women abbused
-
బెయిల్‌పై విడుదల: రాజకీయ నాయకుడికి అట్టహాసంగా ఘనస్వాగతం
నోయిడా: రాజకీయ నేత శ్రీకాంత్ త్యాగి మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించి జైలు పాలైన సంగతి తెలిసిందే. ఐతే ఆ నాయకుడు ప్రస్తుతం బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. దీంతో అతని అనుచర వర్గాలు అతనికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పైగా శ్రీకాంత్ బాయ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ మేరకు సదరు రాజకీయ నాయకుడు త్యాగి తన ప్రత్యర్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...తనపై చేసిన గ్యాంగ్‌స్టర్ వంటి ఆరోపణలు కల్పితమన్నారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ క్రుట్రలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వివాదంలోకి తన సోదరిని కూడా లాగి తమ మధ్య గొడవలు సృష్టించాలని చూశారన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచిని తమ కమ్యూనిటీ వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను రాజకీయాల్లోనే ఉంటానని, తాను చేయాల్సింది చాలా ఉందని చెప్పుకొచ్చాడు. తన తదుపరి నిర్ణయాల విషయమై మాట్లాడుతూ...తన మద్దతుదారులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. త్యాగికి అలహాబాద్ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేయడంతో అతను గురువారం జైలు నుంచి విడుదలయ్యాడు. వాస్తవానికి త్యాగి గ్రాండ్ ఓమాక్స్ సొసైటీలో ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ కావడంతో అతన్ని అరెస్టు చేశారు. అతనిపై దోపిడీ నేరం, గ్యాంగ్‌స్టర్, మహిళలపై దాడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఐతే త్యాగి మాత్రం బీజేపీ రైతు విభాగం సభ్యుడినని చెబుతూ... పార్టీ అధినేత జేపీ నడ్డాతో దిగిన ఫోటోలను చూపిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం సీరియస్‌గా ఆ వ్యాఖ్యలను ఖండించడం గమనార్హం. (చదవండి: మూడేళ్లుగా మారువేషంలో.. బౌద్ధ సన్యాసి ముసుగులో భారత్‌లో గూఢచర్యం?) -
మహిళను పొలంలోకి లాక్కెళ్లి కళ్లు పొడిచి పరార్.. ఏం జరిగింది?
పాట్నా: ఇంట్లో నిద్రిస్తున్న మహిళ(45)ను సమీపంలోని జనుము పంటలోకి లాక్కెళ్లి ఆమె కళ్లు పొడిచేసిన సంఘటన బిహార్‌లోని కటిహార్ జిల్లాలో వెలుగు చూసింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన దక్లా ఇంగ్లీష్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడుని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మహిళపై దాడి చేసి చూపు కోల్పోయేలా చేసిన దుండగుడు ఎండీ షామిమ్‌గా గుర్తించారు పోలీసులు. 'నిందితుడు ఎండీ షామిమ్‌ను అరెస్ట్ చేశాం. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది అత్యాచారమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు.' అని ఎస్డీపీఓ తెలిపారు. ఏం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గ్రామంలో తన 8 ఏళ్ల కుమార్తెతో జీవిస్తోంది. మంగళవారం రాత్రి తన కూతురితో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. ఆమె భర్త నాలుగు రోజుల క్రితం పని కోసం ఢిల్లీ వెళ్లాడు. దుండగుడు అక్కడికి వచ్చి డోర్ కొట్టాడు. బాధితురాలు తలుపు తీయగా.. ఆమెను సమీపంలోని జనుము తోటలోకి లాక్కెల్లాడు. చేతులు కట్టేసి తన తల్లి కంట్లో కర్ర పుల్లలను దూర్చాడని, దాంతో తీవ్రంగా రక్తస్రావం అయినట్లు బాధితురాలి కుమార్తె పోలీసులకు తెలిపింది. దాడికి పాల్పడిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే ఆమెను అమ్దాబాద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటం వల్ల కటిహార్ వైద్య కళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఆమెకు చూపు వస్తుందనే నమ్మకం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. ఇదీ చూడండి: ప్రియురాలు ద్రోహం చేసిందని తట్టుకోలేక... ఆమెను చంపి... -
పింక్‌బెల్ట్ మిషన్ ఏం చేస్తుందో తెలుసా?
రెండేళ్లుగా మహిళలపై జరిగే దాడులను, ఎంతో మంది మహిళా బాధితులు మృత్యువాత పడటానికి గల కారణాలను ముంబయ్‌లోని పింక్‌బెల్ట్ మిషన్ గుర్తించడంతో పాటు తగిన రక్షణ చర్యలను తీసుకుంటోంది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఈ మిషన్ చేపట్టే కార్యక్రమాలు చేరుతున్నాయి. లాభాపేక్ష లేని ఈ స్వచ్ఛంద సంస్థ ఇప్పుడు మహిళల భద్రతకు సంబంధించిన సురక్షా పరికరాన్ని అమలులోకి తీసుకువచ్చేలా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది. పింక్ బెల్ట్ మిషన్ మహిళల భద్రత కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మహిళల భద్రతకు ఉద్ధేశించిన ఓ సేఫ్టీ డివైజ్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఈ విషయంలో తమకు మద్దతుగా నిలవాలని సంతకాల సేకరణ కార్యక్రమం కూడా చేపట్టింది. ది పింక్ బెల్ట్ పేరుతో అందుబాటులోకి తెచ్చే ఈ అసాల్ట్ అలర్ట్ బ్యాండ్ దాడులను అప్రమత్తం చేసే బ్యాండ్‌గా ఉండాలని విజ్ఞప్తి చేస్తోంది. దీనిలో జిపిఎస్ ట్రాకింగ్ ఉంటుందని, ఇది దాడి జరిగిన సమయంలో కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా సమీపంలో ఉన్న అధికారులను, వైద్య కేంద్రాలను, కుటుంబ సభ్యులను కూడా అప్రమత్తం చేస్తుందని తద్వారా ప్రమాదంలో ఉన్న మహిళకు వెనువెంటనే అవసరమైన సహకారం అందుతుందని ఈ మిషన్ ప్రతినిధులు వివరిస్తున్నారు. వేగవంతమైన సాయానికి..: 2019లో దేశంలో ప్రతి 13 నిమిషాలకూ ఒక లైంగిక దాడి, 1000కుపైగా యాసిడ్ దాడులు జరిగాయని నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదికలు వెల్లడిస్తున్న నేపధ్యంలో ఈ పింక్ బెల్ట్ మిషన్ కు మద్ధతుగా నిలవాలని, తమ ఆన్ లైన్ పిటిషన్లో సంతకం చేయాలని కోరుతున్నారు. ఈ అంశాలపై తన ఆలోచనలను పింక్‌బెల్ట్ మిషన్ ఫౌండర్ అపర్ణ రజావత్ వెల్లడిస్తూ ‘అత్యాచారాల కారణంగా ఎన్నో మరణాలను మనం చూస్తున్నాం. ఎంతోమంది యాసిడ్ దాడి బాధితులు కంటి చూపు కోల్పోవడంతో పాటుగా ఆ భయంతోనే జీవితాంతమూ గడుపుతున్నారు. పింక్ బెల్ట్ మిషన్ ఈ తరహా సంఘటలను దాటి ముందుకు వస్తున్నప్పటికీ, అత్యంత సమస్యాత్మకంగా ప్రమాద ఘంటికలను మోగిస్తోన్న అంశమేమిటంటే సమయానికి తగిన సహాయం పొందలేకపోతుండటం. అది నేరాన్ని నిరోధించడంలో కావొచ్చు లేదా వేగవంతంగా వైద్య సహాయం అందించడంలో జాప్యమైనా కావొచ్చు. ఈ పింక్ బెల్ట్ మిషన్ ద్వారా మేం ప్రభుత్వ సహాయం తీసుకుని ఈ అసాల్ట్ అలర్ట్ నేపథ్యాన్ని బయటకు తీసుకురావడంతో పాటుగా ఆపదలో ఉన్న వారికి తగిన సహాయం అందించేలా కృషి చేస్తున్నాం. ప్రభుత్వ సహాయంతో పింక్ బెల్ట్ ఇప్పుడు సుదూరతీరాలకు వెళ్లడంతో పాటు జీవితాలనూ కాపాడుతుంది. అంతేకాదు, దీంతో ప్రతి రోజూ మన దేశ మహిళను సురక్షితంగా నిలుపడంలోనూ తోడ్పడుతుంది’ అన్నారు. సంతకం చేయాల్సిన పిటిషన్ లింక్..https://pinkbeltmission.org/iwantmypinkbelt/ -
దివ్యాంగురాలిపై లైంగిక దాడి, చూపు కోల్పోయిన బాలిక
బిహార్: దివ్యాంగురాలు అని కూడా చూడకుండా 15 ఏళ్ల బాలికపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను తీవ్రంగా గాయపర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన బిహార్‌లోని మధుబాన్ జిల్లాలో బుధవారం జరిగింది. మధుబాన్ జిల్లా ఎస్పీ సత్యప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. హర్లకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కౌవహ బర్హి గ్రామానికి చెందిన దివ్యాంగురాలైన (చెవిటి, మూగ) బాలిక (15) తన స్నేహితులతో కలిసి మేకల్ని తోలుకొని అటవీ ప్రాంతానికి వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన ముగ్గురు వెంట పడి బాలికను లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాంతో తోటి బాలికలు వెంటనే బాధితురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వెళ్లి చూసేసరికి ఆ బాలిక తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉంది. దుండగుల దాడిలో ఆ బాలిక కంటిచూపు కోల్పోయింది. బాధితురాలిని మధుబానీలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ పాశవిక దాడి ఘటనపై బిహార్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహిళా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఘటనను ఖండిస్తున్నాయి. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. -
ఆఖరు ప్రయత్నం
‘ఇవాళ ఎలాగైనా సరే’ అనుకుంది. వెళ్లి మెయిన్ డోర్ వేసేసింది. కిటికీ కర్టెన్లు లాగేసింది. రెండు బాల్కనీలు ఉన్నాయి. రెండిటి తలుపులు వేసేసింది. కిచెన్‌లో వాటర్ ప్యూరిఫయర్ ఉంది. అది ఆన్‌లో ఉందా ఆఫ్‌లో ఉందా చెక్ చేసుకుంది. స్టవ్ చెక్ చేసింది. బాత్రూమ్లో ట్యాప్‌లు కట్టేసి ఉన్నాయా లేదా చూసుకుంది. టీవీ ఒక్కటే రన్ అవుతూ ఉంది... దానిని ఆఫ్ చేయాలా లేదా మ్యూట్‌లో పెట్టాలా అని ఒక్క క్షణం ఆలోచించింది. ఇంట్లో టీవీ ఉంటే మనిషి ఉన్నట్టు. పెద్దాడు రెండేళ్ల క్రితం యూఎస్ వెళ్లిపోయాడు కోడలితో, పిల్లవాడితో. కూతురు ఈ మధ్యే కాన్పుకొచ్చి తిరిగి వెళ్లిపోయింది. ఇంట్లో మిగిలింది ఇద్దరు. భర్తా తను. భర్త ఏవో పుస్తకాలు చదువుకుంటూ పార్క్‌కు వెళ్లి తన ఈడు వాళ్లతో బాతాఖానీ వేస్తూ లేదా క్లబ్లో తొమ్మిదీ పది దాకా కార్డ్స్ ఆడుతూ.... ఇక ఇంట్లో ఏ శబ్దం ఉంటుంది... టీవీ శబ్దం తప్ప. ఇవాళ దానిని కూడా ఆఫ్ చేసేద్దామనుకుంది. చేసేసింది. టైమ్ చూసుకుంది. రాత్రి ఎనిమిది.భర్త స్పేర్ కీ తీసుకెళ్లాడా లేదా చెక్ చేసింది. తీసుకెళ్లాడు. తలుపు తప్పనిసరిగా తీయాలన్న నియమం లేదు. తీసుకుని వచ్చేస్తాడు. మంచిది.బెడ్రూమ్లోకి వెళ్లింది. శుభ్రమైన దుప్పటి పరచి, లేత రంగుల్లో ఉన్న పిల్లో కవర్స్‌తో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇలా పడుకోగానే అలా నిద్ర రావాలి దాని మీద. కాని రావడం లేదే.కప్‌బోర్డ్‌లో నిద్ర మాత్రల బాటిల్ తీసుకుని జాగ్రత్తగా ఒక టాబ్లెట్ తీసి మంచినీళ్లతో వేసుకుంది.ఇది వేసుకుంటే నిద్ర రావాలి.వస్తుందనే డాక్టర్ చెప్పాడు.కానీ రాదు. నిద్ర సరిగా పట్టదు. నిద్రకు భయపడి, నిద్రపోవడం తప్పని స్థిరపడి, గాఢమైన నిద్రపోయే హక్కు తనకు లేదు అని కండీషనింగ్ చేసుకోవడం వల్ల తనకు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా పట్టదే.చిన్నప్పుడు బాగా నిద్ర పట్టిన గుర్తు ఉంది. కానీ మూడు నాలుగు తరగతులకు వచ్చే సరికి ముఖాన ధడేలుమని నీళ్లు చల్లి ‘లేవే లే... చదువుకోవాలి లే’ అని అమ్మ నిద్ర లేపేసేది. ఎంతో ముఖ్యమైన నిద్ర ఆ తెల్లవారుజాము ట్యూషన్లలో నాశనమైపోయింది. స్కూల్లో మధ్యాహ్నం క్లాసులలో బయట ఆ ఎండకీ లోపల అర్థం కాని పాఠానికి చాలా నిద్ర వచ్చేది. ఒకసారి దాదాపు నిద్రపోబోయింది. కానీ టీచర్ డస్టర్‌తో తల మీద ఎంత గట్టిగా కొట్టిందంటే పగటి నిద్ర ఆ దెబ్బతో చచ్చిపోయింది. హమ్మయ్య... ఆదివారం వచ్చింది ఆ రోజన్నా కాస్త మనసుతీరా నిద్రపోయి లేద్దాం అంటే అమ్మ తలంటు అని అప్పుడు కూడా లేపేసేది. ఇక వయసు రావడం నిద్ర లేకపోవడం ఒకేసారి జరుగుతాయి.‘ఏమిటే... వయసొచ్చిన పిల్ల అంత సేపు పడుకోవచ్చా’ అని అమ్మ వెలుతురొచ్చే ముందే లేపేసేది. ఇక వాకిలి ఊడ్చి, కళ్లాపి చల్లి, మోటార్ వేసి, బంతిపూలు ఏమైనా పూసి ఉంటే కనుక వాటిని తెంచి, కాసేపు చదువుకుని, కాలేజీకి తయారయ్యి... నిద్రే లేదు. అందమైన కళ్లు... అందమైన కళ్లు అని అందరూ అనేవారు. పొగడ్తలు ఎవరికి కావాలి... నిద్ర కావాలి వాటికి. అసలు నిద్రకూ పరీక్షలకు లంకె ఏమిటో ఎంత ఆలోచించినా అర్థమయ్యేది కాదు. పరీక్షలప్పుడు నిద్ర పది టన్నుల బరువుతో వచ్చేది. కనురెప్పల మీద రాక్షసులు ఎక్కి తొక్కుతున్నట్టే ఉండేది. ఆ నిద్రను కాపలాకాచే బాధ్యత నాన్న తీసుకునేవాడు.‘మా తల్లి కదూ... ఈ టీ తాగి చదువుకోమ్మా’ అని ఫ్లాస్క్ విప్పి టీ అందించేవాడు.చదువుకు, పెళ్లికి మధ్య ఒక గ్యాప్ ఉంటుంది. అప్పుడు నిద్రపోవచ్చు ఆడపిల్ల.కానీ ‘ఆడపిల్ల నిద్ర ఇంటికి దరిద్రం. ఇలా పడుకుంటే సంబంధాలు కుదరవు’ అని అమ్మ నిద్ర పోనిచ్చేది కాదు. ఇక పెళ్లయ్యాక భర్తను కొన్నాళ్ల పాటు శ్రీవారు అని మురిపెం చేయడం కద్దు. ఈ శ్రీవారు నిద్రకు విరోధి. రాత్రికి హక్కుదారు. మెలుకువకు పట్టాదారు. ఆ శ్రీవారు శ్రీమతిని మెలుకువగా ఉంచి మెలుకువను పదే పదే తెప్పించి ఆఖరికి తను మాత్రం గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. శ్రీమతి చచ్చినట్టు లేవాల్సిందే. లేకుంటే అత్తగారు ఏమనుకుంటారు... ఆడపడుచు ఏమనుకుంటుంది... తెల్లవారే లేచి ముగ్గు వేసే కోడలే ఉత్తమురాలు.. ఆ కోడలి నిద్ర ఏ గంగలో అయినా కలవనీగాక.ఈ మురిపెం ఇలా ఉంటుందా... తొమ్మిది నెలలు తిరిగేసరికల్లా ఒడిలో కయ్‌మని ఏడుపు.బాలింతకు నిద్ర కరువు. పాలు పట్టాలి.పిల్లవాడికి నిద్ర కరువు. బాలింత మేలుకోవాలి.మూడు నాలుగేళ్లు వయసు వచ్చేసరికి– అదే సర్కిల్– నిద్ర లేవడం, లేపడం, స్కూళ్లకు సిద్ధం చేయడం, వంట చేసుకోవడం....పిల్లలు కొంచెం ఎదిగొచ్చి పైస్కూళ్లకు వెళ్లే టైమ్‌లో మధ్యాహ్నం పూట నిద్ర పోవడానికి ట్రై చేసింది. సరిగ్గా కునుకు పట్టే వేళకు ఏ పోస్ట్మేనో తలుపు తట్టేవాడు. ఇరుగమ్మో పొరుగమ్మో వొదినా అంటూ వచ్చేది. లేదంటే పక్కింటి అల్లరి కుర్రాడు బెల్‌కొట్టి పారిపోయేవాడు. నాలుగవుతూనే పనిమనిషి తయారు– అంట్ల కోసం. కొడుకు పెళ్లి జరుగుతుంది– పురుడొస్తుంది– మేలుకోవాలి.కూతురు పెళ్లి జరుగుతుంది– బిడ్డ పుడుతుంది– మేలుకోవాలి.అమ్మమ్మ, నానమ్మ హోదాలు నిద్రను ష్యూరిటీగా ఇస్తే తప్ప దక్కవు.ఇన్నాళ్లకు అన్నీ సెటిలయ్యి హాయిగా నిద్ర పోదామనుకుంటే భర్తకు రాత్రి పూట ఒకటి రెండుసార్లు బాత్రూమ్కు వెళ్లే అలవాటు. లేస్తాడు. లేస్తే లేచాడు... లైటు వేసేసి... ట్యాప్ తిప్పేసి.. అదొక జాతర. అలెర్జిక్ కాఫట...మధ్య మధ్య లేచి దగ్గుతాడు.నిద్ర రాత లేదా తనకు.‘ఇవాళ ఎలాగైనా’ అని మళ్లీ గట్టిగా అనుకుంది.‘శవం నిద్ర పోయినంత గాఢంగా నిద్రపోవాలి’ అనుకుంది.కానీ టాబ్లెట్ వేసుకుని ఇంత సేపైనా నిద్ర రావడం లేదే.ఇంకో టాబ్లెట్ వేసుకుంటే? ట్రై చేద్దాం. బాటిల్ విప్పి అరచేతిలో వొంచింది. మొత్తం టాబ్లెట్లు పడ్డాయి. మొత్తం. వాటి నిండా నిద్రే ఉంటుందా?లాగుతోంది మనసు. నిద్ర కావాలని వెర్రెక్కిపోతోంది మనసు.ఒక్కొక్కటే వేసుకుంటూ నీళ్లు తాగేసింది.కళ్ల మీద మగత. హమ్మయ్య. నిద్ర వస్తున్నట్టుంది.భర్త వచ్చి ఎక్కడ డిస్ట్రబ్ చేస్తాడో.‘ఏమండీ... చచ్చిపోవట్లేదు. నిద్రపోతున్నా’ కాగితం రాసి కళ్లు మూసుకుంది.కథ ముగిసింది.అబ్బూరి ఛాయాదేవి రాసిన ‘సుఖాంతం’ కథ ఇది.అన్నింటికీ నెపం మగాడి మీద వేయాల్సిన అవసరం లేదు. స్త్రీని పట్టించుకోవడం అంటే మగాడు మాత్రమే కాదు.. మొత్తం కుటుంబం పట్టించుకోవాలి. సాటి స్త్రీ పట్టించుకోవాలి. తల్లి, తండ్రి, పిల్లలు, తోబుట్టువులు... అందరూ పట్టించుకుంటేనే ఆమెకు కనీస విశ్రాంతి దొరుకుతుంది. ఏమడుగుతోంది స్త్రీ... మణులా మాణిక్యాలా... కంటి నిండా నిద్ర. మనింట్లో అమ్మ ఎన్ని గంటలు నిద్రపోతున్నదో ఇవాళ గమనిద్దామా? పునః కథనం: ఖదీర్ - అబ్బూరి ఛాయాదేవి -
బెంగళూరులో బద్మాష్‌లు: సంచలన వీడియో
బెంగళూరు: భారత ఐటీ రాజధాని బెంగళూరులో కొత్త సంవత్సరం వేకువజామున చోటుచేసుకున్న ఓ కీచకపర్వం సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. నగరంలోని కమ్మనహళ్లి ప్రాంతంలో జనవరి 1 తెల్లవారి 2:40 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనలో.. ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతిని స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు వెంబడించడం, అందులో ఒకడు నేరుగా అమ్మాయి దగ్గరకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడం, అమ్మాయి ప్రతిఘటన తదితర దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డయ్యాయి. కాగా, ఫుటేజీల ఆధారంగా యువతిపై లైంగికదాడి చేసిన యువకులపై గత రాత్రి కేసు నమోదుచేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని బెంగళూరు సిటీ ఈస్ట్ జోన్ డీసీపీ మీడియాకు చెప్పారు. (వెంటాడి.. దుస్తులను చించి వేధించారు) నగరంలో పార్టీ హబ్‌గా పేరొందిన ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో శనివారం రాత్రి న్యూ ఇయర్ సంబరాల్లో వేలాది మంది మధ్యలో యువతులు, మహిళలపై ఆకతాయిలు అసభ్య ప్రవర్తనకు, లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘ఇలాంటి కిచకపర్వాలు కామనే’ అంటూ కర్ణాటక హోంమంత్రి, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. ఆ ఇద్దరు నేతలకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు కూడా జారీచేసింది. (బెంగళూరు ఘటనపై ఆ ఇద్దరికీ సమన్లు!)