శోక సంచి | women empowerment : special on Uterus | Sakshi
Sakshi News home page

శోక సంచి

Published Thu, Feb 15 2018 12:30 AM | Last Updated on Thu, Feb 15 2018 12:30 AM

women empowerment :  special on Uterus - Sakshi

లేబర్‌ రూమ్‌ అరుపుల్ని మగవాడు వినాలి. అవి ఇంట్లో గదిలో అర్ధరాత్రి ఏకాంతంలో వినవచ్చే మూల్గులు కావు. అరుపులు. కేకలు. గావుకేకలు. పేగులు తెగిపడే కేకలు. కాదు.. కాదు... గర్భసంచి చిరిగిపోయే కేకలు.... అవి వింటాడా మగవాడు? పడతాడా పోనీ. పడితే తెలుస్తుంది. ‘అల్లా... ముఝే బచాలే అల్లా’... కేకలు పెడుతోంది. ఒకటో కాన్పు కాదు. రెండో కాన్పు కాదు. మూడోది నాల్గోది కాదు. ఐదోది. పెనిమిటికి మగబిడ్డ కావాలట. ఈసారీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తాడో. ఏట్లో తోస్తాడో ఏమో. ‘ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇంకో గర్భసంచి మీద ప్రతాపం చూపుతాడు’ అంటుంది నర్సు పిల్ల. ఆ పిల్లకు ఓర్పు చాలా జాస్తి. ఆ పిల్ల సాయం వల్లే చాలా కాన్పులు ఆ ఆస్పత్రిలో జరుగుతుంటాయి. ఆ పిల్ల లేకపోతే డాక్టరు లేబర్‌ రూమ్‌లోకి వెళ్లదు. ఇద్దరూ కలిసి చాలా కేసులే చూశారు. ‘ఈ కేసు దుబాయ్‌ది డాక్టర్‌. తీసుకెళ్లి ఆరునెలలు పెట్టుకున్నాడు. ఇలా చేసి పంపాడు. కాన్పైనాక తిరిగి తీసుకెళ్తాడని ఈ అమాయకురాలి వెర్రి. వాడు ఖాజీకి ఈసరికి ఇంకో పిల్లకు గేలం వేయమని చెప్పేసి ఉంటాడు’ అంటుంది నర్సుపిల్ల.

‘ఈ పిల్లది మరీ అన్యాయం. సొంత బాబాయే’... అని ఇంకో టేబుల్‌ దగ్గర నిలబెడుతుంది. ‘ఈమెను చూశారా మళ్లీ వచ్చింది. నలభై ఏళ్లు రాబోతున్నా వచ్చిందంటే ఏమనాలి. ఆపరేషన్‌ అంటే ఆయన వినడు... రాత్రి మీదిమీదికొస్తుంటే ఈమె కాదనలేదు’ అంటుంది మరో టేబుల్‌ దగ్గర. ‘క్యా ఖాలా... మళ్లీ వచ్చావా?’ ఆమె ఏడుస్తుంది.  ‘ఆయన వినడమ్మా... ఆపరేషన్‌ అంటే వినడు. నా గర్భసంచి చిరిగి నేను పనికి రాకుండా పోతే తప్ప ఇంతే. కంటూ ఉండాల్సిందే’ అంటుంది. పాతబస్తీ చుట్టుపక్కల ప్రసూతి ఆస్పత్రి అంటే కథలు జాస్తి. కన్నీరు జాస్తే. ‘అల్లా... ఈసారైనా రహమ్‌ చూపు. మగపిల్లాణ్ణి ఇచ్చి నా కాపురాన్ని నిలబెట్టు. ఇంకా నన్ను సాధించకు ఊపర్‌వాలే’ లేబర్‌ రూమ్‌లో నుంచి ఆవిడ పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ ఉంది. చూడాలి అల్లా ఏం చేయబోతున్నాడో. ఈ లోపల నర్సు పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది.

‘డాక్టర్‌... ఎమర్జెన్సీ’...మాసిన బురఖాలేసుకున్న ముగ్గురు నలుగురు ఒకామెను మోసుకుంటూ వచ్చారు. ఆమె కాళ్లూ చేతులు కొట్టుకుంటూ ఉంది. వంకరగా తిరిగి పోతూ ఉంది. దవడలు గిట్ట కరుస్తూ ఉంది. పిల్లల్లాగుంది... ఇద్దరు చిన్నపిల్లలు... తల్లిని పట్టుకుని ఏడుస్తున్నారు.‘ఏమైంది?’ డాక్టర్‌ అడిగింది.‘ఏమో డాక్టర్‌. అచానక్‌ ఇలా అయింది’‘ఏమైనా మింగిందా... చెప్పండి’ ‘ఏమో... మాకేం తెలుసు’
వెనుక మొగుడు వచ్చాడు. నలిగిన బట్టలేసుకుని... జుట్టు పెరిగిపోయి... వెర్రి ముఖంతో.‘కొట్టినావా?’‘నై నై... అల్లా కసమ్‌’నాడీ పట్టుకు చూసింది. బాగానే ఉంది. బీపీ– నార్మల్‌. గదిలో నుంచి అందర్నీ వెళ్లగొట్టి తలుపులేసి నిలబడింది. అంతవరకూ వంకర్లు పోయిన ఆమె మామూలుగా అయ్యి  ముఖం దిగులుగా పెట్టింది.‘ఏంటీ పని?’ ‘ఏం చేయను డాక్టర్‌.. మీరే కాపాడాలి. బస్తీలో ఉంటాము. మా ఆయన ఆటో వేస్తాడు. ఇప్పటికి నలుగురు పిల్లలు. ఆపరేషన్‌ వద్దంటాడు. అలాగని దూరం ఉంటాడా. ఉండడు. రాత్రయితే తాగొచ్చి పక్కన చేరుతాడు. ఇప్పటికే తినడానికి తిండి లేదు. నేను కూడా మెహనత్‌ చేస్తేనే ఒక పూటైనా ముద్ద నోట్లోకి పోతోంది. ఇంక నాకు కనే ఓపిక లేదు. ఇంకొక్క కడుపంటే ఉత్తపుణ్యానికే చచ్చిపోతాను. నా ప్రాణం బాగలేదని గుండె జబ్బు ఉందని ముట్టుకుంటే చచ్చిపోతానని నా మొగునికి చెప్పండి. ఈ పుణ్యం చేశారంటే మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగుతాను. లేకుంటే మా ఉసురు దేవుడే పోసుకుంటాడు’... వెక్కిళ్లు పెట్టింది.

డాక్టర్‌ తలుపు తెరిచి అని అందరూ చూసేలా రెండు మూడు ఇంజెక్షన్లు పొడిచింది. మొగుణ్ణి పిలిచి ఆమె చెప్పమన్నట్టే చెప్పింది.అతడు ముఖం చిన్నగా పెట్టుకుని జేబులో నుంచి దస్తీ తీసి కళ్లు దాచుకున్నాడు.‘ఎందుకేడుస్తున్నావ్‌’‘ఇదంతా నా తాగుడు వల్లే డాక్టర్‌. ఇంతకు ముందు ఇలా లేకుండె. ఈ మధ్య గిరాకీ సరిగా లేదు. ఓలాలు ఊబర్లని సిటీ అంతా క్యాబులు తిరుగుతున్నాయ్‌. ఆటోలు నడవట్లేదు. నడిచినా నావంటి ఖటరా ఆటోలను ఎవరూ ఎక్కడం లేదు. రాత్రయితే హైబత్‌తో మందు తాగుతున్నాను. తాగాక దీని పక్కన చేరుతున్నాను. మా బతుకుల్లో సినిమాలు షికార్లు ఉండవుగా డాక్టర్‌. హోటళ్లు రెస్టారెంట్లు తెలియదు. ఈ ఊరు తప్ప ఏ ఊరు తిరిగేది లేదు. నెక్లెస్‌ రోడ్డుకు కూడా వెళ్లేది లేదు. కడుపుకు సరిగా తిండే లేదు. మాకున్న ఒకే ఒక దిల్‌ బెహలాయి మొగుడికి పెళ్లాం... పెళ్లానికి మొగుడు... ఇప్పుడు అది కూడా వద్దంటున్నారు.. సరే కానివ్వండి... ఇక మీదట ఆమెను తాకనులేండి’.. ఏడుస్తూనే ఉన్నాడు. 
ఇది అతడి కథ . అది ఆమె కథ.

లేబర్‌ రూములో‘మగబిడ్డ కావాలి పరవర్‌దిగార్‌’ అని అరుస్తున్నదే ఆమె కథ అల్లాది.అంతులేని ఈ కథ సాగుతూనే ఉంటుందా?డా.గీతాంజలి రాసిన ‘బచ్చేదాని’ కథ ఇది.అంటే ‘గర్భసంచి’ అని అర్థం. గర్భసంచి మీద హక్కు ఎవరికి? అది కలిగిన స్త్రీకా? అందులో బీజం వేసే పురుషునికా? ఆమె జన్మించిన సమూహానికా? కులానికా? మతానికా? దేశానికా? ఆ హక్కు ఎవరికి? తన గర్భసంచికి తానే తాడు కట్టి మూత బిగించే హక్కు, తన గర్భాన్ని తానే నిరాకరించే హక్కు, ఆ గర్భంలో ఏది ఉద్భవిస్తే దానినే స్వీకరించి కాపాడుకునే హక్కు స్త్రీకి నిజంగా ఉన్నదా?  లేనంత వరకూ అది గర్భసంచి కాదు. శోక సంచి.
పునః కథనం: ఖదీర్‌
- ∙డా. గీతాంజలి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement