కాళ్లు కడుక్కుని | women empowerment : retold stories 18 | Sakshi
Sakshi News home page

కాళ్లు కడుక్కుని

Published Wed, Feb 28 2018 1:01 AM | Last Updated on Wed, Feb 28 2018 1:01 AM

women empowerment :  retold stories 18 - Sakshi

‘దెయ్యం అని పేపర్‌ మీద రాయండి’ రాసింది. ‘ఇప్పుడు దానిని చింపండి’ చింపింది. ‘కసిగా. గట్టిగా. పరాపరా’ కసిగా. గట్టిగా. పరాపరా చింపుతూనే ఉంది. చింపుతుంటే లోపలేదో జరుగుతూ ఉంది. కండరాలకు ఏదో శక్తి పెరుగుతూ ఉంది. పెదాలు అదురుతున్నాయ్‌. చేతులు వణుకుతున్నాయి. పరాపరా... చింపుతూ ఉంది. ‘గుడ్‌. ఇప్పుడు సగం చచ్చింది. అలా వదిలేయండి. దానిని పూర్తిగా చంపుదాం’ దళసరి అద్దం ఉన్న టేబుల్‌ మీద ఆ కాగితం ముక్కలు అలా పడి ఉన్నాయ్‌. ‘రిలీఫ్‌గా ఉందా?’ ‘ఊ’ ‘కొంచెం ఏడ్వాలని ఉందా?’ ‘ఉంది. రావట్లేదు. నా పన్నెండవ ఏట నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఏడ్వలేదు డాక్టర్‌’ ‘సంతోషంతో?’ ‘సంతోషంతో కూడా’ ‘ఏం... మీ హస్బెండ్‌ మీకు హ్యాపీనెస్‌ ఇవ్వడం లేదా? హరాస్‌ చేస్తున్నాడా?’ ‘ఏమంటున్నారు? అతనంటే నాకు ప్రాణం. ఈ లోకంలో నేను ఎవర్నయినా నమ్మితే అది అతన్నే. అంత మంచి మగవాడు, స్నేహితుడు మరొకడు లేడు. కాని రాత్రయితేనే’....‘అయితేనే?’...‘దగ్గరకు తీసుకుంటాడు. చేతిని ముద్దాడతాడు. బుగ్గను ముద్దాడతాడు.భుజం మీద చెయ్యేస్తుంటే... నాకు దెయ్యం కనబడి... దెయ్యం... దెయ్యం’... ఒక్కసారిగా వికృతంగా అరవడం మొదలుపెట్టింది.

‘కూల్‌.. కూల్‌... అదిగో దెయ్యం... చచ్చిపడుంది’ కాగితాల వైపు చూపించాడు. శ్వాసను నెమ్మదింప చేస్తూ మెల్లగా శాంతించింది. ‘మొదటిసారి దెయ్యాన్ని ఎప్పుడు చూశారు?’ మంచినీళ్ల గ్లాసును ముందుకు తోస్తూ అడిగాడు. ‘పదీ పదకొండేళ్లప్పుడు అనుకుంటాను. నానమ్మ ఊళ్లో ఉండేదాన్ని. పక్కింట్లో ఒక రాత్రి పెద్ద గోల అయ్యింది. అందరూ మూగారు. ఆమెకు దెయ్యం పట్టిందట. కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఏదో భాష మాట్లాడుతుండింది. నానమ్మ కొంగు పట్టుకుని భయంగా చూస్తూ నిలబడ్డాను. ఆమెకు పాతిక ముప్పై ఉంటాయి. భర్తకు అరవై దాటిపోయాయి. గతి లేక చేశారట. ఆయన రాత్రయితే పొలానికి వెళ్లిపోయేవాడు పడుకోవడానికి. ఈమె ఒక్కత్తే ఉండేసరికి దెయ్యాలు గోడ దూకి వస్తున్నాయట. ఆ దెయ్యాలను అదిలించలేక బెదిరించలేక వాటి బారిన పడలేక రక్షించుకోలేక తానే దెయ్యంలా మారిపోయింది. చాలా భయం వేసింది.’ వింటూ ఉన్నాడు.

‘ఆ రాత్రి నానమ్మను అడిగాను. నన్ను కూడా దెయ్యం పట్టుకుంటుందా అని. దగ్గరకు తీసుకొని గుండెలకు అదుముకుని నేనున్నంత కాలం పట్టదమ్మా అంది. కాని దెయ్యం నన్ను పట్టుకునే తీరింది’  ‘ఎక్కడా... వీధిలోనా.. స్కూల్లోనా... ఆడుకునే చోటా.. పొలాల్లోనా?’ ‘ఇంట్లో’ ‘ఇంట్లో?’ ‘అవును. ఇంట్లో’ ‘ఒక్క నిమిషం’ అని సొరుగులాగి లైటర్‌ బయటకు తీశాడు. ‘ఇప్పుడు శ్రద్ధగా ధ్యాస మరల్చకుండా తగబెడుతున్న సంగతి మీలో రిజిస్టర్‌ అయ్యేలాగా ఒక్కో కాగితాన్ని కాలుస్తూ చెప్పండి’ లైటర్‌ వెలిగించాడు.మొదటి కాగితం ముక్క తగలబడి నుసి రాలింది.‘నాన్న ఏం పని చేసేవాడు కాదు. తాగడం ఆయన పనిగా ఉండేది. పగలంతా బలాదూరు తిరిగేవాడు. పేక ఆడేవాడు. ఎవరైనా ఏమన్నా అంటే కొట్లాట పెట్టుకునేవాడు. మురికి బట్టలు... మాసిన గడ్డం... వాసన... సారాయిలో నంచుకోవడానికి ఉబ్బెత్తుగాఉండే రేగుపళ్ల జేబు’...ఇంకో కాగితం కాలి నుసి అయ్యింది.

‘కాని నాన్నకు ఉండి ఉండి దెయ్యం పట్టేది. రాత్రి పూట ఆమ్మను జుట్టు పట్టి గదిలోకి ఈడ్చేవాడు. తలుపేసేవాడు. దెయ్యం దిగేదాకా తలుపు తెరుచుకునేది కాదు. అమ్మకు ఇష్టం లేదు ఆ దెయ్యం అంటే. తిట్టేది. కొట్టేది. రక్కేది. ఊహూ. వినేవాడు కాదు. దెయ్యం దించుకోవాల్సిందే. ఏమనుకున్నాడో ఏమో... నానమ్మ ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేశాడు. పన్నెండేళ్లుంటాయి. బొద్దుగా పుష్టిగా ఉండేదాన్ని. ఆ రాత్రి నాన్నలో దెయ్యం లేచింది. అది అమ్మ గదిలోకి వెళ్లలేదు. నా గదిలోకి వచ్చింది’... కాగితం తగలడుతూ ఉంటే రెండు కళ్ల చివర నీటి బిందువులు పొంగాయి. ‘దెయ్యం వచ్చి... దెయ్యం వచ్చి’... కాగితాలు కాల్చే వేగం పెరిగింది. కళ్లు తడుస్తున్నాయి. ‘అయ్యో వద్దు... ఛీ దెయ్యమా వద్దూ... అరుస్తున్నాను... బయట అమ్మ తలుపు బాదుతూ ఏడుస్తూ... దెయ్యం మింగేస్తుందేమో అన్నంతలో తలుపు పగలగొట్టి దెయ్యం తల చిట్లగొట్టి’... కళ్లు కారుతున్నాయి. పెదాలు బిగిసి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా చేతులు కాగితాలను తగలబెడుతున్నాయి. నుసి. రాలు. నుసి. నశించు. నుసి. నీకిదే శాస్తి.‘ఆ రోజు ఏడ్వడం మానేశాను. మళ్లీ ఇవాళ’... ఒక్కసారిగా రెండు కళ్లను చేతుల్లో దాచుకుంది. మలినాలు... తెట్టు... కల్మషం... మరొకరి చర్య వల్ల ప్రమేయం లేకపోయినా చేరుకుపోయిన మురికి... అన్నీ కారిపోతున్నాయి... పూర్తిగా... సంపూర్ణంగా... మరేమీ మిగలనట్టుగా... అతడు లేచి ఆ నుసినంతా ఒక కాగితం మీదకు సర్దాడు.‘దీనిని ఫ్లష్‌ చేస్తే మళ్లీ జీవితంలో దీనిని మీరు చూడగలరా?’తల అడ్డంగా ఆడించింది.

‘అయితే ఫ్లష్‌ చేసి రండి’చేతుల్లోకి తీసుకుని ఆ నుసినే చూస్తూ ఆ నుసినే సింక్‌లో వేసి ఆ నుసి పైకి ట్యాప్‌ తిప్పితే ఆ నుసి చురుగ్గా కదలుతూ చీకట్లోకి జారిపోతూ మళ్లీ ఎప్పుడూ తనకెప్పుడూకనిపించడానికి వీల్లేకుండా అగాధంలోకి వెళ్లిపోయింది.ముఖం కడుక్కుంది.‘రిలీఫ్‌గా ఉందా?’ అడిగాడు.‘ఊ’బజర్‌ నొక్కితే హజ్బెండ్‌ లోపలికొచ్చాడు.‘తీసుకెళ్లండి. ఎంజాయ్‌ లైఫ్‌.’...ఆమె వైపు తిరిగి అన్నాడు...‘ఏమండీ... దారిలో పూలు తీసుకుంటారుగా’నవ్వింది. అది ఎంత బాగుంది.కథ ముగిసింది.రాధిక రాసిన ‘అపచ్ఛాయ’ కథ ఇది.ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా నడిచినా ఎన్ని ముళ్లను రాళ్లను తప్పుకుని నడిచినా అశుద్ధం ఎక్కడో చోట అంటుతూనే ఉంటుంది. అక్కడ శిలలా బంధింపబడరాదు. కాళ్లు కడుక్కోవాలి. రుద్ది రుద్ది ఆ పీడ జ్ఞాపకాలను వదిలించుకోవాలి. ముందు చాలా జీవితం ఉంటుంది. అది ఎప్పుడూ మంచి జీవితమే అయి ఉంటుంది. సత్యం.
పునః కథనం: ఖదీర్‌
- రాధిక 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement