వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ వివేక్‌యాదవ్ పదోన్నతిపై బదిలీ అయ్యూరు. ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను గుంటూరు జిల్లా జేసీగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వరంగల్ నగర పాలక సంస్థ కమిషనర్ వివేక్‌యాదవ్ పదోన్నతిపై బదిలీ అయ్యూరు. ప్రస్తుతం జిల్లా ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను గుంటూరు జిల్లా జేసీగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2011 డిసెంబర్ 1న వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీపై వచ్చిన వివేక్ యాదవ్ 22 నెలల 8 రోజులపాటు ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా)కి ఇన్‌చార్జ్ వైస్ చైర్మన్‌గా సుమారు ఆరు నెలలపాటు పనిచేశారు. ఆయన హయూంలో వరంగల్ నగర పాలక సంస్థకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అవార్డులు. ప్రశంసలు, సర్టిఫికెట్లతో వరంగల్ బల్దియా రికార్డులు సృష్టించింది. క్లీన్ అండ్ గ్రీన్ సిటీ దిశగా వరంగల్ నగరాన్ని ముందుకు తీసుకెళ్లి అత్యధిక అవార్డులందుకున్న ఐఏఎస్ కమిషనర్‌గా వివేక్‌యూదవ్ రికార్డుల్లోకెక్కారు. జాతీయ స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో నాలుగు అవార్డులు స్వీకరించారు.
ఉత్తమ శానిటేషన్ నిర్వహణకు గాను జాతీయ స్థాయిలో హడ్కో, మీ సేవ కేంద్రాల ద్వారా సత్వర సేవలందిస్తున్న నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్ది రాష్ట్ర స్థారుులో అవార్డులు అందుకున్నారు. ఆధునిక పద్ధతిలో సింగిల్ విండో విధానం ద్వారా వినియోగదారులకు నల్లా కనెక్షన్లు ఇచ్చి ఇ-గవర్నెన్స్ అవార్డును పొందారు. ఆయన హయూంలోనే కార్పొరేషన్‌కు ఐఎస్‌ఓ 14001-2004 సర్టిఫికెట్ వచ్చింది. అంతేకాకుండా వివేక్‌యూదవ్ నగర పాలనలో తనదైన ముద్ర వేసుకున్నారు. అవినీతి.. అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. అభివృద్ధి పనుల ఫోర్జరీ వ్యవహారంలో ఇద్దరు ఈఈలు, ఒక డీఈ, మరో నలుగురు ఏఈలపై వేటు వేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఇద్దరు ఎంహెచ్‌ఓలు, మరో డీఈని సరెండర్ చేశారు. సుమారు పదిహేను మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడంతోపాటు చాలా మందికి చార్జెస్ ఫ్రేమ్ చేశారు. మెమోలైతే లెక్కే లేవు. బయోమెట్రిక్ విధానం అమలు చేసి అధికారులు, సిబ్బందికి కొరకరాని కొయ్యగా మారారు. కాగా, ఇన్‌చార్జ్ జేసీ హోదాలో మంగళవారం సాయంత్రం పౌరసరఫరాల అధికారులతో గ్యాస్‌కు నగదు బదిలీ పథకంపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినా... చివరి నిమిషంలో బదిలీ ఉత్తర్వులు రావడంతో ఆయన సమావేశం రద్దు చేసుకున్నారు.