అధికారులు నిర్దేశిత లక్ష్యాలు సాధించాలి
- కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ అర్బన్: జిల్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు తమకు నిర్ధేశించిన లక్ష్యాలు సాధించేందుకు పూర్తి స్థాయిలో కృషిచేయాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ దేశించారు. సెలవు నుంచి శనివారం విధుల్లో చేరిన కలెక్టర్ వివిధ శాఖల ఉన్నతాధికారులతో శాఖల పని తీరును సమీక్షించారు. ముఖ్యంగా నగరంలోని జీ+1 నిర్మాణాల విషయంలో టెండర్లు పూర్తయినందున అంబేద్కర్‌నగర్, ఎస్సార్‌నగర్ కాలనీల్లో వెంటనే పనులు మొదలు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ కాకతీయ కింద రెండవ విడతలో 20శాతం చెరువులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, శిఖం, చెరువు కట్టలపై హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటించాలని అన్నారు.
జిల్లాలోని హాస్టళ్లలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. జిల్లాలోని గిరిజన తాండాల్లో ప్రత్యేక వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డీఎంఅడ్ హెచ్‌వోను ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న భూ పంపిణీ పథకం వేగవంతం చేయాలని ఆదేశించారు. కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్, డీఎంఅండ్‌హెచ్‌వో సాంబశివరావు, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, డీపీవో ఈఎస్ నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సురేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్‌ను కలిసిన డీటీసీ
డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా(డీటీసీ) నూతనంగా జిల్లాకు వచ్చిన శివలింగయ్య శనివారం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.