సత్య సంధత..భక్తి పరాయణత
- అలరించిన పౌరాణిక నాటకాలు
కర్నూలు (కల్చరల్): నందినాటకోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రదర్శించిన పౌరాణిక పద్య నాటకాలు భారతీయ ఇతిహాసాలలోని ఉన్నత విలువలను చాటి చెప్పాయి. వంశీ కళాక్షేత్రం తిరుపతి నాటక సమాజం ప్రదర్శించిన ‘రావణ బ్రహ్మ’, వేణుగోపాల స్వామి నాట్యమండలి వరంగల్ నాటక సమాజం వారు ప్రదర్శించిన సత్యహరిశ్చంద్ర, మైత్రీ కళాపరిషత్ మహబూబ్‌నగర్ నాటక సమాజం వారు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణాంజనేయ యుద్ధం’ నాటకాలు, రామాయణ భారత గాథలలోని ఔన్యత్యాన్నికి ప్రతీకగా నిలిచాయి.
ఆకట్టుకున్న ‘రావణబ్రహ్మ’
బ్రహ్మ వంశానికి చెందిన దశగ్రీవుడు అసురజాతిలో పుట్టి తపస్సు చేసి పరమేశ్వరున్ని మెప్పించి అఖండమైన వరుములు పొంది రావణబ్రహ్మగా గుర్తింపు పొందారు. అసురజాతిలో అత్యంత పరాక్రమవంతుడుగానే కాకుండా ఆధ్యాత్మిక సేవాతత్వం కలిగిన రాజుగా రావణబ్రహ్మ గణుతికెక్కాడు. నిత్యం శివలింగార్చన చేసి లంకను స్వాధీనం చేసుకొని అత్యంత అహంభావంతో మెలిగిన రావణుని చరితను ‘రావణబ్రహ్మ’ నాటకం కళ్లకు కట్టినట్లు చిత్రించింది. రాధాదేవి రచించిన ఈ నాటకంలో పల్లేటిలక్ష్మి కులశేఖర్ అత్యంత హృద్యమైన పద్యాలను రచించారు. జీఎల్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆసక్తికరంగా ‘సత్యహరిశ్చంద్ర’
సూర్యవంశపు రాజైన హరిశ్చంద్రుడు క్రమశిక్షణాబద్ధమైన జీవన శైలికి ప్రతీకగా నిలిచాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం, తన జీవిత కాలంలో ఎన్నడూ అబద్ధమాడి ఎరుగకపోవడం హరిశ్చంద్రుని ఉత్తమ గుణాలు. ఈ పాత్రలోని సత్యసంధతను హరిశ్చంద్ర నాటకం చక్కగా చాటి చెప్పింది. విశ్వామిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం సత్యహరిశ్చంద్రుడు కట్టుబట్టలతో అడవులకేగడం, కాటి కాపరిగా మారడం, కొడుకు శవాన్ని వల్లకాడులోకి అనుమతించడానికి సుంకం అడగడం నిష్టాగరిష్టమైన గుణాలను ఈ పాత్రలో దర్శకుడు చక్కగా చూపించాడు. వరంగల్ జిల్లా వేణుగోపాలస్వామి నాట్య మండలి కళాకారులు ప్రదర్శించిన ఈ నాటకం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. శ్రీనివాసాచారి దర్శకత్వం వహించిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
హాస్య సన్నివేశాలతో ‘కృష్ణాంజనేయ యుద్ధం’
మహబూబ్‌నగర్ జిల్లా మైత్రీ కళా పరిషత్ కళాకారులు ప్రదర్శించిన కృష్ణాంజనేయ యుద్ధం నాటకం చక్కని హాస్యసన్నివేశాలతో అలరించింది. బలరాముడు, సత్యభామ, గరుత్మండుల గర్వభంగమే ఈ నాటి ప్రధాన సారాంశం. ఈ ముగ్గురి గర్వభంగం చేయడం కోసం శ్రీకృష్ణుడు ఆంజనేయున్ని పురమాయించడం, ఆంజనేయుడు, కృష్ణుడు మధ్యలో రసవత్తరమైన యుద్ధం జరగడం ఈ నాటకంలో ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. చక్కని వ్యవహార శైలిలో హాస్య సంభాషణలతో సాగిన ఈ నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాండ్ర సుబ్రమణ్యం రచించిన ఈ నాటకానికి జగన్నాథరావు దర్శకత్వం వహించారు.