Consideration
-
మైనింగ్‌పై కూటమి పిడుగు
కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయిన పరిశ్రమపై మళ్లీ కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పెండింగ్‌లో ఉన్న కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం మైనింగ్ యజమానులు బందార్లపల్లె క్రాస్ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్టు వద్ద నిరసనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆన్లైన్లో ఆదేశించడంతో మైనింగ్ యజమానులు షాక్ గురయ్యారు. ఒక్కో లీజుదారుడు రూ.20 లక్షలు మొదలుకొని రూ.60 లక్షల వరకు చెల్లించాలని ఆన్లైన్లో చూపిస్తుండటంతో కంగుతిన్నారు. గతంలో రాయల్టీలు (పర్మిట్లు) తీసుకున్న వారంతా బల్క్‌గా కేటాయించిన అమౌంట్‌ను 2025 జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్‌లైన్ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కన్సిడరేషన్ మొత్తాన్ని బల్క్‌గా కాకుండా ప్రతి పర్మిట్‌పై వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది.మైనింగ్ లీజుదారులు ఆన్లైన్లో రాయల్టీ పొందాలంటే డీఎంఎఫ్తో కలిసి రూ.482 చెల్లించేవారు. ఇకపై ప్రతి రాయల్టీపై కన్సిడరేషన్ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రాయల్టీపై యజమానులకు అదనపు భారం పడనుంది. లక్షలాది రూపాయలు జరిమానా రూపంలో డెడ్‌లైన్ విధించి మరీ చెల్లించాలనడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు 1,150 హెక్టార్లలో మైనింగ్ జరుగుతుండగా.. 600 మందికిపై లీజుదారులు ఉన్నారు. ఈసీ, మైనింగ్ ప్లానింగ్ తదితర రికార్డులు ఉన్న లీజుదారులకు మాత్రమే రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్లైన్ రాయల్టీలు విడుదల చేయకపోవడంతో చాలామంది యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఆందోళనతో స్తంభించిన రవాణారాయల్టీ చెక్‌పోస్టు వద్ద మైనింగ్ యజమానులు ఆందోళనతో నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు రాయల్టీ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని మైనింగ్ యజమానులతో చర్చించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొసమెరుపు. -
మంచికి మంచి ఫలం...
ఆత్మీయం మనం చేసిన ప్రతిపనికీ ప్రతిఫలం ఉంటుంది. మంచిపని చేస్తే సత్ఫలం, చెడుపని చేస్తే దుష్ఫలం లభిస్తుందనే మాటా అక్షర సత్యమే. అందుకే జీవకోటిలోనివాడైన మనిషి తాను చేసిన, చేస్తున్న పుణ్యపాపాలకు అనుగుణంగా మనిషిగా, జంతువుగా, కీటకంగా, చెట్టుగా ఇంకా ఎన్నెన్నో రూపాల్లో జన్మల్ని పొందుతాడని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో సుకృతాల ఫలితంగా మానవజన్మ లభిస్తుంది. ఇక కర్మల విషయానికొస్తే... మనిషి చేసే కర్మలు మూడు రకాలు. అంటే గతంలో చేసినవీ, ప్రస్తుతం చేస్తున్నవీ, రాబోయే కాలాల కోసం చేసేవి అన్నమాట. మనిషి గతంలో చేసిన పుణ్యపాపాలు ‘సంచిత’ కర్మలు. చేసిన పాపాలుగానీ, పుణ్యాలుగానీ పక్వమై అనుభవించడానికి సిద్ధంగా ఉంటే అవి ’ప్రారబ్ధ’ కర్మలు. పుణ్యం చేయడం, పాపం చేయడం అనేవి మనిషి విచక్షణకు సంబంధించిన అంశాలు. ఒక్కొక్కసారి మనిషి చెడుపనులను చేసి, ఆ తరవాత జ్ఞానోదయమై చేసిన తప్పును సరిదిద్దుకోవాలని చూస్తాడు. అయితే అంతమాత్రాన చేసిన పాపం వూరకేపోదు కదా... దానికి తగిన ఫలాన్ని అనుభవించవలసిందే. ఇదే ప్రారబ్ధం అంటే. రాబోయే కాలం కోసం మనిషి చేసే సత్కర్మలు ‘ఆగామి’ కర్మలు. అంటే ఇతరులకు చేసే దానధర్మాలు, ఉపకారాలు, త్యాగాలు వంటివన్నమాట. మనిషికి ఇవి ఆగామికాలంలో ఉపయోగపడతాయి. గత జన్మలూ, ఆగామి జన్మలూ ఉన్నాయని నమ్మినా, నమ్మకపోయినా నష్టం లేదు కానీ– మంచి పనులు చేయకుంటే మాత్రం అడుగడుగునా ఇక్కట్లు, ఇబ్బందులు ఎదురవుతాయనేది కాదనలేని కఠిన సత్యం. అందుకే ఎప్పుడూ మంచినే భావించాలి. మంచినే భాషించాలి. మంచినే ఆచరించాలి. మంచినే అనుసరించాలి.