Ind vs NZ 1st Test: 46తో నగుబాటు | Indias lowest score at home | Sakshi
Sakshi News home page

Ind vs NZ 1st Test: 46తో నగుబాటు

Published Fri, Oct 18 2024 3:45 AM | Last Updated on Fri, Oct 18 2024 10:35 AM

Indias lowest score at home

మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 46 ఆలౌట్‌

స్వదేశంలో అత్యల్ప స్కోరు నమోదు

టీమిండియాను కుప్పకూల్చిన కివీస్‌ పేసర్లు హెన్రీ, రూర్కే

ప్రస్తుతం న్యూజిలాండ్‌ 180/3

ఇప్పటికే 134 పరుగుల ఆధిక్యం   

వికెట్‌కు ఇరువైపులా నాట్యం చేస్తున్న బంతిని రోహిత్‌ శర్మ ఆడలేక చేతులెత్తేశాడు. కోహ్లి, సర్ఫరాజ్‌లకు ఖాతా తెరిచే అవకాశం కూడా రాలేదు. ఆదుకుంటున్నట్లు అనిపించిన యశస్వి జైస్వాల్‌ ఆట కూడా ఎక్కువసేపు సాగలేదు. ఆ తర్వాత వరుసగా కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, అశ్విన్‌ ‘సున్నా’ చుట్టడంతో భారత స్కోరు 34/7. దాంతో నాలుగేళ్ల క్రితం నాటి ‘36 ఆలౌట్‌’ కళ్ల ముందు తిరిగింది. ఎలాగో రిషబ్‌ పంత్‌ ఆ గండం దాటించి తానూ వెనుదిరిగాడు. నాటి అడిలైడ్‌ స్కోరుకు మరో 10 పరుగులు మాత్రమే అదనంగా జోడించిన తర్వాత టీమిండియా ఖేల్‌ ఖతం. సొంతగడ్డపై గతంలో ఎన్నడూ చూడని ఘోరమైన ప్రదర్శనతో భారత ఇన్నింగ్స్‌ ముగిసింది. వర్షం ఆగిన తర్వాత మనోళ్లు పరుగుల వరద పారిస్తారనుకుంటే అంతా తిరగబడి జట్టుపై పెద్ద పిడుగు పడింది. 

హెన్రీ, రూర్కే, సౌతీ... ఈ ముగ్గురు కివీ పేసర్ల బౌలింగ్‌ చూస్తే టెస్టు జరుగుతోంది మన చిన్నస్వామి మైదానంలోనా లేక న్యూజిలాండ్‌లోనా అనిపించింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ ఈ పేసర్లు భారత జట్టు వెన్ను విరిచారు. పిచ్‌పై, గాల్లో తేమను సమర్థంగా వినియోగించుకుంటూ వీరు సీమ్‌ బౌలింగ్‌తో అదరగొట్టారు. ఈ బంతులకు మన బ్యాటర్ల వద్ద జవాబు లేకపోయింది. రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి సౌతీ టీమిండియా పతనానికి శ్రీకారం చుట్టగా... జట్టు ఆట కట్టించే బాధ్యత మిగతా ఇద్దరు తీసుకున్నారు. ఫలితంగా ఐదుగురు భారత బ్యాటర్లు ‘డకౌట్‌’లతో సరిపెట్టగా... ఇద్దరు మినహా మిగతా వారంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడం కివీస్‌ బౌలర్ల ప్రతిభకు నిదర్శనం.  

టాస్‌ గెలవడం... పరిస్థితులు ఎలా ఉన్నా బ్యాటింగ్‌ ఎంచుకొని భారీ స్కోరు సాధించడం... ఆపై ప్రత్యర్థిపై అన్ని రకాలుగా ఆధిపత్యం ప్రదర్శించి టెస్టును చేతుల్లోకి తెచ్చుకోవడం! సుదీర్ఘ కాలంగా సొంతగడ్డపై భారత జట్టు విజయసూత్రం ఇదే. అప్పుడప్పుడు ఆరంభంలో కాస్త తడబాటు ఎదురైనా తర్వాతి బ్యాటర్లు పరిస్థితిని చక్కబెడితే అంతా అనుకూలంగా మారిపోయేది. కానీ ఇప్పుడు కాస్త భిన్నమైన పరిస్థితి... ఈసారీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్నాం. కానీ పిచ్‌ను, వాతావరణాన్ని అంచనా వేయడంలో లెక్క తప్పాం... అనూహ్యంగా దూసుకొచ్చిన సవాల్‌ను ఎదుర్కొనే సన్నద్ధత లేక కుప్పకూలిపోయాం... మూడో రోజు న్యూజిలాండ్‌ను ఎంత వరకు నిలువరించి టెస్టును కాపాడు కోగలమో చూడాలి. 
 
బెంగళూరు: తొలి రోజు పూర్తిగా వర్షార్పణమైన భారత్, న్యూజిలాండ్‌ మొదటి టెస్టు రెండో రోజు ఊహించలేని మలుపు తీసుకుంది. వాన లేకపోవడంతో నిర్ణీత సమయానికే ఆట ఆరంభమైన ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది. కివీస్‌ పదునైన పేస్‌ బౌలింగ్‌ను ఎదుర్కోలేక భారత జట్టు చెత్త ప్రదర్శనతో అవమానకర రికార్డులను మూటగట్టుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లలో కేవలం 46 పరుగులకే ఆలౌటైంది. 

స్వదేశంలో మన జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. రిషభ్‌ పంత్‌ (20; 2 ఫోర్లు), యశస్వి జైస్వాల్‌ (13; 1 ఫోర్‌) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మ్యాట్‌ హెన్రీ (5/15), విలియమ్‌ ఓ రూర్కే (4/22) భారత్‌ను కుప్పకూల్చగా... సౌతీకి ఒక వికెట్‌ దక్కింది. అనంతరం న్యూజిలాండ్‌ ఆట ముగిసే సమయానికి 50 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు సాధించింది. డెవాన్‌ కాన్వే (91; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... రచిన్‌ రవీంద్ర (22 బ్యాటింగ్‌), డరైల్‌ మిచెల్‌ (14 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. 

ప్రస్తుతం కివీస్‌ 134 పరుగుల ఆధిక్యంలో ఉంది. దాదాపు ఒక్క సెషన్‌ సమయంలోనే కివీస్‌ పూర్తిగా పైచేయి సాధించింది. 1 పరుగు వద్ద అదృష్టవశాత్తూ ‘అంపైర్‌ కాల్‌’తో బయటపడిన రోహిత్‌ (16 బంతుల్లో 2)ను సౌతీ ఎక్కువ సేపు నిలవనీయలేదు. కోహ్లి (0) లెగ్‌ గల్లీలో క్యాచ్‌ ఇవ్వగా, సర్ఫరాజ్‌ (0) మరో అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. 13/3 వద్ద వానతో కొద్దిసేపు అంతరాయం ఏర్పడగా... ఆట మళ్లీ మొదలైన తర్వాత యశస్వి జైస్వాల్‌ వెనుదిరిగాడు. 

ఆ తర్వాత 9 బంతుల వ్యవధిలో రాహుల్‌ (0), జడేజా (0), అశ్విన్ (0) పెవిలియన్‌ చేరారు. 34 స్కోరు వద్ద పంత్‌ ఫోర్‌ కొట్టడంతో భారత్‌ తమ ఆల్‌టైమ్‌ అత్యల్ప స్కోరును దాటగలిగింది. పంత్‌ అవుటయ్యాక మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు కివీస్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. 7 పరుగుల వద్ద పంత్‌ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను బ్లన్‌డెల్‌ వదిలేయకుండా ఉంటే భారత జట్టు పరిస్థితి ఇంకా ఎలా ఉండేదో!  

1 స్వదేశంలో భారత్‌కు ఇదే అత్యల్ప స్కోరు. 1987లో  విండీస్‌పై భారత జట్టు 75 పరుగులకు ఆలౌటైంది.  

3 ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో భారత్‌కిది మూడో అత్యల్ప స్కోరు. గతంలో 36 (ఆస్ట్రేలియాపై అడిలైడ్‌లో; 2020లో), 42 (ఇంగ్లండ్‌పై లండన్‌లో 1974లో) చేసింది. ఉపఖండంలో గతంలో ఏ జట్టూ ఇంత తక్కువ స్కోరు చేయలేదు.  

5 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ల  సంఖ్య. టాప్‌–8 బ్యాటర్లలో ఐదుగురు ‘డకౌట్‌’ కావడం 136 ఏళ్ల తర్వాత మళ్లీ జరిగింది. 1888లో మాంచెస్టర్‌లో  ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో ఆ్రస్టేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇలా జరిగింది.  

స్కోరు వివరాలు  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఎజాజ్‌ పటేల్‌ (బి) రూర్కే 13; రోహిత్‌ (బి) సౌతీ 2; కోహ్లి (సి) ఫిలిప్స్‌ (బి) రూర్కే 0; సర్ఫరాజ్‌ (సి) కాన్వే (బి) హెన్రీ 0; పంత్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 20; రాహుల్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) రూర్కే 0; జడేజా (సి) ఎజాజ్‌ పటేల్‌ (బి) హెన్రీ 0; అశ్విన్ (సి) ఫిలిప్స్‌ (బి) హెన్రీ 0; కుల్దీప్‌ (సి) (సబ్‌) బ్రేస్‌వెల్‌ (బి) హెన్రీ 2; బుమ్రా (సి) హెన్రీ (బి) రూర్కే 1; సిరాజ్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (31.2 ఓవర్లలో ఆలౌట్‌) 46. వికెట్ల పతనం: 1–9, 2–9, 3–10, 4–31, 5–33, 6–34, 7–34, 8–39, 9–40, 10–46. బౌలింగ్‌: సౌతీ 6–4–8–1, హెన్రీ 13.2–3–15–5, ఓ రూర్కే 12–6–22–4.  

న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: లాథమ్‌ (ఎల్బీ) (బి) కుల్దీప్‌ 15; కాన్వే (బి) అశ్విన్‌ 91; యంగ్‌ (సి) కుల్దీప్‌ (బి) జడేజా 33; రచిన్‌ (బ్యాటింగ్‌) 22; మిచెల్‌ (బ్యాటింగ్‌) 14; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 3 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–67, 2–142, 3–154. బౌలింగ్‌: బుమ్రా 10–4–23–0, సిరాజ్‌ 7–1–21–0, అశ్విన్‌ 11–1–46–1, కుల్దీప్‌ 12–1–57–1, జడేజా 10–0–28–1.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement