కారిడార్‌లో నడుస్తూ ఉంటే ఆ ఫ్లాట్‌లో నుంచి మృదువైన ధ్వని. ఏమిటది?వయొలిన్ కావచ్చు. అవును. వయొలినే. ఎవరు మీటుతున్నారబ్బా? తలుపు ఓరగా తెరిచి ఉంది. ఉండబట్టలేక తొంగి చూశాడు.
ఆమే. కొత్త వయొలిన్ లాగుంది... ఇవాళే కొని ఉండవచ్చు... కూచుని సాధన చేస్తూ ఉంది. అది మృదువుగా ఒకసారి మారాము చేస్తున్నట్టు మరోసారి సంగీతం పలుకుతూ ఉంది. ఇతణ్ణి చూసింది. మొహమాటపడుతూ నవ్వింది. ‘చాలా బాగుందండీ’ అనేసి అక్కడి నుంచి వచ్చేశాడు. nఆలోచిస్తే కొంచెం తబ్బిబ్బుగా ఉంది. భర్త ఇటీవలే చనిపోయాడు. పిల్లలు వచ్చి జరగవలసిన కార్యక్రమాలు చూసి మాతో వచ్చెయ్యమ్మా అని పిలిస్తే వెళ్లలేదు. సాధారణంగా ఇలాంటి టైములో పిల్లల దగ్గర ఉండటమే మంచిది. కాని ఇక్కడ ఉండిపోయింది. భర్త పోయిన దుఃఖం, దీనత్వం ఆశించాడు. కాని ఆ ఛాయలేమీ లేవు. పైగా వయొలిన్ నేర్చుకుంటూ కనిపిస్తోంది. మరి తన పరిస్థితి?
దాదాపు దివాలా తీసినట్టయ్యింది బతుకు. కొన్ని రోజుల క్రితమే భార్య కేన్సర్‌తో మరణించింది. ఆమెను సాగనంపాక ఇల్లంతా బోసిపోయినట్టయ్యింది. అది సరే. ఇంతవరకూ ఆ ఇల్లు అసలు తనకు పరిచయమే లేదని అతనికి తెలిసొచ్చింది. రేజర్ కనిపించలేదు. టూత్‌పేస్ట్ ఎక్కడుంటుంది తెలియలేదు. తనకో ఫుల్‌హ్యాండ్స్ బ్లూషర్ట్ ఉండాలి... ఎంత వెతికినా అది కనిపించలేదు. కుక్కర్ కనిపించలేదు. పళ్లేలు కనిపించలేదు. టీవీ రిమోట్ కనిపించలేదు. హాల్లో సోఫా ఉన్నా అదీ కనిపించలేదు.ఇన్నాళ్లూ వాటన్నింటికీ భార్య కళ్లు ఉండేవి. అవి వెతికి అమర్చి పెట్టేవి. ఇప్పుడు తన కళ్లకు అవి కనిపించాలంటే పెద్ద విషయంగా ఉంది. భార్య లేకపోతే భర్త అంధుడైపోతాడా?మరి ఆ వయొలిన్ ఆమె అలా లేదే. ఇద్దరివీ పక్కపక్క ఫ్లాట్లు. ఎంత తేడా?ఆ రోజు టెర్రస్ మీదకు వెళితే ఆమె కేన్ కుర్చీ వేసుకుని వాటర్ ట్యాంక్ నీడలో ఏదో పుస్తకం చదువుకుంటోంది. మొహమాట పడుతూనే అడిగాడు–‘మీవారు పోయిన దుఃఖం మిమ్మల్ని వేధించడం లేదా అండీ’ ‘దుఃఖం ఉండదని ఎవరన్నారు?’ అడిగింది.
అక్కడే సిమెంట్ చేసిన పిల్లర్ ఉంటే కూర్చున్నాడు.‘దుఃఖం ఉంటుంది. జీవితంలో తోడు నిలిచిన భర్తని, మనతో పాటు నడిచిన భర్తని, ప్రేమించిన భర్తని కోల్పోతే దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది. ఆ దుఃఖమూ నిజమే. అతడు పోయాక ఆర్థిక ఇబ్బందులంటూ లేకపోతే నేనూ నావంటి మరో స్త్రీ కాసింతైనా తెరిపిన పడటమూ నిజమే. ఇంతకాలమూ ఒక హోరులో జీవితం గడిచి ఉంటుంది కదా. ఇప్పుడు ఆగి బేరీజు వేసుకునే సమయం చిక్కుతుంది. మనల్ని మనం గమనించుకోవచ్చు. తప్పిపోయిన స్నేహితులను వెతుక్కోవచ్చు. మానేసిన ఇష్టాలను కొనసాగించవచ్చు. ఇదిగో.. ఇలా పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక వంట భారం, ఇంటి భారం అంటారా... భర్త పోయాక అవి తగ్గుతాయే తప్ప పెరగవు’ అంది. తల ఆడించి కిందకు దిగేశాడు.
తనకు అన్నం వండుకోవడం రాదు. కూర చేయడం అంటే రోలర్ కోస్టర్ ఎక్కి దిగినట్టే. నాలుగు అంచులు సరిగ్గా కలిపి దుప్పటి మడతెట్టడం రాదు. బాత్‌రూమ్ దగ్గరుండాల్సిన స్లిప్పర్లు టీవీ దగ్గర, బయట ఉండాల్సిన చప్పల్స్ బెడ్‌రూమ్‌లో.. ఇలా అరాచకం అయిపోయింది ఇల్లు. సాయంత్రమైతే ఏదో గుబులుగా అనిపించి బజారున పడి అటూ ఇటూ తిరుగుతున్నాడు. అలవాట్లున్న మగవాళ్లు ఎలాగోలా పొద్దుపుచ్చుతారో ఏమో. తనకు అలవాట్లు కూడా లేవే.ఆ రోజు కారిడార్‌లో కొత్త కుండీ పెట్టి ఏదో తీగ నాటి నైలాన్ దారానికి పాకించడానికి ప్రయత్నిస్తూ ఉంటే పలకరించాడు.‘కాఫీ తాగుతారా?’ అడిగింది.‘ఈ మాట ఎవరైనా అడిగి ఎంత కాలమైందండీ’ అన్నాడు.కాఫీ ఇచ్చింది. తాగాడు. కదల్లేదు.‘ఒకమాట అడిగితే ఏమీ అనుకోరుగా?’ అడిగాడు.‘మనం పెళ్లి చేసుకుందామా’ అన్నాడు.‘ఏంటీ?’ నవ్వింది. పెద్దగా నవ్వింది. ఆగకుండా నవ్వుతూనే ఉంది.అయోమయంగా చూశాడు.‘మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?’ అడిగింది.‘తోడు కోసం’ ‘తోడంటే మీ దృష్టిలో ఏమిటో తెలుసా?’ గంభీరమవుతూ అంది.‘మీ దృష్టిలో తోడంటే వచ్చి మీ వాషింగ్ మెషీన్ ఆన్ చేయడం. కుక్కర్ ఆన్ చేయడం. సిలిండర్ బుక్ చేయడం. బూజుకర్ర పట్టుకుని సమయానికి బూజు దులిపి పెట్టడం. డోర్‌మేట్స్ ఆర్డర్‌లో ఉండేలా చూసుకోవడం. అదీ మీ దృష్టిలో తోడంటే. ఇప్పటి వరకు పడీపడీ ఉన్నాను. మరి పడలేను’మాట్లాడకుండా వచ్చేశాడు. రెండు మూడు రోజులు ఆలోచనలు సతమతం చేశాయి. అహం రెపరెపలాడింది. దుమ్ము అణిగి దృశ్యం స్పష్టమైనట్టుగా వాస్తవం బోధపడి ‘నిజమే కదా’ అనిపించింది.
తోడంటే తనకు తీరిక ఆమెకు భారమూ కాదు. తోడంటే చెరిసగం. అన్నింటా చెరిసగమే.ఇది నిశ్చయమయ్యాక అతడు కొన్నాళ్లు ఆమె ఫ్లాట్ వైపు తొంగి చూడలేదు. ఇంటి పని శ్రద్ధగా చేయడం నేర్చుకున్నాడు. వంట నేర్చుకునే ప్రయత్నం చేశాడు. జీవితంలో తొలిసారి సోఫాక్లాత్స్ మార్చగలిగాడు. అన్నింటికంటే ముఖ్యం బూజుకర్రను తానూ పట్టుకోగలనని గ్రహించాడు. అన్నం, రెండు కూరలు, అవసరమైతే చపాతీ చేయగలడు. సరుకులు తేగలడు. ఇస్త్రీ పద్దు రాయగలడు.ఒకరోజు వెజిటెబుల్ బిర్యానీ చేసి ఆమెను ఇంటికి ఆహ్వానించాడు.ఆమె వచ్చింది. ‘ఏమిటిదీ’ అని ఆశ్చర్యపోయింది. ఇల్లంతా తిరిగి చూసింది. ఉప్పు తక్కువైనా సరే బిర్యాని ఆరగించి మెచ్చుకుంది.‘తోడంటే ఇక మీదట నా దృష్టిలో ఇలా ఉండటం అండీ’ అన్నాడు.ఆమెకు యాభై ఏళ్లు. చూసింది. అతడికి మరో అయిదు ఉంటాయేమో. చూశాడు.మనోహరమైన ఒక ప్రేమ కథ ఆమె చేతిని అతడు పట్టుకోవడంతో మొదలైంది.ఓల్గా రాసిన ‘తోడు’ కథ ఇది.శ్రమ అంటే ఏమిటనే నిర్వచనాలు మగవాళ్ల దగ్గర చాలా ఉంటాయి. ఆఫీసుకు వెళ్లడం, స్కూటర్ డ్రైవ్ చేయడం, బ్యాంక్‌కు వెళ్లి లావాదేవీలు చూడటం, పిల్లల స్కూలుకు వెళ్లి మాట్లాడటం... ఇవి వాళ్ల దృష్టిలో శ్రమ. పచ్చడి నూరడం, గ్రైండర్ తిప్పడం, ఆరేసిన బట్టలు తీసుకురావడం, పిల్లలకు స్నానం చేయించడం, జిడ్డోడే అంట్లను రుద్ది రుద్ది తోమడం.. ఇవి శ్రమ కాదు. బూజుకర్ర చివరన ఉండాల్సింది గాజుల చేయే అని అనుకుంటారు. అలా అనుకున్నంత కాలం స్త్రీ హృదయంలో సంపూర్ణమైన చోటు సంపాదించలేరు. ఇల్లు మీరుండే చోటు కూడా అయినప్పుడు ఇంటి శ్రమ మీది కూడా కదా.సగం సగం అనుకునే మగవాడా.. నీకు వెల్‌కమ్.
పునః కథనం: ఖదీర్
- ఓల్గా
బూజుకర్ర చివరన
Published Sat, Feb 17 2018 12:35 AM | Last Updated on Sat, Feb 17 2018 12:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment