అతడిని జట్టులోకి తీసుకున్నారా?.. టీమిండియా కోచ్‌ క్లారిటీ | Ind vs NZ: Abhishek Nayar Confirms Harshit Rana has NOT been added To Squad | Sakshi
Sakshi News home page

అతడిని జట్టులోకి తీసుకున్నారా?.. టీమిండియా కోచ్‌ క్లారిటీ

Published Wed, Oct 30 2024 4:36 PM | Last Updated on Wed, Oct 30 2024 4:57 PM

Ind vs NZ: Abhishek Nayar Confirms Harshit Rana has NOT been added To Squad

న్యూజిలాండ్‌తో మూడో టెస్టుకు భారత జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) ఫైనల్‌ గురించి తాము ఆలోచించడం లేదని.. ప్రస్తుతం తమ దృష్టి మొత్తం ముంబై మ్యాచ్‌పైనే ఉందని తెలిపాడు. అదే విధంగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లిల విషయంలో ప్రతి ఒక్కరు సంయమనం పాటించాలని సూచించాడు.

 రోహిత్‌ సేనకు ఊహించని షాకులు
గొప్ప ఆటగాళ్లందరూ ఏదో ఒక సందర్భంలో ఫామ్‌లేమితో సతమతమయ్యారన్న అభిషేక్‌ నాయర్‌.. రోహిత్‌- కోహ్లి తిరిగి పుంజుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2023-25లో భాగంగా టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి రెండు టెస్టుల్లో రోహిత్‌ సేనకు ఊహించని షాక్‌ తగిలింది.

బెంగళూరులో కివీస్‌ చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిన భారత్‌.. పుణెలో 113 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 0-2తో సిరీస్‌ కోల్పోయింది. ఫలితంగా స్వదేశంలో టీమిండియా పన్నెండేళ్ల టెస్టు సిరీస్‌ జైత్రయాత్రకు తెరపడింది. 

ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ముంబై వేదికగా జరుగనున్న మూడో టెస్టు భారత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. వైట్‌వాష్‌ నుంచి తప్పించుకోవాలంటే గెలిచి తీరాలి లేదంటే కనీసం డ్రా అయినా చేసుకోవాలి.

జట్టులో మార్పులేమీ లేవు
ఈ నేపథ్యంలో యువ పేసర్‌ హర్షిత్‌ రాణాను మూడో టెస్టులో బరిలోకి దించనున్నారనే వార్తలు వినిపించాయి. అయితే, అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ వీటిని ఖండించాడు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జట్టులో మార్పులేమీ లేవు. ఎవరినీ కొత్తగా చేర్చడం లేదు. 

ప్రతీ వారం.. ప్రతీ రోజు మాకు కీలకమే. డబ్ల్యూటీసీ ఫైనల్‌ గురించి ప్రస్తుతానికి ఆలోచన లేదు. ఇప్పుడు మా దృష్టి మొత్తం ఈ మ్యాచ్‌ మీదే ఉంది’’ అని అభిషేక్‌ నాయర్‌ తెలిపాడు.

ఫామ్‌లోకి వస్తారనే నమ్మకం ఉంది
అదే విధంగా.. కివీస్‌తో తొలి రెండు టెస్టుల్లో విఫలమైన రోహిత్‌- కోహ్లి గురించి ప్రస్తావన రాగా.. ‘‘ప్రస్తుతం వాళ్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే, కొన్నిసార్లు మనం కాస్త సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఓపికపట్టాలి కూడా! గొప్ప గొప్ప ఆటగాళ్ల కెరీర్‌లో ఇలా జరిగింది.

 ఇప్పుడు వాళ్ల టైమ్‌ బాగా లేకపోవచ్చు. అయితే, త్వరలోనే తిరిగి పుంజుకుంటారనే నమ్మకం ఉంది’’ అని అభిషేక్‌ నాయర్‌ విరాహిత్‌ ద్వయాన్ని సమర్థించాడు. కాగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడుతుంది. ఇందుకు సంబంధించిన జట్టులో హర్షిత్‌ రాణాకు చోటు దక్కింది.

చదవండి: Ind vs Aus: 17 కిలోల బరువు తగ్గి.. ఆసీస్‌ టూర్‌కు ఎంపికైన పేసర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement