వెన్నెలలో | women empowerment : retold stories 20 | Sakshi
Sakshi News home page

వెన్నెలలో

Published Fri, Mar 2 2018 12:47 AM | Last Updated on Fri, Mar 2 2018 12:47 AM

women empowerment :  retold stories 20 - Sakshi

‘వెన్నెల బాగుంది కదండీ... ఇంత బాగుంటుందా వెన్నెల... మా అపార్ట్‌మెంట్స్‌లో ఏమీ కనపడి చావదే’ అంది. ‘మీ అపార్ట్‌మెంట్స్‌లో’ మళ్లీ అడిగింది. బయటకు చూస్తూ ఉంది.  బయట చెట్లు మెరుస్తున్నాయి. పొదలు వెలుతురును తాగుతున్నాయి. వందల ఎకరాల సెంట్రల్‌ యూనివర్సిటీలో గెస్ట్‌హౌస్‌ వనకుటీరంలా ఉంది. ‘ఇక్కడ నెమళ్లు వస్తాయని విన్నానండీ. వస్తాయా?’ ‘పొద్దున చూస్తారుగా’ ఇద్దరూ ఆ వేళే రూమ్‌ ఆక్యుపై చేశారు. పరీక్షలు ఉన్నాయి వారంలో. డిస్టెన్స్‌ కట్టిన పరీక్షలు. ‘మీరు గతంలో ఈ యూనివర్సిటీలో చదివారు కాబట్టి మీకంతా తెలుసు ఇక్కడి గురించి. నాకిదే∙కొత్త. మొదట డార్మిటరీ ఇచ్చారు. అక్కడ చదవడం వీలుగాదని రిక్వెస్ట్‌ చేస్తే మీ రూమ్‌కు పంపారు. పర్లేదుగా... మిమ్మల్నేం డిస్టర్బ్‌ చేయడం లేదుగా’ బయటకే చూస్తూ ఉంది. ఫోన్‌ డయల్‌ చేయబోయింది. మళ్లీ కట్‌ చేసింది.‘ఏదో అలజడిగా ఉందండీ... ఇంటి అలజడి’వచ్చినప్పటి నుంచి ఇంటికి ఫోన్లు, భర్తతో మాటలు నడుస్తున్నాయి.‘ఏడేళ్లండీ బాబుకి. ఆయనకు వదిలిపెట్టి వచ్చాను. ఆయన అంత సరిగ్గా చూసుకోడు. అదీ ప్రాబ్లమ్‌. బాబు ఆయనకు రెండేళ్లు దూరం ఉన్నాడు నా వల్ల. ఆ గ్యాప్‌ ఉంది ఇద్దరికీ’...ఎందుకు గ్యాప్‌ అని అడగాలనిపించింది. అడగొచ్చో కూడదో.

‘డిన్నర్‌కు వెళదామా. మళ్లీ మెస్‌ కట్టేస్తారు’ ఇద్దరూ నల్లటి తార్రోడ్డు ఎక్కారు. గాలి మెల్లగా చల్లగా వీస్తూ ఉంది.  ప్లేట్‌లో రెండు పుల్కాలు, కర్రీ పెట్టుకుని కూర్చుంది.  ఒక తుంట నోట్లో పెట్టుకుని అంది– ‘ఈ వంట చేసే అట్రాసిటీ అంతా ఇంతా కాదండీ.  ఆడపిల్లలు అబ్బాయిలతో సమానంగా చదువుకోవాలి అంటారు. అబ్బాయిలు చదువుకుంటే చదువే. అమ్మాయిలు చదువుకుంటే చదువుతో పాటు వంట కూడా నేర్చుకోవాలి. ప్రొఫెషనల్‌ కోర్సులు వంట నేర్చుకుంటూ చదువుకునే కోర్సులా అండీ. హాస్టల్‌లో ఉండి ఇంజనీరింగ్‌ చేశాను.  టాపర్‌ని. మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఘనత చూడొద్దా. కాని పెళ్లయ్యాక అత్తగారు వంటగదిలో పంపి తోడు రాదే. కొత్తపెళ్లి కూతుర్ని. ఏం చేయాలో తెలియదు. అయినా తిప్పలు పడి సాంబారు చేశాను. చింతపండు విషయంలో ఏదో గందగోళం అయినట్టుంది. దానికే పెద్ద రాద్ధాంతం.వినడానికి చిన్న విషయం. కాని ఇల్లుకాని ఇంట్లో, కొత్త  మనుషుల మధ్య, అప్పుడే అడుగుపెట్టిన అమ్మాయికి అదెంత పెద్ద హింసో ఎవరికి తెలుస్తుంది?’ ఇంకో తుంట పెట్టుకుంది.

‘ఫ్రిజ్‌లో వాటర్‌బాటిల్‌ అనే టైటిల్‌తో ఎవరైనా కథ రాయాలండీ. దానిని నింపే బాధ్యత ఎవరిదో తెలుసా? కోడలిదే. ఫ్రిజ్‌ తెరిచిన మా ఆడపడుచు నేను ఎక్కడ ఉన్నా వినపడేలా వాటర్‌ బాటిల్స్‌లో నీళ్లు లేవు అని అరిచేది. పరిగెత్తుకెళ్లేదాన్ని. ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది’...టొమాటో కర్రీని కెలుకుతూ ఉంది.‘ఇక శాలరీ చెక్‌ తెచ్చి మా మావగారికి ఇవ్వాలి. ఇవ్వడం సంతోషమే. కాని ఆయన చేత్తో కూడా ముట్టేవాడు కాదు. అక్కడ పెట్టు అనేవాడు. పిల్లలు తెచ్చిన జీతాన్ని పెద్దలు చూసి మెచ్చుకుంటే ఒక ఆనందం. ఖర్చుపెట్టెటప్పుడు లేని అహం పుచ్చుకునేటప్పుడు వచ్చిందా? ఇలాగే చిన్న చిన్న విషయాలే పెద్ద రాద్ధాంతాలుగా ముగిసేవి. హింస. విచిత్రం ఏమిటంటే రాత్రయితే పరుపు మీద మోకాళ్లతో పాకి దగ్గరకు చేరే ఆయనగారు ఇలాంటి రాద్ధాంతాల్లో ఎమోషనల్‌ సపోర్ట్‌గా కూడా నిలబడేవాడు కాదు. దాంతో బెంగుళూరుకు ట్రాన్స్‌ఫర్‌ పెట్టుకుని వెళ్లిపోయాను. మొదట ఒప్పుకోలేదు. పోలీస్‌ గీలీస్‌ అనేసరికి వదిలేశారు’... డిన్నర్‌ ముగిసింది. తిరిగి దారిలో పడ్డారు. 

మాటలకు ఏ అడ్డంకీ లేనట్టుగా ఖాళీ రోడ్లు.‘రెండేళ్లు బెంగుళూరులో ఉన్నాక సడన్‌గా జ్ఞానోదయం అయ్యింది. మనం సమాజం అనే యూనిట్‌ని హ్యాండిల్‌ చేస్తున్నాం. ఆఫీస్‌ అనే యూనిట్‌ని హ్యాండిల్‌ చేస్తున్నాం. కాని ఇల్లు అనే యూనిట్‌ని ఎందుకు హ్యాండిల్‌ చేయలేకపోతున్నాం? ఆఫీసులో చికాకులొస్తే ఉద్యోగం వదిలేసి పోతున్నామా? లేదే. ఇంట్లో చికాకులు వస్తే ఎందుకు వదిలేసిపోవాలి? కాపురం అనేది గేమ్‌. గేమ్‌లాగే చూద్దాం. గెలవడానికి ఆడదాం అనుకున్నాక ఫ్రీ అయిపోయాను. బాబుకు తండ్రి లేకుండా ఎందుకు చేయాలి అని నేనే ఫోన్‌ చేసి ప్రపోజల్‌ పెట్టాను. విడి కాపురం. కానీ’... చిన్నగా నవ్వింది.‘ఎందుకు నవ్వుతున్నారు?’‘అతనేమిట్రా అంటే విడి కాపురంలో భర్త పాత్రతో పాటు అత్తామామల పాత్ర కూడా పోషించడం మొదలుపెట్టాడు. పాత్రల తాకిడి తగ్గలేదన్నమాట’ మళ్లీ అంది–‘ఉద్యోగం స్ట్రెస్‌ ఒక తాకిడి. ఇంటి స్ట్రెస్‌ ఒక తాకిడీ. అన్నీ నేనే పడాలి. ఆఫీసయ్యాక మగాడు రిలాక్స్‌ కావడానికి ఫ్రెండ్స్‌ని వెతుక్కుంటాడు. ఆడది అయ్యో బాబు ఎలా ఉన్నాడో అని పరిగెత్తుకుని వస్తుంది. మదర్‌ ఇన్‌స్టింక్ట్‌... ఈ కడుపులో నుంచి వస్తారు కదండీ పిల్లలు’... ఉదరం మీద చేయి వేసి నిమురుకుంది.

‘ఎంతమందిని చూళ్లేదు... బాగా చదువుకున్న ఆడాళ్లు... ఎంతో ప్రతిభ ఉన్న ఆడాళ్లు... ఫలానా రంగంలో రాణించి తీరాలి అని నిశ్చయించుకుని అందుకు అవసరమైన చదువు చదివిన ఆడాళ్లు... పెళ్లయ్యాక చట్రంలో పడతారు. పిల్లాడు పుట్టాక కెరీర్‌లోకి వెళదామని... వాడికి ఐదేళ్లు వచ్చాక కెరీర్‌లోకి వెళదామని... సెకండ్‌ చైల్డ్‌ కూడా ముగించి కెరీర్‌లోకి వెళదామని... అప్పటికి వయసు మీద పడి అవకాశాలు జారిపోయి చతికిలపడతారు. గమనించారా... పిల్లల కోసం ఉద్యోగం ఎవరు మానేయాలి అనే ప్రశ్న ఏ ఇంటా రాదు. భార్య మానేయాలా వద్దా అనే ప్రశ్న మాత్రమే వస్తుంది. నాకూ వచ్చింది. అందుకే వదిలేశాను’గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. కిటికీ బయట మరింత శక్తిపుంజుకున్నట్టుగా వెన్నెల.పుస్తకం తెరిచింది. మళ్లీ మూసింది.‘ఎందుకు చదువుతున్నట్టు ఈ చదువు. ఉద్యోగం ఉంటే సంవత్సరానికి పదీ పదిహేను లక్షలు నా జీతం. ఇవాళ ఐదు వేలు కూడా సంపాదించలేకపోతున్నాను. ఇంత చదువు, ఉద్యోగం చేసే యోగ్యత ఉండి కూడా అప్లికేషన్‌ ఫామ్స్‌ మీద, ఫేస్‌బుక్‌లో హౌస్‌వైఫ్‌ అని రాసుకోవాల్సి వస్తోంది. ఆ వెలితి భరించలేకే కదా ఇలా డిస్టెన్స్‌ కోర్సులు చదవడం, ఇకబెన లాంటివి నేర్చుకోవడం, తీరిక వేళల్లో భరత నాట్యం... భర్తలకు కూడా ఏ అభ్యంతరం ఉండదు ఇలా చేస్తే’ అని ఆగి నాలుక కరుచుకున్నట్టుగా చూసింది.

‘సారీ... అస్తమాను నా కథతో బోర్‌ కొట్టిస్తున్నట్టున్నాను... మీ కథ?’‘అదేమిటీ... మీరు ఇంతవరకూ చెప్పింది నా కథ కాదా’ఇద్దరూ చాలాసేపు నవ్వుకున్నారు. చాలాసేపు ఆలోచనలో పడ్డారు. ఇద్దరూ ఆ రాత్రి నిద్రపోలేకపోయారు.తెల్లవారుతుండగా దూరంగా క్రీంకారం.‘నెమలి’ గబగబా కిటికీ దగ్గరకు చేరారు.కాసేపటికి ఒక నెమలి బిడ్డను వెంట బెట్టుకుని మెల్లగా అడుగులు వేస్తూ పచార్లకు వచ్చింది. చూస్తూ నిలబడ్డారు.కథ ముగిసింది.సామాన్య రాసిన ‘కల్పన’ కథ ఇది. వ్యాఖ్యానం అవసరం అంటారా? కథంతా వెన్నెల ఉంది. స్త్రీ జీవితంలో సంపూర్ణమైన వెన్నెల ఉందా?
పునః కథనం: ఖదీర్‌
- సామాన్య 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement