ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇక జాగ్రత్తగా ఉండాలి. వీరిపై అధికార యంత్రాంగం నిఘా వేయనుంది. ముందస్తు ఎన్నికలకు అధికారులు అన్నివిధాలుగా సిద్ధమవుతున్నారు. కలెక్టర్ లోకేశ్‌కుమార్ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమించారు. ఇక ప్రతి అంశాన్ని యంత్రాంగం నిశితంగా పరిశీలించనుంది. అభ్యర్థులు ఏమాత్రం నిబంధనలు ఉల్లంఘించినా వారిపై చర్యలు తప్పవు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ‘ముందస్తు’కు పార్టీలే కాదు.. అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతోంది. ఎన్నికల గంట మోగడమే తరువాయి నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రచార సరళి, అభ్యర్థుల కదలికలు, ప్రలోభాలపై నిఘా పెట్టడానికి అధికార బలగాలను మోహరించింది. ఈమేరకు కలెక్టర్ డీఎస్ లోకేశ్‌కుమార్ ఎన్నికల నిర్వహణకు నోడల్ అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మానవ వనరుల నిర్వహణ, ఓటింగ్ యంత్రాల నిర్వహణ, రవాణా, శిక్షణ, సామగ్రి, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిశీలన, పరిశీలకులు, నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణ తదితర అంశాలకు సంబంధించి 16 విభాగాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడంలో ఈ అధికారులు కీలక భూమిక పోషించనున్నారు. కేవలం నోడల్ అధికారులే కాకుండా.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే కథనాలు, పెయిడ్ న్యూస్, ప్రకటనలను అనునిత్యం గమనించేందుకు ‘మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ’ని నియమించారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి ఇద్దరు ప్రతినిధులకు అవకాశం కల్పించారు. ఈ జాబితాలో డీఆర్‌ఓ, డీఈఓ కూడా సభ్యులుగా వ్యవహరించనున్నారు.
రంగంలోకి ఫ్లయింగ్‌స్క్వాడ్‌లు
ఎన్నికల ప్రవర్తనా నియమాళిపై డేగ కన్ను వేయడానికి జిల్లావ్యాప్తంగా 24 మందితో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. ప్రతి సెగ్మెంట్‌కు తహసీల్దార్‌తో కూడిన ఇద్దరు సభ్యుల బృందం ఈ వ్యవహారాలను పరిశీలించనుంది. జిల్లా ఎన్నికల అధికారి పరిధిలోకి వచ్చే షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం, చేవెళ్ల, కల్వకుర్తి, ఎల్‌బీ నగర్ నియోజకవర్గాల్లో ఈ బృందాలను కోడ్ అమలు తీరును కనిపెట్టనున్నాయి. కేంద్ర ఎన్నికల పరిశీలకులకు సహాయకులుగా కూడా వీరిని నియమించారు.
నిఘా నీడలో..
రాజకీయ పార్టీల ప్రచార సరళి, బహిరంగ సభలపై నిఘా వేయడానికి నియోజకవర్గానికో టీమ్‌ను రంగంలోకి దించారు అధికారులు. వీడియోగ్రాఫర్‌తో కూడిన ఈ బృందం ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే ప్రతి క్రతువును చిత్రీకరించనుంది. నామినేషన్ల ప్రక్రియ మొదలు స్టార్ క్యాంపెయినర్ల బహిరంగ సభలను కూడా వీడియోలో బంధించనుంది. ఎక్కడైనా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తేలినా.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా.. కవ్వింపు చర్యలకు పాల్పడినా నిక్షిప్తమయ్యే ఫుటేజీ ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment