టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందా? ఇప్పట్లో అతడు టెస్టు జట్టులో పునరాగమనం చేయడం కష్టమేనా? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. స్వయంకృతాపరాధం, నిలకడలేమి ఫామ్ శ్రేయస్ టెస్టు భవిష్యత్తును ఆగమ్యగోచరంగా మార్చినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ కాంట్రాక్టు పాయె
ఈ ఏడాది ఇంగ్లండ్‌తో స్వదేశంలో చివరగా టెస్టు సిరీస్‌లో పాల్గొన్నాడు శ్రేయస్ అయ్యర్. తొలి రెండు మ్యాచ్‌లలో కలిపి కేవలం 104(35, 13, 27, 29) పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఈ మిడిలార్డర్ బ్యాటర్‌పై వేటు పడింది. మిగిలిన మూడు టెస్టులకు అతడిని పక్కనపెట్టింది బీసీసీఐ. అనంతరం రంజీల్లో ఆడాలని ఆదేశించగా.. ఫిట్‌నెస్ కారణాలు చూపి శ్రేయస్ అయ్యర్ ఈ దేశవాళీ టోర్నీకి దూరంగా ఉన్నాడు.
ఐపీఎల్‌తో జోష్
అయితే, పూర్తి ఫిట్‌గా ఉన్నా బోర్డు ఆదేశాలు బేఖాతరు చేశాడన్న కారణంతో బీసీసీఐ అతడిపై కొరడా ఝులింపించింది. క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డందుకు గానూ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించింది. దీంతో దిగొచ్చిన శ్రేయస్ అయ్యర్ రంజీల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఐపీఎల్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి.. జట్టును చాంపియన్‌గా నిలిపాడు.
అంతలోనే విఫలం
ఈ క్రమంలో శ్రీలంక పర్యటన సందర్భంగా శ్రేయస్ అయ్యర్ వన్డే రీఎంట్రీకి బీసీసీఐ అనుమతినిచ్చింది. అయితే, టెస్టుల్లో చోటు లక్ష్యంగా దేశవాళీ రెడ్‌బాల్ టోర్నీల్లో దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. విజయవంతం కాలేకపోతున్నాడు. తొలుత బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నీలో ముంబై తరఫున ఆడిన అతడు.. అక్కడ ప్రభావం చూపలేకపోయాడు. అయినప్పటికీ దులిప్ ట్రోఫీ-2024లో ఇండియా- ‘డి’ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో అయ్యర్ ఇప్పటి వరకు 9, 54 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఇప్పటికే అతడిని పక్కన పెట్టేశారు టీమిండియా సెలక్టర్లు. ఇక దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్‌లో( 0, 41)నూ అయ్యర్ ఆకట్టుకోలేకపోయాడు. దీంతో బంగ్లాదేశ్‌తో రెండో మ్యాచ్‌కు కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.
ఎవరి స్థానంలో? ఎందుకు చోటివ్వాలి?
అంతేకాదు.. స్వదేశంలో తదుపరి న్యూజిలాండ్‌తో.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లకు శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసే అవకాశం లేదని బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాతో పేర్కొన్నాయి. ‘‘ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌కు టెస్టు జట్టులో చోటు దక్కే అవకాశమే లేదు. ఎవరి స్థానంలో అతడిని జట్టులోకి తీసుకోవాలంటారు?
దులిప్ ట్రోఫీలో అతడి షాట్ సెలక్షన్లు కూడా ఎలా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం కదా! వచ్చిన అవకాశాలను అతడు సద్వినియోగం చేసుకోవడం లేదు’’ అని సదరు వర్గాలు తెలిపాయి. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా రోహిత్ సేన బంగ్లాదేశ్‌తో రెండు, న్యూజిలాండ్‌తో మూడు, ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.
చదవండి: బుమ్రా కాదు!.. అతడితో పోటీ అంటే మస్తు మజా: ఆసీస్ స్టార్
Comments
Please login to add a commentAdd a comment