ఆ‘నంది’..అద్వితీయం | silver nandi for apurupam | Sakshi
Sakshi News home page

ఆ‘నంది’..అద్వితీయం

Published Sun, Apr 30 2017 10:54 PM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM

ఆ‘నంది’..అద్వితీయం

ఆ‘నంది’..అద్వితీయం

- పద్యనాటకంలో లలిత కళా సమితి
- బాలల విభాగంలో శ్రీ గురు రాజా కాన్సెప్ట్‌ స్కూల్‌ 
 
సాక్షి, రాజమహేంద్రవరం : రాష్ట్ర స్థాయిలో 2016 ఏడాదికి గాను పద్య, సాంఘిక, బాలల, కళాశాలల, యూనివర్సిటీ స్థాయిలో నిర్వహించిన నాటక పోటీల విజేతలకు 20వ నంది నాటక బహుమతులు ప్రదానం చేశారు. పద్యనాటకంలో మొదటి బహుమతి అనంతపురం పట్టణానికి చెందిన లలిత కళాపరిషత్తు, రెండో బహుమతి కర్నూలుకు చెందిన లలిత కళా సమితి, తృతీయ బహుమతి ఖమ్మం కల్చరల్‌ అసోసియేషన్‌ గెలుచుకున్నాయి. వీరికి బంగారు, వెండి, క్యాంస నందులతోపాటు రూ.80 వేలు, రూ.60 వేలు, రూ.40 వేలు చొప్పున నగదు, ప్రశంసాపత్రం ఇచ్చారు. సాంఘిక నాటిక విభాగంలో మొదటి బహుమతి గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన గంగోత్రి, రెండో బహుమతి హైదరాబాద్‌కు చెందిన కళాంజలి, మూడో బహుమతి రాజమహేంద్రవరం విజయాదిత్య ఆర్ట్స్‌కు ప్రదానం చేశారు. వీరికి నంది, వెండి, క్యాంస నందులతోపాటు రూ.70 వేలు, రూ.50 వేలు, రూ.30 వేలు చొప్పున నగదు, ప్రశంసాపత్రం అందించారు.
 
బాలికలు, కళాశాలలు, యూనివర్సిటీల విభాగంలో... 
బాలల విభాగంలో శ్రీ ప్రకాశ్‌ విద్యానికేతన్‌ విశాఖపట్నం మొదటి బహుమతి, కళారాధన, శ్రీ గురు రాజా కాన్సెప్ట్‌ స్కూల్‌ నంద్యాల రెండో బహుమతి, కళాప్రియ లిటిల్‌ చాంప్స్‌ ఒంగోలు మూడో బహుమతి గెలుచుకున్నాయి. వీరికి బంగారు, వెండి, కాంస్య నందులతోపాటు రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేల చొప్పున నగదు, ప్రశంసాపత్రం అందించారు. కళాశాలలు, యూనివర్సిటీల విభాగంలో సెయింట్‌ థెరిస్సా మహిళా డిగ్రీ కాలేజి ఏలూరు మొదటి బహుమతి, న్యూ స్టార్‌ మోడ్రన్‌ థియేటర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, పీబీ సిద్ధార్ద కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ విజయవాడ రెండో బహుమతి, ఎస్‌.ఎస్‌.బి.ఎన్‌. డిగ్రీ కాలేజి అనంతపురం మూడో బహుమతి గెలుచుకున్నాయి. వీరికి బంగారు, వెండి, కాంస్య నందులతోపాటు రూ.40 వేలు, రూ.30వేలు, రూ.20 వేలు చొప్పున నగదు, ప్రశంసాపత్రం ప్రదానం చేశారు.
 
గ్రామీణ  నేపథ్యంలో ఆధునిక తెలుగు నాటక రచన సమస్యలు, పరిష్కారాలు అనే అంశంపై నాటక రంగంలో రచించిన పుస్తకానికి గాను రచయిత కారుమూరి సీతారామయ్యకు తామ్ర నంది, రూ.35 వేల నగదు, ప్రశంసాప్రతం అందించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ కోడెల, ఇతర వక్తలు మాట్లాడుతూ నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో నాటకాలకు మంచి ప్రాధాన్యం ఉందన్నారు. రాష్ట్రంలో రంగస్థల నటులకు పింఛన్‌ పెంచాలని, వారికి ఇళ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, నగర మేయర్‌ పంతం రజనీశేషసాయి, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎన్‌.శ్రీకాంత్, ఎండీ ఎస్‌.వెంకటేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 
 
వెండినందిని అందుకున్న ‘‘అపురూపం’’
నంద్యాల: రాష్ట్ర ప్రభుత్వం, చలన చిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన నంది నాటకోత్సవం పోటీల్లో వెండి నంది బహుమతిని ఆదివారం రాత్రి అపురూపం నాటిక బృందం అందుకుంది. స్థానిక గురురాజ స్కూల్, కళారాధన, సాంస్కృతిక సంస్థ అపురూపం బాలల నాటికను రూపొందించింది. ఇటీవల కర్నూలులో జరిగిన నంది నాటకోత్సవాల్లో ఈ నాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. ఈ మేరకు రాజమండ్రిలో జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాద్‌ నుంచి వెండి నంది, రూ.30వేల నగదును నాటిక దర్శకుడు డాక్టర్‌ రవికృష్ణ, గురురాజ స్కూల్‌ డైరెక్టర్‌ షావలిరెడ్డి, కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌ఆర్‌ఎస్‌ ప్రసాద్, చిన్నారులు అందుకున్నారు. ఈ వెండి నందిని సాధించినందుకు ఎంతో సంతోషంగా ఉందని, వరుసగా నాలుగేళ్ల నుంచి ప్రతి ఏడాది నంది నాటకోత్సవంలో బహుమతులను సాధిస్తున్నామని డాక్టర్‌ రవికృష్ణ, షావలిరెడ్డి తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement