టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెడ్ బాల్ క్రికెట్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్-2024లో ముంబై తరపున సూర్యకుమార్ ఆడనున్నాడు.
ఈ టోర్నీతో పాటు రాబోయో రంజీ ట్రోఫీ సీజన్‌లో కూడా సూర్యకుమార్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు టోర్నీల్లో మెరుగ్గా రాణించి భారత్ తరపున టెస్టుల్లో పునరాగమనం చేయాలని సూర్య భావిస్తున్నాడు. ఈ ముంబైకర్ టీమిండియా తరపున ఇప్పటివరకు కేవలం ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు.
గతేడాది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై సూర్య టెస్టు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర మ్యాచ్‌లో అతడు కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం గాయం కారణంగా సిరీస్ నుంచి ఈ మిస్టర్ 360 తప్పుకున్నాడు.
ఆ తర్వాత అతడికి టెస్టుల్లో అవకాశం లభించలేదు. ఈ క్రమంలో తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన సూర్యకుమార్ మూడు ఫార్మాట్లలో ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు.
నేను టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో ఆడాలనకుంటున్నాను. టెస్టు క్రికెట్ ఆడేందుకు బుచ్చిబాబు టోర్నమెంట్ మంచి ప్రాక్టీస్‌గా ఉపయోగపడుతుందని భావిస్తున్నానని సూర్య పేర్కొన్నాడు. స్కై బుచ్చిబాబు టోర్నీలో ఆడటం పట్ల ముంబై చీఫ్ సెలక్టర్ సంజయ్ పాటిల్ సైతం సంతోషం వ్యక్తం చేశాడు.
సూర్య నాకు ఫోన్ చేసి బుచ్చి బాబు టోర్నమెంట్‌లో ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో మ్యాచ్‌లో సూర్య ఆడనున్నాడు. అతడు జట్టులోకి వస్తాను అంటే వద్దు అనే వారు ఎవరూ లేరు.
సూర్య రాకతో ముంబై జట్టు మరింత బలోపేతం కానుంది. అతడు ఈ టోర్నీలో ఆడటం చాలా సంతోషంగా ఉంది అని సంజయ్ పాటిల్ చెప్పుకొచ్చాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సూర్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది.
137 ఇన్నింగ్స్‌ల్లో 63.74 స్ట్రయిక్ రేటుతో అతడు 5,628 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 14 సెంచరీలు, 29 అర్ధ శతకాలు ఉన్నాయి. అయితే భారత కొత్త హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సూర్యను కేవలం టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణించారు.
ఈ క్రమంలోనే సూర్యకు భారత టీ20 జట్టు పగ్గాలు అప్పగించారు. లంకతో టీ20లు ఆడిన సూర్యను వన్డే సిరీస్‌కు మాత్రం ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సూర్య మూడు ఫార్మాట్ల ఆడాలనకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో సూర్యకు టీ20ల్లో తప్ప మిగితా ఫార్మాట్లలో గణనీయమైన రికార్డు లేదు.
Comments
Please login to add a commentAdd a comment