ట్రేడ్‌ | women empowerment : Trade retold stories-14 | Sakshi
Sakshi News home page

ట్రేడ్‌

Published Sat, Feb 24 2018 12:17 AM | Last Updated on Sat, Feb 24 2018 12:17 AM

women empowerment :  Trade retold stories-14 - Sakshi

‘దాలయమ్మ వద్దు. దివ్యా అని పెట్టుకుందాం.  ఎవరైనా అడిగితే అసలు పేరు అదే అని నువ్వు కూడా చెప్పు’ ‘ఊ’ అన్నాను. ‘ఏమైనా మనం అదృష్టవంతులం. పిల్ల  దొరికింది. పదునాలుగు లోకాలు తిరిగితే పాతాళంలో దొరికింది పిల్ల. తూర్పు ప్రాంతం అంటే పాతాళమేలే. ఏం ఉండి చచ్చింది కనుక ఇక్కడ’ మళ్లీ ‘ఊ’ అన్నాను. నా దృష్టంతా పెద్ద రింగుల అమ్మాయి మీదే ఉంది. చిన్న రింగుల అమ్మాయి నా కాళ్ల దగ్గర కూచుని ఉంది. ఇద్దరూ మాలాగే శ్రీకాకుళం రోడ్డులో రైలెక్కారు. హౌరా నుంచి వాస్కో వెళ్లే రైలంటే ఇసుకలారీ కన్నా అధ్వాన్నం. రిజర్వేషన్‌ ఉన్నా లేకున్నా ఎక్కడ దొరికితే అక్కడ దూరిపోతారు. ఈ ఇద్దరు 
ఆడపిల్లలు కూడా దూరిపోయారు బతిమిలాడుకుని. రెండు పెద్ద సూట్‌కేసులు ఉన్నాయి. ఒక మూటలో వంట గిన్నెలు ఉన్నట్టున్నాయి. పక్క కంపార్ట్‌మెంట్‌లో వీళ్లలాగే చోటు చేసుకోగలిగిన ఒక మొరటు మనిషి గంటగంటకూ వచ్చి ఈ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా లేరా చూసి వెళుతున్నాడు. పెద్దరింగుల అమ్మాయి సైడ్‌ బెర్త్‌ పక్కన నిలుచుని ఉంది.  ఇందాకటి స్టేషన్‌లో ఎక్కిన కుర్రాడు ఆ అమ్మాయికి దగ్గరగా నిలుచున్నాడు. వాడంత దగ్గరగా నిలుచున్నా చలించడం లేదేమిటా అని చూస్తున్నాను.

‘బ్రోకరుగాడు దొంగముండా కొడుకులాగున్నాడు. ఐదు లక్షలకు టోపీ వేద్దామనుకున్నాడు. మూడున్నరకే తెగ్గొట్టడం మంచిదయ్యింది. లక్షకు మూడెకరాలొచ్చే ప్రాంతంలో మూడున్నరంటే ఎక్కువే. అదీగాక పెళ్లి ఖర్చులు మనవే. మంటపం ఖర్చు మనదే. తాళిబొట్టు, గాజులు... ఒకటేమిటి... రేపు మనింటి కోడలైతే మనాస్తి తనాస్తి కాదా. హూ. మన ప్రాంతం అమ్మాయి మన తాహతు అమ్మాయి దొరుకుతుందనుకున్నాను. నాగుపాము నెత్తిన మణైనా దొరికేలా ఉందికాని ఆడపిల్ల దొరికేలా లేదు. కులం గోత్రం కూడా వదిలేయాల్సొస్తుంది. అయితే అమ్మాయ్‌... నేను మాత్రం మీ పెద్ద పిన్నిలాగా ఈవైపు నుంచి తెచ్చుకుని వేషం మార్చి రూపు మార్చి కాటను చీరలకు బదులు కంచి పట్టుచీరలు కట్టి ఇంట్లో బుట్టబొమ్మలాగా కూచోబెట్టినా మరీ సంవత్సరానికి ఒకసారి తీర్థం కోసమే పుట్టింటికి పంపను.ఎన్నిసార్లయినా రావొచ్చు. ఎన్నిసార్లయినా పోవచ్చు. ఆడపిల్లనే కదా తెచ్చుకుంటున్నాం. బానిసను కాదు గదా’ రాత్రి పది దాటేసింది. మార్కాపురం కూడా దాటేసినట్టుంది. లైట్లు మందం అయ్యాయి. ఆ కుర్రాడు ఆ అమ్మాయి చెవి దగ్గరకు వాలాడు. వాలాడా? చలించదేంటా పిల్లా? ‘ఏమైనా బ్రోకరు తెలివైనోడేలే. అమ్మాయిని కూచోబెట్టి దాని అమా ్మబాబుని కూచోబెట్టి అన్నీ వైనంగా చెప్పాడు. ఇక్కడుంటే ఏముంది మట్టి బతుకు... రైకగుడ్డకి కూడా కూలిపనికి వెళ్లి గాడిద చాకిరీ చేయాలి. ఇక్కడి పిల్లోణ్ణి చేసుకుంటే పగలు బయటి కష్టం రాత్రి మంచం కష్టం తప్ప ఏమీ ఉండదు. పైగా తాగొచ్చి బాదడం ఒకటి.

మన ఆడ పిల్లలు ఎందరిప్పుడు సుకంగా లేరూ? తుంగబద్ర పక్కకెళ్లి కర్నాటకలో సెటిలైన తెలుగాళ్లు అక్కడ  వ్యవసాయం చేసి ఆరుసార్లు తిని మూడుసార్లు వెళ్లేంత సంపాదిచ్చారు. కార్లు బంగళాలు నౌకర్లు చాకర్లు పట్టుపరుపుల మీద పడుతుంది బతుకు. అదేమైనా దుబాయా గిబాయా బయపట్టానికి. మూడు  నెలలు బెజవాడ బాష మాట్లాడటంలో ట్రైనింగ్‌ ఇస్తా. పోయి బెజవాడ ప్రాంతం అమ్మాయిలాగా కలిసిపోవడమే. వాళ్లు ఎదురిచ్చిన డబ్బుతో మీ అమ్మా అప్పా బాగుపడతారు. మన పక్కూరు పుల్లెంకి పుష్పలా మారి గుంటూరుకు కోడరికం వెళ్లలేదా. అప్పలమ్మ అనూషా పేరుతో నూజివీడులో చెలాయించడం లేదా. ఇది బూదిగుంపు కేంపు సంబందం. హోస్పేటకు దగ్గర. సినిమాల్లో చూపించినట్టు స్వర్గంలా ఉంటుందా చోటు. ఎర్రగా బుర్రగా ఉండబట్టి నీ పంట పదహారుసార్లు పండినట్టే పో అనంటే అప్పుడు ఒప్పుకున్నారు’‘అయినా వాళ్ల భయాలు వాళ్లకున్నాయిగా అత్తా’ అన్నాను.‘ఎందుకుండవు. కూటికి లేనోళ్లని తెచ్చి కోడలిగా కూచోబెట్టాక మన పద్ధతులు తెలిసే దాకా కసరమా.. కొసరమా? ఛీఛాలు చీత్కారాలు ఉంటాయ్‌. నిఘా ఉంటుంది. డబ్బుకు అమ్ముడుపోయాక అన్నీ పడాల్సిందే. మన పక్క అమ్మాయిలు కరువై ఒక్కో ఊళ్లో యాభై అరవైమంది కుర్రాళ్లు పెళ్ళిళ్లుగాక ఆడచెట్టుకైనా ఇచ్చి చేయండో అని తిరగతా ఉన్నారనిగానీ’....ఏదో కదలిక. మైగాడ్‌. బేరం కుదిరినట్టుంది.పెద్ద రింగుల అమ్మాయి, ఆ కుర్రాడు టాయిలెట్‌వైపు వెళుతున్నారు. కాళ్ల దగ్గర కూచున్న చిన్న రింగుల అమ్మాయి ఏమీ పట్టనట్టే చూస్తోంది. ఇదంతా నా కంట్లో పడుతుందేమిటీ.ఐదు పది నిమిషాలు కూడా కాలేదు. ఆ కుర్రాడు వేగంగా రాసుకుంటూ ఈ వైపుకు వెళ్లాడు. పెద్ద రింగుల అమ్మాయిని గంట గంటకీ వచ్చి చెక్‌ చేస్తున్న మనిషి టపాటపా రెండు బాదుతున్నాడు. ‘అప్పుడే మొదలెట్టావా సొంత బిజినెస్సు. దొంగముఖం దానా’ తిడుతున్నాడు.

ఆ అమ్మాయి ఏం పట్టనట్టుగా వచ్చి ఇందాక నిలుచున్న చోట నిలుచుంది. కుర్రాడు డబ్బులెగ్గొట్టి వెళ్లినట్టున్నాడు.. అటే చూస్తోంది.‘ఎక్కడికెళుతున్నారు?’ అడిగాను.‘గోవా’‘ఏం చేస్తారక్కడ’‘క్లబ్బుల్లో పేకలు కలపడం, మందు పొయ్యడం, రాత్రిళ్లు ఈడు పంపినోళ్ల దగ్గర ఉండటం. మా అమ్మా బాబులకు అడ్వాన్స్‌ ఇచ్చి తీసుకెళుతున్నాడు. ఇది రెండోసారి’ ఏ భావం లేకుండా చెప్పింది.‘ఎంత సంపాదిస్తావ్‌’‘ఎంత సంపాదించినా అదంతా నరకం. ఎంతమందొస్తారో చెప్పలేం. ఒక్కోసారి ఇద్దరుముగ్గురొచ్చి ఒకేసారి అంటారు. కొట్టేవాళ్లు.. కొరికేవాళ్లు... రాజాం పక్కన వంద గడపల ఊరు మాది. తినడానికి తిండి లేదు. అక్కడైతే టేబుల్‌ మీదొదిలేసిన చికెన్‌ ముక్కలైనా దొరుకుతాయి. ఆకలికి ఏడ్వడం కన్నా మగాడు మీద పడ్డప్పుడు ఏడ్వడం మేలుగదా’ లోగొంతుకలో జీరగా అంది.వికారంగా అనిపించింది. టాయిలెట్‌ వైపు వెళుతుంటే ఆ కుర్రాడు కనిపించి ఐదువందల నోటు ముందు సాచాడు.‘ఇది ఆ అమ్మాయికి ఇవ్వండి. దీని మీద నా నంబర్‌ ఉంది. ఇష్టమైతే బళ్లారిలో దిగిపొమ్మనండి’ అన్నాడు.బళ్లారిలో గోలగోలగా తెల్లారింది.‘తప్పించుకున్నారా ముండల్లారా... తప్పించుకున్నారా.. ఎక్కడికెళతారో చూస్తాను’ అని ఆ చెకింగు మనిషి రంకెలేస్తూ తిరుగుతున్నాడు.ఎస్కేప్‌ అయ్యారన్నమాట. మా మేనత్త లేచి తీరిగ్గా ఆవలించిజుట్టు ముడివేసుకుంటోంది.ఈ పిల్లలు వాడి నుంచి తప్పించుకున్నారు. మా అత్త నుంచి ఆ దాలయమ్మ తప్పించుకుంటుందా?కథ ముగిసింది.మన్నం సింధుమాధురి రాసిన ‘తూరుపు కండ’ కథ ఇది.అసమ ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్‌ అయ్యే మొదటి వస్తువు స్త్రీయే. స్త్రీతో ముడిపడిన వ్యాపారం శృంగార బానిసత్వానికే కాదు సాంస్కృతిక బానిసత్వంలోకి కూడా కొనసాగుతూ ఉంటుంది. నాగరీకం నేర్చిన కోస్తాంధ్ర ఉన్నత వర్గాలు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకుని ఆప్షన్స్‌ కోల్పోయి చతికిల పడటం తెలుస్తోంది. పూర్వం పాలఘాట్‌ నుంచి ఆడపిల్లలను పెళ్లి చేసుకుని తెచ్చేవారు. ఇప్పుడు తూరుపుకు వెళుతున్నారు. హింస అంటే కొట్టడం తిట్టడమే కాదు. కల్చరల్‌ డిస్‌ప్లేస్‌మెంట్‌ కూడా. ఎన్ని కథలొస్తే ఈ బాధ తెలుస్తుంది.
పునః కథనం: ఖదీర్‌
మన్నం సింధుమాధురి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement