హౌస్ ఓనర్ ఆశ్చర్యపోయింది ఎదురుగా నిలుచున్న మనిషిని చూసి. వయసు యాభై యాభైఅయిదు ఉంటాయి. చక్కని ముత్తయిదు స్త్రీ అని తెలిసిపోతోంది. చదువు, సంస్కారం కూడా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భాష చక్కగా ఉంది. హుందాగా కట్టుకున్న చీర, చేతులకు మట్టిగాజుల మధ్య ఒకటీ రెండు బంగారు గాజులు, మెట్టెలు, మంగళసూత్రాలు... కాని ఒక్కత్తే ఉంటానంటోంది. అందుకే ఆశ్చర్యం. ‘ఏం ఇవ్వరా?’ అడిగింది. ‘అబ్బే... అలాంటిదేమీ లేదు. మిమ్మల్ని చూశాను ఒకటి రెండుసార్లు మార్కెట్‌లో. చేరండి. మా పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయ్యి బోర్ కొడుతోంది. ఈ చిన్నపోర్షన్ అందుకే అద్దెకు వదిలాం. చేరండి పర్లేదు’ సంతోషంగా నమస్కారం చేసింది. ఏమేం సామాన్లు తెచ్చుకుంటుందో అని హౌస్‌ఓనర్ చూస్తూ ఉంది.ఏమీ లేవు. ఒక చాప. రెండు దుప్పట్లు. మార్కెట్‌లో గ్యాస్‌తో పాటు అమ్మే చిన్న స్టౌ. ఒకటి రెండు బ్యాగుల్లో బట్టలు. ఇక్కడకు చేరాకే పాల కోసమైనా గిన్నె కొనుక్కుని వచ్చి పొంగించింది. కొంచెం కాఫీ చేసి హౌస్‌ఓనర్‌కు ఇచ్చింది కూడా. రెండు మూడు రోజుల్లోనే ఆ చిన్న పోర్షన్ ముచ్చటైన ఇంటిగా మారిపోయింది. గడప దగ్గర రెండు పూల కుండీలు చేరాయి. ముగ్గులూ.. తక్కువధరకు వచ్చినవే అయినా అందంగా ఉన్న వాల్ హ్యాంగింగ్‌లూ... కుతూహలంతో హౌస్‌ఓనర్ తొంగి చూస్తే ‘నా ఇల్లండీ... అచ్చంగా నా ఇల్లు’ అంది నవ్వుతూ.
‘ఖాళీ చేయించరుగా’ మళ్లీ అడిగింది. ‘అబ్బే లేదండీ... మీరు ఎన్నేళ్లయినా ఉండొచ్చు. ఖాళీ చేస్తానన్నా నేను చేయించనుగా’ ‘అమ్మయ్య.. ఇలాంటి దిలాసా మా ఇంట్లో ఉండేది కాదంటే నమ్మండి’ అంది. భర్త ఇంజనీరు. స్టాఫ్ మీద చెలాయించాడు. కాని ఇంట్లో చెలాయిస్తే ఎలా? పడి ఉండటానికి బంట్రోతా? భార్య. ఒక రోజు కాఫీ అడిగాడు. సిద్ధంగా పెట్టిన డికాక్షన్ చేయి జారి ఒలికి పోయింది. మళ్లీ సిద్ధం చేస్తుంటే విసుక్కున్నాడు. విసుక్కోవచ్చు. కాని పద్ధతి ఉండాలి కదా. ‘సంసారం బుద్ధులు బొత్తిగా లేవు నీకు. ఒక్క రూపాయి సంపాదిస్తే తెలుస్తుంది సంపాదన ఎంత కష్టమో’ అన్నాడు. సంసారం బుద్ధులు లేవా తనకు? పెళ్లయ్యి ముప్పై ఏళ్లు గడుస్తుంటే సంసారం బుద్ధులు లేవని కనిపెట్టాడా? చిన్న ఉద్యోగిగా ఉన్నప్పుడు ఇల్లు ఎలా లాక్కుని వచ్చింది, పిల్లల చదువుకని ఎలా పొదుపు చేసింది, తెచ్చిన జీతంలో రూపాయి రూపాయి దాచి ఎలా మిగిల్చి ఇచ్చింది... రెండు చెంచాల కాఫీ పొడికి ఇంత పెద్ద మాటా?
పట్టుదల వచ్చింది.
తెలిసిన వాళ్ల ఆఫీసు ఉంటే చిన్న ఉద్యోగం సంపాదించింది. పార్ట్‌టైమ్ లాంటిది. నలుగైదు గంటలు హెచ్‌ఆర్‌లో కూచుని అటెండెన్స్‌లు అవీ చూడాలి. భర్త కక్కాలేక మింగాలేక చూశాడు. కక్కేది ఏముంది... మింగడమే.‘ఊరి నుంచి అక్కయ్య వస్తోంది వెళ్లి రిసీవ్ చేసుకో’ అన్నాడు ఒకరోజు.ఆడపడుచు అంటే తనకూ గౌరవమే. కాని ఆఫీసులో ఊహించని పని పడి వెళ్లలేకపోయింది. ఆడపడుచు నేరుగా ఇంటికే వచ్చేసింది. అక్కాతమ్ముళ్లు ఏం మాట్లాడుకున్నారో. కోపం వచ్చింది. కోపం రావచ్చు. కాని వ్యక్తపరచడంలో పద్ధతి ఉండాలి కదా.‘నువ్వు కావాలనే వెళ్లలేదు కదూ’ అన్నాడా రాత్రి.‘అది కాదండీ’...‘నా మాటంటే నీకు లెక్కలేదు. చూస్తున్నానంతా. ఇలా అయితే నా ఇంట్లో ఉండాల్సిన పని లేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండు. లేదంటే వేరే ఇల్లు చూసుకొని ఫో.’ఏమంటున్నాడు... ఇది నా ఇల్లు అంటున్నాడు. స్థలం చూసినప్పుడు, రిజిస్ట్రేషన్ చేయిస్తున్నప్పుడు, శంకుస్థాపన చేస్తున్నప్పుడు, కడుతున్నప్పుడు, కట్టాక ఇక్కడే పిల్లలను పెంచుతున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, తులసి కోట చుట్టూ తిరుగుతున్నప్పుడు, రాత్రిళ్లు పవళింపు సేవ చేస్తున్నప్పుడు, ఇన్నేళ్లుగా ఈ నాలుగ్గోడలను తీర్చిదిద్దుతున్నప్పుడు తన ఇల్లు కూడా అనుకుందే. తనకు హక్కు ఉంది అనుకుందే. తనది కాకుండా పోతుందా అనుకుందే.
తనది కాదు.ఏ ఇల్లూ స్త్రీది కాదు. అయితే అది తండ్రిది. లేకుంటే భర్తది. కాకుంటే కొడుకుది. ఈ ఇల్లు అనేది లేకుండా పోవడం వల్లే కదా మగాడు ఆడదాన్ని ఆడిస్తున్నాడు. ‘ఇంటిని సంపాదిస్తాను. నా ఇంట్లో నేనుంటాను’ అని అనుకుంది. బయటకు వచ్చేసింది.ఈ ఇల్లు తీసుకుంది. వారం పదిరోజులు గడిచాయో లేదో ఊరి నుంచి తమ్ముడు దిగబడ్డాడు.‘ఏంటక్కయ్యా... ఈ చోద్యం’ అన్నాడు దిగులుగా, అక్క మీద బెంగగా.‘చోద్యం ఏముందిరా. అది ఆయన ఇల్లు. ఆయన అనుమతితో ఆయన పద్ధతి ప్రకారం నేను ఉండాలి. ఇది నా ఇల్లు. ఇక్కడ నా ఇష్టప్రకారం నేనుంటాను. మగాళ్లకు ఇదొకటి ఆటైంది... చీటికి మాటికి పెళ్లాన్ని పట్టుకొని ఫో... బయటికి పో అని బెదరగొట్టడం... ఏం పోలేమనుకున్నారా?’‘బావ బాగా బెంబేలు పడిపోతున్నాడక్కా’‘ఎందుకురా బెంబేలు. నేనేం విడిపోలేదుగా. విడాకులు తీసుకోలేదుగా. రమ్మను ఇక్కడకు. నాకు తోచిందేదో నేను పెడతాను. ఉండమను. లేదంటే ఉండిపోమను. కాని నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటి గడప తొక్కను’‘పిల్లలు కంగారు పడుతున్నారు’
‘పడనీ’‘ఊళ్లో మగాళ్లందరూ కంగారు పడుతున్నారు’‘పడనీ’‘అసలీ ప్రపంచమే కంగారు పడేలా ఉంది. ఎంత పని చేశావక్కా’ అన్నాడు తమ్ముడు.ఆమె చిరునవ్వుతో తన డబ్బుతో తాను కొన్న, కింద పడినా, చేయి ఒలికినా ఎవరూ ఏమీ అనని కాఫీని తయారు చేయడానికి, ఫో బయటకి అని ఎవరూ బెదిరించలేని తన వంట గదిలోకి హాయిగా అడుగులు వేసింది.కథ ముగిసింది.కవనశర్మ రాసిన ‘ఆమె ఇల్లు’ కథ ఇది.మగాళ్లూ భద్రం. ఇప్పుడు హాస్టల్స్ పెరిగాయి. సర్వీస్ అపార్ట్‌మెంట్లు వచ్చాయి. పేయింగ్ గెస్ట్ ఆఫర్లు కూడా బోలెడు ఉన్నాయి. ఫో... నా ఇంట్లో నుంచి అని అంటే వాళ్లు నిజంగా వెళితే గతేం కాను? రిజిస్ట్రేషన్ కాగితాల్లో ఏ ఇల్లైనా మగాడి పేరు మీదే ఉండొచ్చు. కాని దానికి పునాది రాయి మాత్రం స్త్రీ అని మర్చిపోతే ఎలా?
పునః కథనం: ఖదీర్
కవనశర్మ
పునాదిరాయి
Published Tue, Mar 6 2018 1:12 AM | Last Updated on Tue, Mar 6 2018 1:12 AM
1/1
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment