ఆసక్తికరంగా భారత-న్యూజిలాండ్‌ల మూడో టెస్టు.. పడగొట్టి... ఆపై తడబడి! | Ind vs NZ 3rd Test: Rohit Kohli Fails Again India Lose Control On Day 1 | Sakshi
Sakshi News home page

ఆసక్తికరంగా భారత-న్యూజిలాండ్‌ల మూడో టెస్టు.. పడగొట్టి... ఆపై తడబడి!

Published Fri, Nov 1 2024 5:42 PM | Last Updated on Sat, Nov 2 2024 7:41 AM

Ind vs NZ 3rd Test: Rohit Kohli Fails Again India Lose Control On Day 1

తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 86/4

న్యూజిలాండ్‌ 235 ఆలౌట్‌

జడేజాకు 5 వికెట్లు, సుందర్‌కు 4 వికెట్లు  

వాంఖెడే మైదానంలో తొలి రోజు 84.4 ఓవర్లు పడ్డాయి. 82.5 ఓవర్ల వరకు భారత్‌దే పైచేయి... కానీ తర్వాతి 8  బంతుల వ్యవధిలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. టీమిండియా అనూహ్యంగా 3 వికెట్లు చేజార్చుకొని వెనుకంజ వేసింది. అప్పటి వరకు చక్కగా ఆడిన యశస్వి జైస్వాల్‌తో పాటు టాప్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి రనౌట్‌ ఇందులో ఉండగా, ఒక కీలక రివ్యూ కూడా కోల్పోవడంతో భారత్‌ నిరాశగా ఆటను ముగించింది. 

అంతకుముందు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ ధాటికి 235 పరుగులకే పరిమితమై నిరాశ చెందిన న్యూజిలాండ్‌ ఆ తర్వాత 4 వికెట్లు కూడా పడగొట్టి పైచేయి సాధించింది. రెండో రోజు మన బ్యాటర్లు ఎంత వరకు స్కోరును తీసుకెళ్లి ఆధిక్యం అందించగలరనే అంశంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.   

ముంబై: భారత్, న్యూజిలాండ్‌ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మొదలైంది. బౌలర్లు తొలి రోజు నేలకూల్చిన 14 వికెట్లు మ్యాచ్‌లో తర్వాతి రోజులు ఎలా సాగనున్నాయనే దానికి సంకేతంగా నిలిచింది. మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.4 ఓవర్లలో 235 పరుగులకే ఆలౌటైంది. డరైల్‌ మిచెల్‌ (129 బంతుల్లో 82; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), విల్‌ యంగ్‌ (138 బంతుల్లో 71; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు.

మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (5/65) ఐదు వికెట్లతో సత్తా చాటగా... వాషింగ్టన్‌ సుందర్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్‌ ఆట ముగిసే సమయానికి 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (38 బంతుల్లో 31 బ్యాటింగ్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (1 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత్‌ మరో 149 పరుగులు వెనుకబడి ఉంది. తుది జట్టులో భారత్‌ ఒక మార్పు చేసింది. 

బుమ్రాకు విశ్రాంతినిచ్చి సిరాజ్‌ను ఆడించగా... న్యూజిలాండ్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌ హీరో సాంట్నర్‌ పక్కటెముకల గాయంతో టెస్టుకు దూరం కాగా... అతని స్థానంలో సోధి వచ్చాడు. పేసర్‌ టీమ్‌ సౌతీకి బదులుగా హెన్రీని కివీస్‌ ఎంచుకుంది.  

భారీ భాగస్వామ్యం... 
కివీస్‌ ఇన్నింగ్స్‌ మూడు భిన్న దశలుగా సాగింది. ఫామ్‌లో ఉన్న కాన్వే (4) ఆరంభంలోనే వెనుదిరగ్గా... కెపె్టన్‌ టామ్‌ లాథమ్‌ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు) కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే లాథమ్‌తో పాటు రచిన్‌ రవీంద్ర (5)లను సుందర్‌ క్లీన్‌»ౌల్డ్‌ చేయడంతో 72/3 వద్ద కివీస్‌ కష్టాల్లో పడింది. ఈ దశలో యంగ్, మిచెల్‌ భాగస్వామ్యం జట్టును ఆదుకుంది. వీరిద్దరు తర్వాతి 25 ఓవర్ల పాటు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 87 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యంతో స్కోరును 159/3 వరకు తీసుకెళ్లారు. 

అయితే ఇక్కడే ఆట మళ్లీ మలుపు తిరిగింది. జడేజా వేసిన ఈ ఓవర్లో యంగ్, బ్లన్‌డెల్‌ (0) వెనుదిరిగారు. ఆ తర్వాత వరుసగా మరో మూడు వికెట్లు కూడా అతని ఖాతాలోనే చేరాయి. సుందర్‌ మూడు ఓవర్లలో ఒక్కో సిక్సర్‌ చొప్పున బాది జోరు ప్రదర్శించిన మిచెల్‌ ఎట్టకేలకు సుందర్‌ బౌలింగ్‌లోనే పెవిలియన్‌ చేరగా... మరో మూడు బంతుల తర్వాత కివీస్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  

కోహ్లి రనౌట్‌... 
రోహిత్‌ శర్మ (18) ఎప్పటిలాగే ధాటిగా మొదలు పెట్టినా, మరోసారి అతను తక్కువ స్కోరుకే పరిమితమయ్యాడు. అయితే యశస్వి జైస్వాల్‌ (52 బంతుల్లో 30; 4 ఫోర్లు), గిల్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. 6 పరుగుల వద్ద గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్‌ బ్లన్‌డెల్‌ అందుకోలేకపోయాడు. వీరిద్దరి భాగస్వామ్యం 53 పరుగులకు చేరింది. మరో రెండు ఓవర్ల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో అంతా మారిపోయింది. 

ఎజాజ్‌ బౌలింగ్‌లో అనవసరపు రివర్స్‌ స్వీప్‌నకు ప్రయత్నించి జైస్వాల్‌ బౌల్డ్‌ కాగా... నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన సిరాజ్‌ (0) తర్వాతి బంతికే ఎల్బీగా అవుటయ్యాడు. అయితే దీనికి కూడా అతని ‘రివ్యూ’ తీసుకొని దానిని వృథా చేశాడు! భారత్‌కు మరో షాక్‌ చివరి ఓవర్లో తగిలింది. డిఫెన్స్‌ ఆడి రోజును ముగించాల్సిన సమయంలో కోహ్లి (4) సాహసం చేశాడు. రచిన్‌ బౌలింగ్‌లో మిడాన్‌ దిశగా ఆడిన అతను అతి విశ్వాసంతో సింగిల్‌కు ప్రయత్నించాడు. హెన్రీ డైరెక్ట్‌ త్రో వికెట్లను పడగొట్టడంతో నిరాశగా వెనుదిరిగాడు.  

స్కోరు వివరాలు  
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) సుందర్‌ 28; కాన్వే (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్‌ 4; యంగ్‌ (సి) రోహిత్‌ (బి) జడేజా 71; రచిన్‌ (బి) సుందర్‌ 5; మిచెల్‌ (సి) రోహిత్‌ (బి) సుందర్‌ 82; బ్లన్‌డెల్‌ (బి) జడేజా 0; ఫిలిప్స్‌ (బి) జడేజా 17; సోధి (ఎల్బీ) (బి) జడేజా 7; హెన్రీ (బి) జడేజా 0; ఎజాజ్‌ (ఎల్బీ) (బి) సుందర్‌ 7; రూర్కే (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (65.4 ఓవర్లలో ఆలౌట్‌) 235. వికెట్ల పతనం: 1–15, 2–59, 3–72, 4–159, 5–159, 6–187, 7–210, 8–210, 9–228, 10–235. బౌలింగ్‌: సిరాజ్‌ 6–0–16–0, ఆకాశ్‌దీప్‌ 5–0–22–1, అశ్విన్‌ 14–0–47–0, వాషింగ్టన్‌ సుందర్‌ 18.4–2– 81–4, జడేజా 22–1–65–5.  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) ఎజాజ్‌ 30; రోహిత్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 18; 
గిల్‌ (బ్యాటింగ్‌) 31; సిరాజ్‌ (ఎల్బీ) (బి) ఎజాజ్‌ 0; కోహ్లి (రనౌట్‌) 4; పంత్‌ (బ్యాటింగ్‌) 1; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 86.  
వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84. బౌలింగ్‌: హెన్రీ 5–1–15–1, రూర్కే 2–1–5–0, ఎజాజ్‌ 7–1–33–2, ఫిలిప్స్‌ 4–0–25–0, 
రచిన్‌ 1–0–8–0.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement