పద్యనాటకాలు.. ఇతిహాస సుగంధాలు
పద్యనాటకాలు.. ఇతిహాస సుగంధాలు
Published Sun, Jan 29 2017 10:07 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
కర్నూలు (కల్చరల్) : నందినాటకోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాలు ప్రదర్శించిన పద్య నాటకాలు అలనాటి ఇతిహాస సుగంధాలను వెదజల్లాయి. స్వామి అయ్యప్ప, మైరావణ, భక్త మార్కండేయ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. నైతిక విలువలకు సంబంధించి చక్కని సందేశాలను అందించాయి.
అయ్యప్ప చరితను చాటిన స్వామి అయ్యప్ప నాటకం
శ్రీసర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన స్వామి అయ్యప్ప నాటకం స్వామి జన్మవృత్తాంతం, ఆయన అడవులకు వెళ్లడం, శబరిగిరిలో ఆలయం నిర్మాణం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహిషాసురుడిని దుర్గామాత సంహరించిన తర్వాత అతని సోదరి మహిషి తపస్సు చేసి హరిహరుల సంగమం వలన పుట్టిన వాడి చేతనే తాను మరణిస్తానని వరం పొందుతుంది.
విష్ణుదేవుడు, మోహినిని శివునికి ఇచ్చి వివాహం చేయడం, మోహిని, శివంశ సంఘమం వలన ధర్మశాస్త్రుడు అవతరించి మహిషిని సంహరిస్తాడు. కలియుగంలో రాజశేఖర, రాజ దంపతులకు పసిపాపగా ధర్మశాస్త్రుడు జన్మించి అయ్యప్ప, మణికంఠుడిగా మారుతాడు. అనంతరం ఆ దంపతులకు పుట్టిన మరో పుత్రుడు అయ్యప్పకు రాజపీఠానికి పోటీగా తయారవుతాడు. అయ్యప్ప తల్లి అతనిపై ధ్వేషంతో తన ఔషధం కోసం పులిపాలను తెమ్మని అడవులకు పంపుతుంది. తుదకు అయ్యప్ప మహిమాన్వితుడై దైవంగా మారుతాడు. నాటకాన్ని పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రచించగా బీఆర్ తీట్ల దర్శకత్వం వహించారు.
రామాయణ విశిష్టతను చాటిన మైరావణ నాటకం
శ్రీవినాయక నాటక కళా మండలి రేణిగుంట నాటక సమాజం ప్రదర్శించిన మైరావణ పద్య నాటకం రామాయణ గాథలోని విశిష్టతను చాటి చెప్పింది. రామరావణ యుద్ధంలో రావణ పరివారంలోని ముఖ్యులు గతించి పోయాక నారదుని సలహా మేరకు రావణుడు మైరావణుడిని సాయం కోరుతారు. మైరావుణుడు తన మంత్ర ప్రభావంతో రామలక్ష్మణులను భైరవీదేవికి బలి ఇవ్వాలని ఆలోచిస్తాడు. అయితే ఆంజనేయుడు రామలక్ష్మణులను కాపాడుకునే నేపథ్యంలో పాతాళలంక ముఖద్వారం దగ్గర మత్స్యవల్లభునితో యుద్ధం చేస్తాడు.
మత్స్య వల్లభుడు తన కుమారుడేనని నారదుడి ద్వారా తెలుసుకుంటాడు. ఆంజనయుడు, మైరావణుడు బంధించిన చంద్రసేన ద్వారా అతని జన్మరహస్యాన్ని సంపాదిస్తాడు. మైరావణుడి ప్రాణమున్న చిలుకను తెచ్చి వధించి ఆంజనేయుడు, రామలక్ష్మణులను కాపాడుకుంటాడు. సుంకర పండరిబాబు నాటకానికి దర్శకత్వం నిర్వహించారు.
మార్కండేయ చరితకు అద్దం పట్టిన భక్త మార్కండేయ..
మార్కండేయుని ఇతివృత్తాన్ని ఆసక్తికరమైనకథగా మలిచి చక్కని నాటకీయతతో ప్రదర్శించారు ఓరుగల్లు శారదానాట్య మండలి కళాకారులు. యమధర్మరాజు నారదుడితో 14 భువనములలో తనకు తిరుగులేదని ఎటువంటి జీవి అయినా తన లోకానికి వచ్చి తీరాల్సిందేనని అహంభావంతో పలికుతాడు. నారదుడు అతని గర్వాన్ని అణచడానికి ఒక వీరుడుని సృష్టించాలని సంకల్పిస్తారు. మ్రికండముని, మరుద్మతి దంపతులు చాలా కాలాంగా పిల్లలు లేక అష్టకష్టాలు పడుతుంటారు. నారదుడి ఉపదేశంతో వారు శివుని గూర్చి తపస్సు చేస్తారు.
శివుడు వారికి 16 ఏళ్లు ఆయుష్షు కలిగిన, గుణవంతుడైన మార్కండేయుడు అనే కుమారున్ని ప్రసాదిస్తాడు. మార్కండేయుడు గురుదేవుల దీవెనలతో జాబాలి విద్యను అభ్యసిస్తాడు. అయితే 16 ఏళ్లు ముగియగా, అతని ఆయష్షు అంతమవుతుందని తిరిగి ఆ దంపతులు బ్రహ్మదేవున్ని వేడుకుంటారు. బ్రహ్మ మార్కండేయునికి దీర్ఘాయుష్షు ప్రసాదిస్తాడు. మార్కండేయుడు యముని గర్వాన్ని అణచివేస్తాడు. శారదానాట్య మండలి (ఓరుగల్లు) అధ్యక్షుడు జేఎన్ శర్మ దర్శకత్వం వహించారు.
Advertisement
Advertisement