తోడు... | In addition, ... | Sakshi
Sakshi News home page

తోడు...

Published Thu, Dec 17 2015 11:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

తోడు...

తోడు...

ఆ ఫ్లాట్ మీదుగా నడుస్తుంటే గంగాధరానికి వయొలిన్ సవ్వడి వినిపించింది. ఆశ్చర్యపోయాడు. ఈ ఇంట్లో వయొలిన్ వాయించేది ఎవరబ్బా?సంశయిస్తూనే తలుపు తడితే నవ్వుతూ విజయలక్ష్మి కనిపించింది. చేతిలో వయొలిన్. ఆ వేళే బజారుకు వెళ్లి, దానిని కొనుక్కొచ్చి, సాయంత్రం నుంచి సాధన చేస్తోందట. ‘బాగుందా’ అని నవ్వింది. గంగాధరానికి ఇది ఇంకా ఆశ్చర్యం. ఆమె భర్త ఇటీవలే చని పోయాడు. పిల్లలు కర్మాంతరాలు చేసి వెళ్లిపోయారు. వెళ్లే ముందు మాతో వచ్చి ఉండమ్మా.. అని ఎంతఅడిగినా వెళ్లలేదు. సరే.. పెద్ద వయసు.. అలవాటు పడిన ఇల్లు అనుకుంటే ఈ సంగీతం ఏమిటి? ఒక దిగులూ బాధా లేకుండా ఈ నవ్వు ఏమిటి?ఏవో మాటలు చెప్పి తన ఫ్లాట్‌కు వచ్చేశాడు. ఫ్లాటా అది? అడవిలా ఉంది. ఎక్కడి బట్టలు అక్కడే. ఎక్కడి గిన్నెలు అక్కడే. ఒక మూల గుట్టలు పడిన న్యూస్ పేపర్లు. ఇంకో వైపు తుడవని టీ మరకలు. మనిషి కూడా ఒక కళా కాంతీ లేకుండా. అతని భార్య కూడా కొద్ది రోజుల క్రితమే క్యాన్సర్‌తో మరణించింది. ఇన్నాళ్లూ ఆమె అతనికి అన్నీ అమర్చిపెట్టింది. పిలిస్తే పలికి... పిలకపోయినా పలికి... ఇప్పుడు ఒక్కడే చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో తెలియక అవస్థ పడుతున్నాడు. గదులు తెలియడమే ఇల్లు తెలియడం అనుకున్నాడు.గంగాధరం- విజయలక్ష్మి... పక్కపక్కగా ఉండే ఫ్లాట్లు. ఒకేలాంటి కష్టం. కాని విజయలక్ష్మి ఒకలా ఉంది. గంగాధరం మరోలా ఉన్నాడు. ‘మీకు మీవారు పోయారన్న బెంగ లేదా’ అడిగాడొక రోజు.

 ‘ఎందుకు లేదు?’ ఎదురు ప్రశ్న వేసింది. ‘ఉంటుంది. బాధ ఉంటుంది. బెంగ ఉంటుంది. ఇన్నాళ్లు కలిసి జీవించడం వల్ల జ్ఞాపకాలు ఉంటాయి. అవన్నీ ఎంతవాస్తవమో భర్త పోయాక ఆర్థిక ఇబ్బందులు గనక లేకపోతే స్త్రీ చేసే మొదటి పని రిలాక్స్ కావడమే అనేది కూడా అంతేవాస్తవం. ఇన్నాళ్లూ భర్తే తానై తానే భర్తైబతికి ఉంటుంది కదా. ఇప్పుడన్నా కనీసం కొత్త స్నేహితులతో మాట్లాడవచ్చు. పాత అలవాట్లను నెమరు వేసుకోవచ్చు. తీరిగ్గా పుస్తకాలు చదువుకోవచ్చు. ఇక వంట పని అంటారా... భర్త చనిపోతే భార్యకు ఆ చాకిరీ తగ్గుతుందే తప్ప పెరగదు’... గంగాధరం జవాబు చెప్పలేకపోయాడు. నిజానికి అతడి కష్టం చెప్పనలవిగాకుండా ఉంది. ఎవరి మీదనో తెలియని కోపంగా ఉంది. సాయంత్రమైతే చాలు ఇంట్లో ఉండలేక ఫ్లాట్‌కు తాళం వేసి బయటకు వెళ్లిపోతున్నాడు.తిరిగి తిరిగి ఇంటికి చేరుకుంటే కాస్తయినా పలకరించే విజయలక్ష్మే అతడికిప్పుడు అతి పెద్ద ఓదార్పు.

సంవత్సరం గడిచింది. ఇద్దరి మధ్యా పరిచయం పెరిగింది. స్నేహం పెరిగింది. మనసులోని మాట ఏదైనా చెప్పేయవచ్చు అన్న చనువు కూడా పెరిగిందేమోనని గంగాధరానికి అనిపించింది. ‘మనం పెళ్లి చేసుకుందామా’ అడిగాడు.‘ఏంటి?’ నవ్వింది. ‘ఏంటి’.. మళ్లీ నవ్వింది. పడీ పడీ నవ్వింది. ‘నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?’ ‘తోడు కోసం’‘తోడు కోసమా?’ నవ్వుతూ అంది- ‘నాకు తెలుసు తోడంటే ఏమిటో? మగవాడి దృష్టిలో తోడంటే బట్టలు ఉతకడం, ఇల్లు ఊడ్చడం, అంట్లు తోమడం, వండి వార్చడం... ఇవన్నీ చేసిపెట్టడమే మీకు
కావలసిన తోడు. ఇన్నాళ్లు అవి చేసి చేసి విసిగిపోయి ఉన్నాను. ఇప్పుడే వాటి నుంచి బయట పడ్డాను. మళ్లీ తోడు అనే  అందమైన ముసుగు వేసి నన్ను ఈ రాద్ధాంతంలోకి లాగకండి’... లేచి ఫ్లాట్‌కు వచ్చేశాడు. ఆ రాత్రి చాలా ఆలోచించాడు. స్త్రీ గౌరవించే, స్త్రీ కోరుకునే, స్త్రీ  అభిమానించే మగతోడు ఎలా ఉండాలి? కొంచెం అందినట్టు అనిపించింది.  మరుసటి రోజు బజారుకు వెళ్లాడు. ఇంటికి అవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాడు. బూజు కట్టెలు వెతికి బూజు దులుపుకున్నాడు. బట్టలు సర్దుకున్నాడు. తడిబట్ట పెట్టి టీపాయ్‌లు కప్‌బోర్డులు మెరిసేలా తుడుచుకున్నాడు. పని మనిషి ఉండొచ్చు. కాని మన ఇంటి మీద శ్రద్ధ ఉండాల్సింది మనకే కదా. ఇక వంట పని. కొద్దిగా తెలుసు. ఇప్పుడు ఇంకాస్త మనసు పెట్టి వండటం నేర్చుకున్నాడు. చూడటానికే కాదు, తినడానికి కూడా ఆకర్షణీయంగా ఉండే పదార్థాలు చేయడం ఇప్పుడు తనకు వచ్చు.

ఒకరోజు ఆమెను భోజనానికి పిలిచాడు. కుదురుగా ఉన్న ఇంట్లో ముచ్చట గొలిపే డైనింగ్ టేబుల్ మీద రుచికరమైన భోజనం. ‘తోడంటే ఏమిటో నాకు తెలిసింది’ అన్నాడు. నవ్వుతూ చూసింది. ‘అవును. తోడంటే బాధ్యతలో సగం. బరువులో సగం. బంధంలో సగం.సంతోషంలో సగం. కన్నీటిలో సగం. ఒక సంపూర్ణమైన అనుబంధానికి మనిద్దరం చెరో సగం’... చెప్తూ ఆమె వైపు చూశాడు. ఆమె కోసం చూశాడు.యాభై ఏళ్ల స్త్రీ ఆమె. సగం జీవితాన్ని దాటేసిన స్త్రీ. కాని తన ఎదురుగా ఉన్న మగవాణ్ణి, తనను తాను మార్చుకున్న
 మగవాణ్ణి, స్త్రీ గౌరవించి ప్రేమించేలా సిద్ధమైన ఆ మగవాణ్ణి చూసి పదహారేళ్ల అమ్మాయిలా ముచ్చట పడింది. తుళ్లి పడింది.హృదయంలో ప్రేమ ఉప్పొంగగా దగ్గరగా వచ్చి చేతిని అందుకుని మనస్ఫూర్తిగా ముద్దాడింది.  ఒక కొత్త ప్రయాణం- అర్థవంతంగా మొదలైంది.

ఓల్గా
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement