తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి: అందుకే కుల్దీప్‌నకు నో ఛాన్స్‌ | Ind vs Ban 1st Time In 9 Years: Rohit Bold Decision At Toss Stuns Everyone | Sakshi
Sakshi News home page

Ind vs Ban: తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి.. అప్పుడు కోహ్లి.. ఇప్పుడు రోహిత్‌!

Published Fri, Sep 27 2024 11:02 AM | Last Updated on Fri, Sep 27 2024 11:55 AM

Ind vs Ban 1st Time In 9 Years: Rohit Bold Decision At Toss Stuns Everyone

రోహిత్‌ శర్మ- నజ్ముల్‌ షాంటో (PC: BCCI)

బంగ్లాదేశ్‌ను వైట్‌వాష్‌ చేయడమే లక్ష్యంగా టీమిండియా రెండో టెస్టు బరిలో దిగింది. కాన్పూర్‌లో శుక్రవారం మొదలైన ఈ  మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టాస్‌ గెలిచి.. తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇక తమ తుదిజట్టులో ఎలాంటి మార్పులు లేవని.. చెన్నైలో తొలి టెస్టు ఆడిన టీమ్‌నే కొనసాగిస్తున్నట్లు తెలిపాడు.

కుల్దీప్‌ యాదవ్‌కు మరోసారి మొండిచేయి
నిజానికి కాన్పూర్‌లో బ్లాక్‌ సాయిల్‌(నల్లమట్టి) పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అయినప్పటికీ... టీమిండియా ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లనే ఆడించడం విశేషం. మ్యాచ్‌కు ముందు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం చూసి.. అతడు తుదిజట్టులోకి రావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి
అయితే, గ్రీన్‌ పార్క్‌ స్టేడియం వద్ద వాతావరణానికి అనుగుణంగా టీమిండియా తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ఎంచుకోవాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా కాన్పూర్‌లో గురువారం రాత్రి కురిసిన భారీ వాన వల్ల గ్రీన్ ఫీల్డ్ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్త‌డిగా మారింది. ఇదిలా ఉంటే.. సొంతగడ్డపై  టెస్టు మ్యాచ్‌లో.. టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం తొమ్మిదేళ్లలో ఇదే తొలిసారి.

ఇంతకు ముందు.. 2015లో బెంగళూరు వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో నాటి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇదే తరహా నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి టెస్టు డ్రాగా ముగిసిపోయింది. ఇక.. కాన్పూర్‌లో సైతం భారత జట్టు 1964 తర్వాత.. దాదాపు 24 టెస్టుల అనంతరం ఇలా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేస్తోంది.

పిచ్‌ కాస్త సాప్ట్‌గా కనిపిస్తోంది
ఇక టాస్‌ సందర్భంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘‘మేము తొలుత బౌలింగ్‌ చేస్తాం. పిచ్‌ కాస్త సాప్ట్‌గా కనిపిస్తోంది. ఆరంభంలోనే వికెట్లు తీయాలి. కాబట్టి మా ముగ్గురు సీమర్ల సేవలను వినియోగించుకోవాలనుకుంటున్నాం.

తొలి టెస్టులో ఆరంభంలో సరిగ్గా ఆడలేకపోయాం. అయితే, మా బౌలర్ల వల్ల విజయం సాధ్యమైంది. ఇక్కడ కూడా బంగ్లాదేశ్‌ గట్టి పోటీనిస్తుందనే భావిస్తున్నాం. అయితే, ఎలాంటి సవాలునైనా.. అనుభవంతో మేము అధిగమించగలం’’ అని పేర్కొన్నాడు. 

ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్‌ తమ తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. నహీద్‌ రాణా, టస్కిన్‌ అహ్మద్‌ స్థానాల్లో తైజుల్‌ ఇస్లాం, ఖలీద్‌ను తీసుకువచ్చింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25లో భాగంగా.. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతున్న భారత్‌.. 1-0తో ఆధిక్యంలో ఉంది.

టీమిండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ రెండో టెస్టు తుదిజట్లు
భారత్‌
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్‌), కేఎల్‌ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్‌ దీప్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్
షాద్‌మన్‌ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్‌), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్(వికెట్‌కీపర్‌), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.

చదవండి: మీ ఇంగితానికే వదిలేస్తున్నా: రిషభ్‌ పంత్‌ ఆగ్రహం
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement