buchi babu cricket tournament
-
బుచ్చి బాబు టోర్నీ విజేతగా హైదరాబాద్ జట్టు
టేక్ స్పోర్ట్స్-ఆలిండియా బుచ్చి బాబు టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. ఇవాళ (సెప్టెంబర్ 11) ముగిసిన ఫైనల్లో ఛత్తీస్ఘడ్పై 243 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 518 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఛత్తీస్‌ఘడ్ 274 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆయుష్ పాండే(134 బంతుల్లో 117; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అతనికి తోడుగా మరో ఓపెనర్ శశాంక్ చంద్రకర్ (45 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో తనయ్ త్యాగరాజన్ ఐదు, అనికేత్ రెడ్డి రెండు, రోహిత్ రాయుడు, నితేష్ కన్నాల, తన్మయ్ అగర్వాల్ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 417 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు చెలరేగడంతో ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్‌లో 181, రెండో ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. కాగా, గతేడాది ప్లేట్ గ్రూప్‌లో ఉండిన హైదరాబాద్.. తదుపరి సీజన్లో ఎలైట్ గ్రూప్‌లోకి అడుగుపెట్టనుంది.చదవండి: బుచ్చిబాబు టోర్నీ ఫైనల్: పటిష్ట స్థితిలో హైదరాబాద్ -
సూర్యకుమార్ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు ఊహించని షాక్ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగిన ఈ స్టార్ బ్యాటర్ గాయపడ్డాడు. తమిళనాడు జట్టుతో మ్యాచ్ సందర్భంగా అతడి చేతికి గాయమైనట్లు సమాచారం. దీంతో సూర్య దులిప్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది.బంగ్లాతో సిరీస్ నాటికీ కష్టమేఫలితంగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నాటికి కూడా సూర్యకుమార్ యాదవ్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా ఈ టీ20 టాప్ స్టార్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో సూర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!ఈ క్రమంలో ఈ టీ20 స్పెషలిస్టుకు మళ్లీ టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. అయితే, త్వరలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో రీ ఎంట్రీ ఇవ్వాలని భావించిన సూర్యకుమార్ యాదవ్.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీ బరిలో దిగాడు. దేశవాళీ క్రికెట్లో తన సొంతజట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తూ తమిళనాడుతో మ్యాచ్ ఆడాడు.కోయంబత్తూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 30 పరుగులే చేసిన సూర్య.. అనంతరం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. అతడి చేతికి గాయం కాగా.. నొప్పితో విలవిల్లాడినట్లు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో తెలిపింది. దీంతో అతడు దులిప్ ట్రోఫీలో పాల్గొనడంపై సందిగ్దం నెలకొంది. ఆశలపై నీళ్లుఒకవేళ గాయం తీవ్రతరమైతే సూర్యకుమార్ యాదవ్ టెస్టు రీఎంట్రీకి ఇప్పట్లో అవకాశం ఉండకపోవచ్చు. కాగా ఆఖరిగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ ఆడిన టీమిండియా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్ ఆడనుంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది.దులిప్ ట్రోఫీ ఇండియా-సి టీమ్‌లో సూర్యరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.చదవండి: Eng vs SL: శతక్కొట్టిన ఇంగ్లండ్ పేసర్.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్ -
శ్రేయస్ అయ్యర్ మళ్లీ ఫెయిల్.. 286 పరుగుల తేడాతో ముంబై ఓటమి
బుచ్చిబాబు టోర్నీ-2024లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ టోర్నీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటైన శ్రేయస్.. రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. మరోసారి షార్ట్‌బాల్ బలహీనతను అయ్యర్ అధిగమించలేకపోయాడు. తమిళనాడు పేసర్ అచ్యుత్ వేసిన షార్ట్‌పిచ్ బాల్‌కు ఫుల్‌షాట్ ఆడబోయి క్యాచ్‌గా శ్రేయస్ దొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేదు. అతడి చేతి వేలికి ప్రాక్టీస్ సమయంలో గాయమైంది. అయితే గాయం అంత తీవ్రమైనది కానట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై పై 286 పరుగుల తేడాతో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఘన విజయం సాధించింది. 510 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు 223 పరుగులకే ఆలౌటైంది. ముంబై బ్యాటర్లలో షామ్స్ ములానీ(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
సెమీస్‌లో హైదరాబాద్
చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇని్వటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్ జట్టుతో జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో హైదరాబాద్ జట్టు రెండు విజయాలు సాధించి 13 పాయింట్లతో ‘టాప్’లో నిలిచి సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మ్యాచ్ మూడో రోజు ఓవర్‌నైట్ స్కోరు 439/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 129.3 ఓవర్లలో 6 వికెట్లకు 560 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. వరుణ్ గౌడ్ (63 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), టి.రవితేజ (54 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. 353 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు 47 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 46 పరుగులిచ్చి 5 వికెట్లు, తనయ్ త్యాగరాజన్ 35 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు రెండో రోజు హైదరాబాద్ ఓపెనర్ ఎం. అభిరత్ రెడ్డి (243 బంతుల్లో 211; 24 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో మెరిశాడు. మధ్యప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 74.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. -
నిరాశపరిచిన శ్రేయస్, సూర్యకుమార్
బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా స్టార్లు శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ తీవ్రంగా నిరాశపరిచారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబైకి ప్రాతనిథ్యం వహించిన ఈ ఇద్దరు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. శ్రేయస్ 3 బంతుల్లో 2 పరుగులు చేసి సాయి కిశోర్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ 38 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్ సాయంతో 30 పరుగులు చేసి అజిత్ రామ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఫలితంగా ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. దివ్యాన్ష్ సక్సెనా(61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు తమిళనాడు 117.3 ఓవర్లలో 379 పరుగులకు ఆలౌటైంది. ప్రదోష్ 65, ఇంద్రజిత్ 61, భూపతి 82, అజిత్ 53 పరుగులు చేయగా.. ముంబై బౌలర్ హిమాన్షు 81 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.కాగా, బుచ్చిబాబు టోర్నీలో సత్తా చాటి బంగ్లాదేశ్ సిరీస్‌కు ముందు భారత సెలెక్టర్లను ఆకర్శిgచాలని శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ అనుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలయ్యాయి. సాయి కిషోర్, అజిత్ రామ్ వారి ఆశలపై నీళ్లు చల్లారు. వీరిద్దరు మిగతా టీమిండియా ఆటగాళ్లతో కలిసి వచ్చే నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ టోర్నీలో రాణిస్తే బంగ్లాతో సిరీస్‌కు టీమిండియాలో చోటు దక్కడం దాదాపుగా ఖయమనే చెప్పాలి. అయితే ఈ టోర్నీలో సత్తా చాటడం అంత ఈజీ కాదు. జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లంతా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. దీంతో ఇక్కడ పరుగులు సాధించడం కష్టమవుతుంది. వచ్చే నాలుగు నెలల్లో భారత్ 10 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుండటంతో శ్రేయస్, సూర్యకుమార్ లాంటి చాలామంది క్రికెటర్లు రెడ్ బాల్ క్రికెట్‌పై దృష్టి పెట్టారు. టీమిండియాలో చోటే లక్ష్యంగా వీరంతా పావులు కదుపతునున్నారు. -
శ్రేయస్ అయ్యర్‌కు చేదు అనుభవం.. వీడియో
టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బౌలర్ అవతారమెత్తాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో తన బౌలింగ్ నైపుణ్యాలు ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. తన సహజశైలికి విరుద్ధంగా.. వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునిల్ నరైన్ మాదిరి బౌల్ చేయబోయి ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌కు దొరికిపోయాడు.కాగా దులిప్ ట్రోఫీ-2024కు ముందు భారత క్రికెటర్లు.. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్(టీఎన్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బుచ్చిబాబు రెడ్‌బాల్ టోర్నీలో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రేయస్ అయ్యర్ సొంత జట్టు ముంబైకి ఆడుతున్నాడు. ఈ క్రమంలో టీఎన్‌సీఏ ఎలెవన్ జట్టుతో మంగళవారం ముంబై మ్యాచ్ మొదలైంది.సునిల్ నరైన్‌ను అనుసరించబోయి..తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీఎన్‌సీఏ తొలిరోజు ఆట పూర్తయ్యేసరికి(90 ఓవర్లు) ఐదు వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. అయితే, ఆట ముగియడానికి ఒక్క ఓవర్ మిగిలి ఉన్న ఉన్న తరుణంలో శ్రేయస్ అయ్యర్ బంతితో రంగంలోకి దిగాడు. తొంభైవ ఓవర్లో బాల్ చేతబట్టిన ఈ పార్ట్‌టైమ్ స్పిన్నర్ సునిల్ నరైన్ శైలిని అనుసరించబోయాడు. అయితే, క్రీజులో ఉన్న తమిళనాడు బ్యాటర్ సోను యాదవ్ భారీ సిక్సర్‌తో అయ్యర్‌కు చేదు అనుభవం మిగిల్చాడు.ఇండియా-డి జట్టుకు కెప్టెన్గామొత్తంగా అయ్యర్ ఓవర్లో టీఎన్‌సీఏ ఏడు పరుగులు రాబట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ టోర్నీ అనంతరం సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో అయ్యర్ ఆడనున్నాడు. ఇండియా-డి జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా స్పెషలిస్టు బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్ రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్ బౌలింగ్ చేయగలడు. ఇక విండీస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సునిల్ నరైన్ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్. వీరిద్దరు ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో సహచర ఆటగాళ్లు. ఈ ఏడాది అయ్యర్ సారథ్యంలోని కోల్‌కతా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటనShreyas Iyer bowling with Sunil Narine action. 😂 pic.twitter.com/EpX4ZxnfZx— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2024 -
మొన్న పంత్.. ఇప్పుడు ఇషాన్ కిషన్! బౌలింగ్ వీడియో వైరల్
భారత వికెట్ కీపర్ బ్యాటర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సరికొత్త అవతారమెత్తాడు. బుచ్చిబాబు టోర్నమెంట్లో భాగంగా హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కిషన్ స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్యపరిచాడు.చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో విఫలమైన కిషన్.. బంతితో మాత్రం ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బ్యాటర్ టి రవితేజకు కిషన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లు వేసిన కిషన్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవతున్నాయి. కాగా ఇటీవల తన సహచర వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా స్పిన్ బౌలింగ్ చేసి అందరిని షాక్ గురిచేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో పంత్ స్పిన్నర్‌గా మారాడు. ఇప్పుడు కిషన్ కూడా తన బౌలింగ్ స్కిల్స్‌ను ప్రదర్శించాడు.ఇక మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 114, 41 (నాటౌట్) పరుగులతో ఇషాన్ అలరించాడు. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం కిషన్ తన మార్క్‌ను చూపించలేకపోయాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను దిక్కరించడంతో కిషన్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. కిషన్ చివరగా భారత్ తరపున గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. The Bowler Ishan Kishan in the town you all 😎🔥@ishankishan51 #IshanKishan #BuchiBabuTournament pic.twitter.com/AvgkAfDibE— Ishan's💙🧘♀️ (@IshanWK32) August 22, 2024 -
Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు!
టీమిండియాలో అరంగేట్రం తర్వాత దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా మళ్లీ మైదానంలో దిగాడు. ఆ తర్వాత దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌కు ముందు ఈ రెడ్‌బాల్ టోర్నీల్లో ఆడటం ద్వారా సర్ఫరాజ్ ఖాన్‌కు కావాల్సినంత ప్రాక్టీసు లభించనుంది.అరగంటలో కనీసం 5 కిలోమీటర్ల దూరమైనాఅయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌పై తాను ఆశలు పెట్టుకోలేదంటున్నాడు ఈ ముంబై బ్యాటర్. అవకాశం వస్తే మాత్రం తప్పక సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. ఆటకు చాలా కాలం దూరంగా ఉన్నా ఫిట్నెస్ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి రోజూ ఉదయం నాలుగున్నరకే నిద్రలేస్తాను.వీలైనంత ఎక్కువ దూరం పరిగెత్తేందుకు ప్రయత్నిస్తాను. అరగంటలో కనీసం 5 కిలోమీటర్ల దూరమైనా పరిగెత్తాలనే లక్ష్యంతో రోజును మొదలుపెడతాను. ఆ తర్వాత జిమ్‌కు వెళ్తాను. అలా ఉదయం పూట రన్నింగ్, వర్కౌట్లతో గడిచిపోతుంది. ఇక సాయంత్రాలు బ్యాటింగ్ ప్రాక్టీసు మొదలుపెడతా.నాకైతే ఇండోర్ సెషన్లో బౌలింగ్ మెషీన్ నుంచి వచ్చే బంతులను ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే.. అక్కడ ఎక్కువగా బ్యాటర్‌కు అనుకూలమైన బంతులే వస్తాయి. ఏదేమైనా నాకు మాత్రం బ్యాటింగ్ చాలెంజింగ్‌గా ఉంటేనే ఇష్టం. అందుకే బయటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తా’’ అని తెలిపాడు.టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా!ఇక టీమిండియా- బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకైతే అస్సలు ఆశలు, అంచనాలు లేవు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంటాను. అందుకే ఇంతగా శ్రమిస్తున్నా. ఎప్పుడు ఏ ఛాన్స్ వస్తుందో తెలియదు. అందుకే మనం సదా సిద్ధంగా ఉండాలి’’ అని సర్ఫరాజ్ ఖాన్ పేర్కొన్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. కాగా 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఘనమైన రికార్డు ఉన్నా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కి జాతీయ జట్టులో చోటుదక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మరో సీనియర్ కేఎల్ రాహుల్ గైర్హాజరీ, ముంబై ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయం వల్ల సర్ఫరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది.ఈ క్రమంలో ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌లో వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపిన సర్ఫరాజ్ ఖాన్.. ఓవరాల్‌గా ఇప్పటి వరకు మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 200 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే సర్ఫరాజ్ గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీనియర్ల పునరాగమనంతో అతడికి మొండిచేయి ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: IPL 2025: ధోని ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..? -
సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్.. 86 బంతుల్లోనే!
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ రెడ్‌బాల్ క్రికెట్ పునరాగమనం అదిరిపోయింది. ఆకాశమే హద్దుగా 86 బంతుల్లోనే శతక్కొట్టాడు ఈ జార్ఖండ్ డైనమైట్. భారత జట్టులో చోటే లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తున్నానని సెలక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్‌కే పరిమితం చేశారని ఇషాన్ కిషన్ మధ్యలోనే నిష్క్రమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.రంజీల్లో ఆడనందుకు వేటు మానసిక ఇబ్బందులు అని చెప్పి ఆ టూర్ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. తదుపరి కుటుంబంతో ట్రిప్‌నకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌పై కన్నెర్ర చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. దేశవాళీ క్రికెట్ ఆడిన తర్వాతే టీమిండియాలో మళ్లీ చోటు దక్కుతుందని అతడికి స్పష్టం చేసింది. అయినప్పటికీ.. స్వరాష్ట్రానికి చెందిన జార్ఖండ్ తరఫున రంజీల్లో ఆడటానికి అతడు నిరాకరించాడు.ఫలితంగా సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్-2024లో ఇషాన్ కిషన్ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెరీర్‌పై దృష్టి సారించిన ఈ జార్ఖండ్ బ్యాటర్... బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా తిరిగి రెడ్‌బాల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. జార్ఖండ్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ డైనమైట్.. మధ్యప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కాడు.సిక్సర్‌తో సెంచరీ పూర్తిసిక్సర్తో సెంచరీ మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతకుముందు.. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ సమయంలో మూడు అద్భుత క్యాచ్‌లతో మెరిసి వికెట్ కీపర్‌గానూ తనను తాను నిరూపించుకున్నాడు 26 ఏళ్ల ఇషాన్ కిషన్. కాగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 225 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ సెంచరీ కారణంగా జార్ఖండ్ 69.1 ఓవర్లోనే 233 పరుగుల మార్కు అందుకుంది. ఇక టీమిండియా తరఫున ఈ జార్ఖండ్ కెప్టెన్ చివరగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగమయ్యాడు.చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్ పోస్ట్ వైరల్ISHAN KISHAN YOU’RE SO ICONIC!!!Ishan Kishan 100 in 86 balls!!#IshanKishan pic.twitter.com/I37dgcnciS— shrey (@slidinjun) August 16, 2024 -
రీ ఎంట్రీ అదుర్స్: అద్భుత క్యాచ్‌తో మెరిసిన ఇషాన్ కిషన్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్ బాటపట్టాడు. జాతీయ జట్టులో పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్న ఈ డాషింగ్ క్రికెటర్ తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ బరిలో దిగాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో సొంత రాష్ట్రం జార్ఖండ్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన ఇషాన్ కిషన్.. తొలిరోజు శుభారంభం అందుకున్నాడు.బుచ్చిబాబు టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న మధ్యప్రదేశ్‌తో జార్ఖండ్ తొలి మ్యాచ్ ఆడుతోంది. గురువారం మొదలైన ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సరికి జార్ఖండ్ మధ్యప్రదేశ్ జట్టును 224-8కు కట్టడి చేసింది. ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయడంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు.సూపర్ క్యాచ్ అందుకున్న ఇషాన్ అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని మూడు వికెట్లు పడగొట్టడంలో భాగం పంచుకున్నాడు. ముఖ్యంగా క్రీజులో నిలదొక్కుకుని.. జార్ఖండ్ బౌలర్లకు చుక్కలు చూపించిన మధ్యప్రదేశ్ లెఫ్టాండర్ బ్యాటర్ శుభం కువాష్ ఇచ్చిన క్యాచ్ తనదైన స్టైల్లో ఒడిసిపట్టి వారెవ్వా అనిపించాడు. 74వ ఓవర్లో ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య సింగ్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన శుభం(84).. షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు.బ్యాట్ ఎడ్జ్‌ని తాకిన బాల్ తన వైపునకు రాగానే ఇషాన్ కిషన్ ఏమాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ అందుకున్నాడు. మిస్ అవుతుందనుకున్న బంతిని ఒడిసిపట్టి శుభంను డిస్మిస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో శుభంతో పాటు చంచల్ రాథోడ్, రామ్‌వీర్ గుర్జార్ వికెట్లు పడగొట్టడంలోనూ ఇషాన్ కిషన్ కీపర్‌గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాడు. కాగా గతేడాది దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే టీమిండియాను వీడిన ఇషాన్ కిషన్.. రంజీలు ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ క్రమంలో సెంట్రల్ కాంట్రా క్టు కోల్పోయాడు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ఇషాన్.. తొలుత బుచ్చిబాబు టోర్నీతో దేశవాళీ క్రికెట్ మొదలు పెట్టాడు. బుచ్చిబాబు టోర్నమెంట్- ఏగ్రూపులో ఏ జట్లు?తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుచ్చిబాబు టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల మ్యాచ్‌ల ఈ రెడ్‌బాల్ టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఏలో డిఫెండింగ్ చాంపియన్ మధ్యప్రదేశ్‌తో పాటు జార్ఖండ్, హైదరాబాద్.. గ్రూప్-బిలో రైల్వేస్, గుజరాత్, తమిళనాడు ప్రెసిడెంట్స్ ఎలెవన్, గ్రూప్-సిలో ముంబై, హర్యానా, తమిళనాడు ప్రెసింగ్ ఎలెవన్ 2, గ్రూప్-డిలో జమ్మూ కశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆగష్టు 15- సెప్టెంబరు 5 వరకు ఈ టోర్నీ జరుగనుంది. Ishan Kishan in good rhythm. 💥- Great piece of wicketkeeping!pic.twitter.com/sjnsGZTaQF— Mufaddal Vohra (@mufaddal_vohra) August 15, 2024 -
సూర్యతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా!
శ్రీలంక సిరీస్‌తో వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా క్రికెటర్ టెస్టు రీఎంట్రీపై కూడా దృష్టి సారించాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ముంబై తరఫున ఈ టోర్నీలో శ్రేయస్ బరిలోకి దిగనున్నాడు.ఆ మ్యాచ్‌లో శ్రేయస్ ఆడతాడుఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ధ్రువీకరించింది. ‘‘తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. కోయంబత్తూరు వేదికగా ఆగష్టు 27న జరుగనున్న ముంబై వర్సెస్ జమ్మూ కశ్మీర్ మ్యాచ్‌లో అతడు ఆడనున్నాడు’’ అని ఎంసీఏ తన ప్రకటనలో తెలిపింది.కాగా శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ముంబై తరఫున రంజీ బరిలో దిగిన అతడు.. ఇంగ్లిష్ జట్టుతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లో వరుసగా 35, 13, 27, 29 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత తుదిజట్టులో అతడికి చోటు దక్కలేదు.టెస్టు జట్టులోనూ చోటే లక్ష్యంగా ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో ఆడిన తర్వాతే టీమిండియాలో అవకాశమని బీసీసీఐ చెప్పగా.. ఆ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. అయితే, ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.ఇక ఇప్పుడు టెస్టు జట్టులోనూ తిరిగి చోటు దక్కించుకోవాలని శ్రేయస్ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత తాను ఫామ్ కోల్పోయానని.. అయితే, ఐపీఎల్ ద్వారా తిరిగి గాడిలో పడ్డాడని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. తాను ఎవరితోనూ పోటీపడటం లేదని.. తనకు తానే పోటీ అని పేర్కొన్నాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇక అయ్యర్‌తో పాటు మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ బుచ్చిబాబు టోర్నీ ఆడనున్నాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ వ్యవహరించనున్నాడు.చదవండి: Pak vs Ban: పాక్ ఆస్ట్రేలియన్ మైండ్‌సెట్‌తో ఆడకూడదు! -
ఇషాన్ కిషన్ రీఎంట్రీ.. ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక?
టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్లో జార్ఖండ్ జట్టుకు కిషన్ సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫో తమ కథనంలో పేర్కొంది. ఈ బుచ్చిబాబు టోర్నీ చెన్నై వేదికగా ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం జార్ఖండ్ జట్టు ఇప్పటికే చెన్నైకు చేరుకుంది. కాగా తొలుత కిషన్ ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావించాండంట. ఈ క్రమంలోనే మొదట ప్రకటించిన జార్ఖండ్ జట్టులో కిషన్‌కు జెఎస్సీఎ సెలక్టర్లు చోటివ్వలేదు.అయితే తర్వాత ఇషాన్ తన నిర్ణయాన్ని మార్చకుని, ఈ బుచ్చిబాబు టోర్నీకి అందుబాటులో ఉంటానని జెఎస్సీఎకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే తమ జట్టు పగ్గాలను అతడికి జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ అప్పగించింది. కిషన్ బుధవారం(ఆగస్టు 14) చెన్నైలో ఉన్న తన జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ టోర్నీలో కిషన్ అద్భుతంగా రాణిస్తే భారత క్రికెట్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశముంటుంది. కాగా దేశవాళీ క్రికెట్లో ఆడాలన్న తమ ఆదేశాలను దిక్కరించడంతో కిషన్‌పై బీసీసీఐ వేటు వేసిన సంగతి తెలిసిందే. జాతీయ జట్టులో చోటుతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను ఈ జార్ఖండ్ డైనమెట్ కోల్పోయాడు.అసలేంటి ఈ బుచ్చి బాబు టోర్నీ..?దక్షిణాది భారత క్రికెట్ పితామహుడు ఎం. బుచ్చి బాబు నాయుడు(మోతవరపు వెంకట మహిపతి నాయుడు) పేరు మీద ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ టోర్నీ జరగనుంది. చివరగా 2017లో జరిగింది. ఈ ఏడాది టోర్నీలో మొత్తం 12 జట్లు పాల్గోనున్నాయి. వాటిని రెండు గ్రూపులుగా విభిజించారు. తమిళనాడులోని తిరునెల్వేలి, కోయంబత్తూరు, సేలం, నాథమ్ వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయిజట్లు ఇవేగ్రూప్ ఎ: మధ్యప్రదేశ్(డిఫెండింగ్ ఛాంపియన్ ), జార్ఖండ్, హైదరాబాద్గ్రూప్ బి: రైల్వేస్, గుజరాత్, TNCA ప్రెసిడెంట్స్ XIగ్రూప్ సి: ముంబై, హర్యానా, TNCA XIగ్రూప్ డి: జమ్మూ & కాశ్మీర్, బరోడా, ఛత్తీస్‌గఢ్ -
గంభీర్‌కు షాకిచ్చిన సూర్య.. మనసులో మాట చెప్పిన మిస్టర్ 360
టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెడ్ బాల్ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్-2024లో ముంబై తరపున సూర్యకుమార్ ఆడనున్నాడు.ఈ టోర్నీతో పాటు రాబోయో రంజీ ట్రోఫీ సీజన్లో కూడా సూర్యకుమార్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో మెరుగ్గా రాణించి భారత్ తరపున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు. ఈ ముంబైకర్ టీమిండియా తరపున ఇప్పటివరకు కేవలం ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సూర్య టెస్టు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అతడు కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం గాయం కారణంగా సిరీస్ నుంచి ఈ మిస్టర్ 360 తప్పుకున్నాడు.ఆ తర్వాత అతడికి టెస్టుల్లో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన సూర్యకుమార్ మూడు ఫార్మాట్లలో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు.నేను టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడాలనకుంటున్నాను. టెస్టు క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నాడు. స్కై బుచ్చిబాబు టోర్నీలో ఆడటం పట్ల ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ సైతం సంతోషం వ్యక్తం చేశాడు.సూర్య నాకు ఫోన్ చేసి బుచ్చి బాబు టోర్నమెంట్లో ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో మ్యాచ్‌లో సూర్య ఆడనున్నాడు. అతడు జట్టులోకి వస్తాను అంటే వద్దు అనే వారు ఎవరూ లేరు.సూర్య రాకతో ముంబై జట్టు మరింత బలోపేతం కానుంది. అతడు ఈ టోర్నీలో ఆడటం చాలా సంతోషంగా ఉంది అని సంజయ్ పాటిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో సూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. 137 ఇన్నింగ్స్‌ల్లో 63.74 స్ట్రయిక్ రేటుతో అతడు 5,628 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 14 సెంచరీలు, 29 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సూర్యను కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణించారు. ఈ క్రమంలోనే సూర్యకు భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. లంకతో టీ20లు ఆడిన సూర్యను వన్డే సిరీస్‌కు మాత్రం ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సూర్య మూడు ఫార్మాట్ల ఆడాలనకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే అంతర్జాతీయ క్రికెట్లో సూర్యకు టీ20ల్లో తప్ప మిగితా ఫార్మాట్లలో గణనీయమైన రికార్డు లేదు. -
ఎట్టకేలకు నెరవేరిన కల.. కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్
సీనియర్ల గైర్హాజరీ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు బంపరాఫర్ వచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ ఫలించి కెప్టెన్ కావాలన్న అతడి కల నెరవేరింది. బుచ్చిబాబు టోర్నమెంట్-2024లో సర్ఫరాజ్‌ను ముంబై జట్టు కెప్టెన్‌గా నియమించింది యాజమాన్యం.కాగా దేశవాళీ క్రికెట్లో ముంబై జట్టుకు అజింక్య రహానే సారథ్యం వహిస్తున్నాడు. అతడి కెప్టెన్సీలో గత రంజీ సీజన్ ట్రోఫీని ముంబై గెలుచుకుంది. ఇక ఆ సమయంలో షామ్స్ ములానీ రహానే డిప్యూటీగా.. వైస్ కెప్టెన్‌గా వ్యహరించాడు. అయితే, రహానే ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీలతో బిజీగా ఉన్నాడు. లీసెస్టర్‌షైర్ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.మరోవైపు.. షామ్స్ ములానీ జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఇక పృథ్వీ షా సైతం ఇంగ్లండ్‌లో బిజీగా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా టీమిండియాలో పునరాగమనం చేసి ప్రస్తుతం జట్టుతో పాటు కొనసాగుతున్నాడు.కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ఇలా సీనియర్లంతా తమ తమ షెడ్యూల్‌తో బిజీగా ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్‌కు కెప్టెన్‌గా అవకాశం దక్కింది. ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పాటిల్ ధ్రువీకరించాడు. ‘‘అజింక్య రహానే అందుబాటులో ఉంటే అతడే కెప్టెన్‌గా ఉండేవాడు. ఒకవేళ అతడు జట్టుతో లేకపోయినా మాకు కావాల్సినన్ని ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం జట్టులో సర్ఫరాజ్ ఖాన్ సీనియర్ మోస్ట్ ప్లేయర్. అతడే ఈ టోర్నీలో మా కెప్టెన్‌గా ఉంటాడు’’ అని సంజయ్ పాటిల్ ‘మిడ్ డే’తో పేర్కొన్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పరుగుల వరద పారించిన సర్ఫరాజ్ ఖాన్.. స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తుదిజట్టులో కూడా చోటు దక్కించుకుని హాఫ్ సెంచరీలతో మెరిశాడు. మూడు టెస్టులాడి 200 పరుగులు సాధించాడు. అయితే, కేఎల్‌రాహుల్, రిషభ్ పంత్ వంటి సీనియర్ల రాకతో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపికవుతాడా?లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.బుచ్చిబాబు టోర్నమెంట్-2024కు ముంబై జట్టుసర్ఫరాజ్ ఖాన్ (కెప్టెన్), సిద్ధేశ్ లాడ్, దివ్యాంశ్ సక్సేనా, అమోగ్ భత్కల్, అఖిల్ హెర్వాద్కర్, ముషీర్ ఖాన్, నూతన్ గోయల్, సూర్యాన్ష్ షెడ్గే, హార్దిక్ తామోర్, ప్రసాద్ పవార్, తనూష్ కొటియన్, అథర్వ అంకోలేకర్, హిమాన్షు సింగ్, ధనిత్ రౌత్, సిల్వెస్టర్ డిసౌజా, జునైద్ ఖాన్, హర్ష్ తనా.కాగా నాటి మద్రాస్ ప్రెసిడెన్సీకి మోతవరపు మహిపతి నాయుడు బుచ్చిబాబు నాయుడుగా సుపరిచితులు. 1868లో జన్మించిన ఆయన.. స్వదేశీయులకు క్రికెట్ క్లబ్లో అవకాశాలు కల్పించారు. క్రికెట్ జట్లలో వివక్షకు తావులేకుండా గొంతెత్తారు. ఆయన పేరు మీదుగా తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బుచ్చిబాబు నాయుడు టోర్నమెంట్ నిర్వహిస్తోంది. రెడ్‌బాల్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. -
తడబడిన హైదరాబాద్ బౌలర్లు
ముంబై భారీ స్కోరు బుచ్చిబాబు టోర్నీ చెన్నై: బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్లో ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు తడబడ్డారు. సోమవారం ఇక్కడ ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముంబై 100 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై బ్యాట్స్‌మెన్ బ్రావిష్ శెట్టి (157), నిఖిల్ పాటిల్ (123) సెంచరీలతో చెలరేగారు. హైదరాబాద్ బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ మెహదీ హసన్ 121 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా...లెఫ్టార్మ్ సీమర్ అన్వర్ ఖాన్ 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరో వైపు అస్సాంతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర 100 ఓవర్లలో 365 పరుగులు చేసింది. కె.భరత్ రెడ్డి (96), శ్రీకర్ భరత్ (95) సెంచరీలు చేజార్చుకోగా...జి. చిరంజీవి (66), బోడ సుమంత్ (41) రాణించారు.