సహచర ఆటగాళ్లతో ఇషాన్ కిషన్ (PC: TNCA X)
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ బాటపట్టాడు. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న ఈ డాషింగ్ క్రికెటర్ తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో సొంత రాష్ట్రం జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్.. తొలిరోజు శుభారంభం అందుకున్నాడు.
బుచ్చిబాబు టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్ తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి జార్ఖండ్ మధ్యప్రదేశ్ జట్టును 224-8కు కట్టడి చేసింది. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.
సూపర్ క్యాచ్ అందుకున్న ఇషాన్
అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని మూడు వికెట్లు పడగొట్టడంలో భాగం పంచుకున్నాడు. ముఖ్యంగా క్రీజులో నిలదొక్కుకుని.. జార్ఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మధ్యప్రదేశ్ లెఫ్టాండర్ బ్యాటర్ శుభం కువాష్ ఇచ్చిన క్యాచ్ తనదైన స్టైల్లో ఒడిసిపట్టి వారెవ్వా అనిపించాడు. 74వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శుభం(84).. షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.
బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బాల్ తన వైపునకు రాగానే ఇషాన్ కిషన్ ఏమాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. మిస్ అవుతుందనుకున్న బంతిని ఒడిసిపట్టి శుభంను డిస్మిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో శుభంతో పాటు చంచల్ రాథోడ్, రామ్‌వీర్ గుర్జార్ వికెట్లు పడగొట్టడంలోనూ ఇషాన్ కిషన్ కీపర్‌గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు.
కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే టీమిండియాను వీడిన ఇషాన్ కిషన్.. రంజీలు ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రా క్టు కోల్పోయాడు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్.. తొలుత బుచ్చిబాబు టోర్నీతో దేశవాళీ క్రికెట్ మొదలు పెట్టాడు.
బుచ్చిబాబు టోర్నమెంట్- ఏగ్రూపులో ఏ జట్లు?
తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల మ్యాచ్‌ల ఈ రెడ్‌బాల్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు.
గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో పాటు జార్ఖండ్, హైదరాబాద్.. గ్రూప్-బిలో రైల్వేస్, గుజరాత్, తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలెవన్, గ్రూప్-సిలో ముంబై, హర్యానా, తమిళనాడు ప్రెసింగ్ ఎలెవన్ 2, గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆగష్టు 15- సెప్టెంబరు 5 వరకు ఈ టోర్నీ జరుగనుంది.
Ishan Kishan in good rhythm. 💥
- Great piece of wicketkeeping!pic.twitter.com/sjnsGZTaQF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024
Comments
Please login to add a commentAdd a comment