వచ్చినవాళ్లలో ఎవరో జన్నతుల్ ఫిర్‌దౌస్ రాసినట్టున్నారు. మంచి వాసనొస్తోంది. కాని అసలు కంపంతా హుసేన్ చేశాడు. పంచాయితీ కూచుంది. బల్లపీటల మీద కూచున్నోళ్లు బల్లపీటల మీద ఉన్నారు.నులక మంచాల మీద కూచున్నోళ్లు నులక మంచాల మీద ఉన్నారు. వరండాలో చాటుగా ఘోషా పాటిస్తున్న ఆడవాళ్లు మాటకు అవసరం రాకపోతుందా అన్నట్టు కాచుకుని ఉన్నారు. ఒకవైపు హుసేను ఒకవైపు జుబేదా నిల్చున్నారు. మూడు నెలలుగా గొడవ జరుగుతూ ఉంది. గొడవ చేస్తున్నవాడు హుసేను. టీచరుద్యోగానికి వెళ్లిన జుబేదా ఇంకో స్కూలు సారు సైకిల్ మీద కూచుని కనిపించిందని గొడవ.‘పెళ్లయిన ఏడేళ్లలో మూడు కడుపులు పోయాయి. ముగ్గురు పిల్లలు పుట్టారు. పిల్లల సంచి పలుచనైందని డాక్టరమ్మ చెప్పి గోలీలు రాసిచ్చింది. కాని ఎన్నిగోలీలు వాడినా బహిష్టప్పుడు నొప్పితో బంతిలా మారిపోతున్నా. నేను ఉద్యోగం చేసే ఊరు బస్సులు తిరిగే ఊరు కాదు. పొద్దునొక జీపు సాయంత్రం ఒక జీపు తిరుగుతాయి. నొప్పికి వీలుగాక కాస్త ఇంటిదాక వదలమంటే, పాపం అన్నలాంటోడు, వచ్చి వదిలాడు. అది తప్పా’ అని జుబేదా జవాబు చెప్పింది.
కాని వినట్లేదు. అసలు సంవత్సరం ఆరు నెలలుగా సతాయిస్తున్నాడు.‘నువ్వు దొడ్డుగైనావు. నా దోస్తులు చూసి నవ్వుతున్నారు’ అన్నాడొకసారి.‘నువ్వు మాత్రం పెళ్లయినప్పుడు ఎట్టున్నావో అట్టే ఉన్నావా. బొర్రా పిర్రా పెంచలేదా. నాది ఊబవొళ్లు. నీకు సేవ జేసిజేసి, పిల్లల్ని కనీకనీ ఈ ఒళ్లు వచ్చింది’ అంది జుబేదా.‘నలుగురితో మీద మీద పడి మాట్లాడుతున్నావు’‘నాది సర్కారు నౌకరీ. నలుగురితో కలుపుగోలుగా ఉండటమే నా కొలువు. కాదంటే చెప్పు మానేసి ఇంట్లో కూచుంటా’ఊహూ. వినట్లేదు.సంగతి తర్వాత తెలిసింది. ఊళ్లో ఒంటెద్దుబండి తిప్పే మస్తాను కూతురు ఫాతిమా వెనుక పడుతున్నాడట.ఆ పిల్ల మీద మోజుతో ఏదో ఒక కారణం చూసుకొని తన్ని పుట్టింటికి పంపుతున్నాడు.‘వాని మీద గత్తర పడ. వానికి సావు రాను. వాని కనుగుడ్లలో పువ్వులు పుయ్య. వాడి చేతుల్లో పుండ్లు పడ’ అని కూతురు ఇంటికొచ్చినప్పుడల్లా జుబేదా తల్లి తిట్లు లంకించుకుంటుంది.‘మీ ఇళ్లల్లో ఒక్కో మగాడు ఇద్దరు ముగ్గుర్ని చేసుకుంటారు గదా. ఇదేం కొత్త’ అంది ఇరుగమ్మ. ‘రా చూద్దూరా. మా అయ్య చేసుకున్నాడా. మా తాత చేసుకున్నాడా. మా ఫుప్పా చేసుకున్నాడా. మా ఆయన చేసుకున్నాడా. చేసుకునే బద్మాష్‌గాళ్లు ఏ కులం మతంలో అయినా ఉంటారు. చేసుకోనివాళ్లు కూడా ఎక్కడైనా ఉంటారు. నా ప్రాణానికే దొరికాడు ఇలాంటి లత్తుకోరుగాడు’ అంది జుబేదా తల్లి.
‘ఆ మస్తానుకు బుద్ధి లేదా. పెళ్లయినోడు పిల్ల వెంట పడుతుంటే బుద్ధి చెప్పాలి గదా. పిల్లనట్ట వదిలేస్తాడా సోబతు పొమ్మని’ అంది పొరుగమ్మ.‘ఆ మస్తానుగాడికి ముగ్గురు కూతుళ్లు. ఒక పిల్ల పెళ్లికే నంగా అయ్యి గల్లీల పడ్డాడు. ఇంకో ఇద్దరు బిడ్డల నిఖాలు ఎక్కడ జరిపిస్తాడు? పూట పూటకు దిక్కులు చూడాల్సిన పరిస్థితి. ఇంటి పిల్ల రెండోదానిగానో మూడోదానిగానో వెళ్లినా వేళకు రెండు ముద్దలైనా తింటుందని ఆశ పడుతున్నాడు గాబోలు. ఆకలికి మనుషుల్ని అమ్ముకునే బేహాలతు ఉన్నంత కాలం ఇలాంటి వాళ్లు ఉండనే ఉంటారు. అసలు వాళ్లను అని ఏం ప్రయోజనం. మన బంగారం మంచిదైతే కదా’ అంది జుబేదా.ఇలాంటి తకరార్లు, తగాదాలు జరిగి మొగునికి బుద్ధి చెప్పే విషయంగా పంచాయితీ కూచోబెట్టింది జుబేదా. టోపీలు, గడ్డాలు, సుర్మాలు, బుర్ఖాలు అన్నీ కొలువు దీరాయి.‘మరి ఏమంటావు హుసేనా?’ అన్నాడు మసీదు పెద్ద.హుసేను ముందుకొచ్చి, జంకూ గొంకూ లేకుండా ‘నాకిద్దరూ గావాలె’ అన్నాడు.‘అట్టెట్ట కుదురుద్ది’ అని ఘోషాలో నుంచి ఎవరో ఆడామె అనబోయింది.‘ఆడోళ్లు నోరు ముయ్యండి. మగాళ్లం మాట్లాడుతున్నాం కదా’ కసిరాడు మసీదు పెద్ద. ‘నాకు ఇద్దర్ని పోషించే హోస్లా ఉంది. పోషించే హోస్లా ఉన్నప్పుడు చేసుకొమ్మని మతం చెప్పింది గదా. ఇంకేంటి’ అన్నాడు హుసేను.మసీదు పెద్ద ఫాతిమాని పిలిపించాడు.
‘పెళ్లయినోణ్ణి కోరుతున్నావ్. వాణ్ణి కోరడం మంచి పనేనా?’ ఫాతిమా పక్కా ఇరాదాతో అంది– ‘నాకు వాడు గావాలె’. ‘ఏం మస్తానా. పెళ్లయినవాడికిచ్చి నీ కూతురి గొంతు కోద్దామనుకుంటున్నావా?’మస్తాన్ ఏమీ మాట్లాడలేదు. తల వొంచుకుని కూచున్నాడు. ‘ఇంకేంది పంచాయితీ తేలిపోయింది. ఇద్దరూ పడి ఉండండి’ అన్నాడు మసీదు పెద్ద. ‘ఏంటి?’ అంది జుబేదా ముందుకొచ్చి. ‘పోషించే హోస్లా ఉందంటున్నాడుగా నీ మొగుడు. నువ్వుంటావు. అదీ ఉంటుంది. అదే తీర్పు’ అన్నాడు మసీదు పెద్ద. ‘అయితే నా తీర్పు వినండి’ అంది జుబేదా. ‘ఒళ్లు దొడ్డుగయ్యింది ముక్కు సొట్టబొయ్యింది అని నెపం పెట్టి ఇవాళ ఇంకోదాన్ని తీసుకొస్తున్నాడు. రేపు ఆ రెండోదాన్ని నువ్వు నల్లగున్నావు రాత్రేళ సల్లగున్నావు అని వేరేదాన్ని తేకుండా ఉంటాడా? నేనూ మనిషినే. ఒకమ్మ కడుపున పుట్టిన్దాన్నే. చదువుకున్నా.ఉద్యోగం ఉంది. నా బతుకు నేను బతగ్గలను. నన్ను గౌరవించని మొగుడు నాకెందుకు. హోస్ల ఉంటే ఇంకోదాన్ని తెచ్చుకోమని చెప్పిన మతమే సరిపడని మగాణ్ణి వదిలించుకొమ్మని కూడా చెప్పింది. బహిష్టు నొప్పప్పుడు తంగేడు పుల్ల నవిలితే నొప్పి పోతుందని నవిలా. పోలేదు. పిల్లలసంచి తీసి పారెయ్ పోతుంది అని డాక్టరమ్మ చెప్తే రేపొస్తానని వచ్చా. ఈ పుల్ల పంచాయితీ ఎంత మందమో తెలిసిపోయింది. నా పిల్లలసంచి లాగే వీణ్ణి కూడా తీసి అవతల పారేస్తున్నా. నాకు ఖులా ఇప్పించండి’ అని, బోర్లేసిన చేతులను నడుం మీద ఉంచి అందరి వైపు తీక్షణంగా చూస్తూ నిలబడింది జుబేదా.
కథ ముగిసింది.
రుబీనా పర్వీన్ రాసిన ‘ఖులా’ కథ ఇది.ఇస్లాంలో పెళ్లి అగ్రిమెంట్‌లాంటిది. అందులో నుంచి బయటపడటానికి మగవాడికి ‘తలాక్’ ఏర్పాటు ఎలా ఉందో స్త్రీకి ‘ఖులా’ ఏర్పాటు అలా ఉంది. తగిన నోటీసు ఇచ్చి తలాక్ ఎలా చెప్పవచ్చో తగిన నోటీస్ ఇచ్చి ఖులా కూడా చెప్పవచ్చు. ముస్లిం స్త్రీ ఖులా తీసుకోదలిస్తే ఆపే శక్తి ఎవరికీ లేదు. తమను ఇబ్బంది పెట్టే మగవాళ్లకు ఖులా ఇచ్చే ఆడవాళ్ల సంఖ్య హైదరాబాద్‌లో పెరిగిందని ఇటీవలి అధ్యయనం చెప్పింది. ఏ స్త్రీకైనా జీవితంలో ఆత్మగౌరవమే ప్రథమం. మతం ద్వితీయం. అది ఏ మతమైనా సరే.
పునః కథనం: ఖదీర్
- రుబీనా పర్వీన్
ఫైసలా
Published Thu, Feb 22 2018 12:18 AM | Last Updated on Thu, Feb 22 2018 12:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment