మన కావ్య పురాణాలని పరిశీలిస్తే ఉదాత్తమైన మన స్త్రీలతో పోల్చదగిన పురుషులున్నారా అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంతటి మహోన్నతమైన నడవడిక, చరిత్ర వారిది. కుంతీదేవి కూడా వారిలో ఒకరని చెప్పుకుంటున్నాం కదా... ఆమె చిన్నతనంలో కుంతిభోజుడి ఇంటికి దుర్వాసుల మహర్షి వచ్చారు. నేనిక్కడ కొన్ని నెలలపాటు ఉంటాను, నాకు ఉపచారాలు చేయడానికి ఎవరినయినా ఏర్పాటు చేయమని అడిగాడు. ఆయన కోపధారి కనుక ఈ పనికి కుంతిభోజుడు తన పత్నులను నియోగించలేదు. దత్తపుత్రిక కుంతీదేవిని నియమించాడు. ఆమె ఎంత ఓర్పుతో సేవించిందంటే... ఆయన వెళ్ళిపోతూ ఆమె సేవలకు సంతోషించి–‘‘నీకు నేను ఒక గొప్ప ఉపదేశం చేస్తున్నాను.
నీవు ఏ దేవతని కోరుకుంటావో వారి అనుగ్రహం చేత నీవు సంతానాన్ని పొందుతావు’’ అన్నాడు. మరి ఏ భవిష్యత్తుని దర్శనం చేసి వరమిచ్చాడో మహానుభావుడు !పాండురాజు ఆ రోజుల్లో అరివీర భయంకరుడు. ఆయనకు కుంతి ఇల్లాలయింది. మహా సౌందర్యవతి. కర్ణుడి కథ చెప్పలేదు. పాండురాజుతో చాలా కాలం సంతోషంగా కాలం గడిపింది. ఎంత అందగత్తె అయినా స్త్రీకి జీవితంలో భరించలేని దుఃఖం ఏమిటంటే.. భర్త సవతిని తీసుకురావడం. ఇంతగా అభిమానించే భార్య ఉండగా మాద్రిని పెళ్ళిచేసుకున్నాడు పాండురాజు. అయినా ఆమె అసూయ చెందలేదు. పరమ ప్రేమతో తోడబుట్టిన చెల్లెల్లా చూసింది మాద్రిని. ఒకసారి ముగ్గురూ శతశృంగ పర్వతం దగ్గర ఉండగా అనుకోని రీతిలో పాండురాజు జింకల రూపంలో క్రీడిస్తున్న మునిదంపతుల మీద బాణ ప్రయోగం చేసాడు.
‘నీవు నీ భార్యతో సంగమిస్తే మరణాన్ని పొందుతావు’’ అని ముని శాపమిచ్చాడు. సంతానం కలగలేదు. ఉన్నత గతులుండవని పాండురాజు బాధపడుతుండగా కుంతి తన వరం గురించి చెప్పింది. భర్త అనుమతితో దేవతను ప్రార్థన చేసింది. యమధర్మరాజు అనుగ్రహంగా ధర్మరాజును, వాయువు అనుగ్రహంగా భీముడిని, దేవేంద్రుడి అనుగ్రహంగా అర్జునుడిని కన్నది. ఆ సమయానికి గాంధారి గర్భిణీ గా ఉంది. అయినా ఆమెకన్నా ముందు సింహాసనానికి వారసులని కన్నది. సవతికి సంతానం లేదు. పాండురాజు తండ్రి కావడానికి వైదికంగా, ధార్మికంగా మార్గాన్ని కల్పించానని సంతోషించింది. కానీ ఆ సంతోషం కొద్ది సేపే. పాండురాజు పిలిచి ఆ మంత్రం మాద్రికి కూడా చెప్పమన్నాడు.
వెంటనే మాద్రికి కూడా ఉపదేశించింది. అశ్వనీదేవతల అనుగ్రహం చేత మాద్రి నకుల, సహదేవులను కన్నది. పాండురాజు సహజ చాపల్యం చేత నిగ్రహించుకోలేక మాద్రితో కామసుఖాన్ని కోరి ప్రాణత్యాగం చేసాడు. ఆయనను విడిచి ఉండలేనని చెప్పి మాద్రి సహగమనం చేసి శరీరత్యాగం చేసింది. సవతి బిడ్డలని చూడకుండా, తన బిడ్డలకన్నా నకులసహదేవులను ఎక్కువగా ప్రేమించింది కుంతి. ఐదుగురికీ ద్రౌపదీదేవినిచ్చి వివాహం జరిపించింది. ఐదుగురూ కష్టాలూ దాటారు. రాజ్యాన్ని పొందారు..అనుకునేటప్పటికి జూదమాడి ధర్మరాజు మళ్ళీ రాజ్యాన్ని పోగొట్టుకుని అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధపడిందో...ఇంట్లో ఉంటే దుర్యోధనుడు ఏం మాటలు అంటాడేమోనని విదురుడి ఇంట తలదాచుకుంది. కురుక్షేత్రం జరిగింది. అసలు క్షోభ ఆమెకు అప్పుడు మొదలయింది.
Comments
Please login to add a commentAdd a comment