ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు ప్రభుత్వం ఆమోదం | Government Approved The Inner Ring Road in Warangal | Sakshi
Sakshi News home page

ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు ప్రభుత్వం ఆమోదం

Published Sat, Mar 9 2019 2:41 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Government Approved The Inner Ring Road in Warangal

వరంగల్‌ అర్బన్‌: వరంగల్‌ మహా నగరానికి మరో మణిహారం.. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది. దాదాపు 47 ఏళ్ల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఐదు దశాబ్దాల క్రితం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాయి. 1972 సంవత్సరంలో వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌లో రెండొందల అడుగుల ఇన్నర్‌ రింగ్‌రోడ్డును ప్రతిపాదించారు. దీనికి రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్లు రూ.50 కోట్లతో అంచనాలు రూపొందించగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది.

ఇక భూసేకరణ చేస్తూ, మరో వైపు రోడ్డు నిర్మాణ పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను అదేశించారు. ఈ మేరకు శుక్రవారం వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌ దయానంద్, గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ రవికిరణ్, ఆర్‌అండ్‌బీ, కుడా, సర్వే ల్యాండ్‌ రికార్డు తదితర విభాగల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణంపై క్షుణ్ణంగా అధ్యయనం చేసి దిశానిర్దేశం చేశారు.

 ట్రైసిటీస్‌ ప్రజలు చిరకాల వాంఛ..

రెండొందల అడుగుల ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ట్రైసిటీస్‌ ప్రజలు చిరకాల వాంఛ. సరైన బైపాస్‌ రోడ్డు లేక భారీ వాహనాలు నగరం నుంచి రాకపోకలు సాగుతున్నాయి. రోడ్లు దెబ్బతినడం, ట్రాఫిక్‌ సమస్య, తరచూ ప్రమాదాలతో బాటసారులు, వాహనదారులు వణికిపోతున్నారు. దీంతో నగర శివారులోని ఔటర్‌ రింగ్‌రోడ్డుతో పాటు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అత్యంత ప్రాధాన్యత కలిగిందని గుర్తించిన ప్రజాప్రతినిధులు, అధికారులు గుర్తించారు. ఖమ్మం రోడ్డు నాయుడు పెట్రోల్‌ పంపు నుంచి వసంతపూర్, స్తంభంపల్లి, ఖిలా వరంగల్‌ కోట, జానీపీరీలు, కీర్తినగర్, కోటిలింగాల దేవాలయం, ఎనుమాముల మార్కెట్, పైడిపల్లి శివారు, ఆరేపల్లి జంక్షన్‌ వరకు రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు రూపొందించారు.

2012 సంవత్సరంలోనే రూ.20కోట్లు భూసేకరణ కోసం కేటాయించారు. భూసేకరణ కోసం రెండొందల అడుగుల రోడ్డుకు ఇరువైపులా కందకాలు తీశారు. కానీ ‘కుడా’కు నిధుల లేమి తదితర సమస్యలతో మరుగునపడింది. స్వరాష్ట్రంలో తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌కు 2016 నుంచి వరుసగా మూడు సంవత్సరాలుగా రూ.900 కోట్ల నిధులు కేటాయింపులు జరిగాయి. మహా నగర ఔటర్‌ రింగ్‌రోడ్డును ఎన్‌హెచ్‌ 163లో 29 కిలోమీటర్లు, ఎన్‌హెచ్‌ 563లో 22 కిలోమీటర్ల నాలుగు లైన్ల రోడ్డును చేపడుతున్నారు. మిగిలిన 18 కిలోమీటర్ల రోడ్డును రాష్ట్ర ఫ్రభుత్వం ఆర్‌అండ్‌బీ ద్వారా నిర్మించేందుకు పనులకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఓఆర్‌ఆర్‌కు ఇన్నర్‌ రింగ్‌రోడ్డు రవాణా మార్గం ఎంతగానో దోహదపడనుంది.

 తొలిదఫా నాయుడు పెట్రోల్‌పంపు నుంచి మార్కెట్‌ వరకు.

ఇన్నర్‌ రింగ్‌రోడ్డును తొలిదఫాగా నాయుడు పెట్రోల్‌పంపు నుంచి ఎనుమాముల మార్కెట్‌ వరకు అభివృద్ధి చేయనున్నారు. జానీపీరిల వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ప్రాంతం మినహా ఆరు కిలోమీటర్ల వరకు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. అందుకోసం ఆర్‌అండ్‌బీ రూ.50కోట్లతో రూపొందించిన అంచనాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. 

భూసేకరణకు రూ.110కోట్లు

ఇన్నర్‌ రింగ్‌రోడ్డు భూసేకరణ అత్యంత కీలకంగా మారింది. మాస్టార్‌ ప్లాన్‌లో రూపొందించిన రహదారిలో వ్యవసాయ ఆధారిత భూములు, ఇళ్ల స్థలాల ప్లాట్లు ఉన్నాయి. భూసేకరణ కోసం రూ.110 కోట్ల వ్యయం అవుతుందని రెవెన్యూ, సర్వే ల్యాండ్‌ అధికారులు అంచనా వేశారు.

పనులు వేగవంతం చేయండి.. 

ఇన్నర్‌ రింగ్‌రోడ్డుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. భూసేకరణ విషయంలో ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభ్యంతరాలను నివృత్తి చేయాలన్నారు. ఏమైనా క్లిష్టమైన ఫిర్యాదుల వస్తే తన దృష్టికి తీసుకొస్తే స్వయంగా పరిశీలించి పరిష్కారిస్తానని అన్నారు. రోడ్డు అభివృద్ధి పనులకు సాంకేతిక అనుమతులు తీసుకొని టెండర్లు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో ‘కుడా’ ప్లానింగ్‌ అధికారి అజిత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ ఎల్‌.రాజం, డీఈ రాజు, సర్వే ల్యాండ్‌ రికార్డు ఏడీ ప్రభాకర్, ఇంజినీర్లు పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement