
Photo Courtesy: BCCI
ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)పై భారత స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో ముంబై గెలిచిందంటే అందుకు ప్రధాన కారణం రోహిత్ అని కొనియాడాడు. కాగా ఐపీఎల్-2025 (IPL 2025)లోనూ ముంబై స్థాయికి తగ్గట్లు ఆడలేకపోతోంది.
ఇప్పటి వరకు ఈ సీజన్‌లో హార్దిక్ సేన ఆడిన ఆరు మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచింది. చివరగా ఢిల్లీతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో ముంబై గట్టెక్కింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది.
205 పరుగులు
ఓపెనర్ రియాన్ రికెల్టన్ (25 బంతుల్లో 41), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 40) రాణించగా.. తిలక్ వర్మ ( Tilak Varma- 33 బంతుల్లో 59), నమన్ ధీర్ (Naman Dhir- 17 బంతుల్లో 38 నాటౌట్) దంచికొట్టారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ముంబై 205 పరుగులు సాధించింది.
కరుణ్ నాయర్ విధ్వంసకర ఇన్నింగ్స్
ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడినా కరుణ్ నాయర్ (40 బంతుల్లో 89) విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా ఆఖరి వరకు పోటీ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రమాదకర బ్యాటర్ కరుణ్ నాయర్‌తో పాటు కేఎల్ రాహుల్, స్టబ్స్ ఆట కట్టించేందుకు రోహిత్ శర్మ ఇచ్చిన సలహాలు పనిచేశాయి.
కొత్త బంతితో మ్యాజిక్
బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్-2025లో మంచు ప్రభావం మరీ ఎక్కువగా ఉంటే.. పదవ ఓవర్ ముగిసిన తర్వాత కొత్త బంతిని తీసుకోవచ్చు. ఈ రూల్‌ను ఢిల్లీతో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాతో రోహిత్ అమలు చేయించాడు. జోరు మీదున్న ఢిల్లీకి అడ్డుకట్ట వేసేందుకు స్పిన్నర్ కర్ణ్ శర్మకు కొత్త బంతిని ఇవ్వాలని డగౌట్ నుంచి సూచించాడు.
రోహిత్ ఇచ్చిన ఈ సలహా బాగా వర్కౌట్ అయింది. 14, 16 ఓవర్లలో కర్ణ్ ట్రిస్టస్ స్టబ్స్, కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్లు తీశాడు. ఇక కరుణ్ నాయర్‌ను మిచెల్ శాంట్నర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ నేపథ్యంలో 19 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌట్ అయి.. ఢిల్లీ ముంబై చేతిలో ఓటమిని చవిచూసింది.
కోచ్‌లు అహాన్ని పక్కన పెట్టాలి
ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ అద్భుతం చేశాడు. స్పిన్నర్లు.. ముఖ్యంగా కర్ణ్ శర్మను రంగంలోకి దించాలని హెడ్‌కోచ్ మహేళ జయవర్దనేకు చెప్పాడు. కర్ణ్ ఏకంగా మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.
నిజంగా ఇదొక అద్భుతమైన వ్యూహం. కానీ జయవర్ధనే తొలుత రోహిత్ మాటకు అంగీకరించలేదనిపించింది. కొన్నిసార్లు కోచ్‌లు తమ అహాన్ని పక్కన పెట్టి.. జట్టు ఎలా బాగుపడుతుందనే విషయం మీదే దృష్టి పెట్టాలి.
రోహిత్ శర్మ డగౌట్ నుంచి ఇన్‌పుట్స్ ఇచ్చాడు. కానీ జయవర్ధనేకు అవి నచ్చినట్లు లేదు. ఒకవేళ జయవర్ధనే చెప్పినట్లు విని ఉంటే ఢిల్లీ చేతిలో ముంబై ఓడిపోయేది. రోహిత్ కెప్టెన్. దిగ్గజ సారథి.. కెప్టెన్ ఎప్పుడూ కెప్టెన్‌లాగే ఆలోచిస్తాడు. రోహిత్ వ్యూహం వల్లే ముంబై గెలిచింది’’ అని చెప్పుకొచ్చాడు.
చదవండి: మాట నిలబెట్టుకున్న టీమిండియా దిగ్గజం.. కాంబ్లీకి జీవితాంతం నెలకు..
కెప్టెన్‌గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి
Agar miss kiye toh ab dekho - 𝐊𝐚𝐫𝐧 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐤𝐚 𝐁𝐡𝐨𝐨𝐥 𝐁𝐡𝐮𝐥𝐚𝐢𝐲𝐚𝐚 🌀#MumbaiIndians #PlayLikeMumbai #TATAIPL #DCvMIpic.twitter.com/T8KabriAbK
— Mumbai Indians (@mipaltan) April 13, 2025