శ్రీలంక సిరీస్‌తో వన్డేల్లో పునరాగమనం చేసిన టీమిండియా క్రికెటర్ టెస్టు రీఎంట్రీపై కూడా దృష్టి సారించాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్ నేపథ్యంలో భారత జట్టులో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఈ క్రమంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ముంబై తరఫున ఈ టోర్నీలో శ్రేయస్ బరిలోకి దిగనున్నాడు.
ఆ మ్యాచ్‌లో శ్రేయస్ ఆడతాడు
ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) ధ్రువీకరించింది. ‘‘తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్లో శ్రేయస్ అయ్యర్ ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. కోయంబత్తూరు వేదికగా ఆగష్టు 27న జరుగనున్న ముంబై వర్సెస్ జమ్మూ కశ్మీర్ మ్యాచ్‌లో అతడు ఆడనున్నాడు’’ అని ఎంసీఏ తన ప్రకటనలో తెలిపింది.
కాగా శ్రేయస్ అయ్యర్ గత కొంతకాలంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు ముంబై తరఫున రంజీ బరిలో దిగిన అతడు.. ఇంగ్లిష్ జట్టుతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే, తొలి రెండు టెస్టుల్లో వరుసగా 35, 13, 27, 29 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు. ఆ తర్వాత తుదిజట్టులో అతడికి చోటు దక్కలేదు.
టెస్టు జట్టులోనూ చోటే లక్ష్యంగా
ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌లో ఆడిన తర్వాతే టీమిండియాలో అవకాశమని బీసీసీఐ చెప్పగా.. ఆ ఆదేశాలను బేఖాతరు చేశాడు. ఈ నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. అయితే, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్‌కు శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది.
ఇక ఇప్పుడు టెస్టు జట్టులోనూ తిరిగి చోటు దక్కించుకోవాలని శ్రేయస్ అయ్యర్ పట్టుదలగా ఉన్నాడు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత తాను ఫామ్ కోల్పోయానని.. అయితే, ఐపీఎల్ ద్వారా తిరిగి గాడిలో పడ్డాడని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. తాను ఎవరితోనూ పోటీపడటం లేదని.. తనకు తానే పోటీ అని పేర్కొన్నాడు.
కాగా సెప్టెంబరు 19 నుంచి భారత్- బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇక అయ్యర్‌తో పాటు మరో ముంబై బ్యాటర్, టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ బుచ్చిబాబు టోర్నీ ఆడనున్నాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ముంబై కెప్టెన్‌గా సర్ఫరాజ్ ఖాన్ వ్యవహరించనున్నాడు.
చదవండి: Pak vs Ban: పాక్ ఆస్ట్రేలియన్ మైండ్‌సెట్‌తో ఆడకూడదు!
Comments
Please login to add a commentAdd a comment