Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్‌ ఆగ్రహం.. కోహ్లి ఆన్‌ ఫైర్‌! | Ind vs NZ 1st Test Day 4: Kohli, Rohit Argue With Umpires Bad Light Controversy | Sakshi
Sakshi News home page

Rohit- Kohli: అంపైర్లతో గొడవ.. రోహిత్‌ ఆగ్రహం.. కోహ్లి ఆన్‌ ఫైర్‌!

Published Sat, Oct 19 2024 5:50 PM | Last Updated on Sat, Oct 19 2024 7:17 PM

Ind vs NZ 1st Test Day 4: Kohli, Rohit Argue With Umpires Bad Light Controversy

అంపైర్లతో గొడవ రోహిత్‌, కోహ్లి వాగ్వాదం(PC: Jio Cinema X)

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ విరాట్‌ కోహ్లి అంపైర్ల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆటను ఎలా నిలిపివేస్తారంటూ ఫీల్డ్‌ అంపైర్లతో వాదనకు దిగారు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో శనివారం నాటి ఆట సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా భారత్‌ స్వదేశంలో కివీస్‌ జట్టుతో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరుగుతోంది. వర్షం వల్ల బుధవారం నాటి తొలిరోజు ఆట రద్దు కాగా.. గురువారం మ్యాచ్‌ మొదలైంది.

462 పరుగులకు ఆలౌట్‌
ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 46 పరుగులకే కుప్పకూలగా.. న్యూజిలాండ్‌ 402 పరుగులు చేసింది. రోహిత్‌ సేన కంటే 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా మెరుగైన స్కోరు సాధించింది. శనివారం నాటి నాలుగో రోజు ఆటలో 462 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

విజయంపై ఆశలు
అయితే, భారత్‌కు కేవలం 106 పరుగుల లీడ్‌ మాత్రమే లభించింది. ఈ స్కోరును డిఫెండ్‌ చేసుకుని మ్యాచ్‌ గెలవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే. కాగా శనివారం ఆట చరమాంకానికి చేరుకునే సమయంలో కొత్త బంతితో కివీస్‌ పేసర్లు రాణించారు. దీంతో టీమిండియాలో విజయంపై ఆశలు మొదలయ్యాయి. వీలైనంత త్వరగా వికెట్లు పడగొట్టాలనే తొందర కనిపించింది.

ఈ క్రమంలో కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టగా.. భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ అటాక్‌ ఆరంభించాడు. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ క్రీజులో ఉండగా.. రెండో బంతికే బుమ్రా ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే, అంపైర్లు నాటౌట్‌ ఇచ్చారు. దీంతో చిరాకెత్తిపోయిన రోహిత్‌ సేనకు అంపైర్ల మరో నిర్ణయం ఆగ్రహం తెప్పించింది.

అంపైర్ల నిర్ణయం.. మండిపడ్డ రోహిత్‌, కోహ్లి
వెలుతురులేమి కారణంగా దాదాపు అరగంట ముందుగానే ఆటను నిలిపివేయాలని అంపైర్లు నిర్ణయించారు. దీంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వారి దగ్గరకు వెళ్లి వాదనకు దిగగా.. కోహ్లి కూడా అతడికి జత కలిశాడు. ఆట నిలిపే ప్రసక్తే లేదంటూ రోహిత్‌ కంటే ఎక్కువగా కోహ్లినే గట్టిగా వాదించినట్లు కనిపించింది. 

వీరిలా అంపైర్లతో వాగ్వాదానికి దిగిన కాసేపటికే మబ్బులు కమ్ముకువచ్చాయి. అంపైర్లు తమ నిర్ణయం ఫైనల్‌ చేస్తూ ఆట నిలిపివేయగానే.. గ్రౌండ్స్‌మెన్‌ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ఇక శనివారం ఆట పూర్తయ్యే సరికి కివీస్‌ నాలుగు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయలేదు. టామ్‌ లాథమ్‌ 0, డెవాన్‌ కాన్వే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆఖరి రోజు ఆట ఆదివారం ఉదయం 9.15 నిమిషాలకు ఆరంభం కానున్నట్లు బీసీసీఐ తెలిపింది.

టీమిండియా వర్సెస్‌ న్యూజిలాండ్‌ తొలి టెస్టు
👉టీమిండియా తొలి ఇన్నింగ్స్‌- 46 రన్స్‌ ఆలౌట్‌
👉న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌- 402 రన్స్‌ ఆలౌట్‌
👉టీమిండియా రెండో ఇన్నింగ్స్‌- 462 రన్స్‌ ఆలౌట్‌

👉న్యూజిలాండ్‌ లక్ష్యం- 107 పరుగులు
👉విజయానికి పది వికెట్ల దూరంలో టీమిండియా

చదవండి: IND vs NZ: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా.. 147 ఏళ్లలో తొలిసారి!
Ind vs NZ: అయ్యో పంత్‌! .. నీకే ఎందుకిలా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement