టీమిండియాలో అరంగేట్రం తర్వాత దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు సర్ఫరాజ్ ఖాన్. సుదీర్ఘ విరామం తర్వాత తాజాగా బుచ్చిబాబు టోర్నమెంట్ ద్వారా మళ్లీ మైదానంలో దిగాడు. ఆ తర్వాత దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. బంగ్లాదేశ్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌కు ముందు ఈ రెడ్‌బాల్ టోర్నీల్లో ఆడటం ద్వారా సర్ఫరాజ్ ఖాన్‌కు కావాల్సినంత ప్రాక్టీసు లభించనుంది.
అరగంటలో కనీసం 5 కిలోమీటర్ల దూరమైనా
అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌పై తాను ఆశలు పెట్టుకోలేదంటున్నాడు ఈ ముంబై బ్యాటర్. అవకాశం వస్తే మాత్రం తప్పక సద్వినియోగం చేసుకుంటానని పేర్కొన్నాడు. ఆటకు చాలా కాలం దూరంగా ఉన్నా ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించానని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు సర్ఫరాజ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘ప్రతి రోజూ ఉదయం నాలుగున్నరకే నిద్రలేస్తాను.
వీలైనంత ఎక్కువ దూరం పరిగెత్తేందుకు ప్రయత్నిస్తాను. అరగంటలో కనీసం 5 కిలోమీటర్ల దూరమైనా పరిగెత్తాలనే లక్ష్యంతో రోజును మొదలుపెడతాను. ఆ తర్వాత జిమ్‌కు వెళ్తాను. అలా ఉదయం పూట రన్నింగ్, వర్కౌట్లతో గడిచిపోతుంది. ఇక సాయంత్రాలు బ్యాటింగ్ ప్రాక్టీసు మొదలుపెడతా.
నాకైతే ఇండోర్ సెషన్‌లో బౌలింగ్ మెషీన్ నుంచి వచ్చే బంతులను ఎదుర్కోవడం ఇష్టం ఉండదు. ఎందుకంటే.. అక్కడ ఎక్కువగా బ్యాటర్‌కు అనుకూలమైన బంతులే వస్తాయి. ఏదేమైనా నాకు మాత్రం బ్యాటింగ్ చాలెంజింగ్‌గా ఉంటేనే ఇష్టం. అందుకే బయటే ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తా’’ అని తెలిపాడు.
టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా!
ఇక టీమిండియా- బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాకైతే అస్సలు ఆశలు, అంచనాలు లేవు. ఒకవేళ అవకాశం వస్తే మాత్రం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంటాను. అందుకే ఇంతగా శ్రమిస్తున్నా. ఎప్పుడు ఏ ఛాన్స్ వస్తుందో తెలియదు. అందుకే మనం సదా సిద్ధంగా ఉండాలి’’ అని సర్ఫరాజ్ ఖాన్ పేర్కొన్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఘనమైన రికార్డు ఉన్నా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కి జాతీయ జట్టులో చోటుదక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సహా మరో సీనియర్ కేఎల్ రాహుల్ గైర్హాజరీ, ముంబై ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ గాయం వల్ల సర్ఫరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది.
ఈ క్రమంలో ఆడిన తొలి టెస్టులోనే రెండు ఇన్నింగ్స్‌లో వరుస అర్ధ శతకాలతో దుమ్ములేపిన సర్ఫరాజ్ ఖాన్.. ఓవరాల్‌గా ఇప్పటి వరకు మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 200 పరుగులు సాధించాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే, బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకోవాలంటే సర్ఫరాజ్ గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. సీనియర్ల పునరాగమనంతో అతడికి మొండిచేయి ఎదురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment