న్యూజిలాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాటర్లు విఫలమైన తీరు మేనేజ్‌మెంట్‌ను కలవరపాటుకు గురిచేసింది. బెంగళూరు మ్యాచ్‌లో 46 పరుగులకే ఆలౌట్ కావడం సహా.. పుణెలోనూ నామమాత్రపు స్కోర్లు(156, 245) చేయడం విమర్శలకు తావిచ్చింది. మఖ్యంగా.. రెండో టెస్టులో కివీస్ బౌలర్ మిచెల్ సాంట్నర్‌ను ఎదుర్కోలేక చేతులెత్తేసిన భారత బ్యాటర్ల కారణంగా ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే.
పరువు కోసం.. ఫైనల్ కోసం
పన్నెండేళ్ల తర్వాత తొలిసారి టీమిండియా స్వదేశంలో టెస్టు సిరీస్‌లో ఓటమిపాలైంది. జూనియర్లతో పాటు సీనియర్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా లెఫ్టార్మ్ స్పిన్నర్ సాంట్నర్ బౌలింగ్‌లో తడబడ్డారు. భారత బ్యాటర్ల పుణ్యమా అని అతడు తన టెస్టు కెరీర్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు(13/157) నమోదు చేశాడు.
ఇక ఇప్పటికే సిరీస్ కోల్పోయినా.. కివీస్‌తో కనీసం ఆఖరి టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని కఠినంగా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ భారత బ్యాటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీ20 క్రికెట్ వల్లే బ్యాటర్లు విఫలం
ముంబైలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ వ్యాప్తంగా టీ20 క్రికెట్‌కు ఆదరణ పెరిగింది. అందుకే చాలా మంది బ్యాటర్లు డిఫెండ్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే, విజయవంతమైన ఆటగాళ్లలో ఫార్మాట్లకు అతీతంగా మూడింటిలో స్ట్రాంగ్‌గా డిఫెన్స్ చేసుకునే వారే ఎక్కువ.
వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడటానికి ఉన్న ప్రాధాన్యాన్ని మనం మరచిపోకూడదు. ప్రతిసారి ఆటగాళ్లకు ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఉండాలి. తద్వారా దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలు పొందవచ్చు’’ అని గంభీర్ పేర్కొన్నాడు. టెస్టుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ దూకుడు తగ్గించి ఆచితూచి ఆడాలని పరోక్షంగా బ్యాటర్లకు హితవు పలికాడు.
బుమ్రా ఆడకపోవచ్చు
అదే విధంగా.. ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా న్యూజిలాండ్‌తో మూడో టెస్టు ఆడకపోవచ్చని గంభీర్ సంకేతాలు ఇచ్చాడు. కివీస్ సిరీస్ తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లనున్న నేపథ్యంలోనే మేనేజ్‌మెంట్ అతడికి విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది. ఇక నవంబరు 1 నుంచి టీమిండియా- న్యూజిలాండ్ మధ్య ముంబైలోని వాంఖడే వేదికగా నామమాత్రపు మూడో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ
Comments
Please login to add a commentAdd a comment