సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ | Duleep Trophy 2024: Suryakumar Yadav Cleared Replaces Sarfaraz Khan | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌

Published Wed, Sep 18 2024 7:30 PM | Last Updated on Wed, Sep 18 2024 8:37 PM

 Duleep Trophy 2024: Suryakumar Yadav Cleared Replaces Sarfaraz Khan

టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. దులిప్‌ ట్రోఫీ-2024 ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇండియా-‘బి’ జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానాన్ని సూర్య భర్తీ చేయనున్నాడు. కాగా టెస్టుల్లో పునరాగమనమే లక్ష్యంగా ఈ ముంబై బ్యాటర్‌ ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.

గాయంతో ఎన్సీఏలో చేరి
ఈ క్రమంలో తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలోని బుచ్చిబాబు ఇన్విటేషనల్‌ టోర్నీలో సూర్యకుమార్‌ భాగమయ్యాడు. ముంబై తరఫున ఈ రెడ్‌బాల్‌ టోర్నమెంట్‌ బరిలో దిగాడు. అయితే, బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన సూర్య.. ఫీల్డింగ్‌ సందర్భంగా గాయపడ్డాడు. అతడి బొటనవేలికి గాయం కావడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ(ఎన్సీఏ)కు చేరుకున్నాడు.

అక్కడి బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స తీసుకున్న సూర్యకుమార్‌ పూర్తిగా కోలుకున్నాడని.. మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ సాధించాడని ఎన్సీఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దులిప్‌ ట్రోఫీ ఆడేందుకు సూర్యకు మార్గం సుగమమైంది. ఇండియా- ‘బి’ జట్టులో సర్ఫరాజ్‌ ఖాన్‌ స్థానాన్ని అతడు భర్తీ చేయనున్నాడు. 

అనంతపురం చేరుకున్న సూర్య
కాగా బంగ్లాదేశ్‌తో గురువారం నుంచి తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో సర్ఫరాజ్‌ ఇప్పటికే దులిప్‌ ట్రోఫీ టోర్నీ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అనంతపురం వేదికగా గురువారం(సెప్టెంబరు 19) నుంచి ఇండియా-‘బి’- ఇండియా- ‘డి’ జట్టుతో తలపడనుంది. ఇందుకోసం 34 ఏళ్ల సూర్య ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు. 

ఇక ఇప్పటి వరకు.. అభిమన్యు ఈశ్వరన్‌ సారథ్యంలోని ఇండియా-‘బి’ దులిప్‌ ట్రోఫీ-2024లో రెండు మ్యాచ్‌లు ఆడింది. ఇండియా-‘ఎ’పై గెలుపొందడంతో పాటు.. ఇండియా-‘సి’తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో నిలిచింది.

తదుపరి బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో
కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటన సందర్భంగా బీసీసీఐ సూర్యకుమార్‌ యాదవ్‌ను రోహిత్‌ వారసుడిగా ప్రకటించింది. ఇక సూర్య కెప్టెన్సీలో భారత జట్టు 3-0తో శ్రీలంకను క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక దులిప్‌ ట్రోఫీ తర్వాత సూర్య బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టీ20 సిరీస్‌కు సిద్ధం కానున్నాడు.

ఇండియా-బి
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సూర్యకుమార్‌ యాదవ్‌, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సుయాష్ ప్రభుదేశాయ్, రింకు సింగ్, హిమాన్షు మంత్రి (వికెట్ కీపర్), నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్థి.

చదవండి: శ్రేయస్‌ అయ్యర్‌కు మరో బిగ్‌షాక్‌!?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement