పర్యావరణం అనేది యూత్‌కు పట్టని మాట... అనేది తప్పని ‘యూ కెన్’లో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నయువతరం నిరూపిస్తోంది. మహా పట్టణాల నుంచి మారుమూల పల్లెలకు తిరుగుతూ పర్యావరణ సందేశాన్ని మోసుకెళుతుంది...
మధ్యప్రదేశ్‌లోని పిపరియ అనే టౌన్‌లోని ప్రభుత్వ పాఠశాలకు ప్రతి శనివారం తప్పనిసరిగా వస్తుంది 27 సంవత్సరాల లహరి.
‘అక్కయ్య వచ్చేసింది’ అంటూ పిల్లలు చుట్టుముడతారు.
అందరిని పలకరించి తాను చెప్పదలుచుకున్న విషయాలను చెబుతుంది. పిల్లలందరూ నిశ్శబ్దంగా వింటారు. సందేహాలు అడిగి తీర్చుకుంటారు. ఆ తరువాత లహరితో కలిసి ప్రకృతిని పలకరించడానికి వెళతారు.
‘ఈ చెట్టు పేరు మీకు తెలుసా?’
‘అదిగో ఆ కీటకం పేరు ఏమిటి?’
... ఇలా ఎన్నో అడుగుతూ వాటికి సవివరమైన సమాధానాలు చెబుతుంది లహరి.
ముచ్చట్లు, కథలు, నవ్వుల రూపంలో పర్యావరణానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను లహరి ద్వారా నేర్చుకుంటారు పిల్లలు.
‘మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలను కొన్ని ప్రశ్నలు అడిగాను. మౌనమే వారి సమాధానం అయింది. ఇప్పుడు వారిలో ఎంతో మార్పు వచ్చినందుకు సంతోషంగా ఉంది. తమ చుట్టూ ఉన్న మొక్కలు, చెట్ల పేర్లు చెప్పడంతో సహా వాటి ఉపయోగాలు కూడా చెప్పగలుగుతున్నారు’ అంటుంది లహరి.
యూత్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్‌వర్క్(యూ కెన్) వేదికగా మధ్యప్రదేశ్‌లోనే కాదు దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లో లహరిలాంటి వారు పల్లెలు, పట్ణణాలు, కొండలు, కోనలు అనే తేడా లేకుండా విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచుతున్నారు.
‘పిల్లల్లో కలిసిపోయి వారిని నవ్విస్తూనే నాలుగు మంచి విషయాలు చెప్పగలిగే వారిని తయారు చేయాలనుకున్నాం’ అంటున్న రామ్‌నాథ్ చంద్రశేఖర్, వైల్డ్‌లైఫ్ ఫిల్మ్‌మేకర్, ఫొటోగ్రాఫర్, కన్జర్వేషన్ ఎడ్యుకేటర్ రచిత సిన్హాతో కలిసి యూత్ కన్జర్వేషన్ యాక్షన్ నెట్‌వర్క్ (యూ కెన్) అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు.
దేశంలోని పన్నెండు రాష్ట్రాల నుంచి 20 మంది యువతీ యువకులను ‘యూ కెన్’ కోసం ఇంటర్వ్యూలు, వీడియో ఇంటరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఝార్ఖండ్‌కు చెందిన రచిత సిన్హా పచ్చటి ప్రకృతితో చెలిమి చేస్తూ పెరిగింది. ‘మా చిన్నప్పుడు ఎన్ని చెట్లు ఉండేవో తెలుసా, ఎన్ని పక్షులు ఉండేవో తెలుసా!’ అంటూ తల్లిదండ్రులు చెప్పిన విషయాలను వింటూ పెరిగింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసిన రచిత ఆ తరువాత ‘యూ కెన్’పై పూర్తిగా దృష్టి పెట్టింది. (క్లిక్: కూరగాయలు, పండ్ల నిల్వలో విప్లవం.. 2 నెలల వరకు చెక్కు చెదరవు!)
‘లాభాపేక్షతో సంబంధం లేకుండా ఒక మంచిపని కోసం సమయాన్ని వెచ్చించేవారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి యువతరానికి యూ కెన్ మంచి వేదిక అవుతుంది. దీనికోసం పెద్ద డిగ్రీలు అక్కర్లేదు. పర్యావరణ ప్రేమ, నాలుగు మంచి విషయాలు పిల్లలకు చెప్పగలిగే నైపుణ్యం ఉంటే చాలు’ అంటుంది రచిత సిన్హా.
‘నేర్చుకుంటూ... నేర్పుతూ’ అంటారు. ‘యూ కెన్’ ద్వారా యూత్ చేస్తున్న మంచి పని అదే. విలువైన పాఠాలు
ప్రకృతి నుంచి విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. అలా నేర్చుకుంటూనే ‘యూ కెన్’ లాంటి వేదికల ద్వారా తాము నేర్చుకున్న విషయాలను పిల్లలతో పంచుకోవడంలో ముందుంటుంది యువతరం.
– రచిత సిన్హా, యూ కెన్, కో–ఫౌండర్
Comments
Please login to add a commentAdd a comment