పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి
పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి
Published Mon, Sep 26 2016 11:06 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
జిల్లా అధికారుల సమీక్షలో కలెక్టర్ అరుణ్‌కుమార్
కాకినాడ సిటీ :జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఇప్పటికే మంజూరైన పనుల పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టి నిర్ణీత కాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరై భవనాల డిజైన్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రగతి లేదన్నారు. ఇప్పటికే మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించకపోతే అవి రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
భారీవర్షాల నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక
జిల్లాలో ఈనెల 14 నుంచి 22 వరకు కురిసిన భారీ వర్షాల వల్ల ఏర్పడిన నష్టాలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్టు తెలిపారు. 2,459 హెక్టార్లలో వరి, 830 హెక్టార్లలో అపరాలు, 563 హెక్టార్లలో ప్రత్తి, 20 హెక్టార్లలో మిరప నీట మునిగినట్టు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు అందాయన్నారు. 12 మైనర్ ఇరిగేషన్ చెరువులు దెబ్బతిన్నాయని, 244 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బతిన్నాయన్నారు. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.52.57 కోట్లు, తక్షణ పనులకు రూ.2.48 కోట్లు అవసరమవుతాయన్నారు.రాజమహేంద్రవరంలోని కుమారీ టాకీస్ వద్ద ఉన్న ఇసుక ర్యాంపును మూసివేస్తున్నామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణిపై కలెక్టర్ ఆదేశాలు
ప్రజావాణిలో వచ్చిన అర్జీలు, ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సుమారు 180 మంది అర్జీదారులు హాజరయ్యారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి అర్జీలను స్వీకరించారు.
Advertisement