రూపాంతరం..అపురూపం
రూపాంతరం..అపురూపం
Published Sat, Jan 21 2017 10:14 PM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM
నందినాటకోత్సవాల్లో
నాల్గో రోజు రెండు నాటికల ప్రదర్శన
కర్నూలు(కల్చరల్): నంది నాటకోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శనివారం.. స్థానిక టీజీవి కళాక్షేత్రంలో బాల కళాకారులు ప్రదర్శించిన నాటికలు పసి మనసులను హృద్యంగా ఆవిష్కరించాయి. నంద్యాల కళారాధన, గురు రాజా కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘అపురూపం’ నాటిక పసి మనసుల్లో సహజసిద్ధమైన ప్రేమను చాటిచెప్పింది. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పిల్లల మనసుల్లో దాగివుండే ప్రేమానురాగాలకు ఈ నాటిక అద్దం పట్టింది. అనాథలైన పిల్లలు ఒకచోట చేరి జీవిస్తుండగా శ్రీను అనే బాలుడికి తీవ్రమైన అనారోగ్యం కల్గుతుంది. అనారోగ్య కారణాలు కూడా తెలుసుకోలేని పసివయస్సులో ఉన్న పిల్లలు ఆ బాలుడికి అత్యంత ఇష్టమైన బొమ్మలను తీసుకువచ్చి అతడిని అనునిత్యం ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నాన్ని గమనించిన పెద్దలు సైతం ఆ బాలుడికి సహాయపడేందుకు ముందుకు వస్తారు. పరులకు సహాయం చేయాలనే అపురూపమైన భావనకు ప్రేరణ కల్గించిన బాలలు పెద్దలకు ఆదర్శంగా నిలువడమే ఈ నాటికలోని ఇతివృత్తం. ఆకెళ్ల శివప్రసాద్ రచించిన ఈ నాటికకు డాక్టర్ జి.రవికృష్ణ దర్శకత్వం వహించారు. ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్ పర్యవేక్షణలో ఈ నాటికను ప్రదర్శించారు.
నేటితరం స్థితిగతులను చాటిచెప్పిన ‘రూపాంతరం’...
స్వర్ణాంధ్ర కల్చరల్ అసోసియేషన్ నందలూరు (వైఎస్సార్ జిల్లా) నాటక సమాజం కళాకారులు ప్రదర్శించిన ‘రూపాంతరం’ నాటిక ప్రస్తుత తరం యువతీయువకుల స్థితిగతులను చాటిచెప్పింది. గర్భంలో శిశువు ఉన్నప్పటినుంచి తల్లి ఎన్నో ఆశలను పెంచుకుంటుంది. తన బిడ్డ ప్రయోజకుడై కీర్తిప్రతిష్టలు సంపాదించిపెడతాడని కలలు కంటుంది. కానీ పుట్టిన బిడ్డ యవ్వన వయస్సులో క్రికెట్ బెట్టింగులు, అమ్మాయిల టీజింగ్‌లు, ఇంటర్నెట్ వ్యామోహంలో పడి అప్రయోజకుడిగా మారి శిక్షార్హుడిగా తయారైతే ఆ తల్లి పడే క్షోభ ఎలా ఉంటుందో నాటిక దృశ్యరూపంలో చూపించింది. దారి తప్పిన పిల్లలు మళ్లీ రూపాంతరం చెంది ఉత్తమ పౌరులుగా ఎదగాలనే సందేశాన్ని ఈ నాటిక అందించింది. చిలువూరు నాగేశ్వరరావు రచించిన ఈ నాటికకు హెచ్.ఆనందకుమార్ దర్శకత్వం వహించారు. వేపగుంట సామ్రాట్ పర్యవేక్షణలో ఈ నాటికను ప్రదర్శించారు.
నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి నాటికల ప్రదర్శనలు...
నంది నాటకోత్సవాల్లో భాగంగా ఐదో రోజున ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బాలల నాటికల ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు బంగారుకొండ అనే నాటిక, 3 గంటలకు ‘పసిమొగ్గలు’ అనే నాటికను, 6:30 గంటలకు ‘వృక్షోరక్షతి రక్షితః’ అనే నాటికను ప్రదర్శిస్తారు. శనివారం జరిగిన నాటిక ప్రదర్శనలో నంది నాటకోత్సవాల కన్వీనర్ కర్నూలు ఆర్‌డీఓ రఘుబాబు, ఎఫ్‌డీసీ మేనేజర్ శ్రీనివాస్, లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement