epics
-
అంతటి ఉదాత్తత పురాణ పురుషుల్లో ఉందా?
మన కావ్య పురాణాలని పరిశీలిస్తే ఉదాత్తమైన మన స్త్రీలతో పోల్చదగిన పురుషులున్నారా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన నడవడిక, చరిత్ర వారిది. కుంతీదేవి కూడా వారిలో ఒకరని చెప్పుకుంటున్నాం కదా... ఆమె చిన్నతనంలో కుంతిభోజుడి ఇంటికి దుర్వాసుల మహర్షి వచ్చారు. నేనిక్కడ కొన్ని నెలలపాటు ఉంటాను, నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినయినా ఏర్పాటు చేయమని అడిగాడు. ఆయన కోపధారి కనుక ఈ పనికి కుంతిభోజుడు తన పత్నులను నియోగించలేదు. దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు. ఆమె ఎంత ఓర్పుతో సేవించిందంటే... ఆయన వెళ్ళిపోతూ ఆమె సేవలకు సంతోషించి–‘‘నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను. నీవు ఏ దేవతని కోరుకుంటావో వారి అనుగ్రహం చేత నీవు సంతానాన్ని పొందుతావు’’ అన్నాడు. మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరమిచ్చాడో మహానుభావుడు !పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు. ఆయనకు కుంతి ఇల్లాలయింది. మహా సౌందర్యవతి. కర్ణుడి కథ చెప్పలేదు. పాండురాజుతో చాలా కాలం సంతోషంగా కాలం గడిపింది. ఎంత అందగత్తె అయినా స్త్రీకి జీవితంలో భరించలేని దుఃఖం ఏమిటంటే.. భర్త సవతిని తీసుకురావడం. ఇంతగా అభిమానించే భార్య ఉండగా మాద్రిని పెళ్ళిచేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అసూయ చెందలేదు. పరమ ప్రేమతో తోడబుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. ఒకసారి ముగ్గురూ శతశృంగ పర్వతం దగ్గర ఉండగా అనుకోని రీతిలో పాండురాజు జింకల రూపంలో క్రీడిస్తున్న మునిదంపతుల మీద బాణ ప్రయోగం చేసాడు. ‘నీవు నీ భార్యతో సంగమిస్తే మరణాన్ని పొందుతావు’’ అని ముని శాపమిచ్చాడు. సంతానం కలగలేదు. ఉన్నత గతులుండవని పాండురాజు బాధపడుతుండగా కుంతి తన వరం గురించి చెప్పింది. భర్త అనుమతితో దేవతను ప్రార్థన చేసింది. యమధర్మరాజు అనుగ్రహంగా ధర్మరాజును, వాయువు అనుగ్రహంగా భీముడిని, దేవేంద్రుడి అనుగ్రహంగా అర్జునుడిని కన్నది. ఆ సమయానికి గాంధారి గర్భిణీ గా ఉంది. అయినా ఆమెకన్నా ముందు సింహాసనానికి వారసులని కన్నది. సవతికి సంతానం లేదు. పాండురాజు తండ్రి కావడానికి వైదికంగా, ధార్మికంగా మార్గాన్ని కల్పించానని సంతోషించింది. కానీ ఆ సంతోషం కొద్ది సేపే. పాండురాజు పిలిచి ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు. వెంటనే మాద్రికి కూడా ఉపదేశించింది. అశ్వనీదేవతల అనుగ్రహం చేత మాద్రి నకుల, సహదేవులను కన్నది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని కోరి ప్రాణత్యాగం చేసాడు. ఆయనను విడిచి ఉండలేనని చెప్పి మాద్రి సహగమనం చేసి శరీరత్యాగం చేసింది. సవతి బిడ్డలని చూడకుండా, తన బిడ్డలకన్నా నకులసహదేవులను ఎక్కువగా ప్రేమించింది కుంతి. ఐదుగురికీ ద్రౌపదీదేవినిచ్చి వివాహం జరిపించింది. ఐదుగురూ కష్టాలూ దాటారు. రాజ్యాన్ని పొందారు..అనుకునేటప్పటికి జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో...ఇంట్లో ఉంటే దుర్యోధనుడు ఏం మాటలు అంటాడేమోనని విదురుడి ఇంట తలదాచుకుంది. కురుక్షేత్రం జరిగింది. అసలు క్షోభ ఆమెకు అప్పుడు మొదలయింది. -
గరుడుని సమయస్ఫూర్తి
ఒకరోజున ఇంద్రసభలో రకరకాల ఉత్పాతాలు ఎదురయ్యాయి. ‘‘ఏమైంది? ఏమిటి ఈ అపశకునాలు?’’ అడిగాడు ఇంద్రుడు దేవగురువుని ఆందోళనగా. ఆయన దివ్యదృష్టితో చూసి ‘‘తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ పుత్రులైన పాములు తమకి అమృతం కావాలన్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని తీసుకువెళ్లి తన తల్లిని దాస్యం నుంచి బయట పడేయాలని గరుడుడు వస్తున్నాడిక్కడికి. మహాబలుడు, వీరుడు అయిన గరుత్మంతుడు నీకు తమ్ముడైనా నువ్వు అతన్ని గెలవలేవు’’ అన్నాడు బృహస్పతి. గురువు మాటలతో అంతా అప్రత్తమయ్యారు. కవచాలూ, ఆయుధాలూ ధరించి, అమృత భాండం చుట్టూ రక్షక వలయంలా నిలిచారందరూ. అంతలో అక్కడకి రానే వచ్చాడు గరుత్మంతుడు. నేరుగా అమృత భాండం దగ్గరే వాలి దాన్ని అందుకోబోయాడు. రకరకాల ఆయుధాలతో అతనిమీద దాడి చేశారు రక్షకులు. గరుత్మంతుడు రెక్కలొక్కసారి బలంగా జాడించాడు. ఆ గాలి ఉధృతికి దేవసైన్యమంతా ఎండుటాకుల్లా ఎగిరి అల్లంతదూరాన పడ్డారు. గరుడుని మీదికి ఉరికిన అగ్ని, వాయు, యమ, కుబేర, వరుణాది దిక్పాలురు కూడా పక్షీంద్రుని పరాక్రమానికి తల వంచక తప్పలేదు. అదను చూసి అమృత కలశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు పక్షీంద్రుడు. అయితే భాండం చుట్టూ ఆకాశాన్నంటేలా మహాగ్ని కీలలు లేచాయి. రివ్వున వెళ్లి నదుల నీళ్ళన్నీ పుక్కిట బట్టి వచ్చి ఆ నీటిని ఆ అగ్ని మీద కుమ్మరించడంతో ఆరిపోయిందది. అంతలో అమృతం చుట్టూ తిరుగుతూ కత్తులు దూస్తున్నట్టుగా యంత్రచక్రం కనిపించడంతో గరుడుడు వెంటనే సూక్ష్మదేహం ధరించి చక్రం రేకుల్లోంచి దూరి లోపలకి ప్రవేశించాడు. భాండాన్ని చుట్టుకుని రెండు మహాసర్పాలు పడగ విప్పి, కోరలు సాచి పైకి లేచాయి. రెండు పాములమీదా చెరో పాదం వేసి వాటి శిరస్సులను కాళ్లతో నొక్కిపెట్టి, ముక్కుతో అమృతభాండాన్ని అందుకుని ఆకాశానికి ఎగిశాడు. ఇదంతా చూస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. పాములు అడిగినందుకు అమృతం తీసుకుని వెళ్తున్నాడు పక్షీంద్రుడు. రుచి చూద్దామన్న తలంపు కూడా లేదు. ఎంత బలవంతుడో అంతటి నీతిమంతుడితను అనుకున్నాడు విష్ణువు. వెంటనే అతని ముందు సాక్షాత్కరించాడు. ‘‘ఖగరాజా! నీ సాహసానికీ మెచ్చాను, నీకు ఓ వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో!’’ అన్నాడు విష్ణువు. కనులముందు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువుకు తలవంచి నమస్కరించాడు. ‘‘నిత్యం నీ సాన్నిధ్యం కంటే కావాల్సిందేమీ లేదు స్వామీ. కాకపోతే జరామరణాలు దుర్భరం కాబట్టి అవి లేకుండా అమరత్వం ప్రసాదించు స్వామీ’’ అడిగాడు సమయస్ఫూర్తితో గరుత్మంతుడు. మరింత సంతోషించాడు విష్ణువు. ‘‘నాకు వాహనంగానూ, నా రథానికీ పతాకం గానూ ఉండు గరుడా’’ అన్నాడు అనుగ్రహ పూర్వకంగా చూస్తూ.. ‘‘ధన్యుణ్ణి స్వామీ!’’ అంటూ కైమోడ్చాడు గరుత్మంతుడు. నీతి, నిజాయితీ, ధైర్యం, సాహసం, సమయస్ఫూర్తి అనేవి పెట్టని కవచాలు. అడగని వరాలు. ఆ పంచాయుధాలుంటే ఇక విజయమే! – డి.వి.ఆర్. భాస్కర్ -
మంచికి మంచి ఫలం...
ఆత్మీయం మనం చేసిన ప్రతిపనికీ ప్రతిఫలం ఉంటుంది. మంచిపని చేస్తే సత్ఫలం, చెడుపని చేస్తే దుష్ఫలం లభిస్తుందనే మాటా అక్షర సత్యమే. అందుకే జీవకోటిలోనివాడైన మనిషి తాను చేసిన, చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మల్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో సుకృతాల ఫలితంగా మానవజన్మ లభిస్తుంది. ఇక కర్మల విషయానికొస్తే... మనిషి చేసే కర్మలు మూడు రకాలు. అంటే గతంలో చేసినవీ, ప్రస్తుతం చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవి అన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలు ‘సంచిత’ కర్మలు. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ’ప్రారబ్ధ’ కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తాడు. అయితే అంతమాత్రాన చేసిన పాపం వూరకేపోదు కదా... దానికి తగిన ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే. రాబోయే కాలం కోసం మనిషి చేసే సత్కర్మలు ‘ఆగామి’ కర్మలు. అంటే ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు వంటివన్నమాట. మనిషికి ఇవి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. గత జన్మలూ, ఆగామి జన్మలూ ఉన్నాయని నమ్మినా, నమ్మకపోయినా నష్టం లేదు కానీ– మంచి పనులు చేయకుంటే మాత్రం అడుగడుగునా ఇక్కట్లు, ఇబ్బందులు ఎదురవుతాయనేది కాదనలేని కఠిన సత్యం. అందుకే ఎప్పుడూ మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి. -
పద్యనాటకాలు.. ఇతిహాస సుగంధాలు
కర్నూలు (కల్చరల్) : నందినాటకోత్సవాల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో వివిధ నాటక సమాజాలు ప్రదర్శించిన పద్య నాటకాలు అలనాటి ఇతిహాస సుగంధాలను వెదజల్లాయి. స్వామి అయ్యప్ప, మైరావణ, భక్త మార్కండేయ నాటకం ఆద్యంతం రసవత్తరంగా సాగాయి. నైతిక విలువలకు సంబంధించి చక్కని సందేశాలను అందించాయి. అయ్యప్ప చరితను చాటిన స్వామి అయ్యప్ప నాటకం శ్రీసర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ నాటక సమాజం ప్రదర్శించిన స్వామి అయ్యప్ప నాటకం స్వామి జన్మవృత్తాంతం, ఆయన అడవులకు వెళ్లడం, శబరిగిరిలో ఆలయం నిర్మాణం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహిషాసురుడిని దుర్గామాత సంహరించిన తర్వాత అతని సోదరి మహిషి తపస్సు చేసి హరిహరుల సంగమం వలన పుట్టిన వాడి చేతనే తాను మరణిస్తానని వరం పొందుతుంది. విష్ణుదేవుడు, మోహినిని శివునికి ఇచ్చి వివాహం చేయడం, మోహిని, శివంశ సంఘమం వలన ధర్మశాస్త్రుడు అవతరించి మహిషిని సంహరిస్తాడు. కలియుగంలో రాజశేఖర, రాజ దంపతులకు పసిపాపగా ధర్మశాస్త్రుడు జన్మించి అయ్యప్ప, మణికంఠుడిగా మారుతాడు. అనంతరం ఆ దంపతులకు పుట్టిన మరో పుత్రుడు అయ్యప్పకు రాజపీఠానికి పోటీగా తయారవుతాడు. అయ్యప్ప తల్లి అతనిపై ధ్వేషంతో తన ఔషధం కోసం పులిపాలను తెమ్మని అడవులకు పంపుతుంది. తుదకు అయ్యప్ప మహిమాన్వితుడై దైవంగా మారుతాడు. నాటకాన్ని పల్లేటి లక్ష్మీ కులశేఖర్ రచించగా బీఆర్ తీట్ల దర్శకత్వం వహించారు. రామాయణ విశిష్టతను చాటిన మైరావణ నాటకం శ్రీవినాయక నాటక కళా మండలి రేణిగుంట నాటక సమాజం ప్రదర్శించిన మైరావణ పద్య నాటకం రామాయణ గాథలోని విశిష్టతను చాటి చెప్పింది. రామరావణ యుద్ధంలో రావణ పరివారంలోని ముఖ్యులు గతించి పోయాక నారదుని సలహా మేరకు రావణుడు మైరావణుడిని సాయం కోరుతారు. మైరావుణుడు తన మంత్ర ప్రభావంతో రామలక్ష్మణులను భైరవీదేవికి బలి ఇవ్వాలని ఆలోచిస్తాడు. అయితే ఆంజనేయుడు రామలక్ష్మణులను కాపాడుకునే నేపథ్యంలో పాతాళలంక ముఖద్వారం దగ్గర మత్స్యవల్లభునితో యుద్ధం చేస్తాడు. మత్స్య వల్లభుడు తన కుమారుడేనని నారదుడి ద్వారా తెలుసుకుంటాడు. ఆంజనయుడు, మైరావణుడు బంధించిన చంద్రసేన ద్వారా అతని జన్మరహస్యాన్ని సంపాదిస్తాడు. మైరావణుడి ప్రాణమున్న చిలుకను తెచ్చి వధించి ఆంజనేయుడు, రామలక్ష్మణులను కాపాడుకుంటాడు. సుంకర పండరిబాబు నాటకానికి దర్శకత్వం నిర్వహించారు. మార్కండేయ చరితకు అద్దం పట్టిన భక్త మార్కండేయ.. మార్కండేయుని ఇతివృత్తాన్ని ఆసక్తికరమైనకథగా మలిచి చక్కని నాటకీయతతో ప్రదర్శించారు ఓరుగల్లు శారదానాట్య మండలి కళాకారులు. యమధర్మరాజు నారదుడితో 14 భువనములలో తనకు తిరుగులేదని ఎటువంటి జీవి అయినా తన లోకానికి వచ్చి తీరాల్సిందేనని అహంభావంతో పలికుతాడు. నారదుడు అతని గర్వాన్ని అణచడానికి ఒక వీరుడుని సృష్టించాలని సంకల్పిస్తారు. మ్రికండముని, మరుద్మతి దంపతులు చాలా కాలాంగా పిల్లలు లేక అష్టకష్టాలు పడుతుంటారు. నారదుడి ఉపదేశంతో వారు శివుని గూర్చి తపస్సు చేస్తారు. శివుడు వారికి 16 ఏళ్లు ఆయుష్షు కలిగిన, గుణవంతుడైన మార్కండేయుడు అనే కుమారున్ని ప్రసాదిస్తాడు. మార్కండేయుడు గురుదేవుల దీవెనలతో జాబాలి విద్యను అభ్యసిస్తాడు. అయితే 16 ఏళ్లు ముగియగా, అతని ఆయష్షు అంతమవుతుందని తిరిగి ఆ దంపతులు బ్రహ్మదేవున్ని వేడుకుంటారు. బ్రహ్మ మార్కండేయునికి దీర్ఘాయుష్షు ప్రసాదిస్తాడు. మార్కండేయుడు యముని గర్వాన్ని అణచివేస్తాడు. శారదానాట్య మండలి (ఓరుగల్లు) అధ్యక్షుడు జేఎన్ శర్మ దర్శకత్వం వహించారు. -
తెలుగు పంచకావ్యాల్లో చోటు దక్కని ప్రబంధం?
కావ్య ప్రక్రియలు - లక్షణాలు పురాణం పరమశివుని నిట్టూర్పు వల్ల వేదాలు, శివుడు స్మరించడం వల్ల పురాణాలు జనించాయని ఐతిహ్యం. వేదాలు సృష్టి పూర్వ రహస్యాలను, పురాణాలు సృష్టి అనంతర విషయాలను తెలియజేస్తాయి. పురాణం అంటే ప్రాచీనమైందని అర్థం. వేదవ్యాసుడు వేదాల సారాన్ని చక్కని కథలతో పురాణాలుగా రచించాడని ప్రతీతి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను పురాణాలు తెలియజేస్తాయి. ఈ పురాణ వాఙ్మయాన్ని ఆంగ్లంలో ‘మైథాలజీ’ అంటారు. పురాణాల్లోని కథలన్నీ ప్రతీకాత్మకాలే. అవి రమ్యంగా, ప్రాచీన మానవుని సుఖ దుఃఖాలను, ఉత్తాన పతనాలను తెలియ జేస్తాయని ఇరివెంటి కృష్ణమూర్తి పేర్కొన్నారు. పురాణం - నిర్వచనాలు: ‘పురాపినవమ్ ఫురాణమ్’ ‘పురాణీయతే ఇతి పురాణమ్’ ‘పురా అవ ఇతి పురాణమ్’ పురాణం - లక్షణాలు: పురాణ లక్షణాలను పరిశీలించి, అమరసింహుడు పురాణం పంచ లక్షణమ్ అని అమరకోశంలో కిందివిధంగా పేర్కొన్నాడు. ‘స్వర్గశ్చ ప్రతిసర్గశ్చవంశో మన్వంతరాణిచ వంశాను చరితం చేతి లక్షణానాంతు పంచకమ్’ పురాణం - పంచ లక్షణాలు: సర్గ: బ్రహ్మాండమ్ పుట్టు పూర్వోత్తరాలను తెలిపేది సర్గ. పతిసర్గ: కల్పాంతంలో జరిగే పునఃసృష్టిని వివరించేది ప్రతిసర్గ. వంశం: దేవతల, రాక్షసుల వంశకర్తల గురించి వివరించేది వంశం. మన్వంతరం: 14 మంది మనువుల పుట్టుక, వారి పాలన విశేషాలను వివరించేది మన్వంతరం. వంశానుచరితం: సూర్య, చంద్ర వంశాల్లో జన్మించిన రాజుల చరిత్రను తెలిపేది వంశానుచరితం. అష్టాదశ పురాణాల శ్లోకం ‘మద్వయంభద్వయం చైవ బత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణేని పృథక్ పృథక్’ లోకంలో అష్టాదశ పురాణాలున్నాయని ప్రతీతి. అష్టాదశ పురాణాలు వేదవ్యాసుని కలం నుంచి జాలువారాయి. సంస్కృతంలో 18 పురాణాలు, 18 ఉప పురాణాలు ఉన్నాయి. మార్కండేయ పురాణాన్ని మొదటిసారిగా సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. ఇది ప్రథమాంధ్ర మహాపురాణం. ఈ పురాణ కర్త మారన. పోతన మధురమైన శైలిలో భక్తి వర్ణనలతో శ్రీమద్భాగవత మహాపురాణాన్ని ఆంధ్రీకరించారు. పబంధయుగంలో వెలసిన పురాణం మత్స్య పురాణం (కర్త హరిభట్టు) వరాహపురాణాన్ని అనువదించిన జంటకవులు - నంది మల్లయ, ఘంట సింగన. గరుడ పురాణాన్ని అనువదించిన అష్టదిగ్గజ కవి పింగళి సూరన. పాల్కురికి సోమనాథుడు తెలుగులో స్వతంత్రంగా బసవ పురాణం గ్రంథాన్ని రచించాడు. ఎర్రన నృసింహ పురాణం అనే కావ్య రచనతో తెలుగులో ప్రబంధ రీతులను ప్రవేశపెట్టాడు. ఇతిహాసం ఇతిహాసం అంటే చరిత్ర అని అర్థం. ఈ విధంగా జరిగిందని చెప్పడం. చారిత్రకమైన ఇతివృత్తం కలది ఇతిహాసం. పూర్వకథ అనే అర్థం కూడా వస్తుంది. అమరసింహుడు తన అమరకోశంలో ‘ఇతిహాసం పురావృత్తమ్’ అని పేర్కొన్నాడు. వీటిని ఆంగ్లంలో ‘ఎపిక్’ అంటారు. ఇవి గ్రంథస్థం కాకముందు ఆశు రూపంలో ఉండేవి. ఇతిహాసాల్లో కథాకథనానికి ప్రాధాన్యం ఎక్కువ. తెలుగునాట కథాకథనానికి ఆద్యుడు నన్నయ. రామాయణ, మహాభారత కావ్యాలను ఇతిహాసాలు అంటారు. సూర్యవంశ చరిత్ర - రామాయణం చంద్రవంశ చరిత్ర - భారతం ఇతిహాసాలు రెండు రకాలు. అవి... 1. పరిక్రియ 2. పురాకల్పం ఏకనాయకాశ్రీతం ఉన్న ఇతిహాసాన్ని పరిక్రియ అంటారు. ఉదా: రామాయణం (రాముడు) బహు నాయకాశ్రీతం ఉన్న ఇతిహాసాన్ని పురాకల్పం అంటారు. ఉదా: మహాభారతం (పాండవులు, కౌరవులు) తెలుగులో తొలి ఇతిహాసం ఆంధ్ర మహాభారతం సంస్కృతంలో తొలి ఇతిహాసం రామాయణం. తమిళంలో కంబడు కంబరామాయణం రచించాడు. హిందీలో తులసీదాస్ రామచరిత మానస్ అనే పేరుతో రామాయణం రచించాడు. తెలుగులో భారతానికి పరిశిష్ట గ్రంథం ఎర్రన హరివంశం. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం. ఇది తొలి తెలుగు ద్విపద రామాయణం. దీని కర్త గోన బుద్ధారెడ్డి. తొలి తెలుగు చంపూ రామాయణం భాస్కర రామాయణం. తొలి తెలుగు సంగ్రహ (సంక్షిప్త) రామాయణం మొల్ల రామాయణం. కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం తెలుగులో రసవత్కావ్యంగా ప్రసిద్ధికెక్కింది. ఆధునిక యుగంలో అల్లంరాజు రంగశాయి కవి చంపూ భారతాన్ని, చంపూ రామాయణాన్ని రచించాడు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ శ్రీమద్రామాయణ కల్పవృక్షం రచించారు. దీనికి జ్ఞానపీఠ్ పురస్కారం పొందారు. ప్రబంధం ప్రకృష్టమైన బంధం ఉన్న రచనను ‘ప్రబంధం’ అంటారు. ఏదైనా పురాణేతిహాసాల నుంచి ఒక చిన్న కథను గ్రహించి, స్వకపోక కల్పనలతో స్వతంత్ర కావ్యం అన్నట్లుగా భాషింపజేయడాన్ని ప్రబంధం అంటారు. అష్టాదశ వర్ణనలున్న కావ్యాన్ని ప్రబంధం అంటారు. దీన్నే మహాకావ్యం అని కూడా పిలుస్తారు. లక్షణాలు: పురాణేతిహాసాల నుంచి కథను గ్రహించాలి. ఏకనాయకాశ్రయత్వం. వస్త్వైక్యం ఉండాలి. అష్టాదశ వర్ణనలు ఉండాలి. శృంగారం రసరాజంగా ఉండాలి. అలంకారికమైన శైలి ఉండాలి. సజీవ పాత్ర చిత్రణ ఉండాలి. అనువాదం కాకుండా, స్వతంత్ర రచన అన్నట్లు ఉండాలి. క్రీ.శ. 16వ శతాబ్ద కాలాన్ని తెలుగు సాహిత్య చరిత్రలో ప్రబంధ యుగం అంటారు. శ్రీ కృష్ణదేవరాయలు కాలంలో వెలువడిన కావ్యాలను ప్రబంధాలు అంటారు. రాయల యుగంలో వెలువడిన ప్రబంధాలతో 16వ శతాబ్దం స్వర్ణయుగంగా పరిఢవిల్లింది. తొలి తెలుగు సమగ్ర ప్రబంధం మను చరిత్ర. చిట్టచివరి ఉత్తమ ప్రబంధం విజయ విలాసం (చేమకూర వెంకటకవి) తెలుగులో వెలువడిన కల్పిత ప్రబంధం కళాపూర్ణోదయం. దీన్ని పద్య రూపంలో ఉన్న నవల అని పిలుస్తారు. శతకం శత్ అనే సంస్కృత ధాతువు నుంచి శతకం అనే పదం జనించింది. శత్ అంటే నూరు (వంద) అని అర్థం. నూరు పద్యాల రచనను శతకం అంటారు. కానీ తెలుగు లాక్షణికుల ప్రకారం నూరు పైచిలుకు పద్యాల రచనే శతకం. ఇవి నీతిని, లోక ధర్మాలను బోధిస్తాయి. నిర్వచనాలు: ‘శతేన శతకం ప్రోక్తం’ అని సంస్కృతంలో నియమం ఉంది. తెలుగులో నూరు, నూట ఎనిమిది, నూట పదహారు శ్లోకాలు/ పద్యాలతో కూడినవి కూడా శతకాలే. లక్షణాలు: సంస్కృత, ప్రాకృత శతకాల్లోని లక్షణాలే తెలుగు శతకాల్లోనూ రూపుదిద్దుకున్నాయని ప్రముఖ శతక సాహిత్య పరిశోధకుడు డాక్టర్ కె. గోపాలకృష్ణారావు అభిప్రాయపడ్డారు. శతకానికి కింది లక్షణాలుండాలని ఈయన తెలిపారు. 1. సంఖ్యా నియమం 2. మకుట నియమం 3. ఛందోనియమం 4. రస నియమం 5. ఆత్మాశ్రయ కవితా ధర్మం 6. ముక్తక లక్షణం (ప్రత్యేక భావం)