ఒకరోజున ఇంద్రసభలో రకరకాల ఉత్పాతాలు ఎదురయ్యాయి.
‘‘ఏమైంది? ఏమిటి ఈ అపశకునాలు?’’ అడిగాడు ఇంద్రుడు దేవగురువుని ఆందోళనగా. ఆయన దివ్యదృష్టితో చూసి ‘‘తల్లి దాస్య విముక్తి కోసం కద్రువ పుత్రులైన పాములు తమకి అమృతం కావాలన్నారు. ఎలాగైనా సరే అమృతాన్ని తీసుకువెళ్లి తన తల్లిని దాస్యం నుంచి బయట పడేయాలని గరుడుడు వస్తున్నాడిక్కడికి. మహాబలుడు, వీరుడు అయిన గరుత్మంతుడు నీకు తమ్ముడైనా నువ్వు అతన్ని గెలవలేవు’’ అన్నాడు బృహస్పతి.
గురువు మాటలతో అంతా అప్రత్తమయ్యారు. కవచాలూ, ఆయుధాలూ ధరించి, అమృత భాండం చుట్టూ రక్షక వలయంలా నిలిచారందరూ. అంతలో అక్కడకి రానే వచ్చాడు గరుత్మంతుడు. నేరుగా అమృత భాండం దగ్గరే వాలి దాన్ని అందుకోబోయాడు. రకరకాల ఆయుధాలతో అతనిమీద దాడి చేశారు రక్షకులు. గరుత్మంతుడు రెక్కలొక్కసారి బలంగా జాడించాడు. ఆ గాలి ఉధృతికి దేవసైన్యమంతా ఎండుటాకుల్లా ఎగిరి అల్లంతదూరాన పడ్డారు. గరుడుని మీదికి ఉరికిన అగ్ని, వాయు, యమ, కుబేర, వరుణాది దిక్పాలురు కూడా పక్షీంద్రుని పరాక్రమానికి తల వంచక తప్పలేదు. అదను చూసి అమృత కలశాన్ని అందుకునేందుకు ప్రయత్నించాడు పక్షీంద్రుడు.
అయితే భాండం చుట్టూ ఆకాశాన్నంటేలా మహాగ్ని కీలలు లేచాయి. రివ్వున వెళ్లి నదుల నీళ్ళన్నీ పుక్కిట బట్టి వచ్చి ఆ నీటిని ఆ అగ్ని మీద కుమ్మరించడంతో ఆరిపోయిందది. అంతలో అమృతం చుట్టూ తిరుగుతూ కత్తులు దూస్తున్నట్టుగా యంత్రచక్రం కనిపించడంతో గరుడుడు వెంటనే సూక్ష్మదేహం ధరించి చక్రం రేకుల్లోంచి దూరి లోపలకి ప్రవేశించాడు. భాండాన్ని చుట్టుకుని రెండు మహాసర్పాలు పడగ విప్పి, కోరలు సాచి పైకి లేచాయి. రెండు పాములమీదా చెరో పాదం వేసి వాటి శిరస్సులను కాళ్లతో నొక్కిపెట్టి, ముక్కుతో అమృతభాండాన్ని అందుకుని ఆకాశానికి ఎగిశాడు.
ఇదంతా చూస్తూనే ఉన్నాడు శ్రీ మహావిష్ణువు. పాములు అడిగినందుకు అమృతం తీసుకుని వెళ్తున్నాడు పక్షీంద్రుడు. రుచి చూద్దామన్న తలంపు కూడా లేదు. ఎంత బలవంతుడో అంతటి నీతిమంతుడితను అనుకున్నాడు విష్ణువు. వెంటనే అతని ముందు సాక్షాత్కరించాడు.
‘‘ఖగరాజా! నీ సాహసానికీ మెచ్చాను, నీకు ఓ వరం ఇవ్వాలనుకుంటున్నాను, కోరుకో!’’ అన్నాడు విష్ణువు. కనులముందు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువుకు తలవంచి నమస్కరించాడు. ‘‘నిత్యం నీ సాన్నిధ్యం కంటే కావాల్సిందేమీ లేదు స్వామీ. కాకపోతే జరామరణాలు దుర్భరం కాబట్టి అవి లేకుండా అమరత్వం ప్రసాదించు స్వామీ’’ అడిగాడు సమయస్ఫూర్తితో గరుత్మంతుడు. మరింత సంతోషించాడు విష్ణువు. ‘‘నాకు వాహనంగానూ, నా రథానికీ పతాకం గానూ ఉండు గరుడా’’ అన్నాడు అనుగ్రహ పూర్వకంగా చూస్తూ..
‘‘ధన్యుణ్ణి స్వామీ!’’ అంటూ కైమోడ్చాడు గరుత్మంతుడు. నీతి, నిజాయితీ, ధైర్యం, సాహసం, సమయస్ఫూర్తి అనేవి పెట్టని కవచాలు. అడగని వరాలు. ఆ పంచాయుధాలుంటే ఇక విజయమే!
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment