చీకటే గుర్తుంది మొదట.‘నువ్వు చీకట్లోనే దొరికావు’ అంటుంది శారదా టీచర్.చీకటి. రాత్రి. ఇల్లంతా చీకటై పోయిన రాత్రి. నాన్న చీకటిగా మారిన రాత్రి.‘అంత ఇష్టమైతే పెళ్లి చేసుకోవచ్చుగా’ అనేదట అమ్మ.‘నేను పెళ్లయినవాణ్ణి. గవర్నమెంట్ ఉద్యోగిని. నిన్ను ఉంచుకుంటా’ అన్నాడట నాన్న.‘పోనీ ఎవ్వరికీ తెలియకుండా నా మెడలో తాళైనా కట్టు’ఆ మాత్రం కమిట్‌మెంట్ కూడా ఎందుకు.‘కట్టను. ఇష్టమైతే చెప్పు’అమ్మ ఏమంటుంది. పేదరికం నోరు మూయించింది. అప్పటికే పాతికేళ్లు వచ్చేశాయి. దిక్కులేని ఇంటికి చాకిరీ చేసి చేసి అలసిపోయింది. మనిషి కదా తను. ఎముకలు, గుజ్జు, రక్తము, చలనము ఉన్న మనిషి. నాన్నతో వచ్చేసింది.పెళ్లయిన స్త్రీకి అడ్రస్ ఉంటుంది. ఉంచుకున్నదానికి ప్రతి ఊరూ అడ్రస్సే.ఇంట్లో తెలియకుండా ఉండాలని నాన్న అమ్మను ఊరూరు తిప్పేవాడు. అక్కడ కొన్నాళ్లు. అక్కడ కొన్నాళ్లు. ఇక్కడ కొన్నాళ్లు. ఇక్కడ కొన్నాళ్లు. ఎప్పుడో ఒకసారి వచ్చేవాడు. వచ్చినరోజు ఇంట్లో కోడికూర కుతకుత ఉడికేది. అమ్మ నవ్వేది. ఏదో అడుగుతుంది కాబోలు గుద్దులు తిని ఏడ్చేది. నవ్వో ఏడుపో. నాన్న వచ్చిన రోజు బాగుండేది. నాన్న డబ్బులిచ్చేవాడు కాదు. ఉంచుకున్న ఆడదానికి డబ్బులిచ్చే బాధ్యత మగాడికి లేదు. అమ్మ బీడీలు చుట్టేది. ట్యూషన్లు చెప్పేది. ఇదిగో శారదా టీచర్ సాయంతో జీవితం లాక్కునొచ్చేది. ఏమీ అనడానికి ఉండేది కాదు. నాన్న దగ్గర నాలుక అనే ఆయుధం ఉండేది.
‘ఏమో.. నన్ను తగులుకునే ముందు ఎంతమందిని తగులుకున్నావో’ అనేవాడు.నాలుక కాదు అది. మలం. అమ్మ నోరుమూసుకుని ఉండేది. ఆ తర్వాత్తర్వాత నాన్న కోపంగా ఇంటికి రావడం మొదలెట్టాడు. ఇంట్లో తెలిసిపోయిందట. భార్య గొడవ చేస్తున్నదట. లంపటంలో ఇరుక్కున్నాను అన్నట్టు ఉండేవాడు. రాత్రయితే భయం. రాత్రయ్యాక తాగాక కొట్టాలి కదా మరి.ఆ రోజు సాయంత్రం నాన్న ఇంట్లోనే ఉన్నాడు.
నేను స్కూలు నుంచి వచ్చి పెరడులో నీళ్ల తొట్టి దగ్గర స్నానం చేస్తున్నా.పెద్ద పెద్దగా అరుపులు వినిపించాయి. ఇంటి ముందు రెండు కార్లు వచ్చి ఆగాయి. ఆడవాళ్లు మగవాళ్లు... చాలామంది ఇంట్లో దొమ్మిగా దూరారు. రావడం రావడం అమ్మను బూతులు తిడుతున్నారు. వాళ్లంతా నాన్న భార్య తరపు మనుషులట. ఇవాళ ఐసల్ ఫైసల్ తేల్చుకుందామని వచ్చారట.కొన్ని విషయాలకు సంఘంలో పూర్తిగా అనుమతులు ఉంటాయి.లేకుంటే తీసుకుంటారు.ఉంచుకున్న మనిషిని దండించే అనుమతి వాళ్లు తీసుకున్నారు. ఒకరికి ఉంపుడుగత్తెగా ఉండి, పచ్చని కాపురం పాడుచేస్తుంటే ఊరుకుంటారా? ఒకడు జుట్టు పట్టుకునిలాగి కింద పడేశాడు. ఒకడు దవడ మీద బాదాడు. ఒకామె మాటలతో ఎగదోసింది. ఒకడు రోకలికర్ర ఎత్తి మీద వేశాడు. నాన్న మెదలకుండా చూస్తుంటే అందరూ గుమిగూడి కాళ్లతో చేతులతో కర్రలతో కట్టెలతో మీదపడి.. అమ్మా... అమ్మా....ఎంత మనిషని? సున్నితంగా చక్కగ ఉన్న మనిషి.
శరీరంలోని ప్రతి అవయవం నలిగిపోయిందని తర్వాత పోస్టుమార్టం రిపోర్టులో చెప్పారట. పక్కటెముకలు, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు.... ఏ కూతురికైనా శాపం ఏమిటో తెలుసా? తల్లి ముఖం మామూలుగా కాక, నవ్వుతున్నట్టు కాక, వికృతంగా– తల పగిలి– రక్తం కారుతూ గుర్తుండిపోవడం.తర్వాత ఏం జరిగిందో గుర్తు లేదు. రాత్రి పదింటికి జ్వరంతో కాలిపోతూ పూర్తి చీకటిలో పెరడులోని నీళ్ల తొట్టె వెనుక శారదా టీచర్‌కు దొరికాను.తనే పెంచింది నన్ను.ఎంత చీకటిలో అయినా గుడ్డి వెలుతురు ఉంటుంది కదా. ప్రేమగా పెంచిన టీచర్. దయదలుస్తున్నట్టుగా కాక మానవ ప్రతిస్పందనగా పెంచిన టీచర్. బాగా ఎదిగి కాలేజీకొచ్చాక అడిగాను–‘పెళ్లెందుకు చేసుకోలేదు శారదా టీచర్?’‘వెగటు పుట్టి తల్లీ. మగాడిలోని చీకటికి వెగటు పుట్టి’మళ్లీ అంది–‘అన్నీ పడాల్సింది మనమే. ఒకతను పరిచయమయ్యాడు. ప్రేమించాను. చేయి వేశాడు. వద్దన్నాను. చేయి వేయనివ్వట్లేదంటే నీకు నా మీద ప్రేమ లేదన్నట్టే అన్నాడు. బ్లాక్‌మెయిలింగ్. ప్రేమ నిరూపించుకోవాలన్నమాట. వేయనిచ్చాను. పెళ్లి చేసుకోమన్నాను. నాకు లొంగిపోయావంటే ఇంకెంతమందికి లొంగిపోయావో అన్నాడు. లొంగదీసింది వాడే. నింద వేసిందీ వాడే. తగులుకోవడానికి నీకు ఎవరో ఒకరు దొరుకుతారులే అన్నాడు. మనసు విరిగిపోయింది’ ఎంత పెనుగులాడి ఉంటుందో.
మగాడు ఎందుకు పెనుగులాడేలా చేస్తాడో.చీకటిగా ఉంది. చుట్టూ హాస్పిటల్ కారిడార్ అంతా పరుచుకున్న చీకటి.శారదా టీచర్ ఇక్కడే ఉంది. కేన్సర్ అన్నారు. ఇప్పుడో మరి కాసేపో. వీడ్కోలు.అమ్మ గుర్తుకొచ్చింది. ఆమె చూసిన జీవితం గుర్తుకొచ్చింది. అమ్మ... అమ్మలాంటి స్త్రీలు.. శారదా టీచర్ శారదా టీచర్‌లాంటి స్త్రీలు... ఎంతమంది ఉంటారు. అంతమంది ఎందుకు ఉండాలి అసలు. జీవితాలని ఎందుకు కోల్పోవాలి? ‘ఇక్కడున్నావా తల్లీ’ పిలుపు వినిపించింది.శ్యామలా ఆంటీ. శారదా టీచర్ ఫ్రెండు. శారదా టీచర్‌లాగే.‘ఇక మీదట అన్నీ నీకు నేనేనమ్మా’ అంది ఉదయమే అపేక్షగా. ‘ఇక్కడ చాలా చీకటిగా ఉంటే ఏం చేస్తున్నావమ్మా. లోపలికి పోదాం పద’ చేయి పట్టుకుంది.తిరిగి ప్రయాణం మొదలైంది. ఒక గుడ్డి వెలుతురులోకి.కథ ముగిసింది.విమల రాసిన ‘నీలా వాళ్లమ్మ మరికొందరు’ కథ ఇది.మగవాళ్ల వికల వ్యక్తిత్వం వల్ల తప్పిపోయిన స్త్రీ పాత్రలు చాలా ఉంటాయి సమాజంలో. ఎక్కడుంది లోపం? వ్యక్తిత్వం ఉన్న అబ్బాయిలు... వ్యక్తిత్వం ఉన్న యువకులు... వ్యక్తిత్వం ఉన్న అధికారులు... వ్యక్తిత్వం ఉన్న నాయకులు... అంతిమంగా వ్యక్తిత్వం ఉన్న భర్తలు వీళ్లను తయారు చేసుకోవడంలో వ్యవస్థ ఎక్కడ విఫలం అవుతూ ఉంది? భూమి రెండు అర్ధగోళాలు. స్త్రీ అనే అర్ధగోళం అర్థవంతంగా ఉండాలంటే పురుషుడి వ్యక్తిత్వం అర్థవంతంగా ఉండాలి. వెలగాలనుకుంటున్న స్త్రీలతో పాటు వెలుగుదామనుకునే పురుషుల వల్లే చీకటి పోతుంది. అందాక గుడ్డి వెలుతురే. ఇప్పుడున్నది అదే.
పునః కథనం: ఖదీర్
- విమల
గుడ్డి వెలుతురు
Published Wed, Feb 21 2018 12:47 AM | Last Updated on Wed, Feb 21 2018 12:47 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment