ఆఖరు ప్రయత్నం | women empowerment : retold stories 21 | Sakshi
Sakshi News home page

ఆఖరు ప్రయత్నం

Published Sat, Mar 3 2018 12:20 AM | Last Updated on Sat, Mar 3 2018 12:20 AM

women empowerment :  retold stories 21 - Sakshi

‘ఇవాళ ఎలాగైనా సరే’ అనుకుంది. వెళ్లి మెయిన్‌ డోర్‌ వేసేసింది. కిటికీ కర్టెన్లు లాగేసింది. రెండు బాల్కనీలు ఉన్నాయి. రెండిటి తలుపులు వేసేసింది. కిచెన్‌లో వాటర్‌ ప్యూరిఫయర్‌ ఉంది. అది ఆన్‌లో ఉందా ఆఫ్‌లో ఉందా చెక్‌ చేసుకుంది. స్టవ్‌ చెక్‌ చేసింది. బాత్‌రూమ్‌లో ట్యాప్‌లు కట్టేసి ఉన్నాయా లేదా చూసుకుంది. టీవీ ఒక్కటే రన్‌ అవుతూ ఉంది... దానిని ఆఫ్‌ చేయాలా లేదా మ్యూట్‌లో పెట్టాలా అని ఒక్క క్షణం ఆలోచించింది. ఇంట్లో టీవీ ఉంటే మనిషి ఉన్నట్టు. పెద్దాడు రెండేళ్ల క్రితం యూఎస్‌ వెళ్లిపోయాడు కోడలితో, పిల్లవాడితో. కూతురు ఈ మధ్యే కాన్పుకొచ్చి తిరిగి వెళ్లిపోయింది. ఇంట్లో మిగిలింది ఇద్దరు. భర్తా తను. భర్త ఏవో పుస్తకాలు చదువుకుంటూ పార్క్‌కు వెళ్లి తన ఈడు వాళ్లతో బాతాఖానీ వేస్తూ లేదా క్లబ్‌లో తొమ్మిదీ పది దాకా కార్డ్స్‌ ఆడుతూ.... ఇక ఇంట్లో ఏ శబ్దం ఉంటుంది... టీవీ శబ్దం తప్ప.
ఇవాళ దానిని కూడా ఆఫ్‌ చేసేద్దామనుకుంది. చేసేసింది.

టైమ్‌ చూసుకుంది. రాత్రి ఎనిమిది.భర్త స్పేర్‌ కీ తీసుకెళ్లాడా లేదా చెక్‌ చేసింది. తీసుకెళ్లాడు. తలుపు తప్పనిసరిగా తీయాలన్న నియమం లేదు. తీసుకుని వచ్చేస్తాడు. మంచిది.బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది. శుభ్రమైన దుప్పటి పరచి, లేత రంగుల్లో ఉన్న పిల్లో కవర్స్‌తో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇలా పడుకోగానే అలా నిద్ర రావాలి దాని మీద. కాని రావడం లేదే.కప్‌బోర్డ్‌లో నిద్ర మాత్రల బాటిల్‌ తీసుకుని జాగ్రత్తగా ఒక టాబ్లెట్‌ తీసి మంచినీళ్లతో వేసుకుంది.ఇది వేసుకుంటే నిద్ర రావాలి.వస్తుందనే డాక్టర్‌ చెప్పాడు.కానీ రాదు. నిద్ర సరిగా పట్టదు. నిద్రకు భయపడి, నిద్రపోవడం తప్పని స్థిరపడి, గాఢమైన నిద్రపోయే హక్కు తనకు లేదు అని కండీషనింగ్‌ చేసుకోవడం వల్ల తనకు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా పట్టదే.చిన్నప్పుడు బాగా నిద్ర పట్టిన గుర్తు ఉంది. కానీ మూడు నాలుగు తరగతులకు వచ్చే సరికి ముఖాన ధడేలుమని నీళ్లు చల్లి ‘లేవే లే... చదువుకోవాలి లే’ అని అమ్మ నిద్ర లేపేసేది. ఎంతో ముఖ్యమైన నిద్ర ఆ తెల్లవారుజాము ట్యూషన్లలో నాశనమైపోయింది. స్కూల్లో మధ్యాహ్నం క్లాసులలో బయట ఆ ఎండకీ లోపల అర్థం కాని పాఠానికి చాలా నిద్ర వచ్చేది. ఒకసారి దాదాపు నిద్రపోబోయింది. కానీ టీచర్‌ డస్టర్‌తో తల మీద ఎంత గట్టిగా కొట్టిందంటే పగటి నిద్ర ఆ దెబ్బతో చచ్చిపోయింది. హమ్మయ్య... ఆదివారం వచ్చింది ఆ రోజన్నా కాస్త మనసుతీరా నిద్రపోయి లేద్దాం అంటే అమ్మ తలంటు అని అప్పుడు కూడా లేపేసేది.

ఇక వయసు రావడం నిద్ర లేకపోవడం ఒకేసారి జరుగుతాయి.‘ఏమిటే... వయసొచ్చిన పిల్ల అంత సేపు పడుకోవచ్చా’ అని అమ్మ వెలుతురొచ్చే ముందే లేపేసేది. ఇక వాకిలి ఊడ్చి, కళ్లాపి చల్లి, మోటార్‌ వేసి, బంతిపూలు ఏమైనా పూసి ఉంటే కనుక వాటిని తెంచి, కాసేపు చదువుకుని, కాలేజీకి తయారయ్యి... నిద్రే లేదు. అందమైన కళ్లు... అందమైన కళ్లు అని అందరూ అనేవారు. పొగడ్తలు ఎవరికి కావాలి... నిద్ర కావాలి వాటికి. అసలు నిద్రకూ పరీక్షలకు లంకె ఏమిటో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. పరీక్షలప్పుడు నిద్ర పది టన్నుల బరువుతో వచ్చేది. కనురెప్పల మీద రాక్షసులు ఎక్కి తొక్కుతున్నట్టే ఉండేది. ఆ నిద్రను కాపలాకాచే బాధ్యత నాన్న తీసుకునేవాడు.‘మా తల్లి కదూ... ఈ టీ తాగి చదువుకోమ్మా’ అని ఫ్లాస్క్‌ విప్పి టీ అందించేవాడు.చదువుకు, పెళ్లికి మధ్య ఒక గ్యాప్‌ ఉంటుంది. అప్పుడు నిద్రపోవచ్చు ఆడపిల్ల.కానీ ‘ఆడపిల్ల నిద్ర ఇంటికి దరిద్రం. ఇలా పడుకుంటే సంబంధాలు కుదరవు’ అని అమ్మ నిద్ర పోనిచ్చేది కాదు. ఇక పెళ్లయ్యాక భర్తను కొన్నాళ్ల పాటు శ్రీవారు అని మురిపెం చేయడం కద్దు. ఈ శ్రీవారు నిద్రకు విరోధి. రాత్రికి హక్కుదారు. 

మెలుకువకు పట్టాదారు. ఆ శ్రీవారు శ్రీమతిని మెలుకువగా ఉంచి మెలుకువను  పదే పదే తెప్పించి ఆఖరికి తను మాత్రం గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. శ్రీమతి చచ్చినట్టు లేవాల్సిందే. లేకుంటే అత్తగారు ఏమనుకుంటారు... ఆడపడుచు ఏమనుకుంటుంది... తెల్లవారే లేచి ముగ్గు వేసే కోడలే ఉత్తమురాలు.. ఆ కోడలి నిద్ర ఏ గంగలో అయినా కలవనీగాక.ఈ మురిపెం ఇలా ఉంటుందా... తొమ్మిది నెలలు తిరిగేసరికల్లా ఒడిలో కయ్‌మని ఏడుపు.బాలింతకు నిద్ర కరువు. పాలు పట్టాలి.పిల్లవాడికి నిద్ర కరువు. బాలింత మేలుకోవాలి.మూడు నాలుగేళ్లు వయసు వచ్చేసరికి– అదే సర్కిల్‌– నిద్ర లేవడం, లేపడం, స్కూళ్లకు సిద్ధం చేయడం, వంట చేసుకోవడం....పిల్లలు కొంచెం ఎదిగొచ్చి పైస్కూళ్లకు వెళ్లే టైమ్‌లో మధ్యాహ్నం పూట నిద్ర పోవడానికి ట్రై చేసింది. సరిగ్గా కునుకు పట్టే వేళకు ఏ పోస్ట్‌మేనో తలుపు తట్టేవాడు. ఇరుగమ్మో పొరుగమ్మో వొదినా అంటూ వచ్చేది. లేదంటే పక్కింటి అల్లరి కుర్రాడు బెల్‌కొట్టి పారిపోయేవాడు. నాలుగవుతూనే పనిమనిషి తయారు– అంట్ల కోసం.

కొడుకు పెళ్లి జరుగుతుంది– పురుడొస్తుంది– మేలుకోవాలి.కూతురు పెళ్లి జరుగుతుంది– బిడ్డ పుడుతుంది– మేలుకోవాలి.అమ్మమ్మ, నానమ్మ హోదాలు నిద్రను ష్యూరిటీగా ఇస్తే తప్ప దక్కవు.ఇన్నాళ్లకు అన్నీ సెటిలయ్యి హాయిగా నిద్ర పోదామనుకుంటే భర్తకు రాత్రి పూట ఒకటి రెండుసార్లు బాత్‌రూమ్‌కు వెళ్లే అలవాటు. లేస్తాడు. లేస్తే లేచాడు... లైటు వేసేసి... ట్యాప్‌ తిప్పేసి.. అదొక జాతర. అలెర్జిక్‌ కాఫట...మధ్య మధ్య లేచి దగ్గుతాడు.నిద్ర రాత లేదా తనకు.‘ఇవాళ ఎలాగైనా’ అని మళ్లీ గట్టిగా అనుకుంది.‘శవం నిద్ర పోయినంత గాఢంగా నిద్రపోవాలి’ అనుకుంది.కానీ టాబ్లెట్‌ వేసుకుని ఇంత సేపైనా నిద్ర రావడం లేదే.ఇంకో టాబ్లెట్‌ వేసుకుంటే? ట్రై చేద్దాం. బాటిల్‌ విప్పి అరచేతిలో వొంచింది. మొత్తం టాబ్లెట్లు పడ్డాయి. మొత్తం. వాటి నిండా నిద్రే ఉంటుందా?లాగుతోంది మనసు. నిద్ర కావాలని వెర్రెక్కిపోతోంది మనసు.ఒక్కొక్కటే వేసుకుంటూ నీళ్లు తాగేసింది.కళ్ల మీద మగత. హమ్మయ్య. నిద్ర వస్తున్నట్టుంది.భర్త వచ్చి ఎక్కడ డిస్ట్రబ్‌ చేస్తాడో.‘ఏమండీ... చచ్చిపోవట్లేదు. నిద్రపోతున్నా’ కాగితం రాసి కళ్లు మూసుకుంది.కథ ముగిసింది.అబ్బూరి ఛాయాదేవి రాసిన ‘సుఖాంతం’ కథ ఇది.అన్నింటికీ నెపం మగాడి మీద వేయాల్సిన అవసరం లేదు. స్త్రీని పట్టించుకోవడం అంటే మగాడు మాత్రమే కాదు.. మొత్తం కుటుంబం పట్టించుకోవాలి. సాటి స్త్రీ పట్టించుకోవాలి. తల్లి, తండ్రి, పిల్లలు, తోబుట్టువులు... అందరూ పట్టించుకుంటేనే ఆమెకు కనీస విశ్రాంతి దొరుకుతుంది. ఏమడుగుతోంది స్త్రీ... మణులా మాణిక్యాలా... కంటి నిండా నిద్ర. మనింట్లో అమ్మ ఎన్ని గంటలు నిద్రపోతున్నదో ఇవాళ గమనిద్దామా?
పునః కథనం: ఖదీర్‌
- అబ్బూరి ఛాయాదేవి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement