మైనింగ్‌పై కూటమి పిడుగు | Protest at Royalty Checkpoint against governments attitude | Sakshi
Sakshi News home page

మైనింగ్‌పై కూటమి పిడుగు

Published Wed, Dec 18 2024 4:10 AM | Last Updated on Wed, Dec 18 2024 4:10 AM

Protest at Royalty Checkpoint against governments attitude

కన్సిడరేషన్‌ ఫీజు బకాయిలు చెల్లించాలని ఆదేశం

లేదంటే పర్మిట్లు రద్దు చేస్తామని హెచ్చరిక

బకాయిలు రూ.లక్షల్లో ఉండటంతో యజమానుల ఆందోళన

ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాయల్టీ చెక్‌పోస్టు వద్ద ధర్నా

సొంత ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా టీడీపీ నేతల నినాదాలు

కొలిమిగుండ్ల: నాపరాతి గనుల యజమానులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకు­పోయిన పరిశ్రమపై మళ్లీ కూటమి ప్రభుత్వం మరో బాదుడుకు రంగం సిద్ధం చేసింది. పెండింగ్‌లో ఉన్న కన్సిడరేషన్‌ ఫీజు బకాయిలు చెల్లించాలని లీజుదారులకు ఆదేశాలు అందాయి. దీంతో మంగళవారం మైనింగ్‌ యజమానులు బందార్ల­పల్లె క్రాస్‌ రోడ్డులోని రాయల్టీ చెక్‌పోస్టు వద్ద నిర­సనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భూగర్భ గనుల శాఖ అధికారులు కన్సిడరేషన్‌ ఫీజు బకా­యిలు చెల్లించాలని ఆన్‌లైన్‌లో ఆదేశించడంతో మైనింగ్‌ యజమానులు షాక్‌ గురయ్యారు. 

ఒక్కో లీజుదారుడు రూ.20 లక్షలు మొదలుకొని రూ.60 లక్షల వరకు చెల్లించాలని ఆన్‌లైన్‌లో చూపిస్తుండటంతో కంగుతిన్నారు. గతంలో రాయల్టీలు (పర్మిట్లు) తీసుకున్న వారంతా బల్క్‌గా కేటాయించిన అమౌంట్‌ను 2025 జనవరి 10వ తేదీలోగా చెల్లించాలని డెడ్‌లైన్‌ విధించారు. లేదంటే పర్మిట్లు రద్దవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై కన్సిడరేషన్‌ మొత్తాన్ని బల్క్‌గా కాకుండా ప్రతి పర్మిట్‌పై వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది.

మైనింగ్‌ లీజుదారులు ఆన్‌లైన్‌లో రాయల్టీ పొందాలంటే డీఎంఎఫ్‌తో కలిసి రూ.482 చెల్లించేవారు. ఇకపై ప్రతి రాయల్టీపై కన్సిడరేషన్‌ మొత్తాన్ని సైతం చెల్లించాల్సి వస్తోంది. అంటే రాయల్టీపై యజమానులకు అదనపు భారం పడ­నుంది. లక్షలాది రూపాయలు జరిమానా రూపంలో డెడ్‌లైన్‌ విధించి మరీ చెల్లించాలనడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడు­తున్నారు. 

బనగానపల్లె నియోజకవర్గంలో దాదాపు 1,150 హెక్టార్లలో మైనింగ్‌ జరుగుతుండగా.. 600 మందికిపై లీజుదారులు ఉన్నారు. ఈసీ, మైనింగ్‌ ప్లానింగ్‌ తదితర రికార్డులు ఉన్న లీజుదారులకు మాత్రమే రాయల్టీలు వస్తున్నాయి. మిగిలిన లీజుదారులకు కూటమి ప్రభుత్వం దాదాపు 3 నెలల నుంచి ఆన్‌లైన్‌ రాయల్టీలు విడుదల చేయకపోవడంతో చాలామంది యజమా­నులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆందోళనతో స్తంభించిన రవాణా
రాయల్టీ చెక్‌పోస్టు వద్ద మైనింగ్‌ యజమానులు ఆందోళనతో నాపరాళ్లను రవాణా చేసే ట్రాక్టర్లు, లారీలతో పాటు ఆర్టీసీ బస్సులు, కార్లు ఇతర వాహనాలు ఇరువైపులా భారీగా నిలిచిపోయాయి. గంటన్నర పాటు ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. 

విషయం తెలుసుకున్న సీఐ రమేష్‌బాబు రాయల్టీ చెక్‌పోస్టు వద్దకు చేరుకుని మైనింగ్‌ యజమానులతో చర్చించి నిలిచిపోయిన వాహనాలను పంపించారు. ధర్నాలో టీడీపీ నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం కొసమెరుపు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement