
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (PBKS vs KKR)తో మ్యాచ్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ తమ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌పై వేటు వేయాలని సూచించాడు. అతడి స్థానంలో మరో బ్యాటర్‌ను ఎంపిక చేసుకుంటే శ్రేయస్ సేనకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.
మూడు గెలిచిన పంజాబ్
కాగా ఐపీఎల్-2025 (IPL 2025) మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ ఆస్ట్రేలియా స్టార్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell)ను రూ. 4.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకు ఈ సీజన్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి కేవలం 34 పరుగులు చేశాడు. చివరగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో అతడు చేసిన స్కోరు 3.
ఇక స్పిన్ బౌలింగ్ చేయగల మాక్సీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్-2025లో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని మూడు గెలిచిన పంజాబ్ కింగ్స్.. మంగళవారం కేకేఆర్‌తో ముల్లన్‌పూర్ వేదికగా తలపడనుంది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా మాక్స్‌వెల్‌ను జట్టు నుంచి తొలగించాలని పంజాబ్ నాయకత్వ బృందానికి సూచన ఇచ్చాడు.
‘‘గత మ్యాచ్‌లో (సన్‌రైజర్స్) పంజాబ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వధేరా, శశాంక్ సింగ్.. మార్కస్ స్టొయినిస్.. అంతా అద్భుతంగా ఆడారు. కానీ మాక్సీ సంగతేంటి?..
బౌలర్‌గా తీసుకోలేదు కదా.. అతడిపై వేటు వేయండి!
దయచేసి అతడిని జట్టు నుంచి తప్పించండి. గ్లెన్ మాక్స్‌వెల్‌ను బ్యాటర్‌గా మీరు ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకుంటున్నారు. బౌలర్‌గా అతడికి చోటు ఇవ్వాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ అతడు ఏం చేస్తున్నాడు. అందుకే అతడిని తుదిజట్టు నుంచి తప్పిస్తే మరొక బ్యాటర్‌కు అవకాశం దక్కుతుంది.
అతడు బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. నేను కూడా ఒప్పుకొంటాను. మాక్సీ రూపంలో మీకు ఆఫ్ స్పిన్నర్ దొరికాడు. ఇక కేకేఆర్‌లో మీకు నలుగురు లెఫ్టాండర్లు కనిపిస్తున్నారు. సునిల్ నరైన్, క్వింటన్ డికాక్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్.. వీళ్ల కోసం మీరు మాక్సీని ఆడించాలని చూస్తారు.
దయచేసి పరుగులు సాధించవయ్యా
కానీ అతడు బ్యాట్‌తో రాణించకపోతే ఫలితం ఉండదు. కేకేఆర్ స్పిన్నర్లను మాక్సీ ఎదుర్కోలేడు. ఏదేమైనా మాక్స్‌వెల్ సాబ్.. నువ్వు గనుక తుదిజట్టులో ఉంటే.. దయచేసి పరుగులు సాధించవయ్యా.. చేతులు జోడించి అర్థిస్తున్నా’’ అంటూ ఆకాశ్ చోప్రా యూట్యూబ్ చానెల్‌లో తనదైన శైలిలో మాక్సీ గురించి కామెంట్స్ చేశాడు.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త ఉత్సాహంతో
కాగా గత సీజన్‌లో పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ కేవలం ఐదే గెలిచిన పంజాబ్.. తొమ్మిదో స్థానంతో ముగించింది. అయితే, ఈసారి మెగా వేలంలో రూ. 26.75 కోట్ల భారీ ధరకు టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్‌ను సొంతం చేసుకుని.. కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.
ఇక పంజాబ్ సారథిగా తొలి మ్యాచ్‌లోనే విజయం అందుకున్న శ్రేయస్.. బ్యాటర్‌గానూ దుమ్ములేపుతున్నాడు. ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్ ఆడి 250 పరుగులు సాధించాడు.
చదవండి: కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి
మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..