![Ind vs NZ 1st Test Day 3: Virat Kohli Ends 9 Month Wait Slams 50 Fans Reacts](/styles/webp/s3/article_images/2024/10/18/viratkohli.jpg.webp?itok=zjOe1H3k)
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ఎట్టకేలకు తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో అర్ధ శతకం బాది.. తొమ్మిది నెలల నిరీక్షణకు తెరదించాడు. తనకు సొంత మైదానం(ఐపీఎల్- ఆర్సీబీ)లాంటి బెంగళూరు చిన్వస్వామి స్టేడియంలో.. చక్కని షాట్లతో అలరిస్తూ.. టెస్టుల్లో తన 31వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. డెబ్బై బంతుల్లో ఫిఫ్లీ పూర్తి చేసుకున్నాడు.
అరుదైన మైలురాయి
కాగా సంప్రదాయ క్రికెట్‌లో కోహ్లి చివరగా గతేడాది డిసెంబరులో యాభై పరుగుల మార్కు అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లి మరో అరుదైన మైలురాయిని దాటాడు. టెస్టుల్లో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇక ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో కోహ్లి నిరాశపరిచిన విషయం తెలిసిందే.
బంగ్లాతో తొలి మ్యాచ్‌లో కేవలం 23 పరుగులే చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో టెస్టులో 76(47, 29*) చేయగలిగాడు. అయితే, న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయి పాత కథనే పునరావృతం చేశాడు. అయితే, శుక్రవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు.
ధీటుగా బదులిస్తున్న టీమిండియా
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 46 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసింది. అయితే, రోహిత్ సేన ఇందుకు ధీటుగా బదులిస్తోంది. 40 ఓవర్ల ఆట ముగిసే సరికి కేవలం రెండు వికెట్లు నష్టపోయి 220 పరుగులు చేసింది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ(52) చేయగా.. సర్ఫరాజ్ ఖాన్, కోహ్లి అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు.
చదవండి: టీమిండియా 46 ఆలౌట్.. అజింక్య రహానే పోస్ట్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment