Ind vs NZ: రోహిత్‌ శర్మ చెత్త రికార్డు.. సచిన్‌ సరసన | Ind vs NZ 1st Test: Rohit Sharma Overtakes Kohli In Unwanted List After Defeat | Sakshi
Sakshi News home page

Ind vs NZ: రోహిత్‌ శర్మ చెత్త రికార్డు.. సచిన్‌ సరసన

Published Sun, Oct 20 2024 8:23 PM | Last Updated on Sun, Oct 20 2024 8:55 PM

Ind vs NZ 1st Test: Rohit Sharma Overtakes Kohli In Unwanted List After Defeat

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. బెంగళూరులో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది.  

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ) 2023-25లో భాగంగా ఇటీవల స్వదేశంలో టీమిండియా బంగ్లాదేశ్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసి ఫైనల్‌కు మరింత చేరువైంది. ఈ క్రమంలో సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు గెలిస్తే నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టేదే! అయితే, వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్‌ సేనకు కివీస్‌ ఊహించని షాకిచ్చింది.

కివీస్‌ 36 ఏళ్ల తర్వాత
బెంగళూరులో ఘన విజయం సాధించి.. భారత గడ్డపై 36 ఏళ్ల తర్వాత తొలి గెలుపు నమోదు చేసింది. చివరగా 1988లో ముంబైలోని వాంఖడేలో టెస్టు మ్యాచ్‌ గెలిచిన న్యూజిలాండ్‌.. ఇప్పుడిలా తాజాగా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మరోవైపు.. స్వదేశంలో కెప్టెన్‌గా రోహిత్‌కు టెస్టుల్లో ఇది మూడో పరాజయం.

రోహిత్‌ శర్మ చెత్త రికార్డు.. సచిన్‌ సరసన
ఈ నేపథ్యంలో సొంతగడ్డపై అత్యధిక టెస్టులు ఓడిన టీమిండియా సారథుల జాబితాలో రోహిత్‌ శర్మ విరాట్‌ కోహ్లిని అధిగమించాడు. బిషన్‌ బేడి, మహేంద్ర సింగ్‌ ధోని, సచిన్‌ టెండుల్కర్‌, సౌరవ్‌ గంగూలీల సరసన చేరాడు. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధికంగా తొమ్మిది మ్యాచ్‌లు ఓడి ఈ జాబితాలో మన్సూర్‌ అలీ పటౌడీ ఖాన్‌ ప్రథమ స్థానంలో ఉన్నాడు.

కోహ్లి అలా.. రోహిత్‌ ఇలా
కాగా కోహ్లి సారథ్యంలో భారత గడ్డపై టీమిండియా 2017లో ఆస్ట్రేలియా చేతిలో, 2021లో ఇంగ్లండ్‌ చేతిలో టెస్టు మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే, ఆ రెండు సందర్భాల్లోనూ భారత్‌ సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఇక రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 2023-24 బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా చేతిలో, 2024 ఆరంభంలో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి పాలైంది.

అయితే, అప్పుడు కూడా సిరీస్‌లను 2-1, 4-1తో గెలవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టీమిండియా- న్యూజిలాండ్‌ మధ్య గురువారం(అక్టోబరు 24) నుంచి పుణె వేదికగా రెండో టెస్టు మొదలుకానుంది. ఇక తొలి టెస్టులో భారత జట్టు ఓడినప్పటికీ సర్ఫరాజ్‌ ఖాన్‌(150), రిషభ్‌ పంత్‌(99) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. మరోవైపు రోహిత్‌ శర్మ మొత్తంగా 54 పరుగులు రాబట్టాడు.

స్వదేశంలో అత్యధిక టెస్టులు ఓడిన టీమిండియా కెప్టెన్లు
👉మన్సూర్‌ అలీ పటౌడీ ఖాన్‌- 9
👉కపిల్‌ దేవ్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌- 4
👉రోహిత్‌ శర్మ, బిషన్‌ బేడి, మహేంద్ర సింగ్‌ ధోని, సచిన్‌ టెండుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ- 3
👉విరాట్‌ కోహ్లి- 2.

చదవండి: Ind vs NZ: టీమిండియాలోకి చెన్నై చిన్నోడు.. బీసీసీఐ ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement