మంచికి మంచి ఫలం...
ఆత్మీయం
మనం చేసిన ప్రతిపనికీ ప్రతిఫలం ఉంటుంది. మంచిపని చేస్తే సత్ఫలం, చెడుపని చేస్తే దుష్ఫలం లభిస్తుందనే మాటా అక్షర సత్యమే. అందుకే జీవకోటిలోనివాడైన మనిషి తాను చేసిన, చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మల్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో సుకృతాల ఫలితంగా మానవజన్మ లభిస్తుంది. ఇక కర్మల విషయానికొస్తే... మనిషి చేసే కర్మలు మూడు రకాలు. అంటే గతంలో చేసినవీ, ప్రస్తుతం చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవి అన్నమాట.
మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలు ‘సంచిత’ కర్మలు. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ’ప్రారబ్ధ’ కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తాడు. అయితే అంతమాత్రాన చేసిన పాపం వూరకేపోదు కదా... దానికి తగిన ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే.
రాబోయే కాలం కోసం మనిషి చేసే సత్కర్మలు ‘ఆగామి’ కర్మలు. అంటే ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు వంటివన్నమాట. మనిషికి ఇవి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. గత జన్మలూ, ఆగామి జన్మలూ ఉన్నాయని నమ్మినా, నమ్మకపోయినా నష్టం లేదు కానీ– మంచి పనులు చేయకుంటే మాత్రం అడుగడుగునా ఇక్కట్లు, ఇబ్బందులు ఎదురవుతాయనేది కాదనలేని కఠిన సత్యం. అందుకే ఎప్పుడూ మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి.