‘హీరో’లు అవుట్‌.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే.. | Ind vs NZ 1st Test Day 4: India Collapse After Pant, Sarfaraz Shine; NZ To Chase | Sakshi
Sakshi News home page

‘హీరో’లు అవుట్‌.. కుప్పకూలిన టీమిండియా! అద్భుతం జరిగితేనే..

Published Sat, Oct 19 2024 4:45 PM | Last Updated on Sat, Oct 19 2024 5:32 PM

Ind vs NZ 1st Test Day 4: India Collapse After Pant, Sarfaraz Shine; NZ To Chase

న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు విజృంభించినా.. వారి పోరాటం సరిపోయేలా కనిపించడం లేదు. భారమంతా ఇప్పుడు బౌలర్లపైనే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితేనే టీమిండియా ఈ మ్యాచ్‌ గెలుస్తుంది. లేదంటే రోహిత్‌ సేన వరుస విజయాలకు బ్రేక్‌ పడుతుంది.

బెంగళూరు వేదికగా భారత్‌- కివీస్‌ మధ్య బుధవారం మొదలుకావాల్సిన మ్యాచ్‌ తొలిరోజు వర్షం కారణంగా.. టాస్‌ పడకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో గురువారం వాన తెరిపినివ్వగా టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి బొక్కబోర్లా పడింది. పేసర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై పరుగులు రాబట్టలేక 46 పరుగులకే ఆలౌట్‌ అయింది.

అనంతరం న్యూజిలాండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 402 పరుగులు చేసి.. 356 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. 

రోహిత్‌, విరాట్‌ ఫిఫ్టీలు
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌(35) ఫర్వాలేదనిపించగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(52), వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(70) అర్ధ శతకాలు చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి నాలుగో రోజు ఆటలో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ విశ్వరూపం ప్రదర్శించాడు.

చెలరేగిన హీరోలు..  
దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన అతడు చిన్నస్వామి స్టేడియంలో దుమ్ములేపాడు. రిషభ్‌ పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు ఏకంగా 177 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సర్ఫరాజ్‌ 150 పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే, పంత్‌ కూడా స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగాడు.

మొత్తంగా 105 బంతులు ఎదుర్కొన్న పంత్‌.. విలియం రూర్కీ బౌలింగ్‌ 99 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్‌ అయ్యాడు. వీళ్లిద్దరు నిష్క్రమించిన తర్వాత టీమిండియా టపటపా వికెట్లు కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌(12), రవీంద్ర జడేజా(5), రవిచంద్రన్‌ అశ్విన్‌(15), జస్‌ప్రీత్‌ బుమ్రా(0), మహ్మద్‌ సిరాజ్‌(0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. 

కివీస్‌ టార్గెట్‌ ఎంతంటే?
కుల్దీప్‌ యాదవ్‌ ఆరు పరగులతో అజేయంగా నిలవగా.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో కివీస్‌ కంటే కేవలం 106 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కివీస్‌కు స్వల్ప లక్ష్యం విధించింది.

అంటే.. న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసిందంటే గెలిచేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే భారత బౌలర్లదే బాధ్యత. వెలుతురు లేమి కారణంగా శనివారం త్వరగా ఆటను ముగించారు. ఆట పూర్తయ్యే సరికి కివీస్‌ విజయానికి 107 పరుగులు, టీమిండియా పది వికెట్ల దూరంలో నిలిచాయి.

చదవండి: వెనక్కి వెళ్తావా? లేదా?: పంత్‌ను ‘హెచ్చరించిన’ సర్ఫరాజ్‌! రోహిత్‌ రియాక్షన్‌ వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement