kadir
-
మరో ప్రేమకథ కోసం కలిశారు!
మ్యూజికల్ లవ్‌స్టోరీస్‌కు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు కదిర్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ల కాంబినేషన్ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిపీట్ కానుంది. గతంలో ‘కాదల్ దేశమ్’ (తెలుగులో ‘ప్రేమ దేశం’), ‘కాదలర్ దినమ్’ (తెలుగులో ‘ప్రేమికుల రోజు’) తదితర బ్లాక్ బస్టర్ హిట్స్ అందించారు వీరిద్దరూ. అయితే 2002లో వచ్చిన ‘కాదల్ వైరస్’ తర్వాత కదిర్ మరే సినిమాకూ దర్శకత్వం వహించలేదు. ఇదిలా ఉంటే.. అబ్బాస్, హీరా, కునాల్, శ్రీదేవీ విజయ్‌కుమార్ తదితర ప్రతిభావంతులైన తారలను కదిర్ వెండితెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. అందుకే కదిర్ మాత్రమే తన కుమారుడు కిషోర్‌ని హీరోగా లాంచ్ చేసేందుకు కరెక్ట్ అని నిర్మాత రంగనాధన్ గట్టిగా భావించడంతో కదిర్ అజ్ఞాతవాసం ముగిసింది. సుదీర్ఘ విరామం తర్వాత మరో సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమైన కదిర్.. ఈ ప్రేమకథా చిత్రానికి సంగీతాన్ని అందించేందుకు కూడా ఏఆర్ రెహమాన్నే ఎంచుకున్నారు. కొంత కాలంగా తనకు దర్శకత్వం ఆఫర్లు వస్తూనే ఉన్నాయని, అయితే ఇప్పటికి అన్నీ కుదిరాయని, సంగీత ప్రధానమైన ప్రేమక«థా చిత్రం కావడంతోనే ఈ సినిమాకు రెహమాన్ అయితే బాగుంటుందనుకున్నానని కదిర్ పేర్కొన్నారు. -
తమిళంలో రీమేక్‌కు ‘హుషారు’
తెలుగు చిన్న సినిమాగా విడుదలై మంచి విజయం సాదించిన హుషారు ఇప్పుడు తమిళంలో పునర్నిర్మాణం కానుంది. తెలుగులో అందరూ కొత్త వారు నటించిన చిత్రం హుషారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణను పొందింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేయడానికి దర్శకుడు వీవీ.కదిర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు జీవా కథానాయకుడుగా తెనావట్టు చిత్రానికి దర్శకత్వం వహించారు. 14 ఏళ్ల తరువాత మళ్లీ మోగాఫోన్ పట్టి ఈ తెలుగు చిత్రం హుషారు రీమేక్‌ను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రాన్ని కాస్మోస్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై జే.ఫణీంద్రకుమార్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు ప్రభుసాల్మన్ దర్శకత్వంలో లాడన్ అనే సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించారు. హుషారు చిత్రం తెలుగులో రూ.3.50 కోట్లతో రూపొంది సుమారు రూ. 20 కోట్లు వసూలు చేసిందని నిర్మాత తెలిపారు. ఈ చిత్ర రీమేక్ హక్కులను గట్టి పోటీ మధ్య ఫ్యాన్సీ ఆఫర్‌తో దక్కించుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని సెట్‌పైకి తీసుకెళ్లనున్నట్లు, నూతన, ప్రముఖ తారలు నటించనున్న ఈ చిత్రానికి తెలుగులో సంగీతాన్ని అందించిన రథన్నే పనిచేయనున్నట్లు తెలిపారు. -
పునాదిరాయి
హౌస్ ఓనర్ ఆశ్చర్యపోయింది ఎదురుగా నిలుచున్న మనిషిని చూసి. వయసు యాభై యాభైఅయిదు ఉంటాయి. చక్కని ముత్తయిదు స్త్రీ అని తెలిసిపోతోంది. చదువు, సంస్కారం కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాష చక్కగా ఉంది. హుందాగా కట్టుకున్న చీర, చేతులకు మట్టిగాజుల మధ్య ఒకటీ రెండు బంగారు గాజులు, మెట్టెలు, మంగళసూత్రాలు... కాని ఒక్కత్తే ఉంటానంటోంది. అందుకే ఆశ్చర్యం. ‘ఏం ఇవ్వరా?’ అడిగింది. ‘అబ్బే... అలాంటిదేమీ లేదు. మిమ్మల్ని చూశాను ఒకటి రెండుసార్లు మార్కెట్లో. చేరండి. మా పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి బోర్ కొడుతోంది. ఈ చిన్నపోర్షన్ అందుకే అద్దెకు వదిలాం. చేరండి పర్లేదు’ సంతోషంగా నమస్కారం చేసింది. ఏమేం సామాన్లు తెచ్చుకుంటుందో అని హౌస్ఓనర్ చూస్తూ ఉంది.ఏమీ లేవు. ఒక చాప. రెండు దుప్పట్లు. మార్కెట్లో గ్యాస్‌తో పాటు అమ్మే చిన్న స్టౌ. ఒకటి రెండు బ్యాగుల్లో బట్టలు. ఇక్కడకు చేరాకే పాల కోసమైనా గిన్నె కొనుక్కుని వచ్చి పొంగించింది. కొంచెం కాఫీ చేసి హౌస్ఓనర్కు ఇచ్చింది కూడా. రెండు మూడు రోజుల్లోనే ఆ చిన్న పోర్షన్ ముచ్చటైన ఇంటిగా మారిపోయింది. గడప దగ్గర రెండు పూల కుండీలు చేరాయి. ముగ్గులూ.. తక్కువధరకు వచ్చినవే అయినా అందంగా ఉన్న వాల్ హ్యాంగింగ్లూ... కుతూహలంతో హౌస్ఓనర్ తొంగి చూస్తే ‘నా ఇల్లండీ... అచ్చంగా నా ఇల్లు’ అంది నవ్వుతూ. ‘ఖాళీ చేయించరుగా’ మళ్లీ అడిగింది. ‘అబ్బే లేదండీ... మీరు ఎన్నేళ్లయినా ఉండొచ్చు. ఖాళీ చేస్తానన్నా నేను చేయించనుగా’ ‘అమ్మయ్య.. ఇలాంటి దిలాసా మా ఇంట్లో ఉండేది కాదంటే నమ్మండి’ అంది. భర్త ఇంజనీరు. స్టాఫ్ మీద చెలాయించాడు. కాని ఇంట్లో చెలాయిస్తే ఎలా? పడి ఉండటానికి బంట్రోతా? భార్య. ఒక రోజు కాఫీ అడిగాడు. సిద్ధంగా పెట్టిన డికాక్షన్ చేయి జారి ఒలికి పోయింది. మళ్లీ సిద్ధం చేస్తుంటే విసుక్కున్నాడు. విసుక్కోవచ్చు. కాని పద్ధతి ఉండాలి కదా. ‘సంసారం బుద్ధులు బొత్తిగా లేవు నీకు. ఒక్క రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది సంపాదన ఎంత కష్టమో’ అన్నాడు. సంసారం బుద్ధులు లేవా తనకు? పెళ్లయ్యి ముప్పై ఏళ్లు గడుస్తుంటే సంసారం బుద్ధులు లేవని కనిపెట్టాడా? చిన్న ఉద్యోగిగా ఉన్నప్పుడు ఇల్లు ఎలా లాక్కుని వచ్చింది, పిల్లల చదువుకని ఎలా పొదుపు చేసింది, తెచ్చిన జీతంలో రూపాయి రూపాయి దాచి ఎలా మిగిల్చి ఇచ్చింది... రెండు చెంచాల కాఫీ పొడికి ఇంత పెద్ద మాటా? పట్టుదల వచ్చింది. తెలిసిన వాళ్ల ఆఫీసు ఉంటే చిన్న ఉద్యోగం సంపాదించింది. పార్ట్‌టైమ్ లాంటిది. నలుగైదు గంటలు హెచ్ఆర్లో కూచుని అటెండెన్స్‌లు అవీ చూడాలి. భర్త కక్కాలేక మింగాలేక చూశాడు. కక్కేది ఏముంది... మింగడమే.‘ఊరి నుంచి అక్కయ్య వస్తోంది వెళ్లి రిసీవ్ చేసుకో’ అన్నాడు ఒకరోజు.ఆడపడుచు అంటే తనకూ గౌరవమే. కాని ఆఫీసులో ఊహించని పని పడి వెళ్లలేకపోయింది. ఆడపడుచు నేరుగా ఇంటికే వచ్చేసింది. అక్కాతమ్ముళ్లు ఏం మాట్లాడుకున్నారో. కోపం వచ్చింది. కోపం రావచ్చు. కాని వ్యక్తపరచడంలో పద్ధతి ఉండాలి కదా.‘నువ్వు కావాలనే వెళ్లలేదు కదూ’ అన్నాడా రాత్రి.‘అది కాదండీ’...‘నా మాటంటే నీకు లెక్కలేదు. చూస్తున్నానంతా. ఇలా అయితే నా ఇంట్లో ఉండాల్సిన పని లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు. లేదంటే వేరే ఇల్లు చూసుకొని ఫో.’ఏమంటున్నాడు... ఇది నా ఇల్లు అంటున్నాడు. స్థలం చూసినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయిస్తున్నప్పుడు, శంకుస్థాపన చేస్తున్నప్పుడు, కడుతున్నప్పుడు, కట్టాక ఇక్కడే పిల్లలను పెంచుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, తులసి కోట చుట్టూ తిరుగుతున్నప్పుడు, రాత్రిళ్లు పవళింపు సేవ చేస్తున్నప్పుడు, ఇన్నేళ్లుగా ఈ నాలుగ్గోడలను తీర్చిదిద్దుతున్నప్పుడు తన ఇల్లు కూడా అనుకుందే. తనకు హక్కు ఉంది అనుకుందే. తనది కాకుండా పోతుందా అనుకుందే. తనది కాదు.ఏ ఇల్లూ స్త్రీది కాదు. అయితే అది తండ్రిది. లేకుంటే భర్తది. కాకుంటే కొడుకుది. ఈ ఇల్లు అనేది లేకుండా పోవడం వల్లే కదా మగాడు ఆడదాన్ని ఆడిస్తున్నాడు. ‘ఇంటిని సంపాదిస్తాను. నా ఇంట్లో నేనుంటాను’ అని అనుకుంది. బయటకు వచ్చేసింది.ఈ ఇల్లు తీసుకుంది. వారం పదిరోజులు గడిచాయో లేదో ఊరి నుంచి తమ్ముడు దిగబడ్డాడు.‘ఏంటక్కయ్యా... ఈ చోద్యం’ అన్నాడు దిగులుగా, అక్క మీద బెంగగా.‘చోద్యం ఏముందిరా. అది ఆయన ఇల్లు. ఆయన అనుమతితో ఆయన పద్ధతి ప్రకారం నేను ఉండాలి. ఇది నా ఇల్లు. ఇక్కడ నా ఇష్టప్రకారం నేనుంటాను. మగాళ్లకు ఇదొకటి ఆటైంది... చీటికి మాటికి పెళ్లాన్ని పట్టుకొని ఫో... బయటికి పో అని బెదరగొట్టడం... ఏం పోలేమనుకున్నారా?’‘బావ బాగా బెంబేలు పడిపోతున్నాడక్కా’‘ఎందుకురా బెంబేలు. నేనేం విడిపోలేదుగా. విడాకులు తీసుకోలేదుగా. రమ్మను ఇక్కడకు. నాకు తోచిందేదో నేను పెడతాను. ఉండమను. లేదంటే ఉండిపోమను. కాని నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటి గడప తొక్కను’‘పిల్లలు కంగారు పడుతున్నారు’ ‘పడనీ’‘ఊళ్లో మగాళ్లందరూ కంగారు పడుతున్నారు’‘పడనీ’‘అసలీ ప్రపంచమే కంగారు పడేలా ఉంది. ఎంత పని చేశావక్కా’ అన్నాడు తమ్ముడు.ఆమె చిరునవ్వుతో తన డబ్బుతో తాను కొన్న, కింద పడినా, చేయి ఒలికినా ఎవరూ ఏమీ అనని కాఫీని తయారు చేయడానికి, ఫో బయటకి అని ఎవరూ బెదిరించలేని తన వంట గదిలోకి హాయిగా అడుగులు వేసింది.కథ ముగిసింది.కవనశర్మ రాసిన ‘ఆమె ఇల్లు’ కథ ఇది.మగాళ్లూ భద్రం. ఇప్పుడు హాస్టల్స్ పెరిగాయి. సర్వీస్ అపార్ట్మెంట్లు వచ్చాయి. పేయింగ్ గెస్ట్ ఆఫర్లు కూడా బోలెడు ఉన్నాయి. ఫో... నా ఇంట్లో నుంచి అని అంటే వాళ్లు నిజంగా వెళితే గతేం కాను? రిజిస్ట్రేషన్ కాగితాల్లో ఏ ఇల్లైనా మగాడి పేరు మీదే ఉండొచ్చు. కాని దానికి పునాది రాయి మాత్రం స్త్రీ అని మర్చిపోతే ఎలా? పునః కథనం: ఖదీర్ కవనశర్మ -
ఆఖరు ప్రయత్నం
‘ఇవాళ ఎలాగైనా సరే’ అనుకుంది. వెళ్లి మెయిన్ డోర్ వేసేసింది. కిటికీ కర్టెన్లు లాగేసింది. రెండు బాల్కనీలు ఉన్నాయి. రెండిటి తలుపులు వేసేసింది. కిచెన్‌లో వాటర్ ప్యూరిఫయర్ ఉంది. అది ఆన్‌లో ఉందా ఆఫ్‌లో ఉందా చెక్ చేసుకుంది. స్టవ్ చెక్ చేసింది. బాత్రూమ్లో ట్యాప్‌లు కట్టేసి ఉన్నాయా లేదా చూసుకుంది. టీవీ ఒక్కటే రన్ అవుతూ ఉంది... దానిని ఆఫ్ చేయాలా లేదా మ్యూట్‌లో పెట్టాలా అని ఒక్క క్షణం ఆలోచించింది. ఇంట్లో టీవీ ఉంటే మనిషి ఉన్నట్టు. పెద్దాడు రెండేళ్ల క్రితం యూఎస్ వెళ్లిపోయాడు కోడలితో, పిల్లవాడితో. కూతురు ఈ మధ్యే కాన్పుకొచ్చి తిరిగి వెళ్లిపోయింది. ఇంట్లో మిగిలింది ఇద్దరు. భర్తా తను. భర్త ఏవో పుస్తకాలు చదువుకుంటూ పార్క్‌కు వెళ్లి తన ఈడు వాళ్లతో బాతాఖానీ వేస్తూ లేదా క్లబ్లో తొమ్మిదీ పది దాకా కార్డ్స్ ఆడుతూ.... ఇక ఇంట్లో ఏ శబ్దం ఉంటుంది... టీవీ శబ్దం తప్ప. ఇవాళ దానిని కూడా ఆఫ్ చేసేద్దామనుకుంది. చేసేసింది. టైమ్ చూసుకుంది. రాత్రి ఎనిమిది.భర్త స్పేర్ కీ తీసుకెళ్లాడా లేదా చెక్ చేసింది. తీసుకెళ్లాడు. తలుపు తప్పనిసరిగా తీయాలన్న నియమం లేదు. తీసుకుని వచ్చేస్తాడు. మంచిది.బెడ్రూమ్లోకి వెళ్లింది. శుభ్రమైన దుప్పటి పరచి, లేత రంగుల్లో ఉన్న పిల్లో కవర్స్‌తో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇలా పడుకోగానే అలా నిద్ర రావాలి దాని మీద. కాని రావడం లేదే.కప్‌బోర్డ్‌లో నిద్ర మాత్రల బాటిల్ తీసుకుని జాగ్రత్తగా ఒక టాబ్లెట్ తీసి మంచినీళ్లతో వేసుకుంది.ఇది వేసుకుంటే నిద్ర రావాలి.వస్తుందనే డాక్టర్ చెప్పాడు.కానీ రాదు. నిద్ర సరిగా పట్టదు. నిద్రకు భయపడి, నిద్రపోవడం తప్పని స్థిరపడి, గాఢమైన నిద్రపోయే హక్కు తనకు లేదు అని కండీషనింగ్ చేసుకోవడం వల్ల తనకు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా పట్టదే.చిన్నప్పుడు బాగా నిద్ర పట్టిన గుర్తు ఉంది. కానీ మూడు నాలుగు తరగతులకు వచ్చే సరికి ముఖాన ధడేలుమని నీళ్లు చల్లి ‘లేవే లే... చదువుకోవాలి లే’ అని అమ్మ నిద్ర లేపేసేది. ఎంతో ముఖ్యమైన నిద్ర ఆ తెల్లవారుజాము ట్యూషన్లలో నాశనమైపోయింది. స్కూల్లో మధ్యాహ్నం క్లాసులలో బయట ఆ ఎండకీ లోపల అర్థం కాని పాఠానికి చాలా నిద్ర వచ్చేది. ఒకసారి దాదాపు నిద్రపోబోయింది. కానీ టీచర్ డస్టర్‌తో తల మీద ఎంత గట్టిగా కొట్టిందంటే పగటి నిద్ర ఆ దెబ్బతో చచ్చిపోయింది. హమ్మయ్య... ఆదివారం వచ్చింది ఆ రోజన్నా కాస్త మనసుతీరా నిద్రపోయి లేద్దాం అంటే అమ్మ తలంటు అని అప్పుడు కూడా లేపేసేది. ఇక వయసు రావడం నిద్ర లేకపోవడం ఒకేసారి జరుగుతాయి.‘ఏమిటే... వయసొచ్చిన పిల్ల అంత సేపు పడుకోవచ్చా’ అని అమ్మ వెలుతురొచ్చే ముందే లేపేసేది. ఇక వాకిలి ఊడ్చి, కళ్లాపి చల్లి, మోటార్ వేసి, బంతిపూలు ఏమైనా పూసి ఉంటే కనుక వాటిని తెంచి, కాసేపు చదువుకుని, కాలేజీకి తయారయ్యి... నిద్రే లేదు. అందమైన కళ్లు... అందమైన కళ్లు అని అందరూ అనేవారు. పొగడ్తలు ఎవరికి కావాలి... నిద్ర కావాలి వాటికి. అసలు నిద్రకూ పరీక్షలకు లంకె ఏమిటో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. పరీక్షలప్పుడు నిద్ర పది టన్నుల బరువుతో వచ్చేది. కనురెప్పల మీద రాక్షసులు ఎక్కి తొక్కుతున్నట్టే ఉండేది. ఆ నిద్రను కాపలాకాచే బాధ్యత నాన్న తీసుకునేవాడు.‘మా తల్లి కదూ... ఈ టీ తాగి చదువుకోమ్మా’ అని ఫ్లాస్క్ విప్పి టీ అందించేవాడు.చదువుకు, పెళ్లికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. అప్పుడు నిద్రపోవచ్చు ఆడపిల్ల.కానీ ‘ఆడపిల్ల నిద్ర ఇంటికి దరిద్రం. ఇలా పడుకుంటే సంబంధాలు కుదరవు’ అని అమ్మ నిద్ర పోనిచ్చేది కాదు. ఇక పెళ్లయ్యాక భర్తను కొన్నాళ్ల పాటు శ్రీవారు అని మురిపెం చేయడం కద్దు. ఈ శ్రీవారు నిద్రకు విరోధి. రాత్రికి హక్కుదారు. మెలుకువకు పట్టాదారు. ఆ శ్రీవారు శ్రీమతిని మెలుకువగా ఉంచి మెలుకువను పదే పదే తెప్పించి ఆఖరికి తను మాత్రం గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. శ్రీమతి చచ్చినట్టు లేవాల్సిందే. లేకుంటే అత్తగారు ఏమనుకుంటారు... ఆడపడుచు ఏమనుకుంటుంది... తెల్లవారే లేచి ముగ్గు వేసే కోడలే ఉత్తమురాలు.. ఆ కోడలి నిద్ర ఏ గంగలో అయినా కలవనీగాక.ఈ మురిపెం ఇలా ఉంటుందా... తొమ్మిది నెలలు తిరిగేసరికల్లా ఒడిలో కయ్‌మని ఏడుపు.బాలింతకు నిద్ర కరువు. పాలు పట్టాలి.పిల్లవాడికి నిద్ర కరువు. బాలింత మేలుకోవాలి.మూడు నాలుగేళ్లు వయసు వచ్చేసరికి– అదే సర్కిల్– నిద్ర లేవడం, లేపడం, స్కూళ్లకు సిద్ధం చేయడం, వంట చేసుకోవడం....పిల్లలు కొంచెం ఎదిగొచ్చి పైస్కూళ్లకు వెళ్లే టైమ్‌లో మధ్యాహ్నం పూట నిద్ర పోవడానికి ట్రై చేసింది. సరిగ్గా కునుకు పట్టే వేళకు ఏ పోస్ట్మేనో తలుపు తట్టేవాడు. ఇరుగమ్మో పొరుగమ్మో వొదినా అంటూ వచ్చేది. లేదంటే పక్కింటి అల్లరి కుర్రాడు బెల్‌కొట్టి పారిపోయేవాడు. నాలుగవుతూనే పనిమనిషి తయారు– అంట్ల కోసం. కొడుకు పెళ్లి జరుగుతుంది– పురుడొస్తుంది– మేలుకోవాలి.కూతురు పెళ్లి జరుగుతుంది– బిడ్డ పుడుతుంది– మేలుకోవాలి.అమ్మమ్మ, నానమ్మ హోదాలు నిద్రను ష్యూరిటీగా ఇస్తే తప్ప దక్కవు.ఇన్నాళ్లకు అన్నీ సెటిలయ్యి హాయిగా నిద్ర పోదామనుకుంటే భర్తకు రాత్రి పూట ఒకటి రెండుసార్లు బాత్రూమ్కు వెళ్లే అలవాటు. లేస్తాడు. లేస్తే లేచాడు... లైటు వేసేసి... ట్యాప్ తిప్పేసి.. అదొక జాతర. అలెర్జిక్ కాఫట...మధ్య మధ్య లేచి దగ్గుతాడు.నిద్ర రాత లేదా తనకు.‘ఇవాళ ఎలాగైనా’ అని మళ్లీ గట్టిగా అనుకుంది.‘శవం నిద్ర పోయినంత గాఢంగా నిద్రపోవాలి’ అనుకుంది.కానీ టాబ్లెట్ వేసుకుని ఇంత సేపైనా నిద్ర రావడం లేదే.ఇంకో టాబ్లెట్ వేసుకుంటే? ట్రై చేద్దాం. బాటిల్ విప్పి అరచేతిలో వొంచింది. మొత్తం టాబ్లెట్లు పడ్డాయి. మొత్తం. వాటి నిండా నిద్రే ఉంటుందా?లాగుతోంది మనసు. నిద్ర కావాలని వెర్రెక్కిపోతోంది మనసు.ఒక్కొక్కటే వేసుకుంటూ నీళ్లు తాగేసింది.కళ్ల మీద మగత. హమ్మయ్య. నిద్ర వస్తున్నట్టుంది.భర్త వచ్చి ఎక్కడ డిస్ట్రబ్ చేస్తాడో.‘ఏమండీ... చచ్చిపోవట్లేదు. నిద్రపోతున్నా’ కాగితం రాసి కళ్లు మూసుకుంది.కథ ముగిసింది.అబ్బూరి ఛాయాదేవి రాసిన ‘సుఖాంతం’ కథ ఇది.అన్నింటికీ నెపం మగాడి మీద వేయాల్సిన అవసరం లేదు. స్త్రీని పట్టించుకోవడం అంటే మగాడు మాత్రమే కాదు.. మొత్తం కుటుంబం పట్టించుకోవాలి. సాటి స్త్రీ పట్టించుకోవాలి. తల్లి, తండ్రి, పిల్లలు, తోబుట్టువులు... అందరూ పట్టించుకుంటేనే ఆమెకు కనీస విశ్రాంతి దొరుకుతుంది. ఏమడుగుతోంది స్త్రీ... మణులా మాణిక్యాలా... కంటి నిండా నిద్ర. మనింట్లో అమ్మ ఎన్ని గంటలు నిద్రపోతున్నదో ఇవాళ గమనిద్దామా? పునః కథనం: ఖదీర్ - అబ్బూరి ఛాయాదేవి -
వెన్నెలలో
‘వెన్నెల బాగుంది కదండీ... ఇంత బాగుంటుందా వెన్నెల... మా అపార్ట్‌మెంట్స్‌లో ఏమీ కనపడి చావదే’ అంది. ‘మీ అపార్ట్‌మెంట్స్‌లో’ మళ్లీ అడిగింది. బయటకు చూస్తూ ఉంది. బయట చెట్లు మెరుస్తున్నాయి. పొదలు వెలుతురును తాగుతున్నాయి. వందల ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్‌హౌస్ వనకుటీరంలా ఉంది. ‘ఇక్కడ నెమళ్లు వస్తాయని విన్నానండీ. వస్తాయా?’ ‘పొద్దున చూస్తారుగా’ ఇద్దరూ ఆ వేళే రూమ్ ఆక్యుపై చేశారు. పరీక్షలు ఉన్నాయి వారంలో. డిస్టెన్స్ కట్టిన పరీక్షలు. ‘మీరు గతంలో ఈ యూనివర్సిటీలో చదివారు కాబట్టి మీకంతా తెలుసు ఇక్కడి గురించి. నాకిదే∙కొత్త. మొదట డార్మిటరీ ఇచ్చారు. అక్కడ చదవడం వీలుగాదని రిక్వెస్ట్ చేస్తే మీ రూమ్‌కు పంపారు. పర్లేదుగా... మిమ్మల్నేం డిస్టర్బ్ చేయడం లేదుగా’ బయటకే చూస్తూ ఉంది. ఫోన్ డయల్ చేయబోయింది. మళ్లీ కట్ చేసింది.‘ఏదో అలజడిగా ఉందండీ... ఇంటి అలజడి’వచ్చినప్పటి నుంచి ఇంటికి ఫోన్లు, భర్తతో మాటలు నడుస్తున్నాయి.‘ఏడేళ్లండీ బాబుకి. ఆయనకు వదిలిపెట్టి వచ్చాను. ఆయన అంత సరిగ్గా చూసుకోడు. అదీ ప్రాబ్లమ్. బాబు ఆయనకు రెండేళ్లు దూరం ఉన్నాడు నా వల్ల. ఆ గ్యాప్ ఉంది ఇద్దరికీ’...ఎందుకు గ్యాప్ అని అడగాలనిపించింది. అడగొచ్చో కూడదో. ‘డిన్నర్‌కు వెళదామా. మళ్లీ మెస్ కట్టేస్తారు’ ఇద్దరూ నల్లటి తార్రోడ్డు ఎక్కారు. గాలి మెల్లగా చల్లగా వీస్తూ ఉంది. ప్లేట్లో రెండు పుల్కాలు, కర్రీ పెట్టుకుని కూర్చుంది. ఒక తుంట నోట్లో పెట్టుకుని అంది– ‘ఈ వంట చేసే అట్రాసిటీ అంతా ఇంతా కాదండీ. ఆడపిల్లలు అబ్బాయిలతో సమానంగా చదువుకోవాలి అంటారు. అబ్బాయిలు చదువుకుంటే చదువే. అమ్మాయిలు చదువుకుంటే చదువుతో పాటు వంట కూడా నేర్చుకోవాలి. ప్రొఫెషనల్ కోర్సులు వంట నేర్చుకుంటూ చదువుకునే కోర్సులా అండీ. హాస్టల్లో ఉండి ఇంజనీరింగ్ చేశాను. టాపర్‌ని. మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఘనత చూడొద్దా. కాని పెళ్లయ్యాక అత్తగారు వంటగదిలో పంపి తోడు రాదే. కొత్తపెళ్లి కూతుర్ని. ఏం చేయాలో తెలియదు. అయినా తిప్పలు పడి సాంబారు చేశాను. చింతపండు విషయంలో ఏదో గందగోళం అయినట్టుంది. దానికే పెద్ద రాద్ధాంతం.వినడానికి చిన్న విషయం. కాని ఇల్లుకాని ఇంట్లో, కొత్త మనుషుల మధ్య, అప్పుడే అడుగుపెట్టిన అమ్మాయికి అదెంత పెద్ద హింసో ఎవరికి తెలుస్తుంది?’ ఇంకో తుంట పెట్టుకుంది. ‘ఫ్రిజ్‌లో వాటర్‌బాటిల్ అనే టైటిల్‌తో ఎవరైనా కథ రాయాలండీ. దానిని నింపే బాధ్యత ఎవరిదో తెలుసా? కోడలిదే. ఫ్రిజ్ తెరిచిన మా ఆడపడుచు నేను ఎక్కడ ఉన్నా వినపడేలా వాటర్ బాటిల్స్‌లో నీళ్లు లేవు అని అరిచేది. పరిగెత్తుకెళ్లేదాన్ని. ఆలోచిస్తుంటే నవ్వు వస్తుంది’...టొమాటో కర్రీని కెలుకుతూ ఉంది.‘ఇక శాలరీ చెక్ తెచ్చి మా మావగారికి ఇవ్వాలి. ఇవ్వడం సంతోషమే. కాని ఆయన చేత్తో కూడా ముట్టేవాడు కాదు. అక్కడ పెట్టు అనేవాడు. పిల్లలు తెచ్చిన జీతాన్ని పెద్దలు చూసి మెచ్చుకుంటే ఒక ఆనందం. ఖర్చుపెట్టెటప్పుడు లేని అహం పుచ్చుకునేటప్పుడు వచ్చిందా? ఇలాగే చిన్న చిన్న విషయాలే పెద్ద రాద్ధాంతాలుగా ముగిసేవి. హింస. విచిత్రం ఏమిటంటే రాత్రయితే పరుపు మీద మోకాళ్లతో పాకి దగ్గరకు చేరే ఆయనగారు ఇలాంటి రాద్ధాంతాల్లో ఎమోషనల్ సపోర్ట్‌గా కూడా నిలబడేవాడు కాదు. దాంతో బెంగుళూరుకు ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్లిపోయాను. మొదట ఒప్పుకోలేదు. పోలీస్ గీలీస్ అనేసరికి వదిలేశారు’... డిన్నర్ ముగిసింది. తిరిగి దారిలో పడ్డారు. మాటలకు ఏ అడ్డంకీ లేనట్టుగా ఖాళీ రోడ్లు.‘రెండేళ్లు బెంగుళూరులో ఉన్నాక సడన్‌గా జ్ఞానోదయం అయ్యింది. మనం సమాజం అనే యూనిట్‌ని హ్యాండిల్ చేస్తున్నాం. ఆఫీస్ అనే యూనిట్‌ని హ్యాండిల్ చేస్తున్నాం. కాని ఇల్లు అనే యూనిట్‌ని ఎందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నాం? ఆఫీసులో చికాకులొస్తే ఉద్యోగం వదిలేసి పోతున్నామా? లేదే. ఇంట్లో చికాకులు వస్తే ఎందుకు వదిలేసిపోవాలి? కాపురం అనేది గేమ్. గేమ్‌లాగే చూద్దాం. గెలవడానికి ఆడదాం అనుకున్నాక ఫ్రీ అయిపోయాను. బాబుకు తండ్రి లేకుండా ఎందుకు చేయాలి అని నేనే ఫోన్ చేసి ప్రపోజల్ పెట్టాను. విడి కాపురం. కానీ’... చిన్నగా నవ్వింది.‘ఎందుకు నవ్వుతున్నారు?’‘అతనేమిట్రా అంటే విడి కాపురంలో భర్త పాత్రతో పాటు అత్తామామల పాత్ర కూడా పోషించడం మొదలుపెట్టాడు. పాత్రల తాకిడి తగ్గలేదన్నమాట’ మళ్లీ అంది–‘ఉద్యోగం స్ట్రెస్ ఒక తాకిడి. ఇంటి స్ట్రెస్ ఒక తాకిడీ. అన్నీ నేనే పడాలి. ఆఫీసయ్యాక మగాడు రిలాక్స్ కావడానికి ఫ్రెండ్స్‌ని వెతుక్కుంటాడు. ఆడది అయ్యో బాబు ఎలా ఉన్నాడో అని పరిగెత్తుకుని వస్తుంది. మదర్ ఇన్స్టింక్ట్... ఈ కడుపులో నుంచి వస్తారు కదండీ పిల్లలు’... ఉదరం మీద చేయి వేసి నిమురుకుంది. ‘ఎంతమందిని చూళ్లేదు... బాగా చదువుకున్న ఆడాళ్లు... ఎంతో ప్రతిభ ఉన్న ఆడాళ్లు... ఫలానా రంగంలో రాణించి తీరాలి అని నిశ్చయించుకుని అందుకు అవసరమైన చదువు చదివిన ఆడాళ్లు... పెళ్లయ్యాక చట్రంలో పడతారు. పిల్లాడు పుట్టాక కెరీర్లోకి వెళదామని... వాడికి ఐదేళ్లు వచ్చాక కెరీర్లోకి వెళదామని... సెకండ్ చైల్డ్ కూడా ముగించి కెరీర్లోకి వెళదామని... అప్పటికి వయసు మీద పడి అవకాశాలు జారిపోయి చతికిలపడతారు. గమనించారా... పిల్లల కోసం ఉద్యోగం ఎవరు మానేయాలి అనే ప్రశ్న ఏ ఇంటా రాదు. భార్య మానేయాలా వద్దా అనే ప్రశ్న మాత్రమే వస్తుంది. నాకూ వచ్చింది. అందుకే వదిలేశాను’గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. కిటికీ బయట మరింత శక్తిపుంజుకున్నట్టుగా వెన్నెల.పుస్తకం తెరిచింది. మళ్లీ మూసింది.‘ఎందుకు చదువుతున్నట్టు ఈ చదువు. ఉద్యోగం ఉంటే సంవత్సరానికి పదీ పదిహేను లక్షలు నా జీతం. ఇవాళ ఐదు వేలు కూడా సంపాదించలేకపోతున్నాను. ఇంత చదువు, ఉద్యోగం చేసే యోగ్యత ఉండి కూడా అప్లికేషన్ ఫామ్స్ మీద, ఫేస్బుక్లో హౌస్‌వైఫ్ అని రాసుకోవాల్సి వస్తోంది. ఆ వెలితి భరించలేకే కదా ఇలా డిస్టెన్స్ కోర్సులు చదవడం, ఇకబెన లాంటివి నేర్చుకోవడం, తీరిక వేళల్లో భరత నాట్యం... భర్తలకు కూడా ఏ అభ్యంతరం ఉండదు ఇలా చేస్తే’ అని ఆగి నాలుక కరుచుకున్నట్టుగా చూసింది. ‘సారీ... అస్తమాను నా కథతో బోర్ కొట్టిస్తున్నట్టున్నాను... మీ కథ?’‘అదేమిటీ... మీరు ఇంతవరకూ చెప్పింది నా కథ కాదా’ఇద్దరూ చాలాసేపు నవ్వుకున్నారు. చాలాసేపు ఆలోచనలో పడ్డారు. ఇద్దరూ ఆ రాత్రి నిద్రపోలేకపోయారు.తెల్లవారుతుండగా దూరంగా క్రీంకారం.‘నెమలి’ గబగబా కిటికీ దగ్గరకు చేరారు.కాసేపటికి ఒక నెమలి బిడ్డను వెంట బెట్టుకుని మెల్లగా అడుగులు వేస్తూ పచార్లకు వచ్చింది. చూస్తూ నిలబడ్డారు.కథ ముగిసింది.సామాన్య రాసిన ‘కల్పన’ కథ ఇది. వ్యాఖ్యానం అవసరం అంటారా? కథంతా వెన్నెల ఉంది. స్త్రీ జీవితంలో సంపూర్ణమైన వెన్నెల ఉందా? పునః కథనం: ఖదీర్ - సామాన్య -
మామూలుకు శిక్ష
బాత్రూమ్లో అరగంటకు పైగా చాటింగ్ అయిపోయింది. ముద్దులు అయిపోయాయి. గుడ్నైట్లు ముగిశాయి. ఇంకా సమయం తీసుకుంటే అనుమానం వస్తుందని స్నానం ముగించి పైజమా టీ షర్ట్ వేసుకుని డైనింగ్ టేబుల్ మీద డిన్నర్‌కి కూచుంటే తల్లి వచ్చి సొరకాయ పాయసం పెట్టింది. పాలు, చక్కెర వేసి, వేయించిన జీడిపప్పులు తేలుతుండగా సువాసనలీనుతున్న లేతాకుపచ్చ పాయసం.గతుక్కుమంది. ‘ఏంటమ్మా విశేషం?’ ‘తినరా మాట్లాడదాం’పై ప్రాణాలు పైనే పోయాయి. ఇంట్లో తీపి చేయడం మామూలే. భార్య చేస్తుంది. పెళ్లయినప్పటి నుంచి తల్లిని వంటింట్లోకి రానివ్వకుండా తల్లే అన్నంత బాగా చూసుకుంటూ వంట తనే చేస్తుంది. తీపి కూడా చేస్తుంది. కాని తల్లి వంటగదిలో దూరి ఈ పాయసం చేసిందంటే ఆ సూచన మంచిది కాదు. ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడే అలా చేస్తుంది. ‘ఏమైనా గుర్తుకు వచ్చిందా?’ అడిగింది. ‘ఊ’.. అన్నాడు కొంచెం భయపడుతూ. పదమూడేళ్ల వయసు ఉండగా తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. వానాకాలం అది. మంచివానలో తడిచి వచ్చి ఆ సంగతి చెప్పి వారం తర్వాత వస్తానని బట్టలు సర్దుకొని పోబోయాడు. తల్లి అడ్డు నిలిచింది. దీనికి అంగీకరించను అంది. ఇప్పుడేం కొంప మునిగిపోయిందని... నిన్ను ఎప్పట్లానే చూసుకుంటానుగా అన్నాడు తండ్రి. ఇల్లు ఇచ్చి, నెల నెలా ఇంటి ఖర్చులు ఇచ్చి, అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉంటానని తండ్రి హామీ. దానికి అంగీరిస్తుందా ఏ తల్లైనా? తండ్రి వెళ్లిపోయాడు. తల్లి ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లిపోయింది.‘నన్ను వద్దనుకున్నప్పుడు నాకు మాత్రం అతనెందుకు’ అనుకుంది చివరకు.‘ఏమంటావు నాన్నా’ కొడుకును అడిగింది. ఇలాంటివి చిన్నపిల్లలకే అర్థమైపోతాయి. పదమూడేళ్లంటే పూర్తి అవగాహన కలిగి ఉండే వయసు.‘వద్దమ్మా. నాన్న వద్దు. నేను నీతో ఉంటాను. మనకు నాన్న వద్దు’ ఆవేశంగా జవాబు చెప్పాడు. ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నాక ఆమె పూర్తిగా తెరిపిన పడింది.‘ఏదైనా తీపి చేస్తానురా’ అంది సంతోషంలో.ఇంట్లో సొరకాయ మాత్రమే ఉంది. దాంతోనే పాయసం చేసింది. ఆ ఇంట్లో వాళ్లిద్దరూ కలిసి ఆరగించిన ఆఖరి పదార్థం అది.అన్నాళ్ల తర్వాత మళ్లీ ఇవాళ టేబుల్ మీద.దానినీ భార్యనూ మార్చిమార్చి చూశాడు.భార్య తలొంచుకుని ఉంది.‘నువ్వెందుకు తలొంచుకుంటావ్. వాడు కదా తలొంచుకోవాల్సింది’ అంది తల్లి.‘ఇప్పుడు ఏం చేశాననమ్మా’ అడిగాడు.‘ఏం చేయాలి? ఇంట్లో ఉంటున్నావా నువ్వు. భార్యతో మాట్లాడుతున్నావా కనీసం. నా పక్కన పది నిమిషాలైనా కూచుంటున్నావా’ ‘ఏం చేయనమ్మా... నువ్వే చూస్తున్నావుగా. పెళ్లయిన నాటి చిన్న ఉద్యోగిని అనుకున్నావా సాయంత్రం ఆరు కొట్టేసరికి ఇల్లు చేరడానికి. జీఎం అయ్యాను. కారిచ్చారు. ఇల్లిచ్చారు. ఇంకా చాలా ఇచ్చారు. దీనికి బదులు మొత్తం టైమ్ వాళ్లే తీసుకున్నారు. వేలు పట్టుకు తిరగడానికి, షికార్లకు తిప్పడానికి వీలు కాదమ్మా. పెద్ద హోదాలోకి వెళ్లాక ఇలా బిజీ కావడం మామూలే’...‘మరి ఆ అమ్మాయి విషయం?’ ‘ఏ అమ్మాయి?‘ఎంతమంది అమ్మాయిలున్నారు?’‘ఆ అమ్మాయా... ఏంటమ్మా కొత్తగా మాట్లాడతావు. ఆఫీసులో నా వ్యవహారాలన్నీ చూసుకోవాల్సింది ఆ అమ్మాయే. ఇంటికి తీసుకువచ్చాను. నీకు పరిచయం చేశాను. తనకు పరిచయం చేశాను. మీరంతా ఒక ఫ్యామిలీలాగా మారిపోతారని అనుకున్నాను. మీటింగ్స్ అటెండ్ చేయాలన్నా బిజినెస్ ట్రిప్‌లకు వెళ్లినా తన అసిస్టెన్స్ నాకు తప్పనిసరి. అందుకే క్లోజ్‌గా ఉంటాను. ఆ అమ్మాయి కూడా– మీ వైఫ్‌కి ఇది తీసుకోండి... అది తీసుకోండి అని ఒక ఫ్యామిలీ మెంబర్‌లాగా ఎంత కన్సర్న్ చూపిస్తుంది. ఇంత క్లోజ్ అయ్యాక తన ఎమోషన్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా. అందుకే మాట్లాడుతుంటాను. కార్పొరెట్ లెవల్లో ఇవన్నీ మామూలేనమ్మా’‘రేయ్... లక్షలు కట్నం ఇస్తానంటే కాదని ఈ పిల్లను ఇష్టపడి విలువలకి కట్టుబడి పైసా కట్నం లేకుండా చేసుకున్నవాడివిరా నువ్వు. ఆ మనిషివీ ఈ మనిషివీ ఒకడివేనా అని సందేహం వస్తోంది’‘ఇప్పుడు ఏం అపకారం చేస్తున్నానమ్మా. బాగానే చూసుకుంటున్నాగా తనని’‘శభాష్. అచ్చు మీ నాన్నలాగా మాట్లాడావురా’ కోడలి వైపు తిరిగింది. ‘నీకెందుకు సిగ్గు లేదు? నీ భర్తను ఎందుకు నిలదియ్యవు. నీకు నా మీద ప్రేమ చచ్చిపోయింది.. అందుకే నన్ను నిర్లక్ష్యం చేసి ఎవరితోనో తిరుగుతున్నావు.. నువ్వు నాకు వద్దు అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? సరే... నీ సమస్యలేవో నీకున్నట్టున్నాయి. నాకు లేవు’ అని కొడుకువైపు తిరిగింది.కొడుకు భయంగా చూశాడు.‘ఈ మాట నీకు ముందే చెప్పాల్సింది. కాని నాకు సపోర్ట్ చేయడానికి అప్పట్లా నువ్వు లేవుగా. ఒక్కదాన్నే నిర్ణయం తీసుకోవాలంటే టైమ్ పట్టింది. మీ నాన్నకు రెండో పెళ్లి చేసుకోవడం మామూలు. నీకు భార్య ఉండగానే తల్లి ఎదురుగా భార్య ఎదురుగా ఇంకో అమ్మాయితో రాసుకు పూసుకు తిరగడం మామూలు. ఆ అమ్మాయితో క్యాంపులకెళ్లడం దేశాలు తిరగడం మామూలు. ఇవన్నీ తేలిక విషయాలుగా భ్రమింపజేస్తూ పబ్బం గడుపుకునే మగాళ్ల లిస్టులో నువ్వు కూడా చేరతావని నేను అనుకోలేదు. మీ నాన్నతో రాజీ పడలేనిదాన్ని నీతో సర్దుకుపోతాననుకున్నావా? చస్తే జరగదు. జాగ్రత్తగా విను. నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను. ఇక నువ్వు నాకు వద్దు. నా దారి నేను చూసుకుంటాను. ఏయ్ అమ్మాయ్... నువ్వూ వస్తావా... నిన్నూ తీసుకెళతాను’ అని హూంకరించింది. దెబ్బకు అక్కడ భూకంపమే వచ్చింది.ఇన్నాళ్లు ఎప్పుడూ ఏడ్వని భార్య, ఎంతో ఇష్టంగా చూసుకునే భార్య, గౌరవంగా చూసుకునే భార్య ధారాపాతంగా ఏడుస్తూ ఉంది.అదిరిపడిపోయాడు. ఏదో కెలికినట్టయ్యి విలవిలలాడిపోయాడు. ఒక్క ఉదుటున లేచి భార్య పక్కన చేరి చెంపలు తుడుస్తూ ‘ఊరుకో.. ఊరుకో... ఇక మీదట అలా జరగదు.. అలా జరగనే జరగదు’ అని తల్లి దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని బెదిరిన గొడ్డు వలే తల వొంచుకు నిలబడ్డాడు.కథ ముగిసింది.రంగనాయకమ్మ రాసిన ‘మురళీ వాళ్లమ్మ’ కథ ఇది.మైక్రో ఫ్యామిలీలు వచ్చి ఇంటి పెద్దల్ని సక్సెస్‌ఫుల్‌గా ఇంటి బయటకు నెట్టాయి. మగాణ్ణి అదలించే, కట్టు తప్పితే కట్టులోకి తెచ్చే, మొటిక్కాయలు వేసే తల్లులూ తండ్రులూ ఉండాలి. మౌనం ఎప్పుడూ మంచిది కాదు. చూసి చూడనట్టు ఉందాం అనుకోవడమూ మంచిది కాదు. లోలోపల నలుగుబాటూ మంచిది కాదు. నిర్ణయం తీసుకోండి. పాయసం వండి టేబుల్ మీద పెట్టండి. తర్వాతి కథ అదే జరుగుతుంది. పునః కథనం: ఖదీర్ రంగనాయకమ్మ -
కాళ్లు కడుక్కుని
‘దెయ్యం అని పేపర్ మీద రాయండి’ రాసింది. ‘ఇప్పుడు దానిని చింపండి’ చింపింది. ‘కసిగా. గట్టిగా. పరాపరా’ కసిగా. గట్టిగా. పరాపరా చింపుతూనే ఉంది. చింపుతుంటే లోపలేదో జరుగుతూ ఉంది. కండరాలకు ఏదో శక్తి పెరుగుతూ ఉంది. పెదాలు అదురుతున్నాయ్. చేతులు వణుకుతున్నాయి. పరాపరా... చింపుతూ ఉంది. ‘గుడ్. ఇప్పుడు సగం చచ్చింది. అలా వదిలేయండి. దానిని పూర్తిగా చంపుదాం’ దళసరి అద్దం ఉన్న టేబుల్ మీద ఆ కాగితం ముక్కలు అలా పడి ఉన్నాయ్. ‘రిలీఫ్‌గా ఉందా?’ ‘ఊ’ ‘కొంచెం ఏడ్వాలని ఉందా?’ ‘ఉంది. రావట్లేదు. నా పన్నెండవ ఏట నుంచి ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఏడ్వలేదు డాక్టర్’ ‘సంతోషంతో?’ ‘సంతోషంతో కూడా’ ‘ఏం... మీ హస్బెండ్ మీకు హ్యాపీనెస్ ఇవ్వడం లేదా? హరాస్ చేస్తున్నాడా?’ ‘ఏమంటున్నారు? అతనంటే నాకు ప్రాణం. ఈ లోకంలో నేను ఎవర్నయినా నమ్మితే అది అతన్నే. అంత మంచి మగవాడు, స్నేహితుడు మరొకడు లేడు. కాని రాత్రయితేనే’....‘అయితేనే?’...‘దగ్గరకు తీసుకుంటాడు. చేతిని ముద్దాడతాడు. బుగ్గను ముద్దాడతాడు.భుజం మీద చెయ్యేస్తుంటే... నాకు దెయ్యం కనబడి... దెయ్యం... దెయ్యం’... ఒక్కసారిగా వికృతంగా అరవడం మొదలుపెట్టింది. ‘కూల్.. కూల్... అదిగో దెయ్యం... చచ్చిపడుంది’ కాగితాల వైపు చూపించాడు. శ్వాసను నెమ్మదింప చేస్తూ మెల్లగా శాంతించింది. ‘మొదటిసారి దెయ్యాన్ని ఎప్పుడు చూశారు?’ మంచినీళ్ల గ్లాసును ముందుకు తోస్తూ అడిగాడు. ‘పదీ పదకొండేళ్లప్పుడు అనుకుంటాను. నానమ్మ ఊళ్లో ఉండేదాన్ని. పక్కింట్లో ఒక రాత్రి పెద్ద గోల అయ్యింది. అందరూ మూగారు. ఆమెకు దెయ్యం పట్టిందట. కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఏదో భాష మాట్లాడుతుండింది. నానమ్మ కొంగు పట్టుకుని భయంగా చూస్తూ నిలబడ్డాను. ఆమెకు పాతిక ముప్పై ఉంటాయి. భర్తకు అరవై దాటిపోయాయి. గతి లేక చేశారట. ఆయన రాత్రయితే పొలానికి వెళ్లిపోయేవాడు పడుకోవడానికి. ఈమె ఒక్కత్తే ఉండేసరికి దెయ్యాలు గోడ దూకి వస్తున్నాయట. ఆ దెయ్యాలను అదిలించలేక బెదిరించలేక వాటి బారిన పడలేక రక్షించుకోలేక తానే దెయ్యంలా మారిపోయింది. చాలా భయం వేసింది.’ వింటూ ఉన్నాడు. ‘ఆ రాత్రి నానమ్మను అడిగాను. నన్ను కూడా దెయ్యం పట్టుకుంటుందా అని. దగ్గరకు తీసుకొని గుండెలకు అదుముకుని నేనున్నంత కాలం పట్టదమ్మా అంది. కాని దెయ్యం నన్ను పట్టుకునే తీరింది’ ‘ఎక్కడా... వీధిలోనా.. స్కూల్లోనా... ఆడుకునే చోటా.. పొలాల్లోనా?’ ‘ఇంట్లో’ ‘ఇంట్లో?’ ‘అవును. ఇంట్లో’ ‘ఒక్క నిమిషం’ అని సొరుగులాగి లైటర్ బయటకు తీశాడు. ‘ఇప్పుడు శ్రద్ధగా ధ్యాస మరల్చకుండా తగబెడుతున్న సంగతి మీలో రిజిస్టర్ అయ్యేలాగా ఒక్కో కాగితాన్ని కాలుస్తూ చెప్పండి’ లైటర్ వెలిగించాడు.మొదటి కాగితం ముక్క తగలబడి నుసి రాలింది.‘నాన్న ఏం పని చేసేవాడు కాదు. తాగడం ఆయన పనిగా ఉండేది. పగలంతా బలాదూరు తిరిగేవాడు. పేక ఆడేవాడు. ఎవరైనా ఏమన్నా అంటే కొట్లాట పెట్టుకునేవాడు. మురికి బట్టలు... మాసిన గడ్డం... వాసన... సారాయిలో నంచుకోవడానికి ఉబ్బెత్తుగాఉండే రేగుపళ్ల జేబు’...ఇంకో కాగితం కాలి నుసి అయ్యింది. ‘కాని నాన్నకు ఉండి ఉండి దెయ్యం పట్టేది. రాత్రి పూట ఆమ్మను జుట్టు పట్టి గదిలోకి ఈడ్చేవాడు. తలుపేసేవాడు. దెయ్యం దిగేదాకా తలుపు తెరుచుకునేది కాదు. అమ్మకు ఇష్టం లేదు ఆ దెయ్యం అంటే. తిట్టేది. కొట్టేది. రక్కేది. ఊహూ. వినేవాడు కాదు. దెయ్యం దించుకోవాల్సిందే. ఏమనుకున్నాడో ఏమో... నానమ్మ ఊరి నుంచి నన్ను తీసుకొచ్చేశాడు. పన్నెండేళ్లుంటాయి. బొద్దుగా పుష్టిగా ఉండేదాన్ని. ఆ రాత్రి నాన్నలో దెయ్యం లేచింది. అది అమ్మ గదిలోకి వెళ్లలేదు. నా గదిలోకి వచ్చింది’... కాగితం తగలడుతూ ఉంటే రెండు కళ్ల చివర నీటి బిందువులు పొంగాయి. ‘దెయ్యం వచ్చి... దెయ్యం వచ్చి’... కాగితాలు కాల్చే వేగం పెరిగింది. కళ్లు తడుస్తున్నాయి. ‘అయ్యో వద్దు... ఛీ దెయ్యమా వద్దూ... అరుస్తున్నాను... బయట అమ్మ తలుపు బాదుతూ ఏడుస్తూ... దెయ్యం మింగేస్తుందేమో అన్నంతలో తలుపు పగలగొట్టి దెయ్యం తల చిట్లగొట్టి’... కళ్లు కారుతున్నాయి. పెదాలు బిగిసి ప్రతీకారం తీర్చుకుంటున్నట్టుగా చేతులు కాగితాలను తగలబెడుతున్నాయి. నుసి. రాలు. నుసి. నశించు. నుసి. నీకిదే శాస్తి.‘ఆ రోజు ఏడ్వడం మానేశాను. మళ్లీ ఇవాళ’... ఒక్కసారిగా రెండు కళ్లను చేతుల్లో దాచుకుంది. మలినాలు... తెట్టు... కల్మషం... మరొకరి చర్య వల్ల ప్రమేయం లేకపోయినా చేరుకుపోయిన మురికి... అన్నీ కారిపోతున్నాయి... పూర్తిగా... సంపూర్ణంగా... మరేమీ మిగలనట్టుగా... అతడు లేచి ఆ నుసినంతా ఒక కాగితం మీదకు సర్దాడు.‘దీనిని ఫ్లష్ చేస్తే మళ్లీ జీవితంలో దీనిని మీరు చూడగలరా?’తల అడ్డంగా ఆడించింది. ‘అయితే ఫ్లష్ చేసి రండి’చేతుల్లోకి తీసుకుని ఆ నుసినే చూస్తూ ఆ నుసినే సింక్‌లో వేసి ఆ నుసి పైకి ట్యాప్ తిప్పితే ఆ నుసి చురుగ్గా కదలుతూ చీకట్లోకి జారిపోతూ మళ్లీ ఎప్పుడూ తనకెప్పుడూకనిపించడానికి వీల్లేకుండా అగాధంలోకి వెళ్లిపోయింది.ముఖం కడుక్కుంది.‘రిలీఫ్‌గా ఉందా?’ అడిగాడు.‘ఊ’బజర్ నొక్కితే హజ్బెండ్ లోపలికొచ్చాడు.‘తీసుకెళ్లండి. ఎంజాయ్ లైఫ్.’...ఆమె వైపు తిరిగి అన్నాడు...‘ఏమండీ... దారిలో పూలు తీసుకుంటారుగా’నవ్వింది. అది ఎంత బాగుంది.కథ ముగిసింది.రాధిక రాసిన ‘అపచ్ఛాయ’ కథ ఇది.ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా నడిచినా ఎన్ని ముళ్లను రాళ్లను తప్పుకుని నడిచినా అశుద్ధం ఎక్కడో చోట అంటుతూనే ఉంటుంది. అక్కడ శిలలా బంధింపబడరాదు. కాళ్లు కడుక్కోవాలి. రుద్ది రుద్ది ఆ పీడ జ్ఞాపకాలను వదిలించుకోవాలి. ముందు చాలా జీవితం ఉంటుంది. అది ఎప్పుడూ మంచి జీవితమే అయి ఉంటుంది. సత్యం. పునః కథనం: ఖదీర్ - రాధిక -
ట్రేడ్
‘దాలయమ్మ వద్దు. దివ్యా అని పెట్టుకుందాం. ఎవరైనా అడిగితే అసలు పేరు అదే అని నువ్వు కూడా చెప్పు’ ‘ఊ’ అన్నాను. ‘ఏమైనా మనం అదృష్టవంతులం. పిల్ల దొరికింది. పదునాలుగు లోకాలు తిరిగితే పాతాళంలో దొరికింది పిల్ల. తూర్పు ప్రాంతం అంటే పాతాళమేలే. ఏం ఉండి చచ్చింది కనుక ఇక్కడ’ మళ్లీ ‘ఊ’ అన్నాను. నా దృష్టంతా పెద్ద రింగుల అమ్మాయి మీదే ఉంది. చిన్న రింగుల అమ్మాయి నా కాళ్ల దగ్గర కూచుని ఉంది. ఇద్దరూ మాలాగే శ్రీకాకుళం రోడ్డులో రైలెక్కారు. హౌరా నుంచి వాస్కో వెళ్లే రైలంటే ఇసుకలారీ కన్నా అధ్వాన్నం. రిజర్వేషన్ ఉన్నా లేకున్నా ఎక్కడ దొరికితే అక్కడ దూరిపోతారు. ఈ ఇద్దరు ఆడపిల్లలు కూడా దూరిపోయారు బతిమిలాడుకుని. రెండు పెద్ద సూట్‌కేసులు ఉన్నాయి. ఒక మూటలో వంట గిన్నెలు ఉన్నట్టున్నాయి. పక్క కంపార్ట్మెంట్లో వీళ్లలాగే చోటు చేసుకోగలిగిన ఒక మొరటు మనిషి గంటగంటకూ వచ్చి ఈ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారా లేరా చూసి వెళుతున్నాడు. పెద్దరింగుల అమ్మాయి సైడ్ బెర్త్ పక్కన నిలుచుని ఉంది. ఇందాకటి స్టేషన్లో ఎక్కిన కుర్రాడు ఆ అమ్మాయికి దగ్గరగా నిలుచున్నాడు. వాడంత దగ్గరగా నిలుచున్నా చలించడం లేదేమిటా అని చూస్తున్నాను. ‘బ్రోకరుగాడు దొంగముండా కొడుకులాగున్నాడు. ఐదు లక్షలకు టోపీ వేద్దామనుకున్నాడు. మూడున్నరకే తెగ్గొట్టడం మంచిదయ్యింది. లక్షకు మూడెకరాలొచ్చే ప్రాంతంలో మూడున్నరంటే ఎక్కువే. అదీగాక పెళ్లి ఖర్చులు మనవే. మంటపం ఖర్చు మనదే. తాళిబొట్టు, గాజులు... ఒకటేమిటి... రేపు మనింటి కోడలైతే మనాస్తి తనాస్తి కాదా. హూ. మన ప్రాంతం అమ్మాయి మన తాహతు అమ్మాయి దొరుకుతుందనుకున్నాను. నాగుపాము నెత్తిన మణైనా దొరికేలా ఉందికాని ఆడపిల్ల దొరికేలా లేదు. కులం గోత్రం కూడా వదిలేయాల్సొస్తుంది. అయితే అమ్మాయ్... నేను మాత్రం మీ పెద్ద పిన్నిలాగా ఈవైపు నుంచి తెచ్చుకుని వేషం మార్చి రూపు మార్చి కాటను చీరలకు బదులు కంచి పట్టుచీరలు కట్టి ఇంట్లో బుట్టబొమ్మలాగా కూచోబెట్టినా మరీ సంవత్సరానికి ఒకసారి తీర్థం కోసమే పుట్టింటికి పంపను.ఎన్నిసార్లయినా రావొచ్చు. ఎన్నిసార్లయినా పోవచ్చు. ఆడపిల్లనే కదా తెచ్చుకుంటున్నాం. బానిసను కాదు గదా’ రాత్రి పది దాటేసింది. మార్కాపురం కూడా దాటేసినట్టుంది. లైట్లు మందం అయ్యాయి. ఆ కుర్రాడు ఆ అమ్మాయి చెవి దగ్గరకు వాలాడు. వాలాడా? చలించదేంటా పిల్లా? ‘ఏమైనా బ్రోకరు తెలివైనోడేలే. అమ్మాయిని కూచోబెట్టి దాని అమా ్మబాబుని కూచోబెట్టి అన్నీ వైనంగా చెప్పాడు. ఇక్కడుంటే ఏముంది మట్టి బతుకు... రైకగుడ్డకి కూడా కూలిపనికి వెళ్లి గాడిద చాకిరీ చేయాలి. ఇక్కడి పిల్లోణ్ణి చేసుకుంటే పగలు బయటి కష్టం రాత్రి మంచం కష్టం తప్ప ఏమీ ఉండదు. పైగా తాగొచ్చి బాదడం ఒకటి. మన ఆడ పిల్లలు ఎందరిప్పుడు సుకంగా లేరూ? తుంగబద్ర పక్కకెళ్లి కర్నాటకలో సెటిలైన తెలుగాళ్లు అక్కడ వ్యవసాయం చేసి ఆరుసార్లు తిని మూడుసార్లు వెళ్లేంత సంపాదిచ్చారు. కార్లు బంగళాలు నౌకర్లు చాకర్లు పట్టుపరుపుల మీద పడుతుంది బతుకు. అదేమైనా దుబాయా గిబాయా బయపట్టానికి. మూడు నెలలు బెజవాడ బాష మాట్లాడటంలో ట్రైనింగ్ ఇస్తా. పోయి బెజవాడ ప్రాంతం అమ్మాయిలాగా కలిసిపోవడమే. వాళ్లు ఎదురిచ్చిన డబ్బుతో మీ అమ్మా అప్పా బాగుపడతారు. మన పక్కూరు పుల్లెంకి పుష్పలా మారి గుంటూరుకు కోడరికం వెళ్లలేదా. అప్పలమ్మ అనూషా పేరుతో నూజివీడులో చెలాయించడం లేదా. ఇది బూదిగుంపు కేంపు సంబందం. హోస్పేటకు దగ్గర. సినిమాల్లో చూపించినట్టు స్వర్గంలా ఉంటుందా చోటు. ఎర్రగా బుర్రగా ఉండబట్టి నీ పంట పదహారుసార్లు పండినట్టే పో అనంటే అప్పుడు ఒప్పుకున్నారు’‘అయినా వాళ్ల భయాలు వాళ్లకున్నాయిగా అత్తా’ అన్నాను.‘ఎందుకుండవు. కూటికి లేనోళ్లని తెచ్చి కోడలిగా కూచోబెట్టాక మన పద్ధతులు తెలిసే దాకా కసరమా.. కొసరమా? ఛీఛాలు చీత్కారాలు ఉంటాయ్. నిఘా ఉంటుంది. డబ్బుకు అమ్ముడుపోయాక అన్నీ పడాల్సిందే. మన పక్క అమ్మాయిలు కరువై ఒక్కో ఊళ్లో యాభై అరవైమంది కుర్రాళ్లు పెళ్ళిళ్లుగాక ఆడచెట్టుకైనా ఇచ్చి చేయండో అని తిరగతా ఉన్నారనిగానీ’....ఏదో కదలిక. మైగాడ్. బేరం కుదిరినట్టుంది.పెద్ద రింగుల అమ్మాయి, ఆ కుర్రాడు టాయిలెట్‌వైపు వెళుతున్నారు. కాళ్ల దగ్గర కూచున్న చిన్న రింగుల అమ్మాయి ఏమీ పట్టనట్టే చూస్తోంది. ఇదంతా నా కంట్లో పడుతుందేమిటీ.ఐదు పది నిమిషాలు కూడా కాలేదు. ఆ కుర్రాడు వేగంగా రాసుకుంటూ ఈ వైపుకు వెళ్లాడు. పెద్ద రింగుల అమ్మాయిని గంట గంటకీ వచ్చి చెక్ చేస్తున్న మనిషి టపాటపా రెండు బాదుతున్నాడు. ‘అప్పుడే మొదలెట్టావా సొంత బిజినెస్సు. దొంగముఖం దానా’ తిడుతున్నాడు. ఆ అమ్మాయి ఏం పట్టనట్టుగా వచ్చి ఇందాక నిలుచున్న చోట నిలుచుంది. కుర్రాడు డబ్బులెగ్గొట్టి వెళ్లినట్టున్నాడు.. అటే చూస్తోంది.‘ఎక్కడికెళుతున్నారు?’ అడిగాను.‘గోవా’‘ఏం చేస్తారక్కడ’‘క్లబ్బుల్లో పేకలు కలపడం, మందు పొయ్యడం, రాత్రిళ్లు ఈడు పంపినోళ్ల దగ్గర ఉండటం. మా అమ్మా బాబులకు అడ్వాన్స్ ఇచ్చి తీసుకెళుతున్నాడు. ఇది రెండోసారి’ ఏ భావం లేకుండా చెప్పింది.‘ఎంత సంపాదిస్తావ్’‘ఎంత సంపాదించినా అదంతా నరకం. ఎంతమందొస్తారో చెప్పలేం. ఒక్కోసారి ఇద్దరుముగ్గురొచ్చి ఒకేసారి అంటారు. కొట్టేవాళ్లు.. కొరికేవాళ్లు... రాజాం పక్కన వంద గడపల ఊరు మాది. తినడానికి తిండి లేదు. అక్కడైతే టేబుల్ మీదొదిలేసిన చికెన్ ముక్కలైనా దొరుకుతాయి. ఆకలికి ఏడ్వడం కన్నా మగాడు మీద పడ్డప్పుడు ఏడ్వడం మేలుగదా’ లోగొంతుకలో జీరగా అంది.వికారంగా అనిపించింది. టాయిలెట్ వైపు వెళుతుంటే ఆ కుర్రాడు కనిపించి ఐదువందల నోటు ముందు సాచాడు.‘ఇది ఆ అమ్మాయికి ఇవ్వండి. దీని మీద నా నంబర్ ఉంది. ఇష్టమైతే బళ్లారిలో దిగిపొమ్మనండి’ అన్నాడు.బళ్లారిలో గోలగోలగా తెల్లారింది.‘తప్పించుకున్నారా ముండల్లారా... తప్పించుకున్నారా.. ఎక్కడికెళతారో చూస్తాను’ అని ఆ చెకింగు మనిషి రంకెలేస్తూ తిరుగుతున్నాడు.ఎస్కేప్ అయ్యారన్నమాట. మా మేనత్త లేచి తీరిగ్గా ఆవలించిజుట్టు ముడివేసుకుంటోంది.ఈ పిల్లలు వాడి నుంచి తప్పించుకున్నారు. మా అత్త నుంచి ఆ దాలయమ్మ తప్పించుకుంటుందా?కథ ముగిసింది.మన్నం సింధుమాధురి రాసిన ‘తూరుపు కండ’ కథ ఇది.అసమ ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్ అయ్యే మొదటి వస్తువు స్త్రీయే. స్త్రీతో ముడిపడిన వ్యాపారం శృంగార బానిసత్వానికే కాదు సాంస్కృతిక బానిసత్వంలోకి కూడా కొనసాగుతూ ఉంటుంది. నాగరీకం నేర్చిన కోస్తాంధ్ర ఉన్నత వర్గాలు ఒకరితో ఇద్దరితో సరిపెట్టుకుని ఆప్షన్స్ కోల్పోయి చతికిల పడటం తెలుస్తోంది. పూర్వం పాలఘాట్ నుంచి ఆడపిల్లలను పెళ్లి చేసుకుని తెచ్చేవారు. ఇప్పుడు తూరుపుకు వెళుతున్నారు. హింస అంటే కొట్టడం తిట్టడమే కాదు. కల్చరల్ డిస్ప్లేస్మెంట్ కూడా. ఎన్ని కథలొస్తే ఈ బాధ తెలుస్తుంది. పునః కథనం: ఖదీర్ మన్నం సింధుమాధురి -
చెంబుడు నీళ్లు
వలీమా ధూమ్‌ధామ్‌గా జరిగింది. అంటే ఏం లేదు. ఇరవై కిలోల దొడ్డు బియ్యంలో పది కిలోల మటన్ ముక్కలు కలిపి, కొత్తిమీర అల్లం లొస్సన్ వేసి బిరియానీ వొండి అడిగినవారికి అడిగినంత ఆకులో వేయడమే. పెళ్లి చేయడం ఆడపెళ్లివాళ్ల వంతు. వలీమా చేయడం మగపెళ్లివాళ్ల వంతు. వలీమా బాగా జరగడం కొత్త పెళ్లికూతురికి సంతోషం కలిగించింది. అబ్బాయి యోగ్యుడు. సొంతగా సైకిల్ షాపు ఉందంటే యోగ్యుడే. యాభై వేలే తీసుకున్నాడు. ఎక్కువ బంగారం అడగలేదు. పలుచగా పొడవైన వేళ్లతో ఉన్నాడు కనుక చక్కగా నవ్వుతున్నాడు కనుక కొడతాడనే భయం మొదటి చూపులోనే లేదు. అత్తగారు స్నేహశీలి. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ముసలామె మాటకారి. ఇద్దరు ఆడపడుచులు. కదిలే తిరిగే ఇంట్లో వచ్చి పడింది. కదిలే తిరిగే ఇల్లేనా? బస్టాండ్ దాకా కదలొచ్చు. తర్కారీకి వెళ్లొచ్చు. టైలర్ షాపుకు పోయి రావచ్చు. కాలేజీకి వెళ్లి రావచ్చు. నీళ్లబావి దాకా రాకపోకలు కొనసాగించవచ్చు. కానీ అక్కడకు మాత్రం వెళ్లడానికి లేదు. ఎక్కడకు? అక్కడికే. అల్లామియా ఆడవాళ్ల కోసమే రాత్రిళ్లు సృష్టించాడు. అబ్బ ఎంత మంచి దేవుడు ఆయన. రాత్రి లేకుంటే ఆడవాళ్ల బతుకు ఏంగాను. చెంబు తీసుకొని, లోటా తీసుకొని, ప్లాస్టిక్ సీసాతో, ఒకరికొకరు కూడబలుక్కుని రాత్రి చీకటిలో అలా తుప్పల్లోకి వెళ్లి వస్తారు. చిన్నప్పుడు అలా వెళ్లడం బాగుండేది. కానీ ఊహ తెలిశాక, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని తండ్రి దానిని కట్టించాడు. అమ్మ చెవి కమ్మలు గిర్వీ పెట్టి, తెలిసిన ఇటుకల బట్టీ ఆయన ఉంటే బతిమిలాడుకుని, బేల్దారును మంచి చేసుకొని, సీలింగ్ రేకు కొని... ఉన్నవాళ్లకు ఇది చీమ. లేనివాళ్లకు ఇదే ఏనుగు. అమ్మకు భలే జుగుత్ ఉండేది. ఇల్లు నీట్‌గా పెట్టేది. దానిని కూడా. రోజూ నిర్మా చల్లి కడిగేది. ఇది బంధువుల్లో చోద్యం. దానిని కూడా తోముతారా. యాక్. తోమకపోతేనే యాక్.ఈ యాక్కి భయపడే బంధువుల ఇళ్లకు వెళ్లేది కాదు. వెళ్లినా రాత్రిళ్లు ఉండేది కాదు. ఉదయం పూట వెళ్లాల్సి వస్తుంది గదా. దానినెందుకు అంత గలీజుగా ఉంచుకుంటారు?‘ఇంటిని చక్కబెట్టుకోవడానికే టైము లేదు. దాన్ని కూడా ఎక్కడ చక్కదిద్దేది’ అనింది ఒక బంధువులామె.వంట చేసి, పిల్లల్ని చూసుకుని, బట్టలుతుక్కుని, బాసన్లు కడుక్కుని, వాకిలి చిమ్ముకుని... ఇవిగాక ఉప్పు చింతపండుక్కూడా బజారుకు పరుగు దీస్తూ... అసలు మగాడనేవాడు లేచి రెండు బకెట్లు నింపి ఠాప్ ఠాప్ కొడితే ఎంత బాగుంటుంది. మగాళ్లు చేస్తారా? టేప్రికార్డర్లో ఖవ్వాలీలు వినమంటే వింటారు. కానీ ఈ పెళ్లికొడుకు చేసేలాగే ఉన్నాడు. చేస్తాడులే. ఏం చేయడం. అసలు అది ఉంటే కదా. కాలేజీకి వెళ్లే ఇద్దరు ఆడపిల్లలు, తల్లి, ముసలామె ఉన్న ఇంట్లో అది లేకుండా ఎలా ఉంటుంది అనే భరోసాతో పెళ్లికి ముందు మాటమాత్రం కూపీ లాగలేదు. పెళ్లయ్యాక చూస్తే అది ఉంది. కానీ తన ఇంట్లోదాని లాగా లేదు. నాలుగు గోతం పట్టాలు నాలుగువైపులా కట్టి, ఒక గోతం పట్టాను తలుపులాగా వేలాడ దీసి.. ఇదా? లోపల ఒక మట్టిగొయ్యి... దానికి అటో కాలు... ఇటో కాలు వేసి కూచోడానికి ఇటుకరాళ్లు... ఆ గొయ్యిలో నిన్నటిదీ మొన్నటిదీ .... డోక్... డోక్... పెళ్లికూతురికి వాంతులు. ఆ తర్వాత కడుపు నొప్పి. వలీమాకు వచ్చిన పెళ్లికూతురు అత్తారింటి నుంచి మొదటి శుక్రవారం అయ్యేదాకా కదల కూడదు. ఈ అమ్మాయి వెళతానని కూచుంది. అన్నం తినదు. తింటే అది వస్తుందని చెప్పదు. కడుపునొప్పి అంటుంది. రాత్రయితే ఆడపడుచుని తీసుకొని తుప్పల్లోకి వెళ్లే సాహసం చేయగలదు. కాని ముస్లింలు అలా వెళ్లకూడదట. గోషా అట. చిన్నప్పుడు అల్లరి చేస్తే తల్లి నరకం గురించి చెప్పి భయపెట్టేది. తనకు మాత్రం నరకం అంటే ఆ నాలుగు గోతం పట్టాల మధ్య ఉన్నదే. పూలంటే ఇష్టం పండ్లంటే ఇష్టం అని చెప్పాల్సిన కొత్త పెళ్లికూతురు నాకు సిమెంటుతో కట్టి నీటుగా ఉంచిన అదంటే ఇష్టం అని భర్తతో నోరు తెరిచి ఎలా చెప్తుంది. మీ ఇంట్లో అది అసయ్యంగా ఉంది అని ఎలా చెప్తుంది. ఇలా ఉంటే నేను ఉండను అని ఎలా చెప్తుంది. ‘మా ఇంటికి వెళ్తాను’ అంది. ఏమనుకున్నాడో ఏమో పెళ్లికూతురిని తీసుకొని బయలుదేరాడు. ఇంకా బంధువులు పూర్తిగా వెళ్లలేదు. తననే చూస్తున్నారు. అత్తగారు మనసు విప్పి మాట్లాడలేదు. తననే చూస్తోంది. ఆడపడుచులు సరదాలు సల్లాపాలు చేయలేదు. తననే చూస్తున్నారు. వెళుతోంది.తిరిగి వస్తుందా? మనసు గుర్రంలాగా పరుగు తీస్తోంది. వేరు కాపురం పెట్టించాలి. తన ఊరికే తీసుకెళ్లిపోయి అక్కడే పెట్టించాలి. అక్కడైతే ఇల్లుంది. ఇంట్లో అది ఉంది. అమ్మయ్య... అది ఉంటే కలిగే నిశ్చింత ఆడవాళ్లుగా పుడితేతప్ప తెలియదు. చెంబు పట్టుకుని నాకిప్పుడు అది వస్తోందహో అని ఊరందరికీ తెలిసేలా దారిలో నడవడం కంటే సిగ్గుతో చచ్చి భూమిలోకి పాతుకుపోవడమే మేలు అని ఈ మగవారికి ఎప్పటికి తెలుస్తుంది. ఇల్లు వచ్చింది. ఎలా ఉన్నావమ్మా– తల్లి ఎదురొచ్చింది.అక్కా– చెల్లెలు పరిగెత్తింది.కానీ నేరుగా వెళ్లి దానిలో దూరి తలుపు మూసుకుంది. కొత్తపెళ్లికూతురు పుట్టింట్లో మొదటగా దానినే పలకరించాల్సి రావడం కన్నా విషాదం ఉంటుందా? రాత్రి మాటల్లో తెలిసింది. ఇల్లు ఖాళీ చేస్తున్నారట. పెళ్లికి అప్పు ఇచ్చినాయన తనఖా తీరేదాక ఇందులోనే ఉంటానని అంటున్నాడట. ‘మరి ఇప్పుడు?’ ‘ఊరికి దూరంగా ఒక రేకుల ఇల్లు దొరికింది. చిన్నది.’ ‘అందులో అది ఉందా?’ ‘అదీ.. అదీ’.. జవాబు చెప్పబోతుంటే ఊపిరి బిగబట్టి ఉంది. కథ ముగిసింది. షాజహానా రాసిన ‘సండాస్’ కథ ఇది. అంటే ‘టాయిలెట్’ అని అర్థం. ‘టాయిలెట్ ఏక్ ప్రేమకథ’లాంటి సినిమాలు దానికి కారణమైన ఘటనలు దేశంలో జరగకముందే 2004లో షాజహానా ఈ కథ రాశారు. ఇవాళ ప్రభుత్వం సాయం చేస్తున్నా కడుతున్నానని అంటున్నా సవాలక్ష పల్లెల్లో ఆడవాళ్ల పరిస్థితి నేటికీ ఇదే. ఒకవేళ కట్టుకున్నా శుభ్రం చేసే చాకిరీ ఆడవాళ్లదే. ‘దానిని కడగటం తప్ప ఏ పనైనా’ అని పని మనుషులు పని మాట్లాడుకుంటున్నారిప్పుడు. దానిని కడగటం తప్ప ఏ పనైనా అని పెళ్లి మాట్లాడుకోగలుగుతున్నారా ఆడవాళ్లు? -పునః కథనం: ఖదీర్ ∙షాజహానా -
ఫైసలా
వచ్చినవాళ్లలో ఎవరో జన్నతుల్ ఫిర్దౌస్ రాసినట్టున్నారు. మంచి వాసనొస్తోంది. కాని అసలు కంపంతా హుసేన్ చేశాడు. పంచాయితీ కూచుంది. బల్లపీటల మీద కూచున్నోళ్లు బల్లపీటల మీద ఉన్నారు.నులక మంచాల మీద కూచున్నోళ్లు నులక మంచాల మీద ఉన్నారు. వరండాలో చాటుగా ఘోషా పాటిస్తున్న ఆడవాళ్లు మాటకు అవసరం రాకపోతుందా అన్నట్టు కాచుకుని ఉన్నారు. ఒకవైపు హుసేను ఒకవైపు జుబేదా నిల్చున్నారు. మూడు నెలలుగా గొడవ జరుగుతూ ఉంది. గొడవ చేస్తున్నవాడు హుసేను. టీచరుద్యోగానికి వెళ్లిన జుబేదా ఇంకో స్కూలు సారు సైకిల్ మీద కూచుని కనిపించిందని గొడవ.‘పెళ్లయిన ఏడేళ్లలో మూడు కడుపులు పోయాయి. ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లల సంచి పలుచనైందని డాక్టరమ్మ చెప్పి గోలీలు రాసిచ్చింది. కాని ఎన్నిగోలీలు వాడినా బహిష్టప్పుడు నొప్పితో బంతిలా మారిపోతున్నా. నేను ఉద్యోగం చేసే ఊరు బస్సులు తిరిగే ఊరు కాదు. పొద్దునొక జీపు సాయంత్రం ఒక జీపు తిరుగుతాయి. నొప్పికి వీలుగాక కాస్త ఇంటిదాక వదలమంటే, పాపం అన్నలాంటోడు, వచ్చి వదిలాడు. అది తప్పా’ అని జుబేదా జవాబు చెప్పింది. కాని వినట్లేదు. అసలు సంవత్సరం ఆరు నెలలుగా సతాయిస్తున్నాడు.‘నువ్వు దొడ్డుగైనావు. నా దోస్తులు చూసి నవ్వుతున్నారు’ అన్నాడొకసారి.‘నువ్వు మాత్రం పెళ్లయినప్పుడు ఎట్టున్నావో అట్టే ఉన్నావా. బొర్రా పిర్రా పెంచలేదా. నాది ఊబవొళ్లు. నీకు సేవ జేసిజేసి, పిల్లల్ని కనీకనీ ఈ ఒళ్లు వచ్చింది’ అంది జుబేదా.‘నలుగురితో మీద మీద పడి మాట్లాడుతున్నావు’‘నాది సర్కారు నౌకరీ. నలుగురితో కలుపుగోలుగా ఉండటమే నా కొలువు. కాదంటే చెప్పు మానేసి ఇంట్లో కూచుంటా’ఊహూ. వినట్లేదు.సంగతి తర్వాత తెలిసింది. ఊళ్లో ఒంటెద్దుబండి తిప్పే మస్తాను కూతురు ఫాతిమా వెనుక పడుతున్నాడట.ఆ పిల్ల మీద మోజుతో ఏదో ఒక కారణం చూసుకొని తన్ని పుట్టింటికి పంపుతున్నాడు.‘వాని మీద గత్తర పడ. వానికి సావు రాను. వాని కనుగుడ్లలో పువ్వులు పుయ్య. వాడి చేతుల్లో పుండ్లు పడ’ అని కూతురు ఇంటికొచ్చినప్పుడల్లా జుబేదా తల్లి తిట్లు లంకించుకుంటుంది.‘మీ ఇళ్లల్లో ఒక్కో మగాడు ఇద్దరు ముగ్గుర్ని చేసుకుంటారు గదా. ఇదేం కొత్త’ అంది ఇరుగమ్మ. ‘రా చూద్దూరా. మా అయ్య చేసుకున్నాడా. మా తాత చేసుకున్నాడా. మా ఫుప్పా చేసుకున్నాడా. మా ఆయన చేసుకున్నాడా. చేసుకునే బద్మాష్‌గాళ్లు ఏ కులం మతంలో అయినా ఉంటారు. చేసుకోనివాళ్లు కూడా ఎక్కడైనా ఉంటారు. నా ప్రాణానికే దొరికాడు ఇలాంటి లత్తుకోరుగాడు’ అంది జుబేదా తల్లి. ‘ఆ మస్తానుకు బుద్ధి లేదా. పెళ్లయినోడు పిల్ల వెంట పడుతుంటే బుద్ధి చెప్పాలి గదా. పిల్లనట్ట వదిలేస్తాడా సోబతు పొమ్మని’ అంది పొరుగమ్మ.‘ఆ మస్తానుగాడికి ముగ్గురు కూతుళ్లు. ఒక పిల్ల పెళ్లికే నంగా అయ్యి గల్లీల పడ్డాడు. ఇంకో ఇద్దరు బిడ్డల నిఖాలు ఎక్కడ జరిపిస్తాడు? పూట పూటకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇంటి పిల్ల రెండోదానిగానో మూడోదానిగానో వెళ్లినా వేళకు రెండు ముద్దలైనా తింటుందని ఆశ పడుతున్నాడు గాబోలు. ఆకలికి మనుషుల్ని అమ్ముకునే బేహాలతు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్లు ఉండనే ఉంటారు. అసలు వాళ్లను అని ఏం ప్రయోజనం. మన బంగారం మంచిదైతే కదా’ అంది జుబేదా.ఇలాంటి తకరార్లు, తగాదాలు జరిగి మొగునికి బుద్ధి చెప్పే విషయంగా పంచాయితీ కూచోబెట్టింది జుబేదా. టోపీలు, గడ్డాలు, సుర్మాలు, బుర్ఖాలు అన్నీ కొలువు దీరాయి.‘మరి ఏమంటావు హుసేనా?’ అన్నాడు మసీదు పెద్ద.హుసేను ముందుకొచ్చి, జంకూ గొంకూ లేకుండా ‘నాకిద్దరూ గావాలె’ అన్నాడు.‘అట్టెట్ట కుదురుద్ది’ అని ఘోషాలో నుంచి ఎవరో ఆడామె అనబోయింది.‘ఆడోళ్లు నోరు ముయ్యండి. మగాళ్లం మాట్లాడుతున్నాం కదా’ కసిరాడు మసీదు పెద్ద. ‘నాకు ఇద్దర్ని పోషించే హోస్లా ఉంది. పోషించే హోస్లా ఉన్నప్పుడు చేసుకొమ్మని మతం చెప్పింది గదా. ఇంకేంటి’ అన్నాడు హుసేను.మసీదు పెద్ద ఫాతిమాని పిలిపించాడు. ‘పెళ్లయినోణ్ణి కోరుతున్నావ్. వాణ్ణి కోరడం మంచి పనేనా?’ ఫాతిమా పక్కా ఇరాదాతో అంది– ‘నాకు వాడు గావాలె’. ‘ఏం మస్తానా. పెళ్లయినవాడికిచ్చి నీ కూతురి గొంతు కోద్దామనుకుంటున్నావా?’మస్తాన్ ఏమీ మాట్లాడలేదు. తల వొంచుకుని కూచున్నాడు. ‘ఇంకేంది పంచాయితీ తేలిపోయింది. ఇద్దరూ పడి ఉండండి’ అన్నాడు మసీదు పెద్ద. ‘ఏంటి?’ అంది జుబేదా ముందుకొచ్చి. ‘పోషించే హోస్లా ఉందంటున్నాడుగా నీ మొగుడు. నువ్వుంటావు. అదీ ఉంటుంది. అదే తీర్పు’ అన్నాడు మసీదు పెద్ద. ‘అయితే నా తీర్పు వినండి’ అంది జుబేదా. ‘ఒళ్లు దొడ్డుగయ్యింది ముక్కు సొట్టబొయ్యింది అని నెపం పెట్టి ఇవాళ ఇంకోదాన్ని తీసుకొస్తున్నాడు. రేపు ఆ రెండోదాన్ని నువ్వు నల్లగున్నావు రాత్రేళ సల్లగున్నావు అని వేరేదాన్ని తేకుండా ఉంటాడా? నేనూ మనిషినే. ఒకమ్మ కడుపున పుట్టిన్దాన్నే. చదువుకున్నా.ఉద్యోగం ఉంది. నా బతుకు నేను బతగ్గలను. నన్ను గౌరవించని మొగుడు నాకెందుకు. హోస్ల ఉంటే ఇంకోదాన్ని తెచ్చుకోమని చెప్పిన మతమే సరిపడని మగాణ్ణి వదిలించుకొమ్మని కూడా చెప్పింది. బహిష్టు నొప్పప్పుడు తంగేడు పుల్ల నవిలితే నొప్పి పోతుందని నవిలా. పోలేదు. పిల్లలసంచి తీసి పారెయ్ పోతుంది అని డాక్టరమ్మ చెప్తే రేపొస్తానని వచ్చా. ఈ పుల్ల పంచాయితీ ఎంత మందమో తెలిసిపోయింది. నా పిల్లలసంచి లాగే వీణ్ణి కూడా తీసి అవతల పారేస్తున్నా. నాకు ఖులా ఇప్పించండి’ అని, బోర్లేసిన చేతులను నడుం మీద ఉంచి అందరి వైపు తీక్షణంగా చూస్తూ నిలబడింది జుబేదా. కథ ముగిసింది. రుబీనా పర్వీన్ రాసిన ‘ఖులా’ కథ ఇది.ఇస్లాంలో పెళ్లి అగ్రిమెంట్లాంటిది. అందులో నుంచి బయటపడటానికి మగవాడికి ‘తలాక్’ ఏర్పాటు ఎలా ఉందో స్త్రీకి ‘ఖులా’ ఏర్పాటు అలా ఉంది. తగిన నోటీసు ఇచ్చి తలాక్ ఎలా చెప్పవచ్చో తగిన నోటీస్ ఇచ్చి ఖులా కూడా చెప్పవచ్చు. ముస్లిం స్త్రీ ఖులా తీసుకోదలిస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు. తమను ఇబ్బంది పెట్టే మగవాళ్లకు ఖులా ఇచ్చే ఆడవాళ్ల సంఖ్య హైదరాబాద్‌లో పెరిగిందని ఇటీవలి అధ్యయనం చెప్పింది. ఏ స్త్రీకైనా జీవితంలో ఆత్మగౌరవమే ప్రథమం. మతం ద్వితీయం. అది ఏ మతమైనా సరే. పునః కథనం: ఖదీర్ - రుబీనా పర్వీన్ -
గుడ్డి వెలుతురు
చీకటే గుర్తుంది మొదట.‘నువ్వు చీకట్లోనే దొరికావు’ అంటుంది శారదా టీచర్.చీకటి. రాత్రి. ఇల్లంతా చీకటై పోయిన రాత్రి. నాన్న చీకటిగా మారిన రాత్రి.‘అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చుగా’ అనేదట అమ్మ.‘నేను పెళ్లయినవాణ్ణి. గవర్నమెంట్ ఉద్యోగిని. నిన్ను ఉంచుకుంటా’ అన్నాడట నాన్న.‘పోనీ ఎవ్వరికీ తెలియకుండా నా మెడలో తాళైనా కట్టు’ఆ మాత్రం కమిట్మెంట్ కూడా ఎందుకు.‘కట్టను. ఇష్టమైతే చెప్పు’అమ్మ ఏమంటుంది. పేదరికం నోరు మూయించింది. అప్పటికే పాతికేళ్లు వచ్చేశాయి. దిక్కులేని ఇంటికి చాకిరీ చేసి చేసి అలసిపోయింది. మనిషి కదా తను. ఎముకలు, గుజ్జు, రక్తము, చలనము ఉన్న మనిషి. నాన్నతో వచ్చేసింది.పెళ్లయిన స్త్రీకి అడ్రస్ ఉంటుంది. ఉంచుకున్నదానికి ప్రతి ఊరూ అడ్రస్సే.ఇంట్లో తెలియకుండా ఉండాలని నాన్న అమ్మను ఊరూరు తిప్పేవాడు. అక్కడ కొన్నాళ్లు. అక్కడ కొన్నాళ్లు. ఇక్కడ కొన్నాళ్లు. ఇక్కడ కొన్నాళ్లు. ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. వచ్చినరోజు ఇంట్లో కోడికూర కుతకుత ఉడికేది. అమ్మ నవ్వేది. ఏదో అడుగుతుంది కాబోలు గుద్దులు తిని ఏడ్చేది. నవ్వో ఏడుపో. నాన్న వచ్చిన రోజు బాగుండేది. నాన్న డబ్బులిచ్చేవాడు కాదు. ఉంచుకున్న ఆడదానికి డబ్బులిచ్చే బాధ్యత మగాడికి లేదు. అమ్మ బీడీలు చుట్టేది. ట్యూషన్లు చెప్పేది. ఇదిగో శారదా టీచర్ సాయంతో జీవితం లాక్కునొచ్చేది. ఏమీ అనడానికి ఉండేది కాదు. నాన్న దగ్గర నాలుక అనే ఆయుధం ఉండేది. ‘ఏమో.. నన్ను తగులుకునే ముందు ఎంతమందిని తగులుకున్నావో’ అనేవాడు.నాలుక కాదు అది. మలం. అమ్మ నోరుమూసుకుని ఉండేది. ఆ తర్వాత్తర్వాత నాన్న కోపంగా ఇంటికి రావడం మొదలెట్టాడు. ఇంట్లో తెలిసిపోయిందట. భార్య గొడవ చేస్తున్నదట. లంపటంలో ఇరుక్కున్నాను అన్నట్టు ఉండేవాడు. రాత్రయితే భయం. రాత్రయ్యాక తాగాక కొట్టాలి కదా మరి.ఆ రోజు సాయంత్రం నాన్న ఇంట్లోనే ఉన్నాడు. నేను స్కూలు నుంచి వచ్చి పెరడులో నీళ్ల తొట్టి దగ్గర స్నానం చేస్తున్నా.పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి. ఇంటి ముందు రెండు కార్లు వచ్చి ఆగాయి. ఆడవాళ్లు మగవాళ్లు... చాలామంది ఇంట్లో దొమ్మిగా దూరారు. రావడం రావడం అమ్మను బూతులు తిడుతున్నారు. వాళ్లంతా నాన్న భార్య తరపు మనుషులట. ఇవాళ ఐసల్ ఫైసల్ తేల్చుకుందామని వచ్చారట.కొన్ని విషయాలకు సంఘంలో పూర్తిగా అనుమతులు ఉంటాయి.లేకుంటే తీసుకుంటారు.ఉంచుకున్న మనిషిని దండించే అనుమతి వాళ్లు తీసుకున్నారు. ఒకరికి ఉంపుడుగత్తెగా ఉండి, పచ్చని కాపురం పాడుచేస్తుంటే ఊరుకుంటారా? ఒకడు జుట్టు పట్టుకునిలాగి కింద పడేశాడు. ఒకడు దవడ మీద బాదాడు. ఒకామె మాటలతో ఎగదోసింది. ఒకడు రోకలికర్ర ఎత్తి మీద వేశాడు. నాన్న మెదలకుండా చూస్తుంటే అందరూ గుమిగూడి కాళ్లతో చేతులతో కర్రలతో కట్టెలతో మీదపడి.. అమ్మా... అమ్మా....ఎంత మనిషని? సున్నితంగా చక్కగ ఉన్న మనిషి. శరీరంలోని ప్రతి అవయవం నలిగిపోయిందని తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో చెప్పారట. పక్కటెముకలు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు.... ఏ కూతురికైనా శాపం ఏమిటో తెలుసా? తల్లి ముఖం మామూలుగా కాక, నవ్వుతున్నట్టు కాక, వికృతంగా– తల పగిలి– రక్తం కారుతూ గుర్తుండిపోవడం.తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు. రాత్రి పదింటికి జ్వరంతో కాలిపోతూ పూర్తి చీకటిలో పెరడులోని నీళ్ల తొట్టె వెనుక శారదా టీచర్‌కు దొరికాను.తనే పెంచింది నన్ను.ఎంత చీకటిలో అయినా గుడ్డి వెలుతురు ఉంటుంది కదా. ప్రేమగా పెంచిన టీచర్. దయదలుస్తున్నట్టుగా కాక మానవ ప్రతిస్పందనగా పెంచిన టీచర్. బాగా ఎదిగి కాలేజీకొచ్చాక అడిగాను–‘పెళ్లెందుకు చేసుకోలేదు శారదా టీచర్?’‘వెగటు పుట్టి తల్లీ. మగాడిలోని చీకటికి వెగటు పుట్టి’మళ్లీ అంది–‘అన్నీ పడాల్సింది మనమే. ఒకతను పరిచయమయ్యాడు. ప్రేమించాను. చేయి వేశాడు. వద్దన్నాను. చేయి వేయనివ్వట్లేదంటే నీకు నా మీద ప్రేమ లేదన్నట్టే అన్నాడు. బ్లాక్‌మెయిలింగ్. ప్రేమ నిరూపించుకోవాలన్నమాట. వేయనిచ్చాను. పెళ్లి చేసుకోమన్నాను. నాకు లొంగిపోయావంటే ఇంకెంతమందికి లొంగిపోయావో అన్నాడు. లొంగదీసింది వాడే. నింద వేసిందీ వాడే. తగులుకోవడానికి నీకు ఎవరో ఒకరు దొరుకుతారులే అన్నాడు. మనసు విరిగిపోయింది’ ఎంత పెనుగులాడి ఉంటుందో. మగాడు ఎందుకు పెనుగులాడేలా చేస్తాడో.చీకటిగా ఉంది. చుట్టూ హాస్పిటల్ కారిడార్ అంతా పరుచుకున్న చీకటి.శారదా టీచర్ ఇక్కడే ఉంది. కేన్సర్ అన్నారు. ఇప్పుడో మరి కాసేపో. వీడ్కోలు.అమ్మ గుర్తుకొచ్చింది. ఆమె చూసిన జీవితం గుర్తుకొచ్చింది. అమ్మ... అమ్మలాంటి స్త్రీలు.. శారదా టీచర్ శారదా టీచర్లాంటి స్త్రీలు... ఎంతమంది ఉంటారు. అంతమంది ఎందుకు ఉండాలి అసలు. జీవితాలని ఎందుకు కోల్పోవాలి? ‘ఇక్కడున్నావా తల్లీ’ పిలుపు వినిపించింది.శ్యామలా ఆంటీ. శారదా టీచర్ ఫ్రెండు. శారదా టీచర్‌లాగే.‘ఇక మీదట అన్నీ నీకు నేనేనమ్మా’ అంది ఉదయమే అపేక్షగా. ‘ఇక్కడ చాలా చీకటిగా ఉంటే ఏం చేస్తున్నావమ్మా. లోపలికి పోదాం పద’ చేయి పట్టుకుంది.తిరిగి ప్రయాణం మొదలైంది. ఒక గుడ్డి వెలుతురులోకి.కథ ముగిసింది.విమల రాసిన ‘నీలా వాళ్లమ్మ మరికొందరు’ కథ ఇది.మగవాళ్ల వికల వ్యక్తిత్వం వల్ల తప్పిపోయిన స్త్రీ పాత్రలు చాలా ఉంటాయి సమాజంలో. ఎక్కడుంది లోపం? వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిలు... వ్యక్తిత్వం ఉన్న యువకులు... వ్యక్తిత్వం ఉన్న అధికారులు... వ్యక్తిత్వం ఉన్న నాయకులు... అంతిమంగా వ్యక్తిత్వం ఉన్న భర్తలు వీళ్లను తయారు చేసుకోవడంలో వ్యవస్థ ఎక్కడ విఫలం అవుతూ ఉంది? భూమి రెండు అర్ధగోళాలు. స్త్రీ అనే అర్ధగోళం అర్థవంతంగా ఉండాలంటే పురుషుడి వ్యక్తిత్వం అర్థవంతంగా ఉండాలి. వెలగాలనుకుంటున్న స్త్రీలతో పాటు వెలుగుదామనుకునే పురుషుల వల్లే చీకటి పోతుంది. అందాక గుడ్డి వెలుతురే. ఇప్పుడున్నది అదే. పునః కథనం: ఖదీర్ - విమల -
బూజుకర్ర చివరన
కారిడార్‌లో నడుస్తూ ఉంటే ఆ ఫ్లాట్‌లో నుంచి మృదువైన ధ్వని. ఏమిటది?వయొలిన్ కావచ్చు. అవును. వయొలినే. ఎవరు మీటుతున్నారబ్బా? తలుపు ఓరగా తెరిచి ఉంది. ఉండబట్టలేక తొంగి చూశాడు. ఆమే. కొత్త వయొలిన్ లాగుంది... ఇవాళే కొని ఉండవచ్చు... కూచుని సాధన చేస్తూ ఉంది. అది మృదువుగా ఒకసారి మారాము చేస్తున్నట్టు మరోసారి సంగీతం పలుకుతూ ఉంది. ఇతణ్ణి చూసింది. మొహమాటపడుతూ నవ్వింది. ‘చాలా బాగుందండీ’ అనేసి అక్కడి నుంచి వచ్చేశాడు. nఆలోచిస్తే కొంచెం తబ్బిబ్బుగా ఉంది. భర్త ఇటీవలే చనిపోయాడు. పిల్లలు వచ్చి జరగవలసిన కార్యక్రమాలు చూసి మాతో వచ్చెయ్యమ్మా అని పిలిస్తే వెళ్లలేదు. సాధారణంగా ఇలాంటి టైములో పిల్లల దగ్గర ఉండటమే మంచిది. కాని ఇక్కడ ఉండిపోయింది. భర్త పోయిన దుఃఖం, దీనత్వం ఆశించాడు. కాని ఆ ఛాయలేమీ లేవు. పైగా వయొలిన్ నేర్చుకుంటూ కనిపిస్తోంది. మరి తన పరిస్థితి? దాదాపు దివాలా తీసినట్టయ్యింది బతుకు. కొన్ని రోజుల క్రితమే భార్య కేన్సర్‌తో మరణించింది. ఆమెను సాగనంపాక ఇల్లంతా బోసిపోయినట్టయ్యింది. అది సరే. ఇంతవరకూ ఆ ఇల్లు అసలు తనకు పరిచయమే లేదని అతనికి తెలిసొచ్చింది. రేజర్ కనిపించలేదు. టూత్‌పేస్ట్ ఎక్కడుంటుంది తెలియలేదు. తనకో ఫుల్‌హ్యాండ్స్ బ్లూషర్ట్ ఉండాలి... ఎంత వెతికినా అది కనిపించలేదు. కుక్కర్ కనిపించలేదు. పళ్లేలు కనిపించలేదు. టీవీ రిమోట్ కనిపించలేదు. హాల్లో సోఫా ఉన్నా అదీ కనిపించలేదు.ఇన్నాళ్లూ వాటన్నింటికీ భార్య కళ్లు ఉండేవి. అవి వెతికి అమర్చి పెట్టేవి. ఇప్పుడు తన కళ్లకు అవి కనిపించాలంటే పెద్ద విషయంగా ఉంది. భార్య లేకపోతే భర్త అంధుడైపోతాడా?మరి ఆ వయొలిన్ ఆమె అలా లేదే. ఇద్దరివీ పక్కపక్క ఫ్లాట్లు. ఎంత తేడా?ఆ రోజు టెర్రస్ మీదకు వెళితే ఆమె కేన్ కుర్చీ వేసుకుని వాటర్ ట్యాంక్ నీడలో ఏదో పుస్తకం చదువుకుంటోంది. మొహమాట పడుతూనే అడిగాడు–‘మీవారు పోయిన దుఃఖం మిమ్మల్ని వేధించడం లేదా అండీ’ ‘దుఃఖం ఉండదని ఎవరన్నారు?’ అడిగింది. అక్కడే సిమెంట్ చేసిన పిల్లర్ ఉంటే కూర్చున్నాడు.‘దుఃఖం ఉంటుంది. జీవితంలో తోడు నిలిచిన భర్తని, మనతో పాటు నడిచిన భర్తని, ప్రేమించిన భర్తని కోల్పోతే దుఃఖం లేకుండా ఎలా ఉంటుంది. ఆ దుఃఖమూ నిజమే. అతడు పోయాక ఆర్థిక ఇబ్బందులంటూ లేకపోతే నేనూ నావంటి మరో స్త్రీ కాసింతైనా తెరిపిన పడటమూ నిజమే. ఇంతకాలమూ ఒక హోరులో జీవితం గడిచి ఉంటుంది కదా. ఇప్పుడు ఆగి బేరీజు వేసుకునే సమయం చిక్కుతుంది. మనల్ని మనం గమనించుకోవచ్చు. తప్పిపోయిన స్నేహితులను వెతుక్కోవచ్చు. మానేసిన ఇష్టాలను కొనసాగించవచ్చు. ఇదిగో.. ఇలా పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక వంట భారం, ఇంటి భారం అంటారా... భర్త పోయాక అవి తగ్గుతాయే తప్ప పెరగవు’ అంది. తల ఆడించి కిందకు దిగేశాడు. తనకు అన్నం వండుకోవడం రాదు. కూర చేయడం అంటే రోలర్ కోస్టర్ ఎక్కి దిగినట్టే. నాలుగు అంచులు సరిగ్గా కలిపి దుప్పటి మడతెట్టడం రాదు. బాత్రూమ్ దగ్గరుండాల్సిన స్లిప్పర్లు టీవీ దగ్గర, బయట ఉండాల్సిన చప్పల్స్ బెడ్రూమ్లో.. ఇలా అరాచకం అయిపోయింది ఇల్లు. సాయంత్రమైతే ఏదో గుబులుగా అనిపించి బజారున పడి అటూ ఇటూ తిరుగుతున్నాడు. అలవాట్లున్న మగవాళ్లు ఎలాగోలా పొద్దుపుచ్చుతారో ఏమో. తనకు అలవాట్లు కూడా లేవే.ఆ రోజు కారిడార్‌లో కొత్త కుండీ పెట్టి ఏదో తీగ నాటి నైలాన్ దారానికి పాకించడానికి ప్రయత్నిస్తూ ఉంటే పలకరించాడు.‘కాఫీ తాగుతారా?’ అడిగింది.‘ఈ మాట ఎవరైనా అడిగి ఎంత కాలమైందండీ’ అన్నాడు.కాఫీ ఇచ్చింది. తాగాడు. కదల్లేదు.‘ఒకమాట అడిగితే ఏమీ అనుకోరుగా?’ అడిగాడు.‘మనం పెళ్లి చేసుకుందామా’ అన్నాడు.‘ఏంటీ?’ నవ్వింది. పెద్దగా నవ్వింది. ఆగకుండా నవ్వుతూనే ఉంది.అయోమయంగా చూశాడు.‘మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?’ అడిగింది.‘తోడు కోసం’ ‘తోడంటే మీ దృష్టిలో ఏమిటో తెలుసా?’ గంభీరమవుతూ అంది.‘మీ దృష్టిలో తోడంటే వచ్చి మీ వాషింగ్ మెషీన్ ఆన్ చేయడం. కుక్కర్ ఆన్ చేయడం. సిలిండర్ బుక్ చేయడం. బూజుకర్ర పట్టుకుని సమయానికి బూజు దులిపి పెట్టడం. డోర్‌మేట్స్ ఆర్డర్లో ఉండేలా చూసుకోవడం. అదీ మీ దృష్టిలో తోడంటే. ఇప్పటి వరకు పడీపడీ ఉన్నాను. మరి పడలేను’మాట్లాడకుండా వచ్చేశాడు. రెండు మూడు రోజులు ఆలోచనలు సతమతం చేశాయి. అహం రెపరెపలాడింది. దుమ్ము అణిగి దృశ్యం స్పష్టమైనట్టుగా వాస్తవం బోధపడి ‘నిజమే కదా’ అనిపించింది. తోడంటే తనకు తీరిక ఆమెకు భారమూ కాదు. తోడంటే చెరిసగం. అన్నింటా చెరిసగమే.ఇది నిశ్చయమయ్యాక అతడు కొన్నాళ్లు ఆమె ఫ్లాట్ వైపు తొంగి చూడలేదు. ఇంటి పని శ్రద్ధగా చేయడం నేర్చుకున్నాడు. వంట నేర్చుకునే ప్రయత్నం చేశాడు. జీవితంలో తొలిసారి సోఫాక్లాత్స్ మార్చగలిగాడు. అన్నింటికంటే ముఖ్యం బూజుకర్రను తానూ పట్టుకోగలనని గ్రహించాడు. అన్నం, రెండు కూరలు, అవసరమైతే చపాతీ చేయగలడు. సరుకులు తేగలడు. ఇస్త్రీ పద్దు రాయగలడు.ఒకరోజు వెజిటెబుల్ బిర్యానీ చేసి ఆమెను ఇంటికి ఆహ్వానించాడు.ఆమె వచ్చింది. ‘ఏమిటిదీ’ అని ఆశ్చర్యపోయింది. ఇల్లంతా తిరిగి చూసింది. ఉప్పు తక్కువైనా సరే బిర్యాని ఆరగించి మెచ్చుకుంది.‘తోడంటే ఇక మీదట నా దృష్టిలో ఇలా ఉండటం అండీ’ అన్నాడు.ఆమెకు యాభై ఏళ్లు. చూసింది. అతడికి మరో అయిదు ఉంటాయేమో. చూశాడు.మనోహరమైన ఒక ప్రేమ కథ ఆమె చేతిని అతడు పట్టుకోవడంతో మొదలైంది.ఓల్గా రాసిన ‘తోడు’ కథ ఇది.శ్రమ అంటే ఏమిటనే నిర్వచనాలు మగవాళ్ల దగ్గర చాలా ఉంటాయి. ఆఫీసుకు వెళ్లడం, స్కూటర్ డ్రైవ్ చేయడం, బ్యాంక్‌కు వెళ్లి లావాదేవీలు చూడటం, పిల్లల స్కూలుకు వెళ్లి మాట్లాడటం... ఇవి వాళ్ల దృష్టిలో శ్రమ. పచ్చడి నూరడం, గ్రైండర్ తిప్పడం, ఆరేసిన బట్టలు తీసుకురావడం, పిల్లలకు స్నానం చేయించడం, జిడ్డోడే అంట్లను రుద్ది రుద్ది తోమడం.. ఇవి శ్రమ కాదు. బూజుకర్ర చివరన ఉండాల్సింది గాజుల చేయే అని అనుకుంటారు. అలా అనుకున్నంత కాలం స్త్రీ హృదయంలో సంపూర్ణమైన చోటు సంపాదించలేరు. ఇల్లు మీరుండే చోటు కూడా అయినప్పుడు ఇంటి శ్రమ మీది కూడా కదా.సగం సగం అనుకునే మగవాడా.. నీకు వెల్కమ్. పునః కథనం: ఖదీర్ - ఓల్గా -
శుంఠలు పదివేలు
‘ఓరి శుంఠా’ అని అనుకుంది. రొప్పుతున్నాడు. రెచ్చుతున్నాడు. గోడకు చేయి ఆనించి ఎటో ముఖం పెట్టి నిలుచున్నాడు. ఇలాంటి టైములో భలే వేగం వస్తుంది. చిన్న బ్యాగు తీసుకుంది. కొన్ని బట్టలు సర్దుకుంది. పసికందును ఒడిలో తీసుకుని తండ్రి వెంట ఇంటి నుంచి బయట పడింది. ఆటో కుదుపులు ఇస్తుంటే ఆదమరిచి నిదురిస్తున్న పాపను గుండెలకు అదుముకుంటూ ‘మెల్లగా అన్నా’ అంది డ్రైవర్‌తో. మళ్లీ పాప వైపు చూసింది. మొండిఘటం. ఎంత కంగారు పెట్టింది. ఆరునెలల క్రితం ఆ రోజు అతను ఆఫీసుకు వెళుతుంటే తనూ ఆఫీసుకు బయలు దేరుతుంటే సడన్‌గా ఏదో అయ్యింది. ఏమిటది... కడుపులో నుంచి ఏదో తన్నుకొస్తున్నట్టుగా... లోపలి నుంచి ఏదో బయట పడిపోతున్నట్టుగా. కళ్లు తిరుగుతున్నాయి. కింద నుంచి స్రావం. అత్తగారు పరిగెత్తుకుంటూ వచ్చింది.దగ్గరగా చిన్న క్లినిక్ ఉంటే ఆ డాక్టరమ్మ పరీక్షించి చూసి ‘అబార్షన్’ అంది.‘పెళ్లయిన మొదటి రెండుసార్లలో ఇలా అబార్షన్ అవడం కొంతమందిలో మామూలే. ఇక మీదట కడుపు నిలబడి మంచి పిల్లలు పుడతారు’ అని చెప్పింది.అది ఒక బాధ. ఆఫీసులో మాటలు పడాల్సి రావడం మరో బాధ. ‘ఈ ఆడవాళ్లకు ఏం పని లేదు. పురుళ్లని ఒకసారి అబార్షన్లని మరోసారి హాయిగా సెలవులు దొబ్బుతుంటారు’ అంటుంటారు కలీగ్స్. ఆడవాళ్లందరూ అన్నిసార్లు సపోర్ట్‌గా ఉంటారని చెప్పలేము. బాగా పని చేసేవాళ్లకు ఆడవాళ్లైనా మగవాళ్లైనా శత్రువులే. వాళ్లూ వంత పాడతారు. సరే. వాళ్లంటే పరాయివాళ్లు... ఎవరోలే అని అనుకోదగ్గవాళ్లు.ఇంటి మనిషి?అరె... భార్యకు అబార్షన్ అయ్యిందే దగ్గర కూర్చుని నాలుగు సాంత్వనం మాటలు మాట్లాడదామే అని లేదు. తను ఆఫీసుకు వెళ్లలేదు కనుక ఆ జీతం డబ్బు ఎలా తెచ్చుకుందామా అని హడావిడి పడి తెచ్చుకున్నాడు. అప్పుడనే ఏముంది? ఒకటో తేదీ వస్తున్నదంటే ఏమిటో రైలు బండి తప్పిపోయేవాడిలాగా కంగారు కంగారుగా ఉంటాడు. ఆ డబ్బు తెచ్చివ్వాలి. అతను తీసుకోవాలి. అప్పుడే నిశ్చింత. అసలు తనను పెళ్లి చేసుకున్నాడా ఒకటో తేదీనా అని సందేహం. ఒకటో తేదీనే అని ఇవాళ తేలి పోయింది.ఇంట్లో పెద్ద గొడవ అయ్యింది. కారణం ఉద్యోగం నుంచి ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు.పాప పుట్టి జీవితం సంతోషంగా ఉండబోతుంది అనుకుంటున్నప్పుడు ఈ దెబ్బ.ఆఫీసును కూడా అనడానికి లేదు. అబార్షన్ అని అబద్ధం చెప్పి ఒకసారి, ఆ వెంటనే మెటర్నిటీ లీవ్ అని మరోసారి వరుసగా సెలవులు వాడుకొని ప్రభుత్వాన్ని చీట్ చేసిందంటూ కేసు పుటప్ చేసి ఊస్టింగ్ ఇప్పించారు. కలీగ్స్ హస్తం ఉంది ఇందులో. కాని జరిగినదానిలో తప్పెవరిది?ఆ రోజు వీధి చివర డాక్టరు చెప్పింది నిజమే అనుకున్నారు. నెల తర్వాత కూడా పిరియడ్స్ రాకపోతే ఈసారి కాస్త పెద్ద డాక్టర్ దగ్గరకు వెళితే ఆమె అన్ని పరీక్షలు చేసి అబార్షన్ జరగలేదని, ఒక్కోసారి ఎక్కువ బ్లీడింగ్ జరిగి అబార్షన్ అనిపిస్తుందని, కాని పిండం సేఫ్‌గా ఉండి ఎదిగి పిల్లలు పుడతారని చెప్పింది.సంబరంలో మునిగి, ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా చూసుకోవడంలో ఉండిపోయిందిగానీ ఆఫీసులో దెబ్బ పడుతుందని అనుకోలేదు.తీరా ఊస్టింగ్ ఆర్డర్‌తో వచ్చేసరికి అతడు మండి పడుతున్నాడు.‘పెద్ద ఉద్యోగం చేయడానికి బయలుదేరుతారు. ఏమైనా అంటే పొడుచుకొస్తూ ఉంటుంది. ఏం నీకు రూల్స్ తెలియవా? ప్రెగ్నెన్సీ రీకన్ఫర్మ్ చేశాక ఇంతకుముందు పెట్టిన అబార్షన్ లీవును వేరే లీవు కిందకో లాస్ ఆఫ్ పే కిందకో మార్చుకోవాలని నీకు తెలియదా?’‘నాకు తెలియలేదు. మీరూ ఎంప్లాయీయే కదా. మీరు చెప్పొచ్చుగా’‘నాకిదే పట్టింది. నీ ముట్లు లెక్కబెట్టుకోవడమే నా పనా’‘మరి నా జీతం నోట్లు లెక్కబెట్టుకోవడం మీ పనా?’ చెంప ఛెళ్లుమంది. తండ్రి ఉన్నాడని కూడా చూడలేదు. ‘మావయ్యా. నేను యోగ్యుణ్ణి. లక్షమంది వచ్చారు చేసుకోవడానికి. కాని మీ అమ్మాయి ఎంప్లాయి అని చేసుకున్నాను. పెళ్లికి నా షరతు కూడా అదే. ఇప్పుడు వెర్రిమొఖం వేసుకుని ఉద్యోగం పోగొట్టుకుంది. ఆమెకు ఉద్యోగం ఉంటే సరి. ఎలా తెచ్చుకుంటుందో తెచ్చుకోమనండి. లేకుంటే నాకు అక్కర్లేదు’ తెగేసి చెప్పాడు.బిడ్డను తీసుకుని బయటపడింది.పుట్టింటి ఆదరణ కూడా ఒకోసారి ముఖ్యమైపోతుంది. పాపను తల్లిదండ్రులకు అప్పజెప్పి తెల్లారి నుంచి కాలికి బలపం కట్టుకుని ఉద్యోగం కోసం తిరగడం మొదలుపెట్టింది. పై ఆఫీసర్లను కలిసి, అర్జీలు పెట్టి, తెలిసిన వారితో చెప్పించి... పెద్ద ప్రయాస. చివరకు శుభవార్త అందింది. ఉద్యోగం ఇస్తారట. అయితే పాత అనుభవం అంతా నల్లిఫై చేసి కొత్త అపాయింట్మెంట్ ఇస్తారట. మంచిదే. ఏదో ఒకటి. ఉద్యోగం అయితే ఉందిగా. మధ్యలో రెండు మూడుసార్లు అతడు వచ్చి చూసి వెళ్లాడు. రమ్మనలేదు. తాను వస్తాననలేదు.ఇప్పుడు వచ్చాడు. ఇలాంటి సందర్భాల కోసమే పావుకిలో స్వీట్ పేకట్లు ఉంటాయి. అలాంటిది తెచ్చాడు.ఆ స్వీటులోని స్వీటే పెట్టి, కొంచెం కారా ఇచ్చి తిన్నాక వీధి తలుపు చూపించింది.‘అదేమిటి?’ అన్నాడు హతాశుడవుతూ.‘నీక్కావల్సింది పెళ్లాం కాదు. పాస్బుక్కు. నీ దోవ నువ్వు చూసుకో’ ‘బాగా ఆలోచించుకో’‘ఆలోచించుకున్నా. వెళ్లవోయ్’వెళ్లిపోయాడు. లేచి తల దువ్వుకుని స్థిరంగా తొణకనిదానిౖయె లాయర్ దగ్గరకు బయలుదేరింది.కథ ముగిసింది.ఇంద్రగంటి జానకీబాల ‘జీవన రాజకీయం’ కథ ఇది.ఆఫీసుల్లో చాలా రాజకీయాలు ఉంటాయి. కాని కుటుంబంలో అందునా భర్త దగ్గర రాజకీయం ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. జీవించడానికి సంపాదనలో ఆమె సాయాన్ని ఆశించవచ్చు. కాని ఆమెనొక రాబడి యంత్రంగా మార్చడానికి రాజకీయం చేస్తే సహించాల్సిన అవసరం లేదు. కల్లబొల్లి కబుర్లు చెప్పి భార్యను కొత్తగా చదివించేవాళ్లు, ఉన్న ఉద్యోగంలో ఉంచకుండా డిపార్ట్మెంటల్ టెస్టులు రాయించేవాళ్లు, ఏదో ఒక మాట చెప్పి మస్కట్ విమానం ఎక్కించేవాళ్లూ, ఉద్యోగం చేయలే నంటున్నా బలవంతంగా చేయించి సాధించేవాళ్లు, నెల తిరిగేసరికి డబ్బు తేని పక్షాన అల్పంగా చూసేవాళ్లు వీళ్లు భర్తలా? శుంఠలు. పునః కథనం: ఖదీర్ ఇంద్రగంటి జానకీ బాల -
శోక సంచి
లేబర్ రూమ్ అరుపుల్ని మగవాడు వినాలి. అవి ఇంట్లో గదిలో అర్ధరాత్రి ఏకాంతంలో వినవచ్చే మూల్గులు కావు. అరుపులు. కేకలు. గావుకేకలు. పేగులు తెగిపడే కేకలు. కాదు.. కాదు... గర్భసంచి చిరిగిపోయే కేకలు.... అవి వింటాడా మగవాడు? పడతాడా పోనీ. పడితే తెలుస్తుంది. ‘అల్లా... ముఝే బచాలే అల్లా’... కేకలు పెడుతోంది. ఒకటో కాన్పు కాదు. రెండో కాన్పు కాదు. మూడోది నాల్గోది కాదు. ఐదోది. పెనిమిటికి మగబిడ్డ కావాలట. ఈసారీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తాడో. ఏట్లో తోస్తాడో ఏమో. ‘ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇంకో గర్భసంచి మీద ప్రతాపం చూపుతాడు’ అంటుంది నర్సు పిల్ల. ఆ పిల్లకు ఓర్పు చాలా జాస్తి. ఆ పిల్ల సాయం వల్లే చాలా కాన్పులు ఆ ఆస్పత్రిలో జరుగుతుంటాయి. ఆ పిల్ల లేకపోతే డాక్టరు లేబర్ రూమ్‌లోకి వెళ్లదు. ఇద్దరూ కలిసి చాలా కేసులే చూశారు. ‘ఈ కేసు దుబాయ్‌ది డాక్టర్. తీసుకెళ్లి ఆరునెలలు పెట్టుకున్నాడు. ఇలా చేసి పంపాడు. కాన్పైనాక తిరిగి తీసుకెళ్తాడని ఈ అమాయకురాలి వెర్రి. వాడు ఖాజీకి ఈసరికి ఇంకో పిల్లకు గేలం వేయమని చెప్పేసి ఉంటాడు’ అంటుంది నర్సుపిల్ల. ‘ఈ పిల్లది మరీ అన్యాయం. సొంత బాబాయే’... అని ఇంకో టేబుల్ దగ్గర నిలబెడుతుంది. ‘ఈమెను చూశారా మళ్లీ వచ్చింది. నలభై ఏళ్లు రాబోతున్నా వచ్చిందంటే ఏమనాలి. ఆపరేషన్ అంటే ఆయన వినడు... రాత్రి మీదిమీదికొస్తుంటే ఈమె కాదనలేదు’ అంటుంది మరో టేబుల్ దగ్గర. ‘క్యా ఖాలా... మళ్లీ వచ్చావా?’ ఆమె ఏడుస్తుంది. ‘ఆయన వినడమ్మా... ఆపరేషన్ అంటే వినడు. నా గర్భసంచి చిరిగి నేను పనికి రాకుండా పోతే తప్ప ఇంతే. కంటూ ఉండాల్సిందే’ అంటుంది. పాతబస్తీ చుట్టుపక్కల ప్రసూతి ఆస్పత్రి అంటే కథలు జాస్తి. కన్నీరు జాస్తే. ‘అల్లా... ఈసారైనా రహమ్ చూపు. మగపిల్లాణ్ణి ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టు. ఇంకా నన్ను సాధించకు ఊపర్వాలే’ లేబర్ రూమ్‌లో నుంచి ఆవిడ పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఉంది. చూడాలి అల్లా ఏం చేయబోతున్నాడో. ఈ లోపల నర్సు పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. ‘డాక్టర్... ఎమర్జెన్సీ’...మాసిన బురఖాలేసుకున్న ముగ్గురు నలుగురు ఒకామెను మోసుకుంటూ వచ్చారు. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉంది. వంకరగా తిరిగి పోతూ ఉంది. దవడలు గిట్ట కరుస్తూ ఉంది. పిల్లల్లాగుంది... ఇద్దరు చిన్నపిల్లలు... తల్లిని పట్టుకుని ఏడుస్తున్నారు.‘ఏమైంది?’ డాక్టర్ అడిగింది.‘ఏమో డాక్టర్. అచానక్ ఇలా అయింది’‘ఏమైనా మింగిందా... చెప్పండి’ ‘ఏమో... మాకేం తెలుసు’ వెనుక మొగుడు వచ్చాడు. నలిగిన బట్టలేసుకుని... జుట్టు పెరిగిపోయి... వెర్రి ముఖంతో.‘కొట్టినావా?’‘నై నై... అల్లా కసమ్’నాడీ పట్టుకు చూసింది. బాగానే ఉంది. బీపీ– నార్మల్. గదిలో నుంచి అందర్నీ వెళ్లగొట్టి తలుపులేసి నిలబడింది. అంతవరకూ వంకర్లు పోయిన ఆమె మామూలుగా అయ్యి ముఖం దిగులుగా పెట్టింది.‘ఏంటీ పని?’ ‘ఏం చేయను డాక్టర్.. మీరే కాపాడాలి. బస్తీలో ఉంటాము. మా ఆయన ఆటో వేస్తాడు. ఇప్పటికి నలుగురు పిల్లలు. ఆపరేషన్ వద్దంటాడు. అలాగని దూరం ఉంటాడా. ఉండడు. రాత్రయితే తాగొచ్చి పక్కన చేరుతాడు. ఇప్పటికే తినడానికి తిండి లేదు. నేను కూడా మెహనత్ చేస్తేనే ఒక పూటైనా ముద్ద నోట్లోకి పోతోంది. ఇంక నాకు కనే ఓపిక లేదు. ఇంకొక్క కడుపంటే ఉత్తపుణ్యానికే చచ్చిపోతాను. నా ప్రాణం బాగలేదని గుండె జబ్బు ఉందని ముట్టుకుంటే చచ్చిపోతానని నా మొగునికి చెప్పండి. ఈ పుణ్యం చేశారంటే మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతాను. లేకుంటే మా ఉసురు దేవుడే పోసుకుంటాడు’... వెక్కిళ్లు పెట్టింది. డాక్టర్ తలుపు తెరిచి అని అందరూ చూసేలా రెండు మూడు ఇంజెక్షన్లు పొడిచింది. మొగుణ్ణి పిలిచి ఆమె చెప్పమన్నట్టే చెప్పింది.అతడు ముఖం చిన్నగా పెట్టుకుని జేబులో నుంచి దస్తీ తీసి కళ్లు దాచుకున్నాడు.‘ఎందుకేడుస్తున్నావ్’‘ఇదంతా నా తాగుడు వల్లే డాక్టర్. ఇంతకు ముందు ఇలా లేకుండె. ఈ మధ్య గిరాకీ సరిగా లేదు. ఓలాలు ఊబర్లని సిటీ అంతా క్యాబులు తిరుగుతున్నాయ్. ఆటోలు నడవట్లేదు. నడిచినా నావంటి ఖటరా ఆటోలను ఎవరూ ఎక్కడం లేదు. రాత్రయితే హైబత్తో మందు తాగుతున్నాను. తాగాక దీని పక్కన చేరుతున్నాను. మా బతుకుల్లో సినిమాలు షికార్లు ఉండవుగా డాక్టర్. హోటళ్లు రెస్టారెంట్లు తెలియదు. ఈ ఊరు తప్ప ఏ ఊరు తిరిగేది లేదు. నెక్లెస్ రోడ్డుకు కూడా వెళ్లేది లేదు. కడుపుకు సరిగా తిండే లేదు. మాకున్న ఒకే ఒక దిల్ బెహలాయి మొగుడికి పెళ్లాం... పెళ్లానికి మొగుడు... ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు.. సరే కానివ్వండి... ఇక మీదట ఆమెను తాకనులేండి’.. ఏడుస్తూనే ఉన్నాడు. ఇది అతడి కథ . అది ఆమె కథ. లేబర్ రూములో‘మగబిడ్డ కావాలి పరవర్దిగార్’ అని అరుస్తున్నదే ఆమె కథ అల్లాది.అంతులేని ఈ కథ సాగుతూనే ఉంటుందా?డా.గీతాంజలి రాసిన ‘బచ్చేదాని’ కథ ఇది.అంటే ‘గర్భసంచి’ అని అర్థం. గర్భసంచి మీద హక్కు ఎవరికి? అది కలిగిన స్త్రీకా? అందులో బీజం వేసే పురుషునికా? ఆమె జన్మించిన సమూహానికా? కులానికా? మతానికా? దేశానికా? ఆ హక్కు ఎవరికి? తన గర్భసంచికి తానే తాడు కట్టి మూత బిగించే హక్కు, తన గర్భాన్ని తానే నిరాకరించే హక్కు, ఆ గర్భంలో ఏది ఉద్భవిస్తే దానినే స్వీకరించి కాపాడుకునే హక్కు స్త్రీకి నిజంగా ఉన్నదా? లేనంత వరకూ అది గర్భసంచి కాదు. శోక సంచి. పునః కథనం: ఖదీర్ - ∙డా. గీతాంజలి -
ఖదీర్‌బాబు, సుజాతాదేవికి ‘పెద్దిభొట్ల’ పురస్కారం ప్రదానం
విజయవాడ కల్చరల్: ప్రముఖ కథా రచయిత, కథా పరిశోధకుడు మహ్మద్ ఖదీర్‌బాబు, బాల సాహిత్య కథా రచయిత్రి డి.సుజాతాదేవి 2017 సంవత్సరానికి గాను పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారాలను అందుకున్నారు. పెద్దిభొట్ల స్ఫూర్తి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో జరిగిన సభలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ రచయిత, కాలమిస్ట్ శ్రీరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యుల జీవితాలే పెద్దిభొట్ల కథా వస్తువులని, యువ కథకులు పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పురస్కారాల నిర్వాహకుడు పెద్దిభొట్ల సుబ్బరామయ్య మాట్లాడుతూ తెలుగు కథా ప్రపంచానికి సేవలు చేస్తున్న వారికి స్ఫూర్తి పురస్కారాలు అందిస్తున్నామన్నారు. సభకు అధ్యక్షత వహించిన అరసం (అభ్యుదయ రచయితల సంఘం) జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పెద్దిభొట్ల రాసిన కథలన్నీ ఆణిముత్యాలేనని వివరించారు. ఆయన కథలు ఆంగ్లంలోకి, రష్యన్ భాషలోకి అనువదించబడ్డాయన్నారు. కథారచయితలను లయోలా కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మా సాంబశివరావు, కృష్ణాజిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచంద్ పరిచయం చేశారు. పురస్కారాలు అందుకున్న ఖదీర్‌బాబు, సుజాతాదేవి తమ స్పందన తెలియజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యురాలు వేలూరి గీతారాణి, ఎవీకే ఫౌండేషన్ నిర్వాహకులు అప్పాజోస్యుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణం
మృతునికి 8 మంది కూతుళ్లు నలుగురికి పెళ్లి.. మరో నలుగురికి పెళ్లీడు భారమైన అప్పులు.. ఆదుకోని రుణమాఫీ కదిరి: అప్పుల బాధతో అన్నదాత బలవన్మరణానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లా కదిరి మండలంలోని చలమకుంట్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దళిత రైతు నాగప్ప(56) మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగప్పకు మూడు ఎకరాల పొలం ఉంది. ఇందులో అప్పు చేసి బోరు వేయగా కరువుతో కొద్ది రోజులకే ఎండిపోయింది. అన్నదమ్ములతో కలిసి మరో బోరు వేయించాడు. ఇందుకోసం బంధువుల వద్ద అప్పు చేశాడు. కొద్దిగా నీరు పడటంతో వేరుశనగ సాగు చేస్తున్నాడు. ఇతనికి భార్య శివమ్మ, 8 మంది కుమార్తెలు సంతానం. పెద్దమ్మాయిలు ముగ్గురినీ టీటీసీ చదివించి అప్పులు చేసి పెళ్లిళ్లు కూడా చేశాడు. నాలుగో కుమార్తె చదువుకోలేదు. ఈమెకు కూడా పెళ్లి చేసి మెట్టినింటికి పంపించాడు. మిగిలిన నలుగురు కూతుళ్లూ పెళ్లీడుకొచ్చారు. వీరిలో ఒకరు ఇంజనీరింగ్ చదువుతుండగా.. మరో ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. చివరి అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. మూడెకరాల పొలంతో నాగప్ప బతుకు బండిని భారంగా లాగుతున్నాడు. పంటల సాగు, పెట్టుబడులతో పాటు పిల్లల చదువుకు బంధువుల వద్ద రూ.4లక్షల వరకు అప్పు చేశాడు. అదేవిధంగా కదిరి ఎస్బీఐ ఏడీబీలో భార్య బంగారం తాకట్టు పెట్టి 2014లో రూ.1.20 లక్షలు అప్పు తీసుకున్నాడు. ఇందులో ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. అదే బ్యాంకులో 2013లో రూ.45వేలు పంట రుణం తీసుకున్నాడు. వడ్డీతో కలిపి అది రూ.60వేలకు చేరుకుంది. ఇందులో రూ.5వేలు మాత్రమే మాఫీ అయ్యింది. అది వడ్డీకే సరిపోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అసలే అప్పులు.. ఆపై కుటుంబ భారం పంటల సాగుతో పాటు పిల్లల చదువు, పెళ్లిళ్లతో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగప్పను కష్టాలు ఉక్కిరిబిక్కిరిచేశాయి. ఇక లాభం లేదని గురుపౌర్ణమి నాడు(9న) బోరుబావి దగ్గరకెళ్లి తన వెంట తీసుకెళ్లిన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చివరి సారిగా తన భార్యాపిల్లలను చూడాలనిపించి పరుగు పరుగున ఇంటికెళ్లాడు. అతని పరిస్థితి గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురం లేదా కర్నూలుకు తరలించాలని సూచించారు. వారి సూచన మేరకు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ మంగళవారం కన్నుమూశాడు. కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
లిఖిత హత్య కేసులో పురోగతి
అనంతపురం: చిన్నారి లిఖిత హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. లిఖిత తల్లి ఉమామహేశ్వరిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్విమ్మింగ్ పూల్ నిర్వాహకుడైన ఇలియాజ్తో సహా మరో ఇద్దరు నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా తన కుమార్తె లిఖిత అదృశ్యమైనట్లు ఉమామహేశ్వరి ఫిర్యాదు చేసినప్పుడు ఆమె ప్రవర్తనను గమనించి,నిఘా ఉంచినట్లు డీఎస్పీ తెలిపారు. ఆమె ఫోన్ నంబర్ ఆధారంగా తరచూ ఇలియాజ్తో మాట్లాడుతున్నట్లు తెలుసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. లిఖిల ప్రమాదవశాత్తు నీటిలో పడి చనిపోగా తాను సొంతకారులో దొరిగిల్లుకు తీసుకెళ్లి పూడ్చి పెట్టానని నిందితుడు విచారణలో తెలిపినట్లు డీఎస్పీ వెల్లడించారు. అతడికి సహకరించిన కారు డ్రైవరు హన్ను, మరో వ్యక్తి నౌషాద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా తన తల్లితో వివాహేతర సంబంధాన్ని కళ్లారా చూసిందన్న కారణంతోనే లిఖితను స్విమ్మింగ్ పూల్‌లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూల్‌లోని నీటిలోనే అదిమిపట్టి చనిపోయాక అక్కడికి తీసుకెళ్లి పూడ్చి పెట్టారా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.