ఆ కంపును మోయొద్దు!
ఆ కంపును మోయొద్దు!
Published Sun, Nov 22 2015 1:09 AM | Last Updated on Sat, Jul 6 2019 1:10 PM
ఆత్మబంధువు
‘‘అమ్మా... ఆ శశిగాడితో నేను మాట్లాడను’’ అన్నాడు మిత్ర స్కూల్‌నుంచి వస్తూనే.
‘‘ఏమైంది నాన్నా. మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా!’’ అంది రేఖ.
‘‘అది ఇంతకు ముందు. నౌ ఐ హేట్ హిమ్. వాడు నన్ను రోజూ ఏడిపిస్తున్నాడు.’’
‘‘అవునా... ఏమనీ?’’
‘‘వాడు నన్ను బోండాం, బోండాం అంటున్నాడమ్మా. అలా పిలవొద్దని చెప్పినా వినడంలేదు. అందుకే ఇక మీదట వాడితో మాట్లాడను’’ అన్నాడు కోపంగా.
‘‘నువ్వు లావుగా ఉండవుగా నాన్నా... మరి బోండాం అని పిలవడమెందుకు?’’
‘‘ఏమో... వాడు అలానే పిలిచి ఏడిపిస్తున్నాడు.’’
‘‘వాడలా పిలిస్తే నువ్వు ఉడుక్కుంటున్నావు కాబట్టి ఉడికిస్తున్నాడు. నువ్వు పట్టించుకోలేదనుకో.. రెండ్రోజులు పిలిచి వాడే ఊరుకుంటాడు’’ అంది రేఖ.
‘‘అంతేనంటావా మమ్మీ?’’
‘‘అంతే నాన్నా... కావాలంటే రేపట్నుంచి ట్రై చేసి చూడు.’’
‘‘సరే. రేపు వాడేమన్నా పట్టించు కోను. పిలిస్తే పిల్చుకో అని చెప్పేస్తా.’’
‘‘గుడ్. దట్స్ ద స్పిరిట్’’ అంటూ కొడుకుని ముద్దాడింది రేఖ.
వారం రోజులు గడిచాయి. ఓ రోజు స్కూల్‌నుంచి రాగానే స్కూల్ బ్యాగ్ విసిరికొట్టాడు మిత్ర.
‘‘మమ్మీ... ఆ శశిగాడిని తుక్కు తుక్కుగా కొట్టేస్తా’’ అన్నాడు కోపంగా.
ఆ కోపం చూసి రేఖకు భయమేసింది. ‘‘మళ్లీ ఏమైందిరా?’’... మెల్లగా అడిగింది.
‘‘నేనెంత మంచిగా ఉన్నా వాడు నా మీద కామెంట్స్ చేయడం మానడం లేదమ్మా. పైగా వాడు నా బుక్స్ తీసి దాస్తున్నాడు. దాంతో బుక్ లేదని టీచర్ నన్ను తిడుతోంది. వాడివల్ల నాకు తిట్లు.’’
‘‘నువ్వు వాడికి క్లోజ్ ఫ్రెండ్‌వి కదా. అందుకని సరదాగా చేస్తున్నాడులే నాన్నా. దానికే అంత కోపమైతే ఎలా?’’... బుజ్జగించే ప్రయత్నం చేసింది రేఖ.
‘‘అవును.. వాడు క్లోజ్ ఫ్రెండే. అందుకే వాడలా చేస్తే నాకు నచ్చదు.’’
‘‘అదే వేరే వాళ్లు చేసుంటే?’’
‘‘వేరే వాళ్లు చేస్తే నేను పట్టించు కోనుగా. నా ఫ్రెండ్ చేశాడు కాబట్టే నాకు కోపం.’’
‘‘అంటే.. నీ ఫ్రెండ్ ఎలా ఉండాలో నీకో ఐడియా ఉంది. దాని ప్రకారం వాడు లేడు కాబట్టి వాడిమీద కోపం... అంతే కదా?’’
‘‘హా... అంతే.’’
‘‘వాడు నీ ఐడియా ప్రకారం ఎందుకు ఉండాలి? వాడు కూడా నువ్వు నాటీగా ఉండాలనుకుంటున్నాడేమో. నువ్వలా ఉంటావా మరి?’’
‘‘వాడికి నచ్చినట్లు నేనెందుకు ఉంటాను? నాకు నచ్చినట్లే నేనుంటాను.’’
‘‘కదా.. వాడు కూడా అలాగే ఉంటున్నాడు. దాన్ని యాక్సెప్ట్ చేస్తే నీకు కోపం రాదు. మీరు మంచి ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు.’’
‘‘ట్రై చేస్తా’’ అన్నాడు మిత్ర.
అప్పటికి మిత్రకు సర్దిచెప్పింది కానీ తనలో పెరుగుతున్న అసహనాన్ని, కోపాన్ని చూస్తే రేఖకు భయమేసింది. టీనేజ్‌లోకి వస్తున్న ఈ దశలోనే వాటిని కట్టడి చేయాలని, వాటివల్ల నష్టమని తనకి ప్రాక్టికల్‌గా చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకు మర్నాడు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌ను ఎంచుకుంది.
‘‘అమ్మా....’’ పిలిచాడు మిత్ర కాస్త విసుగు, కాస్త బాధ నిండిన స్వరంతో.
‘‘ఏంటి నాన్నా?’’ అడిగింది రేఖ.
‘‘నాకు ఉల్లిపాయలు ఇష్టం లేదని తెలుసు కదా. వాటితో కర్రీ చేశావేం? పొటాటో కర్రీ చేయొచ్చుగా!’’ అన్నాడు కినుకగా.
‘‘సారీ నాన్నా. ఇవ్వాళ డాడీ కోసం చేశాలే. రేపు నీకోసం పొటాటో కర్రీ చేస్తా సరేనా!’’
‘‘ఓకే.’’
‘‘నాన్నా... నీకు పొటాటో అంటే చాలా ఇష్టం కదా!’’
‘‘అవును... అది నీకు తెలుసు కదా మమ్మీ!’’
‘‘సరే నేనో పని చెప్తా చేస్తావా?’’
‘‘ఆ చేస్తా.’’
‘‘నీకెంతో ఇష్టమైన పొటాటోని ఇవ్వాల్టి నుంచి నీ జేబులోనే పెట్టుకో.. నిద్ర పోతున్నప్పుడు కూడా తీయకూడదు. సరేనా!’’
‘‘ఎందుకు?’’ అన్నాడు మిత్ర అయోమయంగా.
‘‘ముందుకో పెట్టుకో. ఎందుకో తర్వాత చెప్తా’’ అంటూ ఓ చిన్న దుంపను ఇచ్చింది రేఖ.
‘‘ఓకే మమ్మీ’’ అంటూ ఆ చిన్న బంగాళాదుంపను జేబులో వేసుకున్నాడు మిత్ర.
నాలుగు రోజులు గడిచాయి. బంగాళాదుంప మెత్తబడటం మొదలు పెట్టింది. పదిరోజులు గడిచాక దుర్వాసన మొదలైంది.
‘‘అమ్మా... ఇది వాసన వస్తోంది, తీసేస్తా’’ అని చెప్పాడు మిత్ర.
‘‘అదేంట్రా... నీకెంతో ఇష్టం కదా. నీతోపాటే ఉంచుకో’’ అంది రేఖ.
‘‘అమ్మో, వద్దు మమ్మీ. దీన్ని ఇంకా ఉంచుకుంటే కంపు కొడుతుంది. ఫ్రెండ్స్ ఎవ్వరూ నా దగ్గరకు కూడా రారు’’ అన్నాడు ముఖం ఇబ్బందిగా పెట్టి.
‘‘ఒక బంగాళాదుంప కంపు కొడితేనే ఫ్రెండ్స్ నీ దగ్గరకు రారంటున్నావు కదా. మరి దానికంటే చెడ్డవైన నీ అసహనం, కోపం చూస్తే నీ దగ్గరకు వస్తారా?’’
తల్లివైపు చూశాడు మిత్ర. ఆమె చిన్నగా నవ్వింది. అమ్మ ఏం చెప్పాలనుకుందో మిత్రకు అర్థమైంది. ‘‘సారీ మమ్మీ. పొటాటోతో పాటే వాటిని కూడా వెంటనే తీసి పారేస్తా’’ అంటూ స్కూలుకు బయలుదేరాడు మిత్ర.
- డా॥విశేష్, కన్సల్టింగ్ సైకాలజిస్ట్
Advertisement
Advertisement