నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్‌ ఫైర్‌ | Ind vs NZ 3rd Test: Virat Kohli Presses Self Destruct With Horrible Run Out Fans Fires | Sakshi
Sakshi News home page

నువ్వు జట్టులో ఉండి ఏం లాభం?.. కోహ్లిపై ఫ్యాన్స్‌ ఫైర్‌

Published Fri, Nov 1 2024 7:24 PM | Last Updated on Fri, Nov 1 2024 8:12 PM

Ind vs NZ 3rd Test: Virat Kohli Presses Self Destruct With Horrible Run Out Fans Fires

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రనౌట్‌ అయి వికెట్‌ సమర్పించుకున్నాడు. దీంతో ఫ్యాన్స్‌ సైతం కోహ్లి తీరును విమర్శిస్తున్నారు. ‘‘నీలాంటి దిగ్గజ ఆటగాడు కూడా ఇలా చేస్తే..  జట్టుకు నీతో ఏం ఉపయోగం?’’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్వదేశంలో బంగ్లాదేశ్‌తో సిరీస్‌ సందర్భంగా టెస్టుల్లో పునరాగమనం చేసిన కోహ్లి.. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 6, 17, 47,  29(నాటౌట్‌) పరుగులు స్కోరు చేశాడు. బలహీన ప్రత్యర్థిపై కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. ఈ సిరీస్‌లో భారత్‌ గెలిచింది కాబట్టి కోహ్లి విఫలమైనా పెద్దగా నష్టం జరుగలేదు.

ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపు
అయితే, న్యూజిలాండ్‌తో టెస్టుల్లోనూ కోహ్లి ఆట తీరు మారలేదు. బెంగళూరులో తొలి మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. రెండో ఇన్నింగ్స్‌ 70 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఫామ్‌లోకి వచ్చాడనుకునేలోపు.. పుణెలో జరిగిన రెండో టెస్టులో మళ్లీ ఫెయిల్‌ అయ్యాడు.

ఆ మ్యాచ్‌లో కోహ్లి సాధించిన స్కోర్లు 1, 17. ఇక ఈ రెండు టెస్టుల్లో టీమిండియా ఓటమిపాలై.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య శుక్రవారం నాటి మూడో టెస్టు మొదలైంది. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది పర్యాటక కివీస్‌ జట్టు.

ఆది నుంచే ఎదురుదెబ్బలు
భారత బౌలర్ల విజృంభణ కారణంగా 235 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్‌ సుందర్‌ నాలుగు, పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఈ క్రమంలో తొలి రోజే బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియాకు ఆది నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి.

ఓపెనర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(18) దూకుడుగా ఆడి తొలి వికెట్‌గా వెనుదిరగగా.. మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌(30)కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. జైస్వాల్‌ స్థానంలో క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ సిరాజ్‌ డకౌట్‌ కాగా.. భారత్‌ ఒక్క బంతి వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.

హెన్రీ డైరెక్ట్‌ త్రో.. కోహ్లికి షాక్‌
ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఆడాల్సిన కోహ్లి ఊహించని రీతిలో రనౌట్‌ అయ్యాడు. భారత ఇన్నింగ్స్‌ పందొమ్మిదవ ఓవర్‌లో రచిన్‌ రవీంద్ర వేసిన మూడో బంతిని షాట్‌ ఆడిన కోహ్లి.. సింగిల్‌ కోసం గిల్‌ను పిలిచాడు. ఇద్దరూ క్రీజును వీడిన సమయంలో.. బంతిని అందుకున్న ఫీల్డర్‌ మ్యాట్‌ హెన్రీ కోహ్లి వస్తున్న నాన్‌ స్ట్రైకర్‌ ఎండ్‌ వికెట్ల వైపు బాల్‌ త్రో చేశాడు. 

నేరుగా అది వికెట్లను గిరాటేయడంతో కోహ్లి రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. అప్పటికి కోహ్లి డైవ్‌ చేసినా ఫలితం లేకపోయింది. కేవలం నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి అవుట్‌ కాగా టీమిండియా కష్టాల్లో పడింది.

ఇక శుక్రవారం నాటి తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 19 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 86 రన్స్‌ స్కోరు చేసింది. గిల్‌ 31, రిషభ్‌ పంత్‌ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు.

చదవండి: IPL 2025 Retentions: జాక్‌పాట్‌ కొట్టిన ఆటగాళ్లు వీరే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement