Ind vs NZ 2nd Test: 156 పరుగులకే టీమిండియా ఆలౌట్‌ | IND Vs NZ 2nd Test Day 2 Santner Returns 7 Wickets India Bundle Out 156, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

Ind vs NZ 2nd Test: ఏడేసిన సాంట్నర్‌.. 156 పరుగులకే టీమిండియా ఆలౌట్‌

Published Fri, Oct 25 2024 12:51 PM | Last Updated on Fri, Oct 25 2024 3:51 PM

Ind vs NZ 2nd Test Day 2 Santner Returns 7 Wickets India Bundle Out 156

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్‌ వైఫల్యం కొనసాగుతోంది. మొదట బెంగళూరు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్‌ సేన.. పుణె వేదికగా రెండో టెస్టులోనూ స్థాయికి తగ్గట్లు ఆడలేక చతికిలపడింది. మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే కుప్పకూలింది.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌లు ఆడుతోంది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన.. గురువారం మొదలైన రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగింది.

చెన్నై స్పిన్నర్లు దుమ్ములేపారు
అయితే, పుణెలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై టీమిండియా స్టార్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అద్భుత ప్రదర్శన కనబరిచారు. చెన్నైకి చెందిన ఈ ఇద్దరు రైటార్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ స్పిన్నర్లు కివీస్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించారు.

అశూ వికెట్ల వేట మొదలుపెడితే.. వాషీ విజయవంతంగా దానిని ముగించాడు. అశ్విన్‌ 3, వాషీ 7 వికెట్లు పడగొట్టి.. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌట్‌ చేశారు. బౌలర్లుగా తమ కర్తవ్యం నెరవేర్చి ప్రత్యర్థిని నామమాత్రపు స్కోరుకు కట్టడి చేయగలిగారు.

ప్చ్‌.. బ్యాటర్లు మాత్రం
కానీ.. బ్యాటర్లు మాత్రం చేతులెత్తేశారు. న్యూజిలాండ్‌ స్పిన్నర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌(30) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ డకౌట్‌ అయ్యాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ శుబ్‌మన్‌ గిల్‌ 30 పరుగులతో రాణించగా.. విరాట్‌ కోహ్లి ఒక్క పరుగు మాత్రమే చేసి చెత్తగా బౌల్డ్‌ అయ్యాడు.

ఆ తర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌ చేసిన రిషభ్‌ పంత్‌(18),న సర్ఫరాజ్‌ ఖాన్‌(11) త్వరగానే అవుట్‌ కాగా.. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 38 పరుగులతో అందరిలోకెల్లా టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక మిగతా వాళ్లలో అశ్విన్‌ 4, వాషింగ్టన్‌ సుందర్‌ 18- నాటౌట్‌, ఆకాశ్‌ దీప్‌ 6, జస్‌ప్రీత్‌ బుమ్రా 0 పరుగులు చేశారు. 

ఫలితంగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో టీమిండియా 156 పరుగులకే ఆలౌట్‌ అయింది. కివీస్‌ బౌలర్లలో స్పిన్నర్లు మిచెల్‌ సాంట్నర్‌ ఏడు, గ్లెన్‌ ఫిలిప్స్‌ రెండు వికెట్లు తీయగా.. రైటార్మ్‌ పేసర్‌ టిమ్‌ సౌతీ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

103 పరుగులు వెనుకబడ్డ టీమిండియా
కాగా పుణె వేదికగా రెండో టెస్టులో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 259 పరుగులు చేసింది. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(76), రచిన్‌ రవీంద్ర(65) అద్భుత అర్ధశతకాలు సాధించగా.. మిచెల్‌ సాంట్నర్‌ 33 రన్స్‌తో రాణించాడు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌట్‌ కావడంతో మొదటి ఇన్నింగ్స్‌లో కివీస్‌ కంటే 103 పరుగులు వెనుకబడి ఉంది.

 చదవండి: ఒక్క పరుగు.. 8 వికెట్లు.. 53 పరుగులకే కుప్పకూలిన డిఫెండింగ్‌ చాంపియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement