సూర్యకుమార్‌ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్‌! | Big Blow To India As Senior Batter Suffers Hand Injury Ahead Of Bangladesh Test, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

సూర్యకుమార్‌ ఆశలపై నీళ్లు.. ఊహించని షాక్‌!

Published Sat, Aug 31 2024 9:43 AM | Last Updated on Sat, Aug 31 2024 10:36 AM

Big Blow To India As Senior Batter Suffers Injury Ahead Of Bangladesh Test

టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా బుచ్చిబాబు టోర్నమెంట్‌ బరిలో దిగిన ఈ స్టార్‌ బ్యాటర్‌ గాయపడ్డాడు. తమిళనాడు జట్టుతో మ్యాచ్‌ సందర్భంగా అతడి చేతికి గాయమైనట్లు సమాచారం. దీంతో సూర్య దులిప్‌ ట్రోఫీకి దూరమయ్యే అవకాశం ఉంది.

బంగ్లాతో సిరీస్‌ నాటికీ కష్టమే
ఫలితంగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ నాటికి కూడా సూర్యకుమార్‌ యాదవ్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సందర్భంగా ఈ టీ20 టాప్‌ స్టార్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సొంతగడ్డపై జరిగిన ఈ సిరీస్‌లో సూర్య కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది!
ఈ క్రమంలో ఈ టీ20 స్పెషలిస్టుకు మళ్లీ టెస్టు జట్టులో స్థానం దక్కలేదు. అయితే, త్వరలో స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ నేపథ్యంలో రీ ఎంట్రీ ఇవ్వాలని భావించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ టోర్నీ బరిలో దిగాడు. దేశవాళీ క్రికెట్‌లో తన సొంతజట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తూ తమిళనాడుతో మ్యాచ్‌ ఆడాడు.

కోయంబత్తూర్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 30 పరుగులే చేసిన సూర్య.. అనంతరం ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. అతడి చేతికి గాయం కాగా.. నొప్పితో విలవిల్లాడినట్లు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో తెలిపింది. దీంతో అతడు దులిప్‌ ట్రోఫీలో పాల్గొనడంపై సందిగ్దం నెలకొంది. 

ఆశలపై నీళ్లు
ఒకవేళ గాయం తీవ్రతరమైతే సూర్యకుమార్‌ యాదవ్‌ టెస్టు రీఎంట్రీకి ఇప్పట్లో అవకాశం ఉండకపోవచ్చు. కాగా ఆఖరిగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన టీమిండియా దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది.

దులిప్‌ ట్రోఫీ ఇండియా-సి టీమ్‌లో సూర్య
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, గౌరవ్ యాదవ్, వైషక్ విజయ్‌కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్కండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్.

చదవండి: Eng vs SL: శతక్కొట్టిన ఇంగ్లండ్‌ పేసర్‌.. శ్రీలంక 196 పరుగులకే ఆలౌట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement